
శాసనమండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కడియం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వార్షిక (2017–18) బడ్జెట్‌ను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శాసన మండలిలో ప్రవేశపెట్టారు. సోమవారం ఉదయం 11.30 గంటలకు శాసన మండలికి వచ్చిన ఆయన ముందుగా బడ్జెట్ పత్రాలను మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు అందజేశారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తరఫున తాను బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నాని కడియం శ్రీహరి సభ్యులకు తెలిపారు.
డిప్యూటీ సీఎం బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించి ఐదు నిమిషాలు దాటినా బడ్జెట్ ప్రతులు సభ్యులకు చేరలేదు. దీంతో విపక్షనేత షబ్బీర్ అలీ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే శాసన సభ నుంచి బడ్జెట్ ప్రతులు వస్తున్నాయని, ముహూర్తం మించిపోతున్నందున ప్రసంగానికి అడ్డు చెప్పవద్దని షబ్బీర్ అలీని చైర్మన్ స్వామిగౌడ్ కోరారు. 36 పేజీల వార్షిక బడ్జెట్ ప్రసంగ పాఠాన్ని మధ్యాహ్నం 12గంటలకు ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి 1.15గంటలకు పూర్తి చేశారు.
వరుసగా నాలుగోసారి ఆయనే
- బడ్జెట్ రూపకల్పనలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు కీలక భూమిక
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వరుసగా నాలుగోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌ల తయారీలో నాలుగు సార్లూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు కీలక పాత్ర పోషించారు. తొలి రెండేళ్లు ఆర్థిక శాఖ కార్యదర్శిగా బడ్జెట్ రూపకల్పన చేసిన రామకృష్ణారావు.. గతేడాది ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సారి కొత్త పంథాలో తయారైన నాలుగో బడ్జెట్ రూపకల్పనలోనూ క్రియాశీల భూమిక నిర్వహించారు. రామకృష్ణారావుతో పాటు మూడు నెలల కింద ఆర్థిక శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సందీప్‌కుమార్ సుల్తానియా, ఆర్థిక సలహాదారు జి.ఆర్.రెడ్డిలు దాదాపు గత నెల రోజులుగా బడ్జెట్ తయారీ ప్రక్రియలోనే నిమగ్నమయ్యారు. మారిన మార్గదర్శకాల నేపథ్యంలో కొత్త బడ్జెట్ తయారీకి రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగానే కసరత్తు చేసింది. స్వయంగా సీఎం కేసీఆర్ చాలా సమయం వెచ్చించి ప్రతి పద్దును చర్చించి కేటాయింపులు జరిపారు.