ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలు కీలకం
గరిష్ట స్థాయిలో స్వల్ప లాభాల స్వీకరణ ఉండొచ్చు
అధిక వాల్యుయేషన్లపై ఆందోళనలు
ఈ వారం మార్కెట్‌పై నిపుణుల అంచనా
ముంబై: స్టాక్ సూచీలు జీవితకాల గరిష్ట స్థాయిలు నమోదు తర్వాత అధిక వాల్యుయేషన్ల ఆందోళనలతో ఈ వారంలో ఒడిదుడుకులకు లోనవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు దిశానిర్ధేశం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు సమగ్ర బడ్జెట్‌పై అంచనాలు, రుతు పవనాల కదలికల వార్తలు, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు.
‘‘స్టాక్ మార్కెట్లో ఓవర్‌బాట్ పరిస్థితుల కారణంగా గరిష్ట స్థాయిల వద్ద కొంత లాభాల స్వీకరణ జరగొచ్చు. అధిక వాల్యుయేషన్లు, స్థూల ఆర్థిక డేటా విడుదల నేపథ్యంలో కొంత అస్థిరత చోటు చేసుకునే వీలుంది. ఇన్వెస్టర్లు లార్జ్ క్యాప్ షేర్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు స్తబ్ధుగా ట్రేడవుతున్నాయి. సాంకేతికంగా నిఫ్టీకి దిగువ స్థాయిలో 23800 వద్ద కీలక మద్దతు ఉంది. ఎగువున 24,200 వద్ద నిరోధాన్ని చేధించాల్సి ఉంది’’ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ సాంకేతిక నిపుణుడు నాగరాజ్ శెట్టి తెలిపారు.
అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలు, ద్రవ్యోల్బణ సంబంధిత ఆందోళలను అధిగమిస్తూ గతవారం స్టాక్ సూచీలు 2% ర్యాలీ చేశాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 1,823 పాయింట్లు, నిఫ్టీ 510 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.
స్థూల ఆర్థిక గణాంకాలు
జూన్ జీఎస్‌టీ వసూళ్లు, ఆటో కంపెనీలు జూన్ వాహన విక్రయ గణాంకాలు నేడు(సోమవారం) విడుదల కానున్నాయి. ఇదే రోజు జూన్ తయారీ రంగ పీఎంఐ వెల్లడి కానుంది. సేవారంగ పీఎంఐ గణాంకాలు బుధవారం వెల్లడి అవుతాయి. జూన్ 28తో ముగిసిన వారం బ్యాంకు రుణాలు, డిపాజిట్ల వృద్ధి గణాంకాలు, జూన్ 21తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వలను ఆర్‌బీఐ శుక్రవారం(జూన్ 5న) విడుదల చేస్తుంది. దేశ ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి.
ప్రపంచ పరిణామాలు
చైనా, జపాన్ జూన్ తయారీతో పాటు యూరోజోన్ జూన్ వినియోగదారుల విశ్వాస, తయారీ గణాంకాలు సోమవారం(నేడు) విడుదల అవుతాయి. యూరోజోన్ జూన్ ద్రవ్యోల్బణం, మే నిరుద్యోగ గణాంకాలు మంగళవారం వెల్లడి కానున్నాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ మినిట్స్ బుధవారం (జూలై 3న), బ్రిటన్‌లో (గురువారం) జూలై4న సార్వత్రి ఎన్నికలు జరగునున్నాయి. వారాంతపు రోజైన శుక్రవారం జపాన్ ఏప్రిల్ గృహ వినియోగ వ్యయ డేటా, యూరోజోన్ జూన్ రిటైల్ అమ్మకాలు, అమెరికా జూన్ నిరుద్యోగ గణాంకాలు విడుదల కానున్నాయి.
జూన్‌లో రూ.26,565 కోట్ల కొనుగోళ్లు
దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు జూన్‌లో రూ.26,565 కోట్ల కొనుగోళ్లు జరిపారు. రాజకీయ స్థిరత్వం, స్టాక్ మార్కెట్ అనూహ్యంగా పుంజుకోవడం ఇందుకు కారణాలుగా మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఇదే ఏడాది మార్చిలో అత్యధికంగా రూ.35,098 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ‘‘జేపీ మోర్గాన్ గ్లోబల్ బాండ్ ఇండెక్సులో భారత ప్రభుత్వ బాండ్లలను చేర్చడంతో దేశీయంగా కూడా పెట్టుబడులు భారీగా పెరగొచ్చు. అమెరికా అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో వడ్డీ రేట్ల తగ్గింపు ఉండే అవకాశం ఉంది. దీంతో విదేశీ ఇన్వెస్టర్లకు భారత మార్కెట్ మరింత ఆకర్షణగా కనిపిస్తుంది’’ స్వస్తిక ఇన్వెస్ట్‌మెంట్ సీనియర్ సాంకేతిక నిపుణుడు ప్రవేశ్ గౌర్ తెలిపారు. ఎఫ్‌ఐఐలు మే నెలలో రూ. 25,586 కోట్లు, ఏప్రిల్‌లో రూ.8,671 కోట్ల విలువైన భారతీయ ఈక్విటీలను విక్రయించగా, జనవరిలో రూ. 25,744 కోట్లతో అమ్మకాలు జరిపారు. ఫిబ్రవరిలో మాత్రం రూ.1,539 కోట్ల స్వల్ప ఇన్‌ఫ్లోలు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment