బతుకునిచ్చే బడ్జెట్‌ | This life giving budget, says Etala | Sakshi
Sakshi News home page

బతుకునిచ్చే బడ్జెట్‌

Published Tue, Mar 14 2017 3:11 AM | Last Updated on Tue, Oct 2 2018 4:41 PM

బతుకునిచ్చే బడ్జెట్‌ - Sakshi

బతుకునిచ్చే బడ్జెట్‌

ఇది బ్యాలెట్‌ బడ్జెట్‌ కాదు: మంత్రి ఈటల
-
గ్రామీణ వ్యవస్థ బలోపేతంతోనే రాష్ట్రం పురోగమిస్తుంది
- సమైక్య పాలనలో తెలంగాణ జీవిక విచ్ఛిన్నమైంది
- మళ్లీ దాన్ని పునరుద్ధరిస్తాం
- రాష్ట్ర వృద్ధి రేటు జాతీయ సగటును మించింది
- ఆర్థిక వ్యవస్థ దృఢత్వాన్ని సంతరించుకుంది
- రెవెన్యూ మిగులు రూ.4,571.30 కోట్లుగా అంచనా
- అసెంబ్లీలో వరుసగా నాలుగోసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మంత్రి


 ‘‘తెలంగాణది ప్రత్యేక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ. ఇక్కడి వనరుల ఆధారంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక జీవిక ఏర్పడింది. వ్యవసాయంతోపాటు అనేక అనుబంధ వృత్తులు పల్లెలను గొప్పగా ఉంచాయి. ఉత్పత్తి కేంద్రంగా ఉండే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పదిలంగా ఉన్నంత వరకు తెలంగాణ పల్లెలు స్వయం పోషకత్వంతో, సమృద్ధితో కొనసాగాయి. సమైక్య పాలనలో అవి విచ్ఛిన్నమయ్యాయి. వ్యవసాయం, కులవృత్తులు ధ్వంసమై గ్రామీణ తెలంగాణ అల్లకల్లోలమైంది. ఈరోజు మా ప్రభుత్వం బ్యాలెట్‌ బాక్సు బడ్జెట్‌గా కాకుండా బతుకును నిలబెట్టే బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయటం ద్వారా యావత్‌ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి వేగం పుంజుకుంటుందని నమ్ముతున్నాం’’  – ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌

సాక్షి, హైదరాబాద్‌:
2017–18 ఆర్థిక సంవత్సరానికి రూ.1,49,646 కోట్ల అంచనాతో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ సోమవారం అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఇందులో నిర్వహణ వ్యయం పద్దు కింద రూ.61,607.20 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.88,038.80 కోట్లు ప్రతిపాదించారు. నిర్వహణ వ్యయం కంటే ప్రగతి పద్దు ఎక్కువగా ఉండటం అపూర్వమని ఈటల అభివర్ణించారు. ‘‘నిర్వహణ వ్యయంలో ఎక్కువగా రాజీ పడకుండా బడ్జెట్‌ను రూపొందించాం. వనరులను ఎక్కువగా సమీకరించి వ్యయాన్ని సహేతుకంగా క్రమబద్ధీకరించటం ద్వారా ఇది సాధ్యమైంది’’ అని బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు.

 జీఎస్‌డీపీని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2011–12ను బేస్‌ ఇయర్‌గా స్వీకరించినందున ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం 2017–18 ఆర్థిక సంవత్సరంలో రుణ పరిమితి కొంత పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. సాధారణంగా బడ్జెట్‌లో కేటాయింపులు ప్రణాళిక, ప్రణాళికేతర పద్దుల పేరుతో ఉంటుంది. కానీ ఈసారి దానికి భిన్నంగా నిర్వహణ పద్దు, ప్రగతి పద్దు పేరుతో బడ్జెట్‌ రూపొందించారు. ఇటీవల కేంద్రం బడ్జెట్‌ విధానాన్ని మార్చి రాష్ట్రాలు కూడా దాన్నే అనుసరించాలని ఆదేశించిన నేపథ్యంలో ఈ మార్పు చేసినట్టు ఈటల వివరించారు. బడ్జెట్‌ వర్గీకరణలో కొత్త విధానంతో కేంద్ర ప్రభుత్వం.. పంచవర్ష ప్రణాళికల స్థానంలో పదిహేనేళ్ల దార్శనికత, ఏడేళ్ల వ్యూహం, మూడేళ్ల కార్యాచరణ ప్రణాళిక ప్రవేశపెట్టిందన్నారు. ఇది స్థానిక ప్రభుత్వ విధానాన్ని బలోపేతం చేస్తుందని వివరించారు.

ఆదాయ వృద్ధి రేటు భేష్‌..
ఆర్థిక మంత్రి హోదాలో ఈటల రాజేందర్‌ వరుసగా నాలుగోసారి శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. తొలుత సోమవారం ఉదయం 11.30 గంటలకు బడ్జెట్‌ ప్రవేశపెడతారని ప్రభుత్వం ప్రకటించినా.. తర్వాత దాన్ని 12 గంటలకు మార్చారు. సరిగ్గా అదే సమయానికి ఈటల బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభించారు. నాలుగుసార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపి ప్రసంగం ప్రారంభించారు. ‘‘యాభై ఎనిమిది సంవత్సరాలపాటు చీకటిలో గడిపిన తెలంగాణ ప్రజలు సొంత రాష్ట్రంలోనే తమకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని భావించారు. మా ప్రభుత్వంపై వారికి ఉన్న నమ్మకానికి అనుగుణంగా నిలవాలన్నదే మా ప్రయత్నం. కొత్త రాష్ట్రం ఏర్పడగానే వనరులపై అస్పష్టత, పరిపాలన యంత్రాంగాన్ని గాడిలో పెట్టడం, రెండు రాష్ట్రాల మధ్య సిబ్బంది పంపిణీ తదితర సమస్యలు ఎదురయ్యాయి. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక స్థితిపైన, వనరులు, పేదల స్థితిగతులను మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన పూర్తి అవగాహన ఏర్పడింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రెవెన్యూ వృద్ధి అమితంగా ఉందని చెప్పటానికి సంతోషిస్తున్నా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో పన్నుల ద్వారా సమకూరిన రాష్ట్ర ఆదాయం 19.61 శాతం వృద్ధి రేటుతో దేశంలోని చాలా రాష్ట్రాల కన్నా ఎక్కువగా ఉంది. పెద్ద నోట్ల రద్దు వల్ల స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ ద్వారా వచ్చే ఆదాయం తగ్గినప్పటికీ, ఇతర పన్నుల ద్వారా సమకూరే ఆదాయం పెరిగింది. ఎంతో జాగ్రత్తగా తీర్చిదిద్దడం వల్ల మన ఆర్థిక వ్యవస్థ ఇంతటి దృఢత్వాన్ని సంతరించుకుంది’’ అని వివరించారు.

ద్రవ్యలోటు 3.48 శాతం
వచ్చే ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ మిగులు రూ.4,571.30 కోట్లు, ద్రవ్యలోటు రూ.26,096.31 కోట్లు ఉంటుందని ఈటల అంచనా వేశారు. ఈ ద్రవ్య లోటు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.48 శాతంగా అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నారు. సాగునీటి రంగానికి కేటాయించిన నిధులను నిర్మాణ వ్యయంగా పరిగణించటం వల్ల రెవెన్యూ మిగులు అధికంగా అంచనా వేసినట్టు వివరించారు. 2016–17 ఆర్థిక సంవత్సరపు సవరించిన అంచనాల ప్రకారం రాష్ట్ర సొంత ఆదాయం రూ.58,636 కోట్లు కాగా.. 2017–18లో రూ.69,220.37 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు వివరించారు. కేంద్ర వితరణ కింద వచ్చే నిధులు 2016–17 అంచనాల ప్రకారం రూ.28,433.78 కోట్లు కాగా... 2017–18 బడ్జెట్‌లో రూ.43,862.67గా అంచనా వేశారు.

రెండంకెల వృద్ధి సాధించాం..
జీఎస్‌డీపీ వృద్ధి 2016–17లో స్థిర ధరల వద్ద 10.1 శాతానికి పెరిగే అవకాశం ఉందని, ఇదే కాలంలో జాతీయ జీడీపీ వృద్ధి 7.1 శాతంగా ఉంటుందని అంచనా వేసినట్టు ఈటల వెల్ల డించారు. పెద్ద నోట్ల రద్దుతో ఆర్థిక కార్యక లాపాలు దెబ్బతిన్నా.. రాష్ట్రం రెండంకెల వృద్ధి ని సాధించటం ఎంతో సంతృప్తినిచ్చింద న్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు జాతీయ వృద్ధి కంటే మన వృద్ధిరేటు తక్కువగా ఉండే దని, తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత గత మూడేళ్లలో జీఎస్‌డీపీ జాతీయ సగటు కన్నా ఎక్కువగా నమోదవుతోందన్నారు. విద్యుత్‌ సరఫరా మెరుగవడం, ప్రభుత్వ క్రియాశీల విధానాల వల్ల పారిశ్రామిక రంగం పురోగతి చెప్పుకోదగిన స్థాయిలో ఉందని, ఈ రంగం లో వృద్ధి 2013–14లో 0.6 శాతంగా ఉండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.5 శాతానికి చేరుకుందని ప్రకటించారు. వ్యవసాయం, అనుబంధ రంగాల వృద్ధి 12.1 శాతానికి చేరుకుంటోందన్నారు. ప్రస్తుత ధరల ప్రకారం జీఎస్‌డీపీ.. గతేడాది 5,75,631 కోట్లు ఉండగా, 2016–17లో 6,54,294 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నట్టు వివరిం చారు. ఇది గత ఏడాదితో పోలిస్తే రికార్డు స్థాయిలో 13.7 శాతం వృద్ధి సాధించిందని, రాష్ట్ర తలసరి ఆదాయం  2015–16లో రూ.1,40,683 ఉండగా ఈ ఏడాది రూ.1,58,360కి పెరుగుతుందని అంచనా వేసినట్టు చెప్పారు. 2016–17 తలసరి ఆదాయం జాతీయ సగటు రూ.1,03,818 కన్నా ఎక్కువగా ఉందన్నారు. రాష్ట్రావిర్భావం తర్వాత తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చెప్పుకోదగ్గ స్థాయిలో వేగం పుంజుకోవటం చూస్తే ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందనే విషయం రుజువవుతోందన్నారు.

ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికలో మార్పులు
బడ్జెట్‌ రూపకల్పనలో వచ్చిన మార్పుల వల్ల ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికల్లో కూడా మార్పులు అనివార్యమైనట్టు ఈటల వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీలకు బడ్జెట్‌ కేటాయింపులు ఎలా ఉండాలనే విషయంలో సూచనల కోసం ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రుల ఆధ్వర్యంలో కమిటీలను నియమించి ఆయా వర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశాలు నిర్వహించినట్టు వెల్లడించారు. వారి సిఫారసుల మేరకు ఆయా వర్గాలకు జనాభా నిష్పత్తి ప్రకారం నిధుల కేటాయింపులు ఉండేలా అంచనాలు రూపొందించినట్టు చెప్పారు. ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. దీంతో కేటాయించిన నిధులు ఆ సంవత్సరంలో ఖర్చు కాకుంటే మరుసటి సంవత్సరానికి బదిలే చేసే వెసులుబాటు కలుగుతుందన్నారు. అంబేడ్కర్‌ ఆలోచన విధానంతోనే చిన్న జిల్లాలుపాలనా విభాగాలు చిన్నవిగా ఉన్నప్పుడే సామాన్యులకు న్యాయం జరుగుతుందన్న అంబేడ్కర్‌ తాత్విక చింతనను సూక్ష్మస్థాయిలో ఆచరించే దిశగా తమ ప్రభుత్వం జిల్లాలను  పునర్వ్యవస్థీకరించిందని ఈటల వెల్లడించారు. జిల్లాల పెంపుతోపాటు, 25 కొత్త రెవెన్యూ డివిజన్లు, 125 కొత్త మండలాలు, 5 కొత్త పోలీసు కమిషనరేట్లు, 23 కొత్త పోలీసు సబ్‌ డివిజన్లు, 28 సర్కిళ్లు, 94 కొత్త పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.

సాదాసీదాగా ప్రసంగం...
గత బడ్జెట్‌ ప్రసంగాలతో పోలిస్తే ఆర్థికమంత్రి ఈసారి సాదాసీదా ప్రసంగంతో సరిపుచ్చారు. మెరుపులు, విరుపులు, ఆరోపణలు లాంటివి లేకుండా ఎక్కువగా ఆయా శాఖల కేటాయింపులను ప్రస్తావించేందుకే పరిమితమయ్యారు. సమైక్య పాలనలో తెలంగాణకు అన్యాయం జరిగిందనే మాటను రెండు సందర్భాల్లో ప్రస్తావించినా... తరచూ చెప్పే బంగారు తెలంగాణ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. గత బడ్జెట్‌ ప్రసంగంలో అమర్త్యసేన్‌ మాటలను ప్రస్తావించారు. చాణక్య నీతి, అశోకుడి రీతి, ఇంటిని చక్కబెట్టుకోవటంలో ఇల్లాలి ఇగురం.. ఈ మూడింటి మేలైన కలయికే ఈ బడ్జెట్‌ అంటూ ప్రసంగంలో ఆసక్తి పెంచేలా చేశారు. ఈసారి మాత్రం అలాంటి వాటి జోలికి వెళ్లలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement