expectations
-
ఆరోగ్య సేవలకు టానిక్ ఇస్తారా..?
ప్రజలందరికీ ఆరోగ్య సదుపాయాలు మరింతగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా.. ప్రజారోగ్యంపై ప్రభుత్వం మరింత దృష్టి సారించడంతోపాటు కేటాయింపులను గణనీయంగా పెంచాలని ఈ రంగానికి చెందిన నిపుణులు కోరుతున్నారు. ప్రభుత్వరంగంలో కొత్త ఆస్పత్రుల ఏర్పాటుతోపాటు, ప్రైవేటు రంగంలో ఆస్పత్రులకు సైతం పలు రకాల ప్రయోజనాలతో ప్రోత్సాహం అందించాలన్న సూచనలు వస్తున్నాయి. వైద్య సేవలు, పరికరాలు, ఔషధాలపై జీఎస్టీని తగ్గించాలన్న డిమాండ్లు నెలకొన్నాయి. మరోవైపు 11 కోట్ల మందికి ఉపాధి కలి్పస్తూ జీడీపీలో 30–35 శాతం వాటా కలిగిన ఎంఎస్ఎంఈ రంగం సైతం విధానపరమైన మద్దతు చర్యలను ఆశిస్తోంది. అంచనాలు–డిమాండ్లు.. → 2024–25 బడ్జెట్లో ఆరోగ్య రంగానికి రూ.90,171 కోట్లు కేటాయించారు. అత్యాధునిక ఆరోగ్య సదుపాయాలు మరింత మందికి అందుబాటులోకి రావాలంటే జీడీపీలో కేటాయింపులు 2.5 శాతానికి పెంచాలి. → ఒకరికి వినియోగించిన లేదా పునరి్వనియోగానికి అనుకూలంగా మార్చిన (రిఫర్బిష్డ్) వైద్య పరికరాల విషయంలో తగిన నియంత్రపరమైన విధానాల తీసుకురావడం ద్వారా.. ఈ పరికరాలు సమాజంలో వైద్య సదుపాయాలు అంతగా అందని వర్గాలకు చేరువ చేయొచ్చు. → వ్యాధి నివారణ ముందస్తు ఆరోగ్య చికిత్సలు, టెస్ట్‌లకు పన్నుల ప్రయోజనాలు కల్పించాలి. వైద్య, ఆరోగ్య సేవలు, జీవనశైలి వ్యాధులు(మధుమేహం, స్థూలకాయం తదితర) ప్రాణాధార ఔషధాలపై జీఎస్టీని తగ్గించాలి. → గత బడ్జెట్లలో టెలీ మెడిసిన్‌కు మద్దతు లభించింది. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ (ఎన్డీహెచ్ఎం)ను సైతం కేంద్రం ప్రవేశపెట్టింది. 2025 బడ్జెట్లోనూ హెల్త్ యాప్‌లు, ఏఐ ఆధారి డయాగ్నోస్టిక్స్ టూల్స్ తదితర డిజిటల్ హెల్త్ సేవల విస్తరణ దిశగా చర్యలు ఉంటాయని అంచనా. → ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్స్ కేంద్రాల విషయంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) బలోపేతం చేసే దిశగా చర్యలు అవసరం. → ఫార్మాస్యూటిక్సల్, వైద్య పరికరాల కోసం దేశం మొత్తానికి ఒకే నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలి. → పరిశోధన, అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు, ప్రోత్సాహకాలు కల్పించాలి. ప్రభుత్వం నుంచి పరిశోధనా ప్రోత్సాహకాలు ప్రస్తుతం ఇనిస్టిట్యూషన్లు, విద్యా కేంద్రాలకే వెళుతున్నాయి.→ క్లినికల్, డిస్కవరీ రీసెర్చ్ కార్యక్రమాల్లో పాల్గొనే కాంట్రాక్ట్ రీసెర్చ్ సంస్థలకు (సీఆర్వోలు) నిధులు, ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఎంఎస్ఎంఈలకు రుణ విస్తృతి అవసరం→ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎఎస్ఎంఈలు) కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీతో అనుసంధానం కావాల్సి ఉంటుంది. కనుక ఈ రంగంలోని కారి్మకులకు డిజిటల్ నైపుణ్యాల కల్పన, ఏఐ ఆధారిత శిక్షణ కార్యక్రమాలను అందించాలి. → ఎఎస్ఎంఈలకు నిధుల లభ్యత పెద్ద సమస్యగా ఉంది. అత్యవసర క్రెడిట్ గ్యారంటీ సహా పలు రకాల పథకాలను ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ ఆచరణలో లోపం నెలకొంది. దీంతో టైర్ 3, 4, గ్రామీణ ప్రాంతాల్లోని ఎంఎస్ఎంఈలకు రుణాల లభ్యత కష్టంగానే ఉంది. ఏఐ ఆధారిత రుణ దరఖాస్తుల మదింపు, రిస్క్ ప్రొఫైలింగ్‌తో రుణ లభ్యతను విస్తృతం చేయొచ్చు. → తయారీ విస్తరణకు, తక్కువ వడ్డీరేట్లపై రుణాలు అందించాలి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
బడ్జెట్: మేడమ్... మధ్య తరగతిని మర్చిపోకండి
బడ్జెట్ అనగానే ఎదురుచూపులు...భారీ ఆశలు... కోర్కెల చిట్టాలు...చివరకు నిట్టూర్పులు...ప్రతిసారీ మధ్యతరగతి వర్గం పరిస్థితి ఇదే...ఈసారైనా కాస్త మార్పు వస్తుందేమోనన్న ఆశ.2025-26 ఆర్ధిక సంవత్సరానికి కేంద్ర ఆర్ధిక మంత్రి ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కొన్ని విప్లవాత్మక నిర్ణయాలకు వేదికగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల తర్వాత మూడోసారి కొలువు తీరిన మోదీ సర్కారు నుంచి వెలువడే ఈ బడ్జెట్ దేశ ఆర్ధిక వ్యవస్థను పరుగులు తీయించగల కొన్ని కఠిన నిర్ణయాలతో పాటు.. సామాన్యులను ఇరకాటంలో పెట్టని విధంగా సమతౌల్యంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది.ఆర్ధిక వృద్ధి రేటు మందగించి.. రూపాయి నానాటికీ క్షీణిస్తూ... స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్న ప్రస్తుత తరుణంలో ఏమాత్రం బ్యాలన్స్ తప్పినా...జరిగే నష్టాన్ని పూడ్చడం అంత తేలిక్కాదు. ఈనేపథ్యంలో వృద్ధికి పట్టుగొమ్మగా నిలిచే మధ్య తరగతి వర్గాలను... మరీ ముఖ్యంగా ఉద్యోగ వర్గాలను మెప్పించడం ప్రధానం.దేశంలో ఆదాయపు పన్ను క్రమం తప్పక చెల్లిస్తున్నది ఉద్యోగ వర్గాలే. వీళ్లకు టీడీఎస్ రూపంలో జీతం ఇచ్చేటప్పుడే పన్ను కోత జరుగుతుంది. మిగతా వర్గాల్లో పన్ను వసూళ్లు ఉన్నప్పటికీ వారికి దక్కే మినహాయింపులు వేరు. ఖర్చులు పెరిగిపోయి... వచ్చే ఆదాయాలు ఏమూలకూ సరిపోని ఈరోజుల్లో... తమను చిన్న చూపు చూడొద్దంటూ అత్యధిక సంఖ్యలో పన్ను చెల్లించే మధ్య తరగతి, ఉద్యోగ వర్గాలు ఆర్ధిక మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాయి.రాబోయే బడ్జెట్ నుంచి వీరు ఏమి ఆశిస్తున్నారో... ఏమి చర్యలు ప్రకటిస్తే బావుంటుందో చూద్దాం.1. సెక్షన్ 80 సీ: ఆదాయపు పన్ను చట్టంలోని ఈ సెక్షన్ రూ.1 .50 లక్షల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని కల్పిస్తోంది. 2014 నుంచి చిన్న చిన్నవి తప్పిస్తే... ఈ సెక్షన్ లో పెద్దగా మార్పులే చోటు చేసుకోలేదు. ఈ పరిమితిని కనీసం రూ.2 లక్షల వరకైనా పెంచాలి అనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుత అధిక ధరలు, ఖర్చుల నేపథ్యంలో... ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సంపాదించే ఆదాయం వచ్చింది వచ్చినట్లు ఖర్చు అయిపోతున్న నేపథ్యంలో సగటు జీవులు పొదుపు చేసే పరిస్థితులు సన్నగిల్లాయి. పొదుపు చేసే పరిస్థితులే లేనప్పుడు వారు ఇక పెట్టుబడులు ఎలా పెట్టగలుగుతారు. పెట్టుబడులు రానప్పుడు ఆర్ధిక వ్యవస్థ పరుగులు ఎలా తీస్తుంది? కాబట్టి ఆర్ధిక మంత్రి ఇప్పటికైనా దశాబ్దానికి పైగా పడకేసిన మార్పుల్ని ఈ సెక్షన్ లో చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా ట్యాక్ సేవింగ్ పథకాలు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లు వంటి పథకాల్లో పొదుపు పెరుగుతుంది. విస్మరించకూడని సెక్షన్ ఇది.2. సెక్షన్ 80డీ : రానురాను ఆరోగ్య సమస్యలు పెచ్చుమీరుతున్నాయి. చిన్న రోగం వచ్చిందంటే చాలు... వేలల్లో వెచ్చించాల్సి వస్తోంది. ఇక పెద్ద రోగాలయితే చెప్పనక్కర్లేదు... లక్షలు పెట్టాల్సిందే. కొంతవరకు బీమా ప్రయోజనాలు దక్కుతున్నప్పటికీ.. ఇప్పటికీ బీమాకు దూరంగా ఉంటున్న వర్గాలే ఎక్కువ. పన్ను చెల్లింపుదారులకు కొద్దో గొప్పో ప్రయోజనాన్ని కల్పిస్తోందీ సెక్షన్. వైద్య ఖర్చులపై వెచ్చించే మొత్తానికి ప్రస్తుతం వృద్ధులకు రూ.50,000, మిగతా వర్గాలకు రూ.25,000 వరకు పన్ను తగ్గింపు లభిస్తోంది. ఈమొత్తాన్నివృద్ధుల విషయంలో రూ. లక్షకు, మిగతా వారికి రూ.50,000 వరకు పెంచాల్సిన అవసరం ఉంది.3. సీనియర్ సిటిజెన్లు: ప్రభుత్వం ప్రతిసారీ వీరికి ఇతోధిక ప్రయోజనాలను కల్పిస్తూ తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయినా అవి సరిపోవు. వీళ్ళు వయసు పెరిగి.. శ్రమ శక్తి తగ్గి... సంపాదనా సామర్ధ్యం మూలన పడి.. అనారోగ్యాలు పలకరిస్తూ.. కేవలం పెన్షన్ నో, అంతో ఇంతో దాచుకున్న డబ్బులనో.. లేదంటే పిల్లలు పంపే సొమ్ములనో నమ్ముకుని కాలం వెళ్లదీస్తూ ఉంటారు. ఈ వర్గాలకు పన్ను, వడ్డీ మినహాయింపులు అధిక మేలు చేస్తాయి. ప్రభుత్వం తప్పనిసరిగా వీరి విషయంలో ఉదారంగా వ్యవహరించాల్సిందే.4 హెచ్ఆర్ఏ: ఢిల్లీ, కోల్ కతా వంటి మెట్రో నగరాల్లోని ఉద్యోగులు తాము పొందే హెచ్ ఆర్ ఏ పై 50 శాతం వరకు పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందుతున్నారు. ఇదే విధానాన్ని హైదరాబాద్, బెంగళూరు వంటి టైర్ - 2 నగరాలకు కూడా వర్తింపజేయాలి. ఈ నగరాలు కూడా టైర్-1 సిటీ లతో పోటీపడుతూ పరుగులు తీస్తున్నాయి. ఈ నగరాల్లోనూ జీవన వ్యయం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. ఈనేపథ్యంలో ఉద్యోగుల ఆదాయ ఉపశమన చర్యల్లో భాగంగా వీరికి కూడా హెచ్ఆర్ఏ లో 50% రిబేటు ప్రయోజనాన్ని కల్పించాలి. 5 . గృహ రుణాల వడ్డీ: మధ్యతరగతి వర్గాల ప్రధాన కల తమకంటూ ఓ సొంత ఇంటిని కట్టుకోవడం. వీరిలో 99% మంది బ్యాంకులు/ఇతర ఆర్ధిక సంస్థల రుణాలపైనే ఆధారపడతారు. వీరు చెల్లించే ఈఎంఐ లో పెను భారం మోపేది వడ్డీలే. గృహ రుణాల వడ్డీపై ఇప్పటిదాకా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24(బి) కింద రూ.2 లక్షల వరకు వడ్డీని ఆదాయం నుంచి మినహాయించి చూపించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరాల్లో డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొనాలంటే కనీసం రూ. 70 లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. ఇందులో రూ. 50 లక్షలు బ్యాంకు లోన్ తీసుకున్నా తక్కువలో తక్కువ రూ.4 లక్షల దాకా వార్షిక వడ్డీ లెక్క తేలుతుంది. కాబట్టి వడ్డీ మినహాయింపు పరిమితిని ప్రస్తుత స్థాయి నుంచి కనీసం రూ. 3 లక్షల వరకైనా పెంచాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.అన్నిటికంటే ప్రధానమైనది ఆదాయపు పన్ను రేట్లు. ట్యాక్ స్లాబుల్లో మార్పులు. వీటి గురించి తదుపరి ఆర్టికల్ లో చర్చించుకుందాం.-బెహరా శ్రీనివాస రావు ఆర్ధిక విశ్లేషకులు -
కేంద్ర బడ్జెట్‌పై భారీగా అంచనాలు
-
కేంద్ర బడ్జెట్‌పై ఎస్బీఐ అంచనాలు
కేంద్ర బడ్జెట్ 2025-26 ప్రకటన సమీపిస్తున్న తరుణంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) భారతదేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే సామర్థ్యం ఉన్న కీలక రంగాలను హైలైట్ చేస్తూ అంచనాలను వెల్లడించింది. ఎస్బీఐ ప్రీ బడ్జెట్ విశ్లేషణలో భాగంగా ప్రస్తావించిన అంశాలు కింది విధంగా ఉన్నాయి. ఫిబ్రవరి 1న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడుతారు.గ్రామీణాభివృద్ధిపై దృష్టికీలక గ్రామీణ పథకాలకు కేటాయింపులు పెరిగే అవకాశం ఉండటంతో ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుంది. ఇందులో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ), గ్రామీణ గృహనిర్మాణం, గ్రామీణ రహదారులు వంటి కార్యక్రమాలు ఉన్నాయి. ప్రత్యేకించి పట్టణ వినియోగం నెమ్మదించడంతో గ్రామీణ డిమాండ్‌ను పెంచడం, విస్తృత ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వడం దీని లక్ష్యం.ఆరోగ్య సంరక్షణ, బీమా సంస్కరణలుహెల్త్ కేర్, ఇన్సూరెన్స్ రంగాల్లో పలు సంస్కరణలు చేపట్టే అవకాశం ఉంది. టర్మ్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను మరింత చౌకగా ఉండేలా జీఎస్టీ, పన్నులను మినహాయించడం, ఆరోగ్య సంరక్షణ వ్యయాన్ని జీడీపీలో 5 శాతానికి పెంచడం, వైద్య పరికరాలపై జీఎస్టీ రేట్లను హేతుబద్ధీకరించడం వంటి వాటిపై దృష్టి సారించవచ్చు. ఈ చర్యలు బీమా సదుపాయాన్ని మరింత మందికి చేరువ చేసేందుకు ఉపయోగపడుతాయి. ఆరోగ్య సంరక్షణ సేవలకు డిమాండ్ పెరుగుతుండడంతో ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలు ఈ సమస్యకు పరిష్కారంగా నిలుస్తాయి.ఎంఎస్ఎంఈలకు మద్దతుసూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)ను ఆదుకునేలా బడ్జెట్లో చర్యలు ఉండబోతున్నాయి. ఇందులో ఎంఎస్ఎంఈలకు తక్కువ వడ్డీ ఫైనాన్సింగ్, పన్ను మినహాయింపులు, రిటైల్, ఇతర రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలు ఉండవచ్చు. నిర్వహణ సవాళ్లను తగ్గించడం, సృజనాత్మకతను పెంపొందించడం దీని లక్ష్యం.ఇదీ చదవండి: లిక్విడిటీ లోటు రూ.3 లక్షల కోట్లుడిజిటల్ మౌలిక సదుపాయాలుముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ మౌలిక సదుపాయాల విస్తరణపై బడ్జెట్లో దృష్టి సారించనున్నారు. ఎక్కువ మంది వినియోగదారులు, వ్యాపారాలను ఆన్లైన్ బాటపట్టించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను పెంచడానికి ఇది సహాయపడుతుంది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక లావాదేవీలను క్రమబద్ధీకరించడం సులువుకానుంది. -
సంకేతాలు ప్రతికూలం.. కన్సాలిడేషన్‌కే అవకాశం!
గతవారం స్టాక్ మార్కెట్లు బాగా కుదేలయ్యాయి. ప్రధాన సూచీలు దాదాపు 2 శాతం పడిపోయాయి. ఇందుకు మూడు ప్రధాన కారణాలను చెప్పుకోవచ్చు. విదేశీ ఇన్వెస్టర్ల నిరంతర అమ్మకాలు, పెరిగిన చమురు ధరలు, పూర్తి ఆర్ధిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గించడం.. ఈ మూడూ మార్కెట్లను కిందకు నడిపించాయి. టీసీఎస్ ఆర్ధిక ఫలితాలు మార్కెట్లను మెప్పించి ఐటీ కంపెనీలపై కాస్త భరోసా ఇచ్చినప్పటికీ.. ఈ డోస్ సరిపోలేదు. అంతర్జాతీయంగా చూస్తే.. అమెరికా ప్రెసిడెంట్‌గా వచ్చే వారం బాధ్యతలు స్వీకరించబోతున్న 'డొనాల్డ్ ట్రంప్' (Donald Trump) అనుసరించబోయే విధానాలపై పూర్తి క్లారిటీ లేకపోవడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసిందని చెప్పవచ్చు. ఇక వారం మొత్తానికి సెన్సెక్స్ 1845 పాయింట్లు కోల్పోయి 77378 వద్ద, నిఫ్టీ 573 పాయింట్లు నష్టపోయి 23432 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి.ఈవారంఅక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించిన ఆర్ధిక ఫలితాల సందడి మొదలయ్యింది. ఈవారం మార్కెట్లను పెద్దగా ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడం వళ్ళ ఆయా కంపెనీలు ప్రకటించబోయే త్రైమాసిక ఫలితాలే రాబోయే రోజుల్లో మార్కెట్లకు దిశానిర్దేశం చేయబోతున్నాయి.రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, విప్రో, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, ఎల్టీటీఈఎస్, ఎల్టీఐఎమ్, ఇండియన్ హోటల్స్, సియట్, ఐసీఐసీఐ లొంబార్డ్ తదితర ప్రముఖ సంస్థలు ఈవారం ఆర్ధిక ఫలితాలను ప్రకటించబోయే జాబితాలో ఉన్నాయి.ఇక క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకల తర్వాత మళ్ళీ మార్కెట్లో విదేశీ మదుపర్ల సందడి మొదలైందని గతవారం మార్కెట్ ట్రెండ్‌ను బట్టే తెలుస్తోంది. గతవారం క్షీణత తర్వాత ఈవారం మార్కెట్లు కొంత మేర కన్సాలిడేషన్ దిశగా సాగే అవకాశం ఉంది. అదే సమయంలో కాస్త ప్రతికూల వార్తలొచ్చినా.. అది మరింత కిందకు లాగేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ద్రవ్యోల్బణ గణాంకాలు, రూపాయి కదలికలు, చమురు ధరల్లో మార్పులపైనా మదుపర్లు ఓ కన్నేసి ఉంచాలి.ఎఫ్ఐఐలువిదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) గత డిసెంబర్ నెల మొత్తం మీద రూ.16982 కోట్ల నికర విక్రయాలు జరపగా.. దేశీయ మదుపర్లు రూ. 34194 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. ఇక ఈ ఏడాది ఇప్పటిదాకా విదేశీ మదుపర్లు రూ.21,357 కోట్ల నికర అమ్మకాలు చేశారు. అదే సమయంలో దేశీయ మదుపర్లు మాత్రం రూ. 24,215 కోట్ల నికర కొనుగోళ్లతో మార్కెట్‌కు అండగా నిలిచారు.సాంకేతిక స్థాయిలుమార్కెట్లో ప్రస్తుతం బేరిష్ సెంటిమెంట్ ఉంది. గత ఏడాది జూన్ తర్వాత నిఫ్టీ మళ్ళీ ప్రస్తుతం ఆ స్థాయిలకు వచ్చింది. సెన్సెక్స్, నిఫ్టీల్లో ఒడుదొడుకులు కొంత మేర తగ్గి మార్కెట్లు కన్సాలిడేషన్ దిశగా సాగుతాయని భావించవచ్చు. ముఖ్యంగా బుల్స్ చేస్తున్న ప్రయత్నాలను ఎప్పటికప్పుడు బేర్స్ అడ్డుకుంటూ మార్కెట్లను కిందకు లాగడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.కొనుగోళ్ల సహకారం లభిస్తే మాత్రం 23700 పాయింట్ల వద్ద నిరోధం ఎదురుకావొచ్చు. అదికూడా అధిగమిస్తే తదుపరి నిరోధక స్థాయి 23830 దగ్గర ఉంది. ప్రముఖ కంపెనీల ఆర్ధిక ఫలితాల మెప్పించకపోయినా, ద్రవ్యోల్బణ గణాంకాలు మరింత నీరసంగా ఉన్నా, సూచీలు పడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అదే జరిగితే మొదట 23270 వద్ద మద్దతు దొరుకుతుంది. దీన్ని కూడా ఛేదించి కిందకు జారితే మాత్రం తదుపరి నిరోధం 23000 వద్ద, ఆపైన 22800 స్థాయి వద్ద సహకారం లభించవచ్చు.ఫ్యూచర్స్ & ఆప్షన్స్ డేటాను పరిశీలిస్తే నిఫ్టీ 23000 - 24000 స్థాయిలోనే చలించవచ్చని తెలుస్తోంది. కాల్స్ డేటా ప్రకారం 24500 వద్ద అత్యధిక స్థాయిలో ఓపెన్ ఇంటరెస్ట్ ఉంది. పుట్స్ వైపు 22500 వద్ద అత్యధిక ఓపెన్ ఇంటరెస్ట్ కేంద్రీకృతమై ఉంది. మార్కెట్లో హెచ్చుతగ్గులకు దిక్సూచిగా నిలిచే ఇండియా విక్స్ గత వారం 10 శాతం పెరిగి 14.9 దగ్గర ఉంది.రంగాలవారీగా..గత వారమంతా చాలా బలహీనంగా సాగిన బ్యాంకింగ్ షేర్లు.. ఈవారం కొద్దిగా పుంజుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా షార్ట్ కవరింగ్ లావాదేవీలు ఈ రంగం సెంటిమెంట్ ను పెంచుతాయి. టెలికాం రంగంలోని సంస్థలు ప్రోత్సాహక ఫలితాలు ప్రకటించవచ్చన్న అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ రంగంలోని షేర్లు సానుకూలంగా కదలాడొచ్చు.వాహన రంగంలోని షేర్లు స్తబ్దుగా చలించే అవకాశం ఉంది. ముఖ్యంగా మారుతీ, అశోక్ లేలాండ్, బజాజ్ ఆటో షేర్లు ప్రతికూలతలను చూడొచ్చు. అదే సమయంలో హీరో, టీవీఎస్ కొంతమేర ప్రోత్సాహకరంగా ఉండొచ్చు. క్షీణిస్తున్న రూపాయి.. ఫార్మా షేర్లకు మంచి బూస్ట్ అనే చెప్పాలి. గత త్రైమాసికానికి సంబంధించి రూపాయి క్షీణత వాటి ఆర్ధిక ఫలితాలను ప్రభావితం చేస్తుంది. ఇది ఒకింత ప్రోత్ససహకమే.మార్కెట్ ఒడుదొడుకుల్లో మదుపరులకు ఇది ఎప్పటికీ సురక్షిత రంగమే. ఇక టీసీఎస్ ప్రకటించిన ఆర్ధిక ఫలితాలు మార్కెట్ వర్గాలను మెప్పించాయి. ఈవారం ఫలితాల ప్రకటించబోయే ఐటీ కంపెనీల్లో ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ వంటివి ఉన్నాయి. వీటి ఫలితాల మార్కెట్లకు.. ముఖ్యంగా ఐటీ రంగానికి దిశానిర్దేశం చేస్తాయి. సిమెంట్ షేర్లకు మద్దతు లభించే అవకాశం ఉండగా, లోహ షేర్లు ఒత్తిళ్లు ఎదుర్కోవచ్చు. చమురు, ఎఫ్ఎంసీజీ షేర్లలో పెద్దగా దూకుడుvఉండకపోవచ్చు.- బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు. -
29న రిలయన్స్ ఏజీఎం.. అంచనాలన్నీ వీటిపైనే!
భారతీయ పారిశ్రామికవేత్త, అత్యంత సంపన్నుడు అయిన 'ముకేశ్ అంబానీ' ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏట కూడా 'రిలయన్స్ యాన్యువల్ జనరల్ మీటింగ్' (AGM) ఈ నెల 29న నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకుంటారనే విషయాలను తెలుసుకోవడానికి సర్వత్రా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.ఆగష్టు 29న జరగనున్న 47వ వార్షిక సర్వసభ్య సమావేశంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. అంబానీ తీసుకునే నిర్ణయాలు ఏకంగా 35 లక్షల మందిని ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే లాభాల బాటలో దూసుకెళ్తున్న రిలయన్స్ కంపెనీ ఆగష్టు 29 తరువాత మరింత వృద్ధి చెందే అవకాశం లేకపోలేదు.రిలయన్స్ యాన్యువల్ జనరల్ మీటింగ్ 2017లో కేవలం 1500 రూపాయలకే రీఫండబుల్ డిపాజిట్‌తో జియో ఫోన్ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. 2018లో 2999 రూపాయలకు జియో ఫోన్2, 2019లో సౌదీ ఆరామ్కో పెట్టుబడులతో పాటు జియో ఫైబర్ లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది. 2020లో గూగుల్ కంపెనీలో పెట్టుబడి, 2021లో రూ. 75000 కోట్ల పెట్టుబడితో కొత్త ఎనర్జీ బ్లూప్రింట్, 2022లో 5జీ కోసం రూ.2 లక్షల కోట్లు కేటాయింపు.. ఇలా సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.ఈ ఏడాది జరగబోయే సమావేశంలో.. రిలయన్స్ జియో ఫైనాన్షియల్ లిస్టింగ్ గురించి మాట్లాడే అవకాశం ఉంది. అంతే కాకుండా వారసత్వ ప్రణాళికలు కూడా వెల్లడయ్యే అవకాశం ఉంది. అంటే ఉన్న వ్యాపారాలలో ఎవరికి ఏది అప్పగిస్తారో.. గురువారం జరిగే సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది.రిలయన్స్ కంపెనీ ఆయిల్ అండ్ కెమికల్, న్యూఎనర్జీ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగానే గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మెగా గ్రీన్ ఎనర్జీ కాంప్లెక్స్ సిద్ధమవుతోంది. కాబట్టి జరగబోయే సమావేశంలో గిగా ఫ్యాక్టరీలు, ఎనర్జీ స్టోరేజీలు, ఎలక్ట్రోలైసర్లు, ప్యూయల్ సెల్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ వంటి వాటిపై అప్డేట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. -
వేతన జీవుల చిన్ని చిన్ని ఆశలు..
ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం ఈ వారంలో అంటే జూలై 23 మంగళవారం నాడు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. రాజకీయ సవాళ్లతో సంబంధం లేకుండా ఈ సంవత్సరం ఎన్నో ఆర్థిక సవాళ్లు ప్రభుత్వం ముందున్నాయి. అభివృద్ధి, ధరల పెరుగుదల, దేశ రక్షణ, సైబర్ సెక్యూరిటీ సమస్యలు ఒక వైపున ఉండగా .. ప్రతి రంగం, ప్రతి పరిశ్రమ, పలు సంస్థలు ఏదో ఒక ఉపశమనం కావాలి.. రావాలి అనుకోవడం మరోవైపున ఉంది. అలాగే, స్త్రీలు, వయోవృద్ధులు, రైతులు, వ్యక్తులు, అందునా వేతన జీవులు కూడా ఎంతో కొంత ఉపశమనం కోరుకుంటున్నారు.రేపు మధ్యాహ్నం ఒంటిగంటకల్లా మనకి బడ్జెట్లో ఏమి ఉందో, ఏమి లేదో తెలిసిపోతుంది. ప్రస్తుతం ఉన్నత వర్గాల్లో చర్చలు, సమాలోచనలు, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలు, సగటు వేతన జీవులు కోరుకుంటున్న చిన్ని చిన్ని అంశాలేమిటంటే..బేసిక్ లిమిట్ పెంపు: ప్రస్తుతం అమల్లో ఉన్న బేసిక్ లిమిట్ రూ. 2,50,000. ఇది చాలా సంవత్సరాల క్రితం నుంచి అమల్లోకి ఉంది. దీన్ని బాగా పెంచమని ఎన్నో విజ్ఞాపనలు ఇచ్చారు. దీనికి కారణం ధరల పెరుగుదల. ఈ బేసిక్ లిమిట్‌ని రూ. 5,00,000కి పెంచమని ఒత్తిడి ఉంది. అయితే, అంత పెంచకపోయినా కనీసం ఆ పరిమితిని ఒక లక్ష రూపాయలైనా పెంచవచ్చని అంచనా. ఇలా చేయడం వల్ల ఇటు ఉద్యోగస్తులకు, అటు ఇతరులకు ఎంతో ప్రయోజనం ఉంటుంది.స్టాండర్డ్ డిడక్షన్ పెంపు: ప్రస్తుతం రూ. 50,000 వరకే స్టాండర్డ్ డిడక్షన్ ఇస్తున్నారు. ఇది జీతం, పెన్షన్ మీద కాకుండా ఫ్యామిలీ పెన్షన్ మీద ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని లక్ష రూపాయల వరకు పెంచాలని విన్నపాలు ఉన్నాయి. దీనివల్ల ప్రయోజనం కేవలం వేతనజీవులకే పరిమితం. ఉద్యోగ సంఘాలు గట్టిగా ఒత్తిడి తెస్తున్నాయి. ఇదొక మార్పు ఉండొచ్చని విశ్లేషకుల అంచనా.80సి కింద మినహాయింపు పెంపు: ఈ సెక్షన్లో కూడా ఎన్నో అంశాలు ఉన్నాయి. పీఎఫ్, ఎన్ఎస్సీలు, ఎఫ్డీలు, ఇంటి లోన్ చెల్లింపు, స్కూల్ ఫీజులు మొదలైనవి ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్ ఏమిటంటే, ఈ లిమిట్‌ని పెంచమని. సేవింగ్స్ ముఖ్యం. ఇంటి లోన్ చెల్లింపు ముఖ్యం. స్కూల్ ఫీజులూ కంపల్సరీ. ఇవి ప్రతి కుటుంబానికి తప్పని పేమెంట్లు. ఈ లిమిట్స్ పెంచడం సమంజసం. ఇదొక అంశం గవర్నమెంటు పరిశీలనలో ఉంది.మెడిక్లెయిం, మెడికల్ ఖర్చులు, బీమా: ఎన్ని సుఖాలు అనుభవిస్తున్నామో, అనారోగ్యం పేరిట అన్ని దుఖాలూ అనుభవిస్తున్నాం. రోగాలు పెరుగుతున్నాయి. ఖర్చు కూడా ఊహకందని విధంగా పెరుగుతోంది. అందువల్ల మెడిక్లెయిం, మెడికల్ ఖర్చులు పెరుగుతున్నాయి. వీటికి పరిమితిని పెంచడం చాలా న్యాయం. ఇది కూడా గవర్నమెంటు వారి పరిశీలనలో ఉంది.ఇలా చాలా చెప్పవచ్చు. క్యాపిటల్ గెయిన్స్‌లో కొన్ని జటిలమైన అంశాలున్నాయి. వీటి విషయంలోనూ సడలింపులు, హేతుబద్ధమైన చర్యలు చేపట్టాలి. పన్నులు కడుతున్న వారికి ప్రశంసలు, పత్రాలు కాకుండా పన్ను మొత్తంలో ప్రత్యేకంగా రాయితీలు ఇవ్వాలి. వేచి చూద్దాం. సీతమ్మగారు శీత కన్ను వేస్తారో .. వెతలు తీరుస్తారో. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్ పంపించగలరు. -
రికార్డుల ర్యాలీ కొనసాగొచ్చు
ముంబై: దేశీయ కార్పొరేట్ కంపెనీల జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలపై సానుకూల అంచనాలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై ఆశలు, బడ్జెట్‌కు ముందు కొనుగోళ్లు అంశాల నేపథ్యంలో స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ ఈ వారమూ కొనసాగొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కంపెనీల క్యూ1 ఆర్థిక ఫలితాలు, ప్రపంచ పరిణామాలు, ద్రవ్యోల్బణ గణాంకాలతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల క్రయ, విక్రయాలు సూచీలకు దిశానిర్దేశం చేస్తాయంటున్నారు. వీటితో పాటు రుతు పవనాల కదలికల వార్తలు, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు. మొహర్రం సందర్భంగా బుధవారం (జూన్ 17న) ఎక్సే్చంజీలకు సెలవ కావడంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైంది. ‘‘వృద్ధి ఆధారిత బడ్జెట్ ఉహాగానాలు, క్యూ1 ఆర్థిక ఫలితాలపై మిశ్రమ అంచనాల నడుమ మార్కెట్లో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. సాంకేతికంగా నిఫ్టీకి ఎగువ స్థాయిలో 24,600 వద్ద నిరోధం ఉంది. దిగువున 24,150 – 24,200 శ్రేణిలో తక్షణ మద్దతు ఉంది. ఫలితాల సీజన్ సందర్భంగా స్టాక్ ఆధారిత ట్రేడింగ్ జరగొచ్చు. రుతుపవనాలు చురుగ్గా కదలుతున్నందున ఎఫ్ఎంసీజీ షేర్లకు డిమాండ్ లభించవచ్చు.’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సాంకేతిక నిపుణులు నాగరాజ్ శెట్టి తెలిపారు. గతవారం స్టాక్ సూచీలు దాదాపు ఒక శాతం ర్యాలీ చేశాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 523 పాయింట్లు, నిఫ్టీ 178 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాల ప్రభావం మార్కెట్ ముందుగా గత వారాంతాన వెల్లడైన హెచ్‌సీఎల్ టెక్, డీమార్ట్ క్యూ1 ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక వారంలో నిఫ్టీ ఇండెక్స్‌లో 36% వెయిటేజీ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఆటో, ఏసియన్ పేయింట్స్, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఆల్ట్రాటెక్ సిమెంట్, విప్రో, కోటక్ మహీంద్రా బ్యాంక్, బీపీసీఎల్ కంపెనీలు తమ జూన్ త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్నాయి. వీటితో పాటు జియో ఫైనాన్సియల్ సరీ్వసెస్, హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్, ఏంజెల్ వన్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, స్పైస్‌జెట్, ఆదిత్య బిర్లా కంపెనీ, ఎల్అండ్టీ ఫైనాన్స్ హావెల్స్, ఎల్అండ్టీ సరీ్వసెస్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, పాలీక్యాబ్ ఇండియా, టాటా టెక్నాలజీ, ఐసీఐసీఐ లాంబార్డ్, పేటీఎం, పీవీఆర్, యూనియన్ బ్యాంక్, ఆర్బీఎల్, యస్ బ్యాంక్ సహా మొత్తం 197 కంపెనీలు తమ తొలి త్రైమాసిక ఫలితాలు వెల్లడించనున్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం దేశీయ జూన్ హోల్‌సేల్ ద్రవ్యల్బణ డేటా, చైనా క్యూ1 జీడీపీ, జూన్ రిటైల్ అమ్మకాలు, యూరోజోన్ మే పారిశ్రామికోత్పత్తి గణాంకాలు నేడు(జూన్ 15న) విడుదల కానున్నాయి. మంగళవారం మే నెల యూరోజోన్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, జూన్ అమెరికా రిటైల్ అమ్మకాల డేటా, బుధవారం బ్రిటన్ జూన్ ద్రవ్యోల్బణం, యూరోజోన్ జూన్ ద్రవ్యోల్బణం, అమెరికా జూన్ పారిశ్రామికోత్పత్తి డేటా వెల్లడి కానుంది. గురువారం బ్రిటన్ మే నిరుద్యోగ గణాంకాలు, జపాన్ జూన్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ డేటా, యూరోజోన్ ఈసీబీ వడ్డీరేట్ల నిర్ణయం వెలువడునున్నాయి. వారాంతపు రోజైన శుక్రవారం ఆర్బీఐ జూన్ 12తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వలు ప్రకటించనుంది. బ్రిటన్ జూన్ రిటైల్ అమ్మకాల డేటా, జపాన్ జూన్ ద్రవ్యోల్బణం, యూరోజోన్ మే కరెంట్ ఖాతాల గణాంకాలు వెలువడునున్నాయి. ఆయా దేశాలకు సంబంధించిన కీలక స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది.రెండు వారాల్లో రూ.15వేల కోట్ల పెట్టుబడులువిదేశీ ఇన్వెస్టర్లు జూలై తొలి రెండు వారాల్లో దేశీయ మార్కెట్లో రూ.15,352 కోట్ల పెట్టుబడి పెట్టారు. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండటం, కొనసాగుతున్న సంస్కరణలు ఇందుకు కారణాలని నిపుణులు చెబుతున్నారు. ‘‘రాబోయే కేంద్ర బడ్జెట్లో వివిధ రంగాలకు సంబంధించి ప్రోత్సహకాలు, రాయితీలు ఉండే అవకాశం ఉంది. అలాగే, అమెరికా ఫెడరల్ తన వడ్డీ రేట్లను తగ్గించే సూచనలు కూడా ఉన్నాయి. దీంతో విదేశీ పెట్టుబడిదారులు దేశీయ ఈక్విటీల్లో పెద్ద ఎత్తున కొనుగోళ్లను జరుపుతున్నారు’’ అని మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ హిమాన్‡్ష శ్రీవాస్తవ తెలిపారు. మరోవైపు సమీక్షా కాలంలో డెట్ మార్కెట్లో ఎఫ్‌పీఐలు రూ.8,484 కోట్ల పెట్టుబడులు పెట్టారు. విదేశీ కొనుగోలుదారులతో పాటు దేశీయ కొనుగోలు దారులు సైతం 2024లో ఈక్విటీల్లో స్థిరమైన కొనుగోలుదారులుగా ఉన్నారు. ఎఫ్‌పీఐలు జనవరి, ఏప్రిల్, మే నెలల్లో రూ.60,000 కోట్లు ఉపసంహరించుకోగా, ఫిబ్రవరి, మార్చి, జూన్లలో కలిపి రూ.63,200 కోట్లు కొనుగోళ్లు జరిపారు.బడ్జెట్‌పై ఆంచనాలు ఫిబ్రవరి మధ్యంతర బడ్జెట్ తరహాలోనే ఈసారి ఆర్థిక లోటు, రుణ లక్ష్యాలపై దృష్టి సారించవచ్చు. గ్రామీణ ఆర్థికావృద్ధిని బలోపేతం దిశగా సానుకూల ప్రకటనలు ఉండొచ్చు. తక్కువ ఆదాయ శ్రేణి వర్గాలకు పన్ను ప్రయోజనాలు ఉండొచ్చు. మూలధన వ్యయాలకు పెద్దపీట వేయవచ్చు. మొత్తంగా ప్రభుత్వ విధానాలు కొనసాగించే వీలుంది. బడ్జెట్ ఆధారిత వార్తలకు అనుగుణంగా ఆయా రంగాల షేర్లలో కదిలికలు ఉండొచ్చు. మొహర్రం సందర్భంగా బుధవారం ఎక్సే్చంజీలకు సెలవు -
ఈ రంగాలపైనే మోదీ 3.0 బడ్జెట్ ఫోకస్!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 బడ్జెట్‌ను జూలై 23న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. అంతకంటే ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆర్థికవేత్తల సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి సీతారామన్, ప్రణాళికా మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్, ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్, ఆర్థికవేత్తలు సుర్జిత్ భల్లా, అశోక్ గులాటి, ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్ మొదలైనవారు హాజరయ్యారు.త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ మోదీ 3.0 మొదటి బడ్జెట్. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యంగా కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. కాబట్టి బడ్జెట్లో ఏ అంశాలను వెల్లడించబోతున్నారనే విషయాలను తెలుసుకోవడానికి సర్వత్రా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బడ్జెట్లో ఉద్యోగాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, తయారీ రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిసింది. వీటిపై కొన్ని ప్రత్యేక ప్రకటనలు చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు.పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని బడ్జెట్లో ప్రతిపాదించే అవకాశం ఉంది. ముడి పదార్థాలపై సుంకాలను తగ్గించడం వంటివి కూడా ఉండవచ్చు. ప్రస్తుత బేసిక్ మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షలు పెంచడం సహా మధ్యతరగతికి మరింత ఉపశమనం కలిగించేలా వ్యక్తిగత ఆదాయపు పన్నులో సంస్కరణలు ఉండే అవకాశం ఉంది.లిస్టెడ్ ఈక్విటీ షేర్లపై దీర్ఘకాలిక మూలధన లాభాల ట్యాక్స్ కనీస హోల్డింగ్ వ్యవధిని ప్రస్తుత ఏడాది నుంచి 2 లేదా 3 సంవత్సరాలకు పొడిగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. స్టాక్ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడులను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ ప్రకటన చేయొచ్చని చెబుతున్నారు.ఇదీ చదవండి: 1950లో బడ్జెట్ లీకయ్యిందా? తర్వాత ఏం జరిగిందంటే..ప్రధానంగా పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రిక్ వాహనాలు మరియు ఇతర హరిత సాంకేతికతలలో పెట్టుబడి పెట్టే కంపెనీలకు ట్యాక్స్ బెనిఫీట్ కల్పించే అవకాశం ఉంది. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులలో గణనీయమైన పెట్టుబడులకు అవకాశం ఉంది. భారతదేశంలో కాలుష్య తీవ్రతను తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
ఒడిదుడుకుల ట్రేడింగ్‌కు అవకాశం
ముంబై: స్టాక్ సూచీలు జీవితకాల గరిష్ట స్థాయిలు నమోదు తర్వాత అధిక వాల్యుయేషన్ల ఆందోళనలతో ఈ వారంలో ఒడిదుడుకులకు లోనవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు దిశానిర్ధేశం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు సమగ్ర బడ్జెట్‌పై అంచనాలు, రుతు పవనాల కదలికల వార్తలు, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు. ‘‘స్టాక్ మార్కెట్లో ఓవర్‌బాట్ పరిస్థితుల కారణంగా గరిష్ట స్థాయిల వద్ద కొంత లాభాల స్వీకరణ జరగొచ్చు. అధిక వాల్యుయేషన్లు, స్థూల ఆర్థిక డేటా విడుదల నేపథ్యంలో కొంత అస్థిరత చోటు చేసుకునే వీలుంది. ఇన్వెస్టర్లు లార్జ్ క్యాప్ షేర్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు స్తబ్ధుగా ట్రేడవుతున్నాయి. సాంకేతికంగా నిఫ్టీకి దిగువ స్థాయిలో 23800 వద్ద కీలక మద్దతు ఉంది. ఎగువున 24,200 వద్ద నిరోధాన్ని చేధించాల్సి ఉంది’’ హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ సాంకేతిక నిపుణుడు నాగరాజ్ శెట్టి తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలు, ద్రవ్యోల్బణ సంబంధిత ఆందోళలను అధిగమిస్తూ గతవారం స్టాక్ సూచీలు 2% ర్యాలీ చేశాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 1,823 పాయింట్లు, నిఫ్టీ 510 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. స్థూల ఆర్థిక గణాంకాలు జూన్ జీఎస్టీ వసూళ్లు, ఆటో కంపెనీలు జూన్ వాహన విక్రయ గణాంకాలు నేడు(సోమవారం) విడుదల కానున్నాయి. ఇదే రోజు జూన్ తయారీ రంగ పీఎంఐ వెల్లడి కానుంది. సేవారంగ పీఎంఐ గణాంకాలు బుధవారం వెల్లడి అవుతాయి. జూన్ 28తో ముగిసిన వారం బ్యాంకు రుణాలు, డిపాజిట్ల వృద్ధి గణాంకాలు, జూన్ 21తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వలను ఆర్బీఐ శుక్రవారం(జూన్ 5న) విడుదల చేస్తుంది. దేశ ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. ప్రపంచ పరిణామాలు చైనా, జపాన్ జూన్ తయారీతో పాటు యూరోజోన్ జూన్ వినియోగదారుల విశ్వాస, తయారీ గణాంకాలు సోమవారం(నేడు) విడుదల అవుతాయి. యూరోజోన్ జూన్ ద్రవ్యోల్బణం, మే నిరుద్యోగ గణాంకాలు మంగళవారం వెల్లడి కానున్నాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ మినిట్స్ బుధవారం (జూలై 3న), బ్రిటన్‌లో (గురువారం) జూలై4న సార్వత్రి ఎన్నికలు జరగునున్నాయి. వారాంతపు రోజైన శుక్రవారం జపాన్ ఏప్రిల్ గృహ వినియోగ వ్యయ డేటా, యూరోజోన్ జూన్ రిటైల్ అమ్మకాలు, అమెరికా జూన్ నిరుద్యోగ గణాంకాలు విడుదల కానున్నాయి. జూన్‌లో రూ.26,565 కోట్ల కొనుగోళ్లు దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు జూన్‌లో రూ.26,565 కోట్ల కొనుగోళ్లు జరిపారు. రాజకీయ స్థిరత్వం, స్టాక్ మార్కెట్ అనూహ్యంగా పుంజుకోవడం ఇందుకు కారణాలుగా మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఇదే ఏడాది మార్చిలో అత్యధికంగా రూ.35,098 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ‘‘జేపీ మోర్గాన్ గ్లోబల్ బాండ్ ఇండెక్సులో భారత ప్రభుత్వ బాండ్లలను చేర్చడంతో దేశీయంగా కూడా పెట్టుబడులు భారీగా పెరగొచ్చు. అమెరికా అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో వడ్డీ రేట్ల తగ్గింపు ఉండే అవకాశం ఉంది. దీంతో విదేశీ ఇన్వెస్టర్లకు భారత మార్కెట్ మరింత ఆకర్షణగా కనిపిస్తుంది’’ స్వస్తిక ఇన్వెస్ట్మెంట్ సీనియర్ సాంకేతిక నిపుణుడు ప్రవేశ్ గౌర్ తెలిపారు. ఎఫ్ఐఐలు మే నెలలో రూ. 25,586 కోట్లు, ఏప్రిల్‌లో రూ.8,671 కోట్ల విలువైన భారతీయ ఈక్విటీలను విక్రయించగా, జనవరిలో రూ. 25,744 కోట్లతో అమ్మకాలు జరిపారు. ఫిబ్రవరిలో మాత్రం రూ.1,539 కోట్ల స్వల్ప ఇన్‌ఫ్లోలు వచ్చాయి. -
అంచనాలను మించి పెరిగిన అమెరికా నియామకాలు
అమెరికాలో ఉద్యోగ వృద్ధి మే నెలలో అంచనాలను అధిగమించింది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గత నెలలో 2,72,000 ఉద్యోగాలను జోడించింది. ఏప్రిల్‌లో నమోదైన 1,65,000 నియామకాల కంటే మే నెలలో భారీగా పెరిగినట్లు ఆ దేశ కార్మిక శాఖ తెలిపింది.బ్రీఫింగ్ డాట్‌కామ్ (briefing.com) ప్రకారం.. విశ్లేషకులు అంచనా వేసిన 1,85,000 పెరుగుదల కంటే ఇది గణనీయంగా ఎక్కువ. 2023 డిసెంబర్ తర్వాత ఇదే గరిష్ఠ స్థాయి. కాగా ఉద్యోగ వృద్ధితోపాటు నిరుద్యోగం కూడా స్పల్పంగా పెరిగింది. నిరుద్యోగ రేటు 3.9 శాతం నుంచి 4.0 శాతానికి పెరిగిందని ఆ శాఖ పేర్కొంది.అయితే వడ్డీ రేట్లను తగ్గించడానికి సరైన సమయం కావడంతో ఊహించిన దానికంటే ఎక్కువ గణాంకాలు ఫెడరల్ రిజర్వ్ గణనను క్లిష్టతరం చేస్తాయి. ద్రవ్యోల్బణాన్ని స్థిరంగా నియంత్రించేందుకు డిమాండ్ తగ్గుతుందనే ఆశతో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఇటీవలి నెలల్లో రేట్లను 23 ఏళ్ల గరిష్ట స్థాయికి చేర్చింది.ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే ఎక్కువ ఉద్యోగాలను జోడించడంతో, ఫెడ్ రేటు కోతలను మరికొంత కాలం నిలుపుదల చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మే నెలలో హెల్త్ కేర్, గవర్నమెంట్ వంటి రంగాలతో పాటు విశ్రాంతి, ఆతిథ్యం వంటి రంగాల్లో ఉపాధి పెరిగిందని కార్మిక శాఖ నివేదిక తెలిపింది. -
Centre for the Study of Developing Societies: ఒపీనియన్లు వేరువేరయా!
ఎన్నికలగానే ముందుగా ఒపీనియన్ పోల్స్ వెలువడుతుంటాయి. ఫలానా పార్టీ అధికారంలోకి వస్తుందన్న అంచనాలు వెల్లువెత్తుతుంటాయి. ఇవి ఓటర్ల అభిప్రాయాలపై ఎంతో కొంత ప్రభావం చూపుతాయి. ఇలాంటి ఒపీనియన్ పోల్స్ ఫలితాల్లో కచి్చతత్వం ఎంతంటే చెప్పడం కష్టమే. ఈసారి ఎన్డీఏ కూటమి 400 పైచిలుకు లోక్‌సభ స్థానాలు సాధిస్తామని చెబుతుండటం తెలిసిందే. ఎన్డీఏ కూటమికి 372 స్థానాలు రావచ్చని ఎన్డీటీవీ పోల్ ఆఫ్ ఒపీనియన్స్ పోల్స్ సర్వే పేర్కొంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమికి 122 దాకా వస్తాయని అంచనా కట్టింది. కానీ, ఒపీనియన్ పోల్స్ ఫలితాలు కొన్నిసార్లు నిజమైనా, బెడిసికొట్టిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్) కూడా ఇదే చెబుతోంది. 1998 నుంచి 2009 ఎన్నికల దాకా వెలువడ్డ పలు ఒపీనియన్ పోల్స్‌ను సీఎస్డీఎస్ విశ్లేషించగా ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి... అంచనాలు ఇలా.. 1998 లోక్‌సభ ముందస్తు ఎన్నికల తరుణంలో వచ్చిన ఒపీనియన్ పోల్స్ ఫలితాలకు దగ్గరగానే ఉన్నాయి. కానీ 1999 లోక్‌సభ ఎన్నికలపై వచ్చిన అంచనాలు అంత కచి్చతంగా లేవు. నాడు బీజేపీ సాధించబోయే స్థానాలను ఒపీనియన్ పోల్స్ ఎక్కువ చేసి చూపాయి. అలాగే 2004 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఒపీనియన్ పోల్స్ జ్యోతిష్యం ఏమాత్రం పండలేదు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో యూపీఏ కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని పోల్స్ అసలే అంచనా వేయలేకపోయాయి. దాదాపు అన్ని ఒపీనియన్ పోల్స్ ఎన్డీఏ అధికారం నిలబెట్టుకుందనే చెప్పాయి. అలాగే 2009 లోక్‌సభ ఎన్నికల ముందు వేసిన అంచనాలు కూడా తప్పాయి. యూపీఏ అధికారాన్ని నిలుపుకుంటుందని మెజారిటీ ఒపీనియన్ పోల్స్ అంచనా వేయలేకపోయాయి. కానీ యూపీఏ కూటమికి 2004లో 222 లోక్‌సభ స్థానాలు రాగా 2009 ఎన్నికల్లో 262కు పెరిగాయి! 2014 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఎన్డీఏ కూటమి 257 నుంచి 340 సీట్ల వరకు గెలుచుకోవచ్చని ఒపీనియన్ పోల్స్ అభిప్రాయపడ్డాయి. ఎన్డీఏకు 336 స్థానాలొచ్చాయి. కాంగ్రెస్ బలం బాగా పడిపోతుందన్న అంచనాలకు అనుగుణంగా 44 స్థానాలకే పరిమితమైంది. మళ్లీ 2019 ఎన్నికల్లో ఒపీనియన్ పోల్స్ అంచనాలు తప్పాయి. ఎన్డీఏకు 285 స్థానాలకు మించి రావని మెజారిటీ పోల్స్ పేర్కొనగా 353 స్థానాలు వచ్చాయి. బీజేపీ ఒంటరిగానే 303 స్థానాలు సాధించడం తెలిసిందే.ఎగ్జిట్ పోల్స్ కూడా అంతే! ప్రీ పోల్ సర్వేలకు, ఎగ్జిట్ పోల్ అంచనాలకు పెద్ద వ్యత్యాసం కనిపించదు. 2003 చివర్లో జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూల ఫలితాలు రావడంతో ఇండియా షైనింగ్ నినాదంతో 2004 కేంద్రంలో బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి 240–250 నుంచి స్థానాలు సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించగా ఫలితాలు రివర్సయ్యాయి. ఎన్డీఏ 187కే పరిమితమైంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కూడా బీజేపీ సొంతంగా స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయలేకపోయాయి. 2016 చివర్లో మోదీ సర్కారు పెద్ద నోట్లను రద్దు చేశాక జరిగిన 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ తుస్సుమన్నాయి. హంగ్ వస్తుందన్న వాటి అంచనాలకు భిన్నంగా బీజేపీ ఏకంగా 300 సీట్లతో ఘన విజయం సాధించింది.నిబంధనలు ఇలా... ఎన్నికల్లో ఎవరికి ఓటేసే అవకాశం ఉందంటూ ఓటర్ల అభిప్రాయాలను తెలుసుకుని రూపొందించేవి ఒపీనియన్ పోల్స్. ఓటేసి పోలింగ్ బూత్‌ల నుంచి తిరిగి వెళ్లే ఓటర్లను ప్రశ్నించి వేసే అంచనాలే ఎగ్జిట్ పోల్స్. ఒపీనియన్ పోల్స్ ఫలితాలను ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందు వరకు ప్రకటించవచ్చు. తుది దశ పోలింగ్ ముగిశాక ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసుకోవచ్చు.తప్పడానికి కారణమేమిటి? ఒపీనియన్ పోల్స్ అంచనాలు చాలా వరకు తారుమారు కావడానికి ఎన్నో కారణాలున్నాయి. అంచనాల్లో తప్పులు ఎంత తక్కువగా ఉంటే ఫలితాలు కచి్చతత్వానికి అంత దగ్గరగా ఉంటాయి. → 1999 లోక్‌సభ ఎన్నికల్లో ఒపీనియన్ పోల్స్ అంచనాలు, వాస్తవ ఫలితాల మధ్య 20 సీట్ల దాకా తేడా ఉంది. → 2009 ఎన్నికల్లో ఈ అంతరం 25–60 స్థానాలకు పెరిగింది. 2014లోనైతే ఏకంగా 50–100 స్థానాల తేడా వచి్చంది. → ఓటర్ల అభిప్రాయాలు తెలుసుకుని తదనుగుణంగా ఈ సంస్థలు అంచనాలు వేస్తుంటాయి. అలా ఒక్కో పార్టీ/కూటమికి వచ్చే స్థానాలను లెక్కగడుతుంటాయి. → ఇది కాలం చెల్లిన పాత విధానమని నిపుణులు అంటున్నారు. → పోలింగ్ ఏజెన్సీలు సర్వేకు కావాల్సిన బలమైన వసతులు లేకపోవడం కూడా అంచనాల్లో తప్పులు పెరగడానికి కారణం. → ప్రతి నియోజకవర్గం నుంచి శాంపిల్ సైజు వీలైనంత ఎక్కువగా ఉండాలి. ఇందుకు భారీగా సిబ్బంది, నిధులు, సమయం కావాలి. → కానీ మన దగ్గర పోల్ ఏజెన్సీలకు ఈ వనరుల్లేవు. → పారీ్టల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే, ఫలితాల అంచనాలు అంత కష్టమవుతాయని సీఎస్డీఎస్ సైతం చెబుతోంది. → 2014 ఎన్నికల్లో 464 రాజకీయ పారీ్టలు పోటీ చేశాయి. 1998తో పోలిస్తే ఇది రెట్టింపు! → పోలింగ్ ఏజెన్సీలు పోటాపోటీగా పెరుగుతున్నాయి. దాంతో చాలా శాస్త్రీయంగా పోల్ సర్వేలు నిర్వహించకుండానే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. → సర్వే అంచనాలు ఎందుకు తప్పాయని చాలా పోలింగ్ ఏజెన్సీలు విశ్లేషణను చేసుకోవడం లేదు. → పైగా సర్వే ఫలితాలను ఎలా రూపొందించారో ఆధారాలను కూడా వెల్లడించడం లేదు. → ప్రీ పోల్ అంచనాలకు సంబంధించి జవాబుదారీ లేకపోవడం కూడా సమస్యకు కారణమే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ట్రంప్ పర్యటనపై కార్పొరేట్ల ఆశలు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా ఈ నెల 24,25న భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన టూర్‌పై దేశీ కార్పొరేట్లు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ పర్యటన సందర్భంగా ‘మినీ’ వాణిజ్య ఒప్పందం కుదరగలదని, అమెరికా కంపెనీలు మరింత పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు ఉండవచ్చని ఆశిస్తున్నారు. ఈ టూర్లో భాగంగా ఒక చిన్న పాటి వాణిజ్య ఒప్పందమైనా కుదిరితే తదుపరి సమగ్ర ఆర్థిక భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకునేందుకు పునాదిలాగా ఉపయోగపడగలదని ఆశిస్తున్నట్లు దేశీ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ చెప్పారు. ఇరు దేశాల వాణిజ్య వర్గాలు దీనిపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయని అసోచాం సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు భారత పర్యటనకు వస్తున్న ట్రంప్.. ఈ సందర్భంగా రౌండ్ టేబుల్ సదస్సులో పలువురు కార్పొరేట్ దిగ్గజాలతో భేటీ కానున్నారు. అమెరికన్ దిగ్గజ సంస్థలు, భారత ప్రభుత్వ సీనియర్ అధికారులతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ, భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, ఎల్అండ్టీ చైర్మన్ ఏఎం నాయక్, బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ షా తదితరులు ఇందులో పాల్గొనున్నారు. వివాదాల పరిష్కారంపై దృష్టి.. ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించి రెండు దేశాల మధ్య కొన్ని అంశాలు నలుగుతున్న సంగతి తెలిసిందే. భారత్ ఎగుమతి చేసే కొన్ని రకాల ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా అధి క సుంకాలు విధిస్తోంది. అలాగే, జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ (జీఎస్పీ) కింద ఎగుమతి సంస్థలకు ఒనగూరే ప్రయోజనాలు ఎత్తివేసింది. వీటన్నింటినీ పునఃసమీక్షించాలని దేశీ కంపెనీలు కోరుతున్నాయి. అలాగే, వ్యవసాయం, ఆటోమొబైల్, ఇంజినీరింగ్, ఆటో పరికరాలు మొదలైన ఉత్పత్తుల ఎగుమతులకు అమెరికా మార్కెట్లో మరిన్ని అవకాశాలు కల్పించాలంటున్నాయి. మరోవైపు, భారత్‌లో తమ వ్యవసాయ, తయారీ రంగ ఉత్పత్తులు, వైద్య పరికరాల విక్రయానికి తగిన అవకాశాలు కల్పించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ భారత పర్యటనకు వస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. సీఐఐ అంచనాల ప్రకారం .. దాదాపు 100 పైగా భారతీయ కంపెనీలు అమెరికాలో 18 బిలియన్ డాలర్ల పైచిలుకు ఇన్వెస్ట్ చేశాయి. 1.13 లక్షల పైగా ఉద్యోగాలు కల్పించాయి. 20 18–19లో అమెరికాకు భారత ఎగుమతులు 52.4 బిలియన్ డాలర్లుగా ఉండగా.. దిగుమతులు 35.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2017–18లో 21.3 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు గత ఆర్థిక సంవత్సరంలో 16.9 బిలియన్ డాలర్లకు తగ్గింది. -
బడ్జెట్లో ఆదాయపన్ను పరిమితి పెంపు రెట్టింపు?
సాక్షి, న్యూఢిల్లీ: మరికొన్ని గంటల్లో కేంద్ర ఆర్థికబడ్జెట్ పార్లమెంటు ముందుకు రానుంది. ఎన్నికల ముందు బీజేపీ సర్కార్ తీసుకొస్తున్న మధ్యంతర బడ్జెట్‌పై వివిధ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా వేతన జీవులకు ఊరట లభించనుందనే మాట వినిపిస్తోంది. రేపు( ఫిబ్రవరి 1)న ప్రకటించనున్న మధ్యంతర బడ్జెట్లో ప్రధాన సంస్కరణలను ప్రకటించకపోయినా, మరింత జనాకర్షితంగా ఉండవచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు.ఆదాయపు పన్ను పరిమితిలో భారీ పెంపు ఉంటుందని భాస్తున్నారు. ఈ మినహాయింపును దాదాపు రెట్టింపు చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం వ్యక్తిగత పన్ను మినహాయింపు రూ.2.5 లక్షలుగా ఉంది. అయితే పరితిమిని రూ. 5లక్షలకు పెంచ వచ్చని అంచనా. ప్రస్తుతం 80 ఏళ్లకు పైబడ్డ వృద్ధులకు మాత్రమే రూ.5 లక్షల మినహాయింపు ఉంది. మరోవైపు రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయం పన్ను మినహాయింపు పరిమితిని రెట్టింపు చేయాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) ఇప్పటికే డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అంతేగాక, సెక్షన్ 80 సి కింద పన్ను మినహాయింపును రూ.1.5 లక్షల నుంచి రూ. 2.5 లక్షల మేరకు పెంచాలని సిఐఐ కోరింది. అంచనాలకనుగుణంగా ఈ పరిమితి రెట్టింపు అయితే రిటైల్ పెట్టుబడిదారులను ఉత్సాహపరుస్తుందని మార్కెట్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. -
రైల్వే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు
సాక్షి, న్యూఢిల్లీ : 7వ వేతన సంఘం సిఫారసుల మేరకు నరేంద్ర మోదీ సర్కార్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు తీపి కబురు అందించింది. ఈ నెలలోనే (జనవరి15) ఉపాధ్యాయులకు సంబంధించి ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలుకు అంగీకరించిన కేంద్రం, తాజాగా రన్నింగ్ అలవెన్స్ పెంపుపై రైల్వే ఉద్యోగుల దీర్ఘకాల డిమాండ్‌ను నెరవేర్చనుంది. రన్నింగ్ అలవెన్స్‌ను 200శాతం పెంచేందుకు అంగీకరించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని క్యాష్ అండ్ క్యారీ ఉద్యోగులకు 300 శాతం అలవెన్సును పెంచేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో క్యాష్ అండ్ ట్రెజరీ ఉద్యోగులకు నెలకు రూ.800 నుండి వెయ్యి రూపాయల వరకు, రైల్వే ఉద్యోగులకు నెలకు సుమారు 12వేల నుంచి 25వేల రూపాయల దాకా అదనపు ప్రయోజనం చేకూరనుంది. దీని ప్రకారం రైల్వే ఉద్యోగుల విషయంలో గార్డులు, లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్లు ఇప్పుడు ప్రతి 100 కిలోమీటర్‌కు 520 రూపాయల భత్యం పొందుతారు. అంతకుముందు ఇది 255 రూపాయలుగా ఉంది. ఒకవైపు రన్నింగ్ అలవెన్సును ప్రభుత్వం రెట్టింపు చేయగా, మరోవైపు 2017 జూలై నుంచి డిసెంబరు 2018 వరకు ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ .4,500 కోట్ల బకాయిలను రైల్వేశాఖ చెల్లించనుంది. కేంద్ర బడ్జెట్ 2019 ఫిబ్రవరి 1న ప్రకటించనున్నందున, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆశలను నెరవేర్చేలా ప్రభుత్వం పెద్ద ప్రకటనలు చేయనుందనే ఊహాగానాలు కూడా భారీగా నెలకొన్నాయి. ముఖ్యంగా 7వ వేతన సంఘం నెలకు కనీస వేతనాన్ని రూ.18వేలుగా సిఫారసు చేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వోద్యోగుల కోరిక మేరకు నెలకు కనీస వేతనాన్ని రూ.26వేలుగా నిర్ణయించనుందని సమాచారం. -
రెడ్ మి నోట్ 5 వస్తుందా? ఎప్పుడు?
చైనా మొబైల్ మేకర్ షావోమి నోట్ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. రెడ్ మి నోట్ 5ను త్వరలోనే లాంచ్ చేయనుందని , ఈ మేరకు ఇప్పటికే టెస్టింగ్ ప్రారంభించిందంటూ పలు నివేదికలు వెలుడ్డాయి. మరోవైపు దీనికి భిన్నమైన వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అవుట్ గోయింగ్ మోడల్ రెడ్మి నోట్ 5 లాంచింగ్ బాగా లేట్ కానుందని మరో నివేదిక ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతగా చెబుతున్న క్వాల్కం చిప్సెట్ ఇంకా లాంచ్ కాకపోవడం దీనికి కారణమని ఓ చైనా వెబ్సైట్ వాదిస్తోంది. ఈ ఏడాది రెండవ క్వార్టర్‌కంటే ముందు అందుబాటులోకి రాదని తెలిపింది. అలాగే భారతీయ కొనుగోలుదారులు దీనికోసం మరింత ఎక్కువ కాలం వేచి ఉండవలసి ఉంటుందని నివేదించింది. రెడ్ మి నెట్ 5 బేస్ వేరియంట్ ధర రూ.12 వేలుగా నిర్ణయించే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే 12 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో రానుందని అంచనా. మిగతా ఫీచర్లపై అంచనాలు ఇలా వున్నాయి. రెడ్ మి నోట్ 5 5.99 అంగుళాల ఫుల్హెచ్డీ స్క్రీన్18:9 యాస్పెక్ట్ రేషియో క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 632 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ నౌగట్ 7.1.2. 4జీబీ ర్యామ్ 64జీబీ స్టోరేజ్ 4000ఎంఏహెచ్ బ్యాటరీ -
ఆడియో హిట్‌తో అంచనాలు పెరిగాయి
ఆకలి పోరాటం చిత్ర నిర్మాత పీవీ రాఘవులు రాజమహేంద్రవరం కల్చరల్ : రామ్‌సాయి గోకులం క్రియేషన్స్‌పై నిర్మించిన ‘ఆకలిపోరాటం’ సినిమాలోని ఆరు పాటలు హిట్ కావడంతో చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయని నిర్మాత పీవీ.రాఘవులు(రవి) తెలిపారు. ఈ నెల 25న రాజమహేంద్రవరంలో విడుదల చేసిన ఆకలి పోరాటం ఆడియో విజయం సాధించడంతో ఆ చిత్ర యూనిట్ శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి ఆ వివరాలను తెలిపారు. ఈ సందర్బంగా హీరో గంగాధర్ మాట్లాడుతూ ఎంత పెద్ద సినిమాలో అయినా ఏవో కొన్ని పాటలు హిట్ అవుతాయని, అయితే చిన్న సినిమా అయిన తాను నటించిన ఆకలి పోరాటంలో ఆరు పాటలు ప్రజాదరణ పొందడం ఆనందంగా ఉందన్నారు. ఈ విజయం తమది మాత్రమే కాదని, గోదావరి ప్రాంత సెంటిమెంట్, ఇక్కడి ప్రజల ఆదరణే ఈ విజయానికి కారణమన్నారు. చిత్ర నిర్వాహకులు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ సినిమాలో ఆరు పాటలు మంచి హిట్ అయ్యాయని, ఈ విజయం గోదావరి ప్రాంత వాసులదేనన్నారు. సినిమా విడుదలకు సిద్ధమౌతున్నామని, పాటలను విజయవంతం చేసిన మాదిరిగానే సినిమాను హిట్ చేయాలని ఆక్షాంక్షించారు. కొల్లపురెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యతో తెరకెక్కిన ఈ సినిమాను అందరూ ఆదరించాలని, ప్రస్తుతం యువత పడుతున్న కష్టాలను ఆకలి పోరాటం ద్వారా చూపామన్నారు. -
ఆదాయానికి మించి అంచనాలు
- మిగులు బడ్జెట్ చూపించేందుకు సర్కారు తంటాలు - కేంద్ర ప్యాకేజీపై ఆశలు.. - భూముల అమ్మకంపై ఆశలు గల్లంతు - బకాయిలకు కనిపించని పరిష్కారం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆదాయానికి మించి అంచనాలు వేసుకుంది. వృద్ధి రేటు గణనీయంగా పుంజుకున్నప్పటికీ.. గడిచిన మూడేళ్ల అనుభవాలను విస్మరించింది. వాస్తవికతకు భిన్నంగా అంచనాలను మరోమారు భూతద్దంలో చూపించింది. రూ.1.49 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సర్కారు.. అందులో నిర్వహణ పద్దు కింద రూ.61 వేల కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.88 వేల కోట్లు చూపింది. బడ్జెట్ తయారీ మార్గదర్శకాలు మారటంతో నిర్వహణ పద్దుతో పోలిస్తే ప్రగతి పద్దు భారీగా పెరిగినట్లు కనిపిస్తోంది. కానీ.. గతంలో ప్రణాళికేతర పద్దులో ఉన్న దాదాపు రూ.10 వేల కోట్ల సబ్సిడీలు, రాయితీలన్నీ ప్రగతి పద్దుకు బదిలీ అయ్యాయి. దీంతో ఈ పద్దు అంత స్థాయికి చేరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్‌తో సంబంధం లేకుండా నిధులను సమీకరించే పోకడను ప్రభుత్వం ఈసారీ కొనసాగించింది. ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, కొత్త ఆసుపత్రుల నిర్మాణాలు, మైక్రో ఇరిగేషన్, గొర్రెలు, చేపల పెంపకానికి ఖర్చు చేసే నిధులన్నీ వివిధ సంస్థలిచ్చే రుణసాయంతో నిర్వహించేందుకు మొగ్గు చూపింది. ‘భూముల’ఆదాయం ఢమాల్ కిందటేడాది ఆశించిన ఆదాయం రాలేదని సవరణ బడ్జెట్ గణాంకాల్లో సర్కారు చెప్పకనే చెప్పింది. గత ఏడాది రూ.1.30 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం... కేవలం రూ.1.12 లక్షల కోట్లు ఖర్చవుతుందని సవరించుకుంది. కోర్టు వ్యాజ్యాల కారణంగా భూముల అమ్మకం జరగలేదని, కేంద్రం నుంచి రావాల్సిన ప్రణాళికా నిధులు తగ్గడం, వాణిజ్య పన్నుల ద్వారా రావాల్సిన బకాయిలు కోర్టు కేసుల కారణంగా వసూలు కాకపోవటంతో ఆశించిన ఆదాయం రాలేదని.. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేని అంశాలుగా ఆర్థిక మంత్రి బడ్జెట్లో వివరణ ఇచ్చారు. నోట్ల రద్దు నిర్ణయం సైతం రాష్ట్ర ఆదాయానికి కొంతమేరకు గండి కొట్టింది. గత ఏడాది భూముల అమ్మకం, క్రమబద్ధీకరణతో రూ.10,900 కోట్లు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ వీటి ద్వారా వచ్చిన ఆదాయం రూ.1000 కోట్లు కూడా దాటలేదు. అందుకే ఈసారి ప్రభుత్వం భూముల అమ్మకం జోలికెళ్లలేదు. కేంద్రంపై ఆశలు.. గతేడాది కేంద్రం నుంచి రూ.3,100 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ వస్తుందని ప్రభుత్వం ఆశించింది. కానీ కేంద్రం కేవలం రూ.450 కోట్లు ఇచ్చింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఈ ఏడాది మరిన్ని ఆశలు పెంచుకుంది. కేంద్రం నుంచి రూ.11,800 కోట్ల ప్యాకేజీ వస్తుందని ఆదాయ పట్టికలో ప్రకటించింది. పన్ను ఆదాయం వచ్చేనా? జీఎస్టీ ఈ ఏడాదే అమల్లోకి రానుంది. జీఎస్టీతో పన్నుల ద్వారా వచ్చే ఆదాయంపై అనిశ్చితి నెలకొంది. గతేడాది వ్యాట్ ద్వారా రూ.37,489 కోట్ల ఆదాయం వచ్చిందని సవరణ బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది రూ.46,500 కోట్ల ఆదాయాన్ని అంచనా వేసింది. వృద్ధి రేటు ప్రకారం లెక్కగడితే ఇది రూ.42 వేల కోట్లకు పరిమితమయ్యే అవకాశాలున్నాయి. జీఎస్టీ అమలు నేపథ్యంలో అంచనాలను ప్రభుత్వం భారీగా పెంచి చూపించినట్లు తెలుస్తోంది. తగ్గుతున్న మిగులు గతేడాది బడ్జెట్లో రూ.3,718 కోట్ల మిగులును అంచనా వేసిన ప్రభుత్వం కేవలం.. రూ.199.39 కోట్లకు సవరించుకుంది. 2015–16లో 238.06 కోట్ల మిగులు ఉన్నట్లు అకౌంట్ జనరల్ లెక్క తేల్చింది. ఈ లెక్కన తెలంగాణ మిగులు తగ్గినట్లు స్పష్టమవుతోంది. అయినా ఈ ఏడాది ఏకంగా రూ.4,571 కోట్ల మిగులు చూపించటం గమనార్హం. పాత బకాయిలు ప్రశ్నార్థకం ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు ఏటేటా పేరుకుపోతున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోవటం సమస్యగా వెంటాడుతోందని ప్రభుత్వం బడ్జెట్లోనే పేర్కొంది. ఇప్పటికీ ఆరోగ్యశ్రీకి రూ.400 కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.2 వేల కోట్లు, ఇన్పుట్ సబ్సిడీకి రూ.420 కోట్లతో పాటు వడ్డీ లేని రుణాలు సైతం పెండింగ్‌లో ఉన్నాయి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు చెల్లించాల్సిన రూ.30 కోట్ల ప్రీమియం కూడా చెల్లించలేకపోయింది. -
ఓవర్సీస్లోఖైదీకి భారీ టార్గెట్
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమాగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఖైదీ నంబర్ 150. చిరు 150వ సినిమా కూడా కావటంతో ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో మెగా అభిమానులను అలరించే అన్ని రకాల అంశాలతో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కింది ఖైదీ నంబర్ 150. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరుగా సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి రీఎంట్రీ సంచలనాలు నమోదు చేయటం కాయంగా కనిపిస్తుంది. అదే సమయంలో మెగాస్టార్ సినిమాకు ఓవర్సీస్లో కూడా భారీ టార్గెట్లు సెట్ అవుతున్నాయి. చిరంజీవి రీ ఎంట్రీ సినిమా కావటంతో విదేశాల్లో ఉన్న తెలుగు వారు కూడా ఆసక్తికనబరుస్తున్నారు. అందుకు తగ్గట్టుగా భారీ మొత్తాలకు ఖైదీ నంబర్ 150 రైట్స్ అమ్ముడవుతున్నాయి. ఇప్పటికే జరిగిన బిజినెస్ ప్రకారం 1.8 మిలియన్ డాలర్లు వసూళు చేస్తే ఖైదీ నంబర్ 150 ఓవర్సీస్లో బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది. మరి చిరు ఈ ఫీట్ సాధిస్తాడో లేదో చూడాలి. -
అదిరిందయ్యా జుకర్ బర్గ్!
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ క్వార్టర్లీ ఫలితాల్లో అదరగొట్టింది. ఈ త్రైమాసిక ఆదాయాలను 50శాతం పెంచుకుని, వాల్ స్ట్రీట్ అంచనాలను అధిగమించింది. లైవ్ వీడియోలతో కొత్త అడ్వర్ టైజర్లను ఆకర్షించడం, మొబైల్ యాప్ విశేషంగా ప్రాచుర్యం పొందడం, అడ్వర్ టైజింగ్ రెవెన్యూల్లో పాత వారిని ప్రోత్సహించడం ఫేస్ బుక్ ను ఒక్కసారిగా ఆదాయాల్లో ముంచెత్తాయి. ఫేస్ బుక్ కంపెనీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. సుమారు 9.5 శాతంపైగా లాభాలతో జోరుమీదున్నాయి. నాలుగేళ్ల క్రితం మొదటి సారి పబ్లిక్ ఆఫర్ కు వచ్చిన దానికంటే ఇది మూడురెట్లు అధికమని కంపెనీ పేర్కొంది. గతేడాది ఇదే సమయంలో1.44 బిలియన్లగా ఉన్న ఫేస్ బుక్ యూజర్లు, ఈ ఏడాది నెలకు 1.65 బిలియన్లగా ఉన్నారని ఫేస్ బుక్ పేర్కొంది. రోజులో 50 నిమిషాల కంటే ఎక్కువగానే ఫేస్ బుక్ ను బ్రౌజ్ చేస్తున్నారని మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు. అడ్వర్ టైజర్లు టెలివిజన్ నుంచి మొబైల్, వెబ్ ప్లాట్ ఫామ్ లోకి మరిలాకా, ఫేస్ బుక్ కు ఎక్కువగా మేలు చేకూరిందని పేర్కొన్నారు. అడ్వర్ టైజర్లను ఎక్కువగా ఆకర్షించుకోవడంతో, నిర్వహణ లాభాలు 52 శాతం నుంచి 55 శాతం పెరిగాయని త్రైమాసిక ఫలితాలు చూపుతున్నాయి. టెక్నాలజీ సంస్థల పుట్టినిలైన సిలికాన్ వ్యాలీలో చాలా సంస్థలు ఈ త్రైమాసికంలో నష్టాలనే నమోదుచేశాయి. ఇంటెల్ సంస్థ ను మొదలుకుని గతవారం ఐబీఎమ్, నిన్న ట్విట్టర్, యాపిల్ లు రెవెన్యూలను చాలా తక్కువగా చూపించాయి. అయితే ఫేస్ బుక్ ఆదాయాలను పెంచుకోవడంతో ఇన్వెస్టర్లలో కొత్త నమ్మకాన్ని పెంచినట్టు మార్కెట్ నిపుణులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.కంపెనీ మొత్తం ఆదాయం 3.54 బిలియన్ డాలర్ల నుంచి 5.38 బిలియన్ డాలర్లకు పెరిగింది.యాడ్ రెవెన్యూ 56.8 శాతం పెరిగి, 5.20 బిలయన్ డాలర్లుగా, మొబైల్ యాడ్ రెవెన్యూ మొత్తం అడ్వర్ టైజింగ్ రెవెన్యూలో 82 శాతం ఉందని కంపెనీ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే కంపెనీకి సీఈవోగా ఉంటున్న మార్క్ జుకర్ బర్గ్, ఓటింగ్ అర్హత లేని కొత్త తరం షేర్లను ప్రవేశపెట్టబోతున్నట్టు ఫేస్ బుక్ ప్రకటించింది.కొత్త రకానికి చెందిన నాన్ ఓటింగ్ షేర్ల లో ఇప్పటికే వాటా కల్గి ఉన్న హోల్డర్స్ కు డివిడెంట్ ఇవ్వాలని కంపెనీ భావిస్తోంది.సంపదలో 99 శాతం ట్రస్టులకు దానంగా ఇస్తానన్న మార్క్ జుకర్ బర్గ్, ఫండ్ దాతృత్వానికి ఈ నాన్ ఓటింగ్ స్టాక్ లను అమ్ముతానని తెలిపారు. ఓటింగ్ స్టాక్స్ మాత్రం అతని నియంత్రణలోనే ఉంటున్నట్టు చెప్పారు.ఒకవేళ స్టాక్ ప్రపోజల్స్ కు ఆమోదం లభిస్తే మెజార్టీ ఓటింగ్ స్టాక్స్ మార్క్ జుకర్ బర్గ్ ఆధీనంలోనే ఉంటాయి. జుకర్ బర్గ్ నియంత్రణ ఎక్కువగా కలిగి ఉండటాన్ని పట్టించుకోమని, కంపెనీ స్థిరంగా అభివృద్ధి చెందుతుందని, అంచనాలను అధిగమిస్తుందని పెట్టుబడిదారులు తెలిపారు. జుకర్ బర్గ్ కు ఎక్కువ అధికారాలు కలిగి ఉన్నట్టు ఎవరూ భావించడం లేదని, ప్రజల్లోకి వెళ్లిన దగ్గర్నుంచి అతను అంతా మంచే చేస్తున్నాడని పెట్టుబడిదారి పాచెర్ చెప్పారు. -
ఎవరి నోరు తీపో..
ఎవరి రుచులు వారివే... ► రైతులు, కార్పొరేట్లపై ప్రత్యేక దృష్టి? ► వేతన జీవులకు ఈసారి నిరాశే ! ► ఐటీ మినహాయింపు పరిమితులు యథాతథం ► ధనికులపై ఇంకాస్త వడ్డింపు? ► సేవల పన్ను పెంపు.. స్టార్టప్ సెస్సు విధింపు! ఐటీ యథాతథం ఉద్యోగులు, మధ్యతరగతి వర్గాలు ఎంతగానో ఎదురుచూసే ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి (బేసిక్ లిమిట్ ప్రస్తుతం రూ.2.5 లక్షలు)లో ఎలాంటి మార్పులూ చేయకపోవచ్చని అంచనా. పన్ను శ్లాబ్‌లను యథాతథంగానే కొనసాగిస్తూ.. కొన్ని మినహాయింపుల్లో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. కార్మికులు అధికంగా ఉండే తోలు, ఆభరణాల రంగాలకు పన్ను రాయితీలు కల్పించొచ్చు. పరిశ్రమలకు ప్రాధాన్యం.. కార్పొరేట్ పెట్టుబడులను పెంచేందుకు ప్రాధాన్యం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీతో పోలిస్తే ఈ పెట్టుబడులు 1.7 శాతంగా ఉండగా.. దీన్ని వచ్చే ఏడాది 2 శాతం వరకూ పెంచేందుకు చర్యలు తీసుకోవచ్చు. మరిన్ని రంగాల్లో విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరవొచ్చు. మొండి బకాయిల భారంతో ఇక్కట్లు ఎదుర్కొంటున్న బ్యాంకులకు మరింత మూలధనం సమకూర్చే దిశగా చర్యలు చేపట్టవచ్చు. అన్నదాతను ఆదుకుంటారా? వరుసగా రెండేళ్లు కరువు నెలకొన్న నేపథ్యంలో వ్యవసాయ రంగానికి కేటాయింపులు పెంచే అవకాశం ఉంది. పంటల బీమా పథకాన్ని విస్తరించడం, సాగునీటి పారుదలకు కేటాయింపులు పెంచడం వంటివి ప్రకటించవచ్చు. గ్రామీణ ఉపాధి పథకానికి కేటాయింపులు పెంచే అవకాశం ఉంది. చిన్న సాగునీటి పథకాలు, వర్షపు నీటి నిల్వ సదుపాయాలకు కేటాయింపులు ఉండొచ్చు. మేకిన్ ఇండియాకు పెద్దపీట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మేకిన్ ఇండియాకు పెద్దపీట వేయొచ్చు. ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఆర్థిక, అధికారిక అడ్డంకులు తొలగించేందుకు చర్యలు ప్రకటించవచ్చు. తయారీ రంగానికి నూరు శాతం ట్యాక్స్ క్రెడిట్‌ను ప్రకటించవచ్చని అంచనా. విదేశీ ఇన్వెస్టర్లకు పన్ను ప్రోత్సాహకాలిస్తూ సంస్కరణలు మరింత వేగంగా అమలు చేసే చర్యలు తీసుకోవచ్చు. ఎవరి నోరు తీపో.. వేతన జీవుల నుంచి రైతన్న వరకూ.. కార్పొరేట్ల నుంచి సామాన్యుడి దాకా దేశమంతా ఎదురుచూసే రోజు వ చ్చింది! కేంద్రంలో మోదీ సర్కారు కొలువుదీరాక వరుసగా మూడో బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం ఉదయం 11 గంటలకు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వ పన్ను వసూళ్లలో మందగమనం, ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులు, ద్రవ్యలోటుకు కళ్లెం వేయాల్సిన పరిస్థితుల నేపథ్యంలో ఈసారి బడ్జెట్ జైట్లీకి బడ్జెట్ కత్తిమీద సామేనని ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు. మొత్తమ్మీద ఈసారి తాయిలాల విషయంలో ఆచితూచి వ్యవహరించవచ్చని.. కొంత కఠిన వైఖరి అవలంబించే అవకాశం ఉందనేది అధిక శాతం మంది విశ్లేషకుల అభిప్రాయం. న్యూఢిల్లీ: సామాజిక పథకాలకు బడ్జెట్లో తప్పనిసరిగా నిధులను పెంచాల్సిన ఒత్తిడిని ఆర్థికమంత్రి జైట్లీ ఎదుర్కోనున్నారు. దేశంలో వరుసగా రెండేళ్లపాటు కరువు పరిస్థితులు నెలకొనడంతో గ్రామీణ భారతావని దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటుండటమే ఇందుకు ప్రధాన కారణం. మరోవైపు ప్రధాని మేకిన్ ఇండియా కలలను నెరవేర్చాలంటే.. విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ప్రోత్సాహకాలను పెంచడం, సంస్కరణలను మరింతగా పరుగులు పెట్టించడం వంటివి కూడా ముఖ్యమే. ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలు కారణంగా ప్రభుత్వంపై రూ.1.02 లక్షల కోట్ల అదనపు భారం పడనుంది. వీటికి తోడు గత బడ్జెట్లో ప్రకటించినట్లుగా జీడీపీలో ద్రవ్యలోటును రానున్న ఆర్థిక సంవత్సరంలో 3.5 శాతానికి కట్టడి చేసే లక్ష్యానికి కట్టుబడి ఉంటారా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు లక్ష్యం 3.9 శాతం నెరవేరే అవకాశం లేదని.. ఇది 4 శాతానికి పైనే ఉండొచ్చన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే తరుణంలో కార్పొరేట్ పన్నును నాలుగేళ్లలో క్రమంగా ఇప్పుడున్న 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గిస్తామని గత బడ్జెట్లోనే ప్రకటించారు. ఈ ప్రక్రియను ఈ ఆర్థిక సంవత్సరం నుంచే అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. కార్పొరేట్లకు ఇస్తున్న పన్ను రాయితీల ఉపసంహరణపై కూడా కీలక ప్రకటనలు వెలువడనున్నాయి. బడ్జెట్లో ఇతర అంచనాలు ఇవీ.. సేవా పన్ను పెంచొచ్చు పెరగనున్న వ్యయాలకు నిధుల కోసం పరోక్ష పన్నుల పెంపు, కొత్తగా పన్నుల విధింపు వంటివి ఉండొచ్చు. సేవల పన్నును ఇప్పటికే 14.5 శాతానికి పెంచిన కేంద్రం (0.5 శాతం స్వచ్ఛ భారత్ సెస్సుతో కలిపి) దీన్ని ఈ బడ్జెట్లో మరింత పెంచే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమల్లోకి వస్తే సేవల పన్నును 18 శాతానికి పెంచాల్సి వస్తుంది. దీనికి అనుగుణంగా ప్రజలను సంసిద్ధం చేసేందుకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. క్రూడ్‌పై మళ్లీ దిగుమతి సుంకం అంతర్జాతీయంగా ముడి చమురు(క్రూడ్) ధరలు తీవ్రంగా పడిపోయిన నేపథ్యంలో దిగుమతి చేసుకునే క్రూడ్, పెట్రోలు, డీజిల్‌లపై మళ్లీ కస్టమ్స్ సుంకం విధింపునకు అవకాశం ఉంది. క్రూడ్ రేట్లు 100 డాలర్లకు చేరడంతో 2011లో దీన్ని తొలగించారు. ఇతరత్రా.. ► బంగారం అధిక దిగుమతుల కారణంగా వాణిజ్య లోటు పెరిగిపోవడం, రూపాయి బలహీనతల కారణంగా పుత్తడిపై దిగుమతి సుంకం మరింత పెంచేలా చర్యలు. ► పారిశ్రామిక రంగంలో ప్రైవేటు పెట్టుబడులు ఆశించినంతగా పెరగనందున.. మౌలిక రంగంలో పెట్టుబడుల పెంపు, ప్రభుత్వ వ్యయాలను పెంచడంపై దృష్టి పెట్టొచ్చు. ► గ్లోబల్ డిమాండ్ పడిపోవడం, అధిక సరఫరా కారణంగా సమస్యల్లోకి కూరుకుపోయిన కమోడిటీ ఆధారిత రంగాలకు చేయూతనిచ్చేందుకు రక్షణాత్మక చర్యలు ఉండొచ్చు. ► మొండి బకాయిల భారంతో ఇక్కట్లు ఎదుర్కొంటున్న బ్యాంకులకు మరింత మూలధనం సమకూర్చే దిశగా చర్యలు. స్టార్టప్స్‌కు చేయూత మోదీ ఇటీవల జపిస్తున్న స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా కార్యక్రమాలకు నిధుల బూ స్ట్ ఇచ్చేందుకు చర్యలు ఉండొచ్చు. దీని కోసం కొత్తగా సెస్సు విధిం చొచ్చు. ‘రాబిన్‌హుడ్’ ట్యాక్స్! మోదీ సర్కారు ఖజానా నింపుకోవడానికి సంపన్నుల (సూపర్ రిచ్)పై మరింతగా పన్నుల కొరడా ఝళిపించే అవాకాశం ఉంది. ఇప్పటికే ఆర్థిక సర్వే కూడా అధికాదాయ వర్గాలపై తగినంత పన్ను విధించడం లేదని.. దీన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో సూపర్ రిచ్ నుంచి అదనంగా పిండుకునే అవకాశం ఉందని(దీన్నే రాబిన్‌హుడ్ ట్యాక్స్‌గా చెబుతారు) విశ్లేషకులు పేర్కొంటున్నారు. గతేడాది బడ్జెట్లో వెల్త్ ట్యాక్స్‌ను తొలగించిన సర్కారు.. రూ. కోటికి పైగా వార్షిక ఆదాయం ఉన్న సూపర్ రిచ్‌పై ఉన్న 10 శాతం సర్‌చార్జీ(ఆదాయపు పన్ను కాకుండా అదనంగా విధించేది)ని 12 శాతానికి పెంచారు. ఇప్పుడు దీన్ని మరింత పెంచొచ్చని అంచనా. -
బడ్జెట్ పై ఐటి సెక్టార్ భారీ ఆశలు