ఆదాయానికి మించి అంచనాలు | Telangana Income is beyond expectations | Sakshi
Sakshi News home page

ఆదాయానికి మించి అంచనాలు

Published Tue, Mar 14 2017 3:02 AM | Last Updated on Tue, Oct 2 2018 4:41 PM

ఆదాయానికి మించి అంచనాలు - Sakshi

ఆదాయానికి మించి అంచనాలు

- మిగులు బడ్జెట్‌ చూపించేందుకు సర్కారు తంటాలు
- కేంద్ర ప్యాకేజీపై ఆశలు..
- భూముల అమ్మకంపై ఆశలు గల్లంతు
- బకాయిలకు కనిపించని పరిష్కారం


సాక్షి, హైదరాబాద్‌:
రాష్ట్ర ప్రభుత్వం ఆదాయానికి మించి అంచనాలు వేసుకుంది. వృద్ధి రేటు గణనీయంగా పుంజుకున్నప్పటికీ.. గడిచిన మూడేళ్ల అనుభవాలను విస్మరించింది. వాస్తవికతకు భిన్నంగా అంచనాలను మరోమారు భూతద్దంలో చూపించింది. రూ.1.49 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సర్కారు.. అందులో నిర్వహణ పద్దు కింద రూ.61 వేల కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.88 వేల కోట్లు చూపింది. బడ్జెట్‌ తయారీ మార్గదర్శకాలు మారటంతో నిర్వహణ పద్దుతో పోలిస్తే ప్రగతి పద్దు భారీగా పెరిగినట్లు కనిపిస్తోంది.

కానీ.. గతంలో ప్రణాళికేతర పద్దులో ఉన్న దాదాపు రూ.10 వేల కోట్ల సబ్సిడీలు, రాయితీలన్నీ ప్రగతి పద్దుకు బదిలీ అయ్యాయి. దీంతో ఈ పద్దు అంత స్థాయికి చేరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్‌తో సంబంధం లేకుండా నిధులను సమీకరించే పోకడను ప్రభుత్వం ఈసారీ కొనసాగించింది. ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్‌ భగీరథ, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం, కొత్త ఆసుపత్రుల నిర్మాణాలు, మైక్రో ఇరిగేషన్, గొర్రెలు, చేపల పెంపకానికి ఖర్చు చేసే నిధులన్నీ వివిధ సంస్థలిచ్చే రుణసాయంతో నిర్వహించేందుకు మొగ్గు చూపింది.

‘భూముల’ఆదాయం ఢమాల్‌
కిందటేడాది ఆశించిన ఆదాయం రాలేదని సవరణ బడ్జెట్‌ గణాంకాల్లో సర్కారు చెప్పకనే చెప్పింది. గత ఏడాది రూ.1.30 లక్షల కోట్ల బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ప్రభుత్వం... కేవలం రూ.1.12 లక్షల కోట్లు ఖర్చవుతుందని సవరించుకుంది. కోర్టు వ్యాజ్యాల కారణంగా భూముల అమ్మకం జరగలేదని, కేంద్రం నుంచి రావాల్సిన ప్రణాళికా నిధులు తగ్గడం, వాణిజ్య పన్నుల ద్వారా రావాల్సిన బకాయిలు కోర్టు కేసుల కారణంగా వసూలు కాకపోవటంతో ఆశించిన ఆదాయం రాలేదని.. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేని అంశాలుగా ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో వివరణ ఇచ్చారు. నోట్ల రద్దు నిర్ణయం సైతం రాష్ట్ర ఆదాయానికి కొంతమేరకు గండి కొట్టింది. గత ఏడాది భూముల అమ్మకం, క్రమబద్ధీకరణతో రూ.10,900 కోట్లు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ వీటి ద్వారా వచ్చిన ఆదాయం రూ.1000 కోట్లు కూడా దాటలేదు. అందుకే ఈసారి ప్రభుత్వం భూముల అమ్మకం జోలికెళ్లలేదు.

కేంద్రంపై ఆశలు..
గతేడాది కేంద్రం నుంచి రూ.3,100 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ వస్తుందని ప్రభుత్వం ఆశించింది. కానీ కేంద్రం కేవలం రూ.450 కోట్లు ఇచ్చింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఈ ఏడాది మరిన్ని ఆశలు పెంచుకుంది. కేంద్రం నుంచి రూ.11,800 కోట్ల ప్యాకేజీ వస్తుందని ఆదాయ పట్టికలో ప్రకటించింది.

పన్ను ఆదాయం వచ్చేనా?
జీఎస్‌టీ ఈ ఏడాదే అమల్లోకి రానుంది. జీఎస్‌టీతో పన్నుల ద్వారా వచ్చే ఆదాయంపై అనిశ్చితి నెలకొంది. గతేడాది వ్యాట్‌ ద్వారా రూ.37,489 కోట్ల ఆదాయం వచ్చిందని సవరణ బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది రూ.46,500 కోట్ల ఆదాయాన్ని అంచనా వేసింది. వృద్ధి రేటు ప్రకారం లెక్కగడితే ఇది రూ.42 వేల కోట్లకు పరిమితమయ్యే అవకాశాలున్నాయి. జీఎస్‌టీ అమలు నేపథ్యంలో అంచనాలను ప్రభుత్వం భారీగా పెంచి చూపించినట్లు తెలుస్తోంది.

తగ్గుతున్న మిగులు
గతేడాది బడ్జెట్‌లో రూ.3,718 కోట్ల మిగులును అంచనా వేసిన ప్రభుత్వం కేవలం.. రూ.199.39 కోట్లకు సవరించుకుంది. 2015–16లో 238.06 కోట్ల మిగులు ఉన్నట్లు అకౌంట్‌ జనరల్‌ లెక్క తేల్చింది. ఈ లెక్కన తెలంగాణ మిగులు తగ్గినట్లు స్పష్టమవుతోంది. అయినా ఈ ఏడాది ఏకంగా రూ.4,571 కోట్ల మిగులు చూపించటం గమనార్హం.

పాత బకాయిలు ప్రశ్నార్థకం
ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు ఏటేటా పేరుకుపోతున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పేరుకుపోవటం సమస్యగా వెంటాడుతోందని ప్రభుత్వం బడ్జెట్‌లోనే పేర్కొంది. ఇప్పటికీ ఆరోగ్యశ్రీకి రూ.400 కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.2 వేల కోట్లు, ఇన్‌పుట్‌ సబ్సిడీకి రూ.420 కోట్లతో పాటు వడ్డీ లేని రుణాలు సైతం పెండింగ్‌లో ఉన్నాయి. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనకు చెల్లించాల్సిన రూ.30 కోట్ల ప్రీమియం కూడా చెల్లించలేకపోయింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement