కేసీఆర్‌ బీసీరథం | KCR mark Backward Classes budget | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ బీసీరథం

Published Tue, Mar 14 2017 2:07 AM | Last Updated on Tue, Oct 2 2018 4:41 PM

కేసీఆర్‌ బీసీరథం - Sakshi

కేసీఆర్‌ బీసీరథం

- వెనుకబడిన తరగతులకు బడ్జెట్‌లో పెద్దపీట
- గ్రామీణ ఆర్థిక ప్రగతి ఎజెండాగా పల్లెబాట
- బీసీలు, కుల వృత్తులకు చేయూత
- గతంలో ఎన్నడూ లేనన్ని నిధులు
- యాదవ, ముదిరాజ్‌ కులాలపై వరాల జల్లు
- గొర్రెల పెంపకానికి రూ.4 వేల కోట్లు
- చేపల పెంపకానికి రూ.వెయ్యి కోట్లు
- నాయిబ్రాహ్మణ, రజకులకు రూ.500 కోట్లు
- విశ్వకర్మలకు రూ.200 కోట్లు, చేనేతకు రూ.1,200 కోట్లు
- ప్రభుత్వాసుపత్రుల్లో పుట్టిన శిశువులకు ‘కేసీఆర్‌’ కిట్‌
- కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల కింద ఆర్థిక సాయం పెంపు
- సాగునీటి ప్రాజెక్టులకు రూ.25 వేల కోట్లు
- రూ.1,49,646 కోట్లతో భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం


సాక్షి, హైదరాబాద్‌

తెలంగాణ బడ్జెట్‌ పల్లె బాట పట్టింది! సాగునీటికి నిధుల వరద పారిస్తూనే... చితికిన కుల వృత్తులు, కూలిన జీవితాలను నిలబెట్టేందుకు కొత్త నినాదం ఎంచుకుంది. అట్టడుగు వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ బీసీలకు భరోసా కల్పించింది. అత్యంత వెనుకబడిన వర్గాలకు తొలిసారి బడ్జెట్‌లో చోటు కల్పించింది. గ్రామీణ ఆర్థిక ప్రగతిని లక్ష్యంగా ఎంచుకొని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రూ.1,49,646 కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రెండేళ్ల ముందే ఎన్నికల బడ్జెట్‌ను ఆవిష్కరించి నట్లుగా భారీగా వరాల జల్లు కురిపించింది. ‘మైగ్రేషన్‌ నుంచి రివర్స్‌ మైగ్రేషన్‌.. వలస బాట పట్టిన తెలంగాణ బిడ్డలు తిరిగి పల్లెకు పయనం కావాలన్నదే మా ఆకాంక్ష...’ అంటూ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ బడ్జెట్‌ ఏ దిశగా పయనించిందో చెప్పారు. ఉద్యమ నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాల్లో ఒకటైన సాగునీటికి వరుసగా రెండోసారి బడ్జెట్‌లో ప్రభుత్వం సింహభాగం నిధులు కేటాయించింది. కోటి ఎకరాల తెలంగాణ మాగాణాన్ని ఆవిష్కరించే సంకల్పానికి మరోసారి ప్రాధాన్యమిస్తూ.. సాగునీటి ప్రాజెక్టులకు రూ.25 వేల కోట్లు ప్రతిపాదించింది.

బీసీ.. ఖుషీ..
బడ్జెట్‌లో తొలిసారిగా సామాజిక వర్గాల వారీగా నిధులు వెచ్చించేందుకు ప్రభుత్వం ప్రాధాన్య మిచ్చింది. బీసీలకు గతంలో ఎన్నడూ లేనన్ని నిధులు కేటాయించింది. కుల వృత్తుల ఆధారంగా కొత్త కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. యాదవ, ముదిరాజ్‌లకు భారీ స్థాయిలో గొర్రెలు, చేపల పెంపకం కార్యక్రమాలను ప్రకటించింది. గొర్రెల పెంపకానికి రూ.4 వేల కోట్లు, చేపల పెంపకానికి రూ.1,000 కోట్ల రుణాలు సేకరించనుంది. వీరితోపాటు నాయిబ్రాహ్మణ, రజకులకు కలిపి రూ.500 కోట్లు, విశ్వకర్మలుగా పిలిచే ఐదు కులాలకు రూ.200 కోట్లు, చేనేతకు రూ.1,200 కోట్లు బడ్జెట్‌లో కేటాయించింది. బీసీల్లో అత్యంత వెనుకబడిన ఎంబీసీ వర్గాలకు రూ.వెయ్యి కోట్లు కేటాయించటం ఇదే తొలిసారి. మొత్తంగా సాగునీటి రంగం తర్వాత సంక్షేమానికే ఎక్కువ నిధులు కేటాయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి దాదాపు రూ.24 వేల కోట్లు కేటాయించింది. వీరితో పాటు బ్రాహ్మణ సంక్షేమ నిధికి రూ.100 కోట్లు, జర్నలిస్టుల సంక్షేమానికి రూ.30 కోట్లు ప్రకటించింది. ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం, మైక్రో ఇరిగేషన్‌ పథకాలకు ఈసారి కూడా బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. బడ్జెటేతర వనరులతో వీటిని చేపడతామని ప్రకటించింది.

తొలిసారి ముఖ్యమంత్రి పేరు
తొలిసారిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేరుతో నవ జాత శిశువులకు ‘కేసీఆర్‌ కిట్‌’ కార్యక్రమాన్ని బడ్జెట్‌లో ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టిన బిడ్డలకు, తల్లులకు మొదటి మూడు నెలలకు అవసరమయ్యే 16 వస్తువులతో ఈ కిట్‌ను సమకూర్చుతారు. ఇందుకు బడ్జెట్‌లో రూ.605 కోట్లు కేటాయించటం గమనార్హం. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఇచ్చే ప్రోత్సాహకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రెండింతలకు పెంచింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాలకు రూ.12 వేల ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ఆడపిల్ల పుడితే మరో రూ.వెయ్యి అదనపు ప్రోత్సాహకం ఇచ్చేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించింది.

బడ్జెట్‌కు ముందే.. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు, వీఆర్‌ఏలు, వీఏవోల జీతాల పెంచుతున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బడ్జెట్‌లో అందుకు తగిన వాటాను సమకూర్చారు. ఇప్పటికే పేద కుటుంబాల ఆదరణ చూరగొన్న కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌ పథకాలకు ఆర్థికసాయాన్ని రూ.75,116కు పెంచింది. దీనికి బడ్జెట్‌లో రూ.850 కోట్లు కేటాయించింది. ఆసరా ఫించన్లకు ఈ ఏడాది నిరుటి కంటే ఎక్కువగానే రూ.5,330 కోట్లు, ఆఖరి విడత రైతుల రుణమాఫీ పథకానికి రూ.4 వేల కోట్లు, విద్యుత్‌ సబ్సిడీకి రూ.4,484 కోట్లు, బియ్యం సబ్సిడీకి రూ.2,600 కోట్లు బడ్జెట్‌లో పొందుపరిచింది. గత ఏడాది సీఎం అధ్వర్యంలో ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్‌డీఎఫ్‌) పేరుతో రూ.4,800 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈసారి దాన్ని రూ.1000 కోట్లకు కుదించటం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement