telangana budget 2017-18
-
'కేసీఆర్ మనసున్న మారాజు'
వరంగల్: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రతిపక్షాలు పసలేని విమర్శలు చేస్తున్నాయని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. బడ్జెట్లో సీఎం కేసీఆర్ బడుగు, బలహీన వర్గాలకు, సంక్షేమ రంగానికి పెద్దపీట వేశారని తెలిపారు. మంగళవారం ఉదయం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ సంక్షేమంతో పాటు మానవ వనరులు, రైతులు, రాష్ర్టా సమగ్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌ను రూపొందించారని తెలిపారు. నాలుగో విడత రైతు రుణమాఫీ కోసం రూ. 4 వేల కోట్లు కేటాయించామన్నారు. పరోక్షంగా, ప్రత్యక్షంగా వ్యవసాయ రంగానికి రూ.35 వేల కోట్లు కేటాయించామని వివరించారు. ప్రతిపక్షాలు ఇచ్చే మంచి సూచనలను ప్రజల అభివృద్ధి కోసం పరిగణలోకి తీసుకుంటామన్నారు. త్వరలో వరంగల్‌లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా టెక్స్టైల్ పార్క్ ప్రారంభించబోతున్నామని తెలిపారు. విద్యాశాఖకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించామన్నారు. విశ్వ విద్యాలయాల్లో మౌలిక వసతుల కోసం నిధులు కేటాయించామని వివరించారు. ఎస్సీల అభివృద్ధి కోసం అధిక నిధులు కేటాయించామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను వారికే కేటాయించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. తెలంగాణ బడ్జెట్ అత్యంత అద్బుతమైన బడ్జెట్ అని కొనియాడారు. మనసున్న మారాజు సీఎం కేసీఆర్ అని కితాబిచ్చారు. -
తెలంగాణ బడ్జెట్ పల్లె బాట పట్టింది!
-
బతుకునిచ్చే బడ్జెట్
ఇది బ్యాలెట్ బడ్జెట్ కాదు: మంత్రి ఈటల - గ్రామీణ వ్యవస్థ బలోపేతంతోనే రాష్ట్రం పురోగమిస్తుంది - సమైక్య పాలనలో తెలంగాణ జీవిక విచ్ఛిన్నమైంది - మళ్లీ దాన్ని పునరుద్ధరిస్తాం - రాష్ట్ర వృద్ధి రేటు జాతీయ సగటును మించింది - ఆర్థిక వ్యవస్థ దృఢత్వాన్ని సంతరించుకుంది - రెవెన్యూ మిగులు రూ.4,571.30 కోట్లుగా అంచనా - అసెంబ్లీలో వరుసగా నాలుగోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి ‘‘తెలంగాణది ప్రత్యేక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ. ఇక్కడి వనరుల ఆధారంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక జీవిక ఏర్పడింది. వ్యవసాయంతోపాటు అనేక అనుబంధ వృత్తులు పల్లెలను గొప్పగా ఉంచాయి. ఉత్పత్తి కేంద్రంగా ఉండే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పదిలంగా ఉన్నంత వరకు తెలంగాణ పల్లెలు స్వయం పోషకత్వంతో, సమృద్ధితో కొనసాగాయి. సమైక్య పాలనలో అవి విచ్ఛిన్నమయ్యాయి. వ్యవసాయం, కులవృత్తులు ధ్వంసమై గ్రామీణ తెలంగాణ అల్లకల్లోలమైంది. ఈరోజు మా ప్రభుత్వం బ్యాలెట్ బాక్సు బడ్జెట్‌గా కాకుండా బతుకును నిలబెట్టే బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయటం ద్వారా యావత్ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి వేగం పుంజుకుంటుందని నమ్ముతున్నాం’’ – ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సాక్షి, హైదరాబాద్: 2017–18 ఆర్థిక సంవత్సరానికి రూ.1,49,646 కోట్ల అంచనాతో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో నిర్వహణ వ్యయం పద్దు కింద రూ.61,607.20 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.88,038.80 కోట్లు ప్రతిపాదించారు. నిర్వహణ వ్యయం కంటే ప్రగతి పద్దు ఎక్కువగా ఉండటం అపూర్వమని ఈటల అభివర్ణించారు. ‘‘నిర్వహణ వ్యయంలో ఎక్కువగా రాజీ పడకుండా బడ్జెట్‌ను రూపొందించాం. వనరులను ఎక్కువగా సమీకరించి వ్యయాన్ని సహేతుకంగా క్రమబద్ధీకరించటం ద్వారా ఇది సాధ్యమైంది’’ అని బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. జీఎస్డీపీని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2011–12ను బేస్ ఇయర్‌గా స్వీకరించినందున ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం 2017–18 ఆర్థిక సంవత్సరంలో రుణ పరిమితి కొంత పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. సాధారణంగా బడ్జెట్లో కేటాయింపులు ప్రణాళిక, ప్రణాళికేతర పద్దుల పేరుతో ఉంటుంది. కానీ ఈసారి దానికి భిన్నంగా నిర్వహణ పద్దు, ప్రగతి పద్దు పేరుతో బడ్జెట్ రూపొందించారు. ఇటీవల కేంద్రం బడ్జెట్ విధానాన్ని మార్చి రాష్ట్రాలు కూడా దాన్నే అనుసరించాలని ఆదేశించిన నేపథ్యంలో ఈ మార్పు చేసినట్టు ఈటల వివరించారు. బడ్జెట్ వర్గీకరణలో కొత్త విధానంతో కేంద్ర ప్రభుత్వం.. పంచవర్ష ప్రణాళికల స్థానంలో పదిహేనేళ్ల దార్శనికత, ఏడేళ్ల వ్యూహం, మూడేళ్ల కార్యాచరణ ప్రణాళిక ప్రవేశపెట్టిందన్నారు. ఇది స్థానిక ప్రభుత్వ విధానాన్ని బలోపేతం చేస్తుందని వివరించారు. ఆదాయ వృద్ధి రేటు భేష్.. ఆర్థిక మంత్రి హోదాలో ఈటల రాజేందర్ వరుసగా నాలుగోసారి శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. తొలుత సోమవారం ఉదయం 11.30 గంటలకు బడ్జెట్ ప్రవేశపెడతారని ప్రభుత్వం ప్రకటించినా.. తర్వాత దాన్ని 12 గంటలకు మార్చారు. సరిగ్గా అదే సమయానికి ఈటల బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు. నాలుగుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపి ప్రసంగం ప్రారంభించారు. ‘‘యాభై ఎనిమిది సంవత్సరాలపాటు చీకటిలో గడిపిన తెలంగాణ ప్రజలు సొంత రాష్ట్రంలోనే తమకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని భావించారు. మా ప్రభుత్వంపై వారికి ఉన్న నమ్మకానికి అనుగుణంగా నిలవాలన్నదే మా ప్రయత్నం. కొత్త రాష్ట్రం ఏర్పడగానే వనరులపై అస్పష్టత, పరిపాలన యంత్రాంగాన్ని గాడిలో పెట్టడం, రెండు రాష్ట్రాల మధ్య సిబ్బంది పంపిణీ తదితర సమస్యలు ఎదురయ్యాయి. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక స్థితిపైన, వనరులు, పేదల స్థితిగతులను మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన పూర్తి అవగాహన ఏర్పడింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రెవెన్యూ వృద్ధి అమితంగా ఉందని చెప్పటానికి సంతోషిస్తున్నా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో పన్నుల ద్వారా సమకూరిన రాష్ట్ర ఆదాయం 19.61 శాతం వృద్ధి రేటుతో దేశంలోని చాలా రాష్ట్రాల కన్నా ఎక్కువగా ఉంది. పెద్ద నోట్ల రద్దు వల్ల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గినప్పటికీ, ఇతర పన్నుల ద్వారా సమకూరే ఆదాయం పెరిగింది. ఎంతో జాగ్రత్తగా తీర్చిదిద్దడం వల్ల మన ఆర్థిక వ్యవస్థ ఇంతటి దృఢత్వాన్ని సంతరించుకుంది’’ అని వివరించారు. ద్రవ్యలోటు 3.48 శాతం వచ్చే ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ మిగులు రూ.4,571.30 కోట్లు, ద్రవ్యలోటు రూ.26,096.31 కోట్లు ఉంటుందని ఈటల అంచనా వేశారు. ఈ ద్రవ్య లోటు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.48 శాతంగా అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నారు. సాగునీటి రంగానికి కేటాయించిన నిధులను నిర్మాణ వ్యయంగా పరిగణించటం వల్ల రెవెన్యూ మిగులు అధికంగా అంచనా వేసినట్టు వివరించారు. 2016–17 ఆర్థిక సంవత్సరపు సవరించిన అంచనాల ప్రకారం రాష్ట్ర సొంత ఆదాయం రూ.58,636 కోట్లు కాగా.. 2017–18లో రూ.69,220.37 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు వివరించారు. కేంద్ర వితరణ కింద వచ్చే నిధులు 2016–17 అంచనాల ప్రకారం రూ.28,433.78 కోట్లు కాగా... 2017–18 బడ్జెట్లో రూ.43,862.67గా అంచనా వేశారు. రెండంకెల వృద్ధి సాధించాం.. జీఎస్డీపీ వృద్ధి 2016–17లో స్థిర ధరల వద్ద 10.1 శాతానికి పెరిగే అవకాశం ఉందని, ఇదే కాలంలో జాతీయ జీడీపీ వృద్ధి 7.1 శాతంగా ఉంటుందని అంచనా వేసినట్టు ఈటల వెల్ల డించారు. పెద్ద నోట్ల రద్దుతో ఆర్థిక కార్యక లాపాలు దెబ్బతిన్నా.. రాష్ట్రం రెండంకెల వృద్ధి ని సాధించటం ఎంతో సంతృప్తినిచ్చింద న్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు జాతీయ వృద్ధి కంటే మన వృద్ధిరేటు తక్కువగా ఉండే దని, తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత గత మూడేళ్లలో జీఎస్డీపీ జాతీయ సగటు కన్నా ఎక్కువగా నమోదవుతోందన్నారు. విద్యుత్ సరఫరా మెరుగవడం, ప్రభుత్వ క్రియాశీల విధానాల వల్ల పారిశ్రామిక రంగం పురోగతి చెప్పుకోదగిన స్థాయిలో ఉందని, ఈ రంగం లో వృద్ధి 2013–14లో 0.6 శాతంగా ఉండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.5 శాతానికి చేరుకుందని ప్రకటించారు. వ్యవసాయం, అనుబంధ రంగాల వృద్ధి 12.1 శాతానికి చేరుకుంటోందన్నారు. ప్రస్తుత ధరల ప్రకారం జీఎస్డీపీ.. గతేడాది 5,75,631 కోట్లు ఉండగా, 2016–17లో 6,54,294 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నట్టు వివరిం చారు. ఇది గత ఏడాదితో పోలిస్తే రికార్డు స్థాయిలో 13.7 శాతం వృద్ధి సాధించిందని, రాష్ట్ర తలసరి ఆదాయం 2015–16లో రూ.1,40,683 ఉండగా ఈ ఏడాది రూ.1,58,360కి పెరుగుతుందని అంచనా వేసినట్టు చెప్పారు. 2016–17 తలసరి ఆదాయం జాతీయ సగటు రూ.1,03,818 కన్నా ఎక్కువగా ఉందన్నారు. రాష్ట్రావిర్భావం తర్వాత తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చెప్పుకోదగ్గ స్థాయిలో వేగం పుంజుకోవటం చూస్తే ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందనే విషయం రుజువవుతోందన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికలో మార్పులు బడ్జెట్ రూపకల్పనలో వచ్చిన మార్పుల వల్ల ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికల్లో కూడా మార్పులు అనివార్యమైనట్టు ఈటల వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీలకు బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉండాలనే విషయంలో సూచనల కోసం ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రుల ఆధ్వర్యంలో కమిటీలను నియమించి ఆయా వర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశాలు నిర్వహించినట్టు వెల్లడించారు. వారి సిఫారసుల మేరకు ఆయా వర్గాలకు జనాభా నిష్పత్తి ప్రకారం నిధుల కేటాయింపులు ఉండేలా అంచనాలు రూపొందించినట్టు చెప్పారు. ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. దీంతో కేటాయించిన నిధులు ఆ సంవత్సరంలో ఖర్చు కాకుంటే మరుసటి సంవత్సరానికి బదిలే చేసే వెసులుబాటు కలుగుతుందన్నారు. అంబేడ్కర్ ఆలోచన విధానంతోనే చిన్న జిల్లాలుపాలనా విభాగాలు చిన్నవిగా ఉన్నప్పుడే సామాన్యులకు న్యాయం జరుగుతుందన్న అంబేడ్కర్ తాత్విక చింతనను సూక్ష్మస్థాయిలో ఆచరించే దిశగా తమ ప్రభుత్వం జిల్లాలను పునర్వ్యవస్థీకరించిందని ఈటల వెల్లడించారు. జిల్లాల పెంపుతోపాటు, 25 కొత్త రెవెన్యూ డివిజన్లు, 125 కొత్త మండలాలు, 5 కొత్త పోలీసు కమిషనరేట్లు, 23 కొత్త పోలీసు సబ్ డివిజన్లు, 28 సర్కిళ్లు, 94 కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. సాదాసీదాగా ప్రసంగం... గత బడ్జెట్ ప్రసంగాలతో పోలిస్తే ఆర్థికమంత్రి ఈసారి సాదాసీదా ప్రసంగంతో సరిపుచ్చారు. మెరుపులు, విరుపులు, ఆరోపణలు లాంటివి లేకుండా ఎక్కువగా ఆయా శాఖల కేటాయింపులను ప్రస్తావించేందుకే పరిమితమయ్యారు. సమైక్య పాలనలో తెలంగాణకు అన్యాయం జరిగిందనే మాటను రెండు సందర్భాల్లో ప్రస్తావించినా... తరచూ చెప్పే బంగారు తెలంగాణ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. గత బడ్జెట్ ప్రసంగంలో అమర్త్యసేన్ మాటలను ప్రస్తావించారు. చాణక్య నీతి, అశోకుడి రీతి, ఇంటిని చక్కబెట్టుకోవటంలో ఇల్లాలి ఇగురం.. ఈ మూడింటి మేలైన కలయికే ఈ బడ్జెట్ అంటూ ప్రసంగంలో ఆసక్తి పెంచేలా చేశారు. ఈసారి మాత్రం అలాంటి వాటి జోలికి వెళ్లలేదు. -
ఆదాయానికి మించి అంచనాలు
- మిగులు బడ్జెట్ చూపించేందుకు సర్కారు తంటాలు - కేంద్ర ప్యాకేజీపై ఆశలు.. - భూముల అమ్మకంపై ఆశలు గల్లంతు - బకాయిలకు కనిపించని పరిష్కారం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆదాయానికి మించి అంచనాలు వేసుకుంది. వృద్ధి రేటు గణనీయంగా పుంజుకున్నప్పటికీ.. గడిచిన మూడేళ్ల అనుభవాలను విస్మరించింది. వాస్తవికతకు భిన్నంగా అంచనాలను మరోమారు భూతద్దంలో చూపించింది. రూ.1.49 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సర్కారు.. అందులో నిర్వహణ పద్దు కింద రూ.61 వేల కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.88 వేల కోట్లు చూపింది. బడ్జెట్ తయారీ మార్గదర్శకాలు మారటంతో నిర్వహణ పద్దుతో పోలిస్తే ప్రగతి పద్దు భారీగా పెరిగినట్లు కనిపిస్తోంది. కానీ.. గతంలో ప్రణాళికేతర పద్దులో ఉన్న దాదాపు రూ.10 వేల కోట్ల సబ్సిడీలు, రాయితీలన్నీ ప్రగతి పద్దుకు బదిలీ అయ్యాయి. దీంతో ఈ పద్దు అంత స్థాయికి చేరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్‌తో సంబంధం లేకుండా నిధులను సమీకరించే పోకడను ప్రభుత్వం ఈసారీ కొనసాగించింది. ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, కొత్త ఆసుపత్రుల నిర్మాణాలు, మైక్రో ఇరిగేషన్, గొర్రెలు, చేపల పెంపకానికి ఖర్చు చేసే నిధులన్నీ వివిధ సంస్థలిచ్చే రుణసాయంతో నిర్వహించేందుకు మొగ్గు చూపింది. ‘భూముల’ఆదాయం ఢమాల్ కిందటేడాది ఆశించిన ఆదాయం రాలేదని సవరణ బడ్జెట్ గణాంకాల్లో సర్కారు చెప్పకనే చెప్పింది. గత ఏడాది రూ.1.30 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం... కేవలం రూ.1.12 లక్షల కోట్లు ఖర్చవుతుందని సవరించుకుంది. కోర్టు వ్యాజ్యాల కారణంగా భూముల అమ్మకం జరగలేదని, కేంద్రం నుంచి రావాల్సిన ప్రణాళికా నిధులు తగ్గడం, వాణిజ్య పన్నుల ద్వారా రావాల్సిన బకాయిలు కోర్టు కేసుల కారణంగా వసూలు కాకపోవటంతో ఆశించిన ఆదాయం రాలేదని.. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేని అంశాలుగా ఆర్థిక మంత్రి బడ్జెట్లో వివరణ ఇచ్చారు. నోట్ల రద్దు నిర్ణయం సైతం రాష్ట్ర ఆదాయానికి కొంతమేరకు గండి కొట్టింది. గత ఏడాది భూముల అమ్మకం, క్రమబద్ధీకరణతో రూ.10,900 కోట్లు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ వీటి ద్వారా వచ్చిన ఆదాయం రూ.1000 కోట్లు కూడా దాటలేదు. అందుకే ఈసారి ప్రభుత్వం భూముల అమ్మకం జోలికెళ్లలేదు. కేంద్రంపై ఆశలు.. గతేడాది కేంద్రం నుంచి రూ.3,100 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ వస్తుందని ప్రభుత్వం ఆశించింది. కానీ కేంద్రం కేవలం రూ.450 కోట్లు ఇచ్చింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఈ ఏడాది మరిన్ని ఆశలు పెంచుకుంది. కేంద్రం నుంచి రూ.11,800 కోట్ల ప్యాకేజీ వస్తుందని ఆదాయ పట్టికలో ప్రకటించింది. పన్ను ఆదాయం వచ్చేనా? జీఎస్టీ ఈ ఏడాదే అమల్లోకి రానుంది. జీఎస్టీతో పన్నుల ద్వారా వచ్చే ఆదాయంపై అనిశ్చితి నెలకొంది. గతేడాది వ్యాట్ ద్వారా రూ.37,489 కోట్ల ఆదాయం వచ్చిందని సవరణ బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది రూ.46,500 కోట్ల ఆదాయాన్ని అంచనా వేసింది. వృద్ధి రేటు ప్రకారం లెక్కగడితే ఇది రూ.42 వేల కోట్లకు పరిమితమయ్యే అవకాశాలున్నాయి. జీఎస్టీ అమలు నేపథ్యంలో అంచనాలను ప్రభుత్వం భారీగా పెంచి చూపించినట్లు తెలుస్తోంది. తగ్గుతున్న మిగులు గతేడాది బడ్జెట్లో రూ.3,718 కోట్ల మిగులును అంచనా వేసిన ప్రభుత్వం కేవలం.. రూ.199.39 కోట్లకు సవరించుకుంది. 2015–16లో 238.06 కోట్ల మిగులు ఉన్నట్లు అకౌంట్ జనరల్ లెక్క తేల్చింది. ఈ లెక్కన తెలంగాణ మిగులు తగ్గినట్లు స్పష్టమవుతోంది. అయినా ఈ ఏడాది ఏకంగా రూ.4,571 కోట్ల మిగులు చూపించటం గమనార్హం. పాత బకాయిలు ప్రశ్నార్థకం ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు ఏటేటా పేరుకుపోతున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోవటం సమస్యగా వెంటాడుతోందని ప్రభుత్వం బడ్జెట్లోనే పేర్కొంది. ఇప్పటికీ ఆరోగ్యశ్రీకి రూ.400 కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.2 వేల కోట్లు, ఇన్పుట్ సబ్సిడీకి రూ.420 కోట్లతో పాటు వడ్డీ లేని రుణాలు సైతం పెండింగ్‌లో ఉన్నాయి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు చెల్లించాల్సిన రూ.30 కోట్ల ప్రీమియం కూడా చెల్లించలేకపోయింది. -
శాసనమండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కడియం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వార్షిక (2017–18) బడ్జెట్‌ను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శాసన మండలిలో ప్రవేశపెట్టారు. సోమవారం ఉదయం 11.30 గంటలకు శాసన మండలికి వచ్చిన ఆయన ముందుగా బడ్జెట్ పత్రాలను మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు అందజేశారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తరఫున తాను బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నాని కడియం శ్రీహరి సభ్యులకు తెలిపారు. డిప్యూటీ సీఎం బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించి ఐదు నిమిషాలు దాటినా బడ్జెట్ ప్రతులు సభ్యులకు చేరలేదు. దీంతో విపక్షనేత షబ్బీర్ అలీ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే శాసన సభ నుంచి బడ్జెట్ ప్రతులు వస్తున్నాయని, ముహూర్తం మించిపోతున్నందున ప్రసంగానికి అడ్డు చెప్పవద్దని షబ్బీర్ అలీని చైర్మన్ స్వామిగౌడ్ కోరారు. 36 పేజీల వార్షిక బడ్జెట్ ప్రసంగ పాఠాన్ని మధ్యాహ్నం 12గంటలకు ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి 1.15గంటలకు పూర్తి చేశారు. వరుసగా నాలుగోసారి ఆయనే - బడ్జెట్ రూపకల్పనలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు కీలక భూమిక సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వరుసగా నాలుగోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ల తయారీలో నాలుగు సార్లూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు కీలక పాత్ర పోషించారు. తొలి రెండేళ్లు ఆర్థిక శాఖ కార్యదర్శిగా బడ్జెట్ రూపకల్పన చేసిన రామకృష్ణారావు.. గతేడాది ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సారి కొత్త పంథాలో తయారైన నాలుగో బడ్జెట్ రూపకల్పనలోనూ క్రియాశీల భూమిక నిర్వహించారు. రామకృష్ణారావుతో పాటు మూడు నెలల కింద ఆర్థిక శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సందీప్‌కుమార్ సుల్తానియా, ఆర్థిక సలహాదారు జి.ఆర్.రెడ్డిలు దాదాపు గత నెల రోజులుగా బడ్జెట్ తయారీ ప్రక్రియలోనే నిమగ్నమయ్యారు. మారిన మార్గదర్శకాల నేపథ్యంలో కొత్త బడ్జెట్ తయారీకి రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగానే కసరత్తు చేసింది. స్వయంగా సీఎం కేసీఆర్ చాలా సమయం వెచ్చించి ప్రతి పద్దును చర్చించి కేటాయింపులు జరిపారు. -
ఇది బోగస్ బడ్జెట్: తమ్మినేని
భూదాన్‌పోచంపల్లి/చౌటుప్పల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒక బోగస్ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. మహాజన పాదయాత్రలో భాగంగా సోమవారం యాదాద్రి జిల్లా భూదాన్‌పోచంపల్లి, చిన్నకొండూరులలో జరిగిన సభల్లో ఆయన మాట్లాడారు. ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవా నికి దూరంగా ఉందన్నారు. ఆదాయానికి మించిన బడ్జెట్ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఎచ్చులకు పోయి ‘మా ఊరి మిర్యాలు తాటి గింజలంత లావు’ అన్న చందంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. గత బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రూ.10 వేల కోట్లు కేటాయించగా, అందులో రూ.9,800 కోట్లు దారి మళ్లించారని ఆరోపించారు. ఈసారి ఎస్సీల సంక్షేమానికి కేటాయించిన రూ.14,370 కోట్లు కేవలం వారిని జో కొట్టడానికేనని విమర్శించారు. పంట రుణమాఫీ కోసం కేవలం రూ. 4వేల కోట్లు పెట్టి రైతులకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. కేరళ లాంటి రాష్ట్రంలో బడ్జెట్లో విద్య కోసం 30 శాతం కేటాయింపులు చేస్తూ సంపూర్ణ అక్షరాస్యతను సాధిస్తుండగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విద్య కోసం కేటాయించిన రూ. 12 వేల కోట్లు కేటాయించడం ఏ మూలకు సరిపోతుందని ప్రశ్నించారు. జనాభాలో 52శాతం ఉన్న బీసీలకు, జనాభా ప్రతిపాదికన రూ.75వేల కోట్లు కేటాయిస్తే సముచితంగా ఉండేదని, కానీ, కేవలం రూ. 5 వేల కోట్లు పెట్టి మోసం చేసిందని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ప్రభుత్వం వెంట పడుతూనే ఉంటామని హెచ్చరించారు. మేదర్లను ఆదుకోవాలి: సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వెనకబడిన మేదరి కులస్తులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని సీపీఎం కోరింది. వారిని ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలకు తగ్గకుండా రుణాలివ్వాలని సీఎం కేసీఆర్‌కు సోమవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో విజ్ఞప్తిచేశారు. యువతకు వృత్తికి సంబంధించిన అధు నాతన పరికరాలను సమకూర్చాలని కోరారు. అర్హులైన పేద మేదరి కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. -
కేసీఆర్ బీసీరథం
- వెనుకబడిన తరగతులకు బడ్జెట్లో పెద్దపీట - గ్రామీణ ఆర్థిక ప్రగతి ఎజెండాగా పల్లెబాట - బీసీలు, కుల వృత్తులకు చేయూత - గతంలో ఎన్నడూ లేనన్ని నిధులు - యాదవ, ముదిరాజ్ కులాలపై వరాల జల్లు - గొర్రెల పెంపకానికి రూ.4 వేల కోట్లు - చేపల పెంపకానికి రూ.వెయ్యి కోట్లు - నాయిబ్రాహ్మణ, రజకులకు రూ.500 కోట్లు - విశ్వకర్మలకు రూ.200 కోట్లు, చేనేతకు రూ.1,200 కోట్లు - ప్రభుత్వాసుపత్రుల్లో పుట్టిన శిశువులకు ‘కేసీఆర్’ కిట్ - కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద ఆర్థిక సాయం పెంపు - సాగునీటి ప్రాజెక్టులకు రూ.25 వేల కోట్లు - రూ.1,49,646 కోట్లతో భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్ తెలంగాణ బడ్జెట్ పల్లె బాట పట్టింది! సాగునీటికి నిధుల వరద పారిస్తూనే... చితికిన కుల వృత్తులు, కూలిన జీవితాలను నిలబెట్టేందుకు కొత్త నినాదం ఎంచుకుంది. అట్టడుగు వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ బీసీలకు భరోసా కల్పించింది. అత్యంత వెనుకబడిన వర్గాలకు తొలిసారి బడ్జెట్లో చోటు కల్పించింది. గ్రామీణ ఆర్థిక ప్రగతిని లక్ష్యంగా ఎంచుకొని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రూ.1,49,646 కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రెండేళ్ల ముందే ఎన్నికల బడ్జెట్‌ను ఆవిష్కరించి నట్లుగా భారీగా వరాల జల్లు కురిపించింది. ‘మైగ్రేషన్ నుంచి రివర్స్ మైగ్రేషన్.. వలస బాట పట్టిన తెలంగాణ బిడ్డలు తిరిగి పల్లెకు పయనం కావాలన్నదే మా ఆకాంక్ష...’ అంటూ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్ ఏ దిశగా పయనించిందో చెప్పారు. ఉద్యమ నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాల్లో ఒకటైన సాగునీటికి వరుసగా రెండోసారి బడ్జెట్లో ప్రభుత్వం సింహభాగం నిధులు కేటాయించింది. కోటి ఎకరాల తెలంగాణ మాగాణాన్ని ఆవిష్కరించే సంకల్పానికి మరోసారి ప్రాధాన్యమిస్తూ.. సాగునీటి ప్రాజెక్టులకు రూ.25 వేల కోట్లు ప్రతిపాదించింది. బీసీ.. ఖుషీ.. బడ్జెట్లో తొలిసారిగా సామాజిక వర్గాల వారీగా నిధులు వెచ్చించేందుకు ప్రభుత్వం ప్రాధాన్య మిచ్చింది. బీసీలకు గతంలో ఎన్నడూ లేనన్ని నిధులు కేటాయించింది. కుల వృత్తుల ఆధారంగా కొత్త కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. యాదవ, ముదిరాజ్‌లకు భారీ స్థాయిలో గొర్రెలు, చేపల పెంపకం కార్యక్రమాలను ప్రకటించింది. గొర్రెల పెంపకానికి రూ.4 వేల కోట్లు, చేపల పెంపకానికి రూ.1,000 కోట్ల రుణాలు సేకరించనుంది. వీరితోపాటు నాయిబ్రాహ్మణ, రజకులకు కలిపి రూ.500 కోట్లు, విశ్వకర్మలుగా పిలిచే ఐదు కులాలకు రూ.200 కోట్లు, చేనేతకు రూ.1,200 కోట్లు బడ్జెట్లో కేటాయించింది. బీసీల్లో అత్యంత వెనుకబడిన ఎంబీసీ వర్గాలకు రూ.వెయ్యి కోట్లు కేటాయించటం ఇదే తొలిసారి. మొత్తంగా సాగునీటి రంగం తర్వాత సంక్షేమానికే ఎక్కువ నిధులు కేటాయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి దాదాపు రూ.24 వేల కోట్లు కేటాయించింది. వీరితో పాటు బ్రాహ్మణ సంక్షేమ నిధికి రూ.100 కోట్లు, జర్నలిస్టుల సంక్షేమానికి రూ.30 కోట్లు ప్రకటించింది. ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, మైక్రో ఇరిగేషన్ పథకాలకు ఈసారి కూడా బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. బడ్జెటేతర వనరులతో వీటిని చేపడతామని ప్రకటించింది. తొలిసారి ముఖ్యమంత్రి పేరు తొలిసారిగా ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో నవ జాత శిశువులకు ‘కేసీఆర్ కిట్’ కార్యక్రమాన్ని బడ్జెట్లో ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టిన బిడ్డలకు, తల్లులకు మొదటి మూడు నెలలకు అవసరమయ్యే 16 వస్తువులతో ఈ కిట్‌ను సమకూర్చుతారు. ఇందుకు బడ్జెట్లో రూ.605 కోట్లు కేటాయించటం గమనార్హం. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఇచ్చే ప్రోత్సాహకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రెండింతలకు పెంచింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాలకు రూ.12 వేల ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ఆడపిల్ల పుడితే మరో రూ.వెయ్యి అదనపు ప్రోత్సాహకం ఇచ్చేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించింది. బడ్జెట్‌కు ముందే.. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, వీఆర్ఏలు, వీఏవోల జీతాల పెంచుతున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బడ్జెట్లో అందుకు తగిన వాటాను సమకూర్చారు. ఇప్పటికే పేద కుటుంబాల ఆదరణ చూరగొన్న కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలకు ఆర్థికసాయాన్ని రూ.75,116కు పెంచింది. దీనికి బడ్జెట్లో రూ.850 కోట్లు కేటాయించింది. ఆసరా ఫించన్లకు ఈ ఏడాది నిరుటి కంటే ఎక్కువగానే రూ.5,330 కోట్లు, ఆఖరి విడత రైతుల రుణమాఫీ పథకానికి రూ.4 వేల కోట్లు, విద్యుత్ సబ్సిడీకి రూ.4,484 కోట్లు, బియ్యం సబ్సిడీకి రూ.2,600 కోట్లు బడ్జెట్లో పొందుపరిచింది. గత ఏడాది సీఎం అధ్వర్యంలో ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్) పేరుతో రూ.4,800 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈసారి దాన్ని రూ.1000 కోట్లకు కుదించటం విశేషం. -
తెలంగాణ బడ్జెట్ హైలైట్స్ 2017-18
-
తెలంగాణ బడ్జెట్ హైలైట్స్ 2017-18
హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ 2017-18ను ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ ప్రవేశపెట్టారు. తాను బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది నాలుగోసారి అని, తనపై నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు అంటూ ఆర్థికమంత్రి చెప్పారు. అనంతరం బడ్జెట్ ప్రసంగం చదువుతూ బడుగు బలహీనవర్గాల వారికి బడ్జెట్లో పెద్దపీట వేశామని ఆర్థికమంత్రి చెప్పారు. ఈసారి బడ్జెట్ రూపకల్పనలో కొత్త పద్దతులు పాటించినట్లు చెప్పారు. ఈ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల్లో విశ్వాసం నింపుతుందని చెప్పారు. ఎస్సీఎస్టీ వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. ఆర్థికమంత్రి ఈటల ప్రవేశ పెట్టిన బడ్జెట్లోని హైలైట్స్ ఒకసారి పరిశీలిస్తే.. తెలంగాణ బడ్జెట్ హైలైట్స్-2017-18 19.61 శాతం వృద్ధిరేటు సాధించాం రెవెన్యూ వృద్ధి గణనీయంగా పెరిగింది కేంద్రం ఆదేశాల మేరకు ఏకరీతిన బడ్జెట్ ను రూపొందించాం 2017-18 బడ్జెట్ రూపకల్పనలో భిన్నపద్ధతులు అవలంభించాం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి చర్యలు తీసుకుంటున్నాం కొత్త నోట్ల రద్దుతో ఆదాయం తగ్గినప్పటికీ ఇతర పన్నుల ద్వారా ఆదాయం పెరిగింది ఆర్థిక వ్యవస్థ వృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేశారు ప్రజల విశ్వాసానికి అనుగుణంగా నిలవాలని మా ప్రయత్నం ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైంది నాపై నమ్మకం ఉంచిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు వరుసగా నాలుగోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నందుకు సంతోషంగా ఉంది రాష్ట్ర బడ్జెట్ రూ. 1,49,646 కోట్లు ప్రగతి పద్దు రూ. 88,038 కోట్లు నిర్వహణ వ్యయం రూ. 61,607 కోట్లు రెవెన్యూ మిగులు అంచనా రూ. 4,571 కోట్లు మహిళా శిశు సంక్షేమం కోసం రూ. 1731 కోట్లు బీసీ సంక్షేమం కోసం రూ. 5,070 కోట్లు మైనార్టీ సంక్షేమం కోసం రూ. 1249 కోట్లు ఆసరా ఫించన్ల కోసం రూ. 5,330 కోట్లు బ్రహ్మణుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు ఫీజు రియింబర్స్ మెంట్ కోసం రూ. 1939 కోట్లు చేనేత కార్మికుల కోసం రూ. 1200 కోట్లు చివరి విడత రైతుల రుణమాఫీకి రూ. 4000 కోట్లు ఇరిగేషన్ కు రూ. 26,652 కోట్లు విద్యారంగ అభివృద్ధికి రూ. 12,705 కోట్లు వైద్య, ఆరోగ్య రంగాలకు రూ.5,976 కోట్లు పంచాయతీరాజ్ వ్యవస్థకు రూ. 14,723 కోట్లు పట్టణాభివృద్ధికి రూ. 5,599 కోట్లు మిషన్ భగీరథకు రూ. 3000 కోట్లు రహదారుల అభివృద్ధికి రూ. 5,033 కోట్లు జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ. 30 కోట్లు మిగతా కార్పొరేషన్లకు రూ. 400 కోట్లు గ్రేటర్ వరంగల్ కు రూ. 300 కోట్లు జీహెచ్ఎంసీకి రూ. 1000 కోట్లు పర్యాటక, సాంస్కృతిక రంగానికి రూ. 198 కోట్లు శాంతి భద్రతలకు రూ. 4,828 కోట్లు ఐటీ రంగానికి రూ. 252 కోట్లు హరితహారానికి రూ. 50 కోట్లు విద్యుత్ రంగానికి రూ. 4,203 కోట్లు పారిశ్రామిక రంగానికి రూ. 985 కోట్లు