కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 బడ్జెట్‌ను జూలై 23న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. అంతకంటే ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆర్థికవేత్తల సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి సీతారామన్, ప్రణాళికా మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్, ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్, ఆర్థికవేత్తలు సుర్జిత్ భల్లా, అశోక్ గులాటి, ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్ మొదలైనవారు హాజరయ్యారు.
త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ మోదీ 3.0 మొదటి బడ్జెట్. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యంగా కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. కాబట్టి బడ్జెట్‌లో ఏ అంశాలను వెల్లడించబోతున్నారనే విషయాలను తెలుసుకోవడానికి సర్వత్రా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బడ్జెట్‌లో ఉద్యోగాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, తయారీ రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిసింది. వీటిపై కొన్ని ప్రత్యేక ప్రకటనలు చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని బడ్జెట్లో ప్రతిపాదించే అవకాశం ఉంది. ముడి పదార్థాలపై సుంకాలను తగ్గించడం వంటివి కూడా ఉండవచ్చు. ప్రస్తుత బేసిక్ మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షలు పెంచడం సహా మధ్యతరగతికి మరింత ఉపశమనం కలిగించేలా వ్యక్తిగత ఆదాయపు పన్నులో సంస్కరణలు ఉండే అవకాశం ఉంది.
లిస్టెడ్ ఈక్విటీ షేర్లపై దీర్ఘకాలిక మూలధన లాభాల ట్యాక్స్ కనీస హోల్డింగ్ వ్యవధిని ప్రస్తుత ఏడాది నుంచి 2 లేదా 3 సంవత్సరాలకు పొడిగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. స్టాక్ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడులను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ ప్రకటన చేయొచ్చని చెబుతున్నారు.
ఇదీ చదవండి: 1950లో బడ్జెట్ లీకయ్యిందా? తర్వాత ఏం జరిగిందంటే..
ప్రధానంగా పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రిక్ వాహనాలు మరియు ఇతర హరిత సాంకేతికతలలో పెట్టుబడి పెట్టే కంపెనీలకు ట్యాక్స్ బెనిఫీట్ కల్పించే అవకాశం ఉంది. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులలో గణనీయమైన పెట్టుబడులకు అవకాశం ఉంది. భారతదేశంలో కాలుష్య తీవ్రతను తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment