సాక్షి, హైదరాబాద్ : వచ్చే ఏడాది జరిగే మేడారం జాతరకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. సోమవారం ఉదయం శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మేడారం జాతరపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తగ్గట్టుగా మేడారం జాతర నిర్వహిస్తామన్నారు. జాతర నిర్వహణకు ఆర్థికసాయం చేయాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. సమ్మక్క - సారలమ్మ జాతరకు కోటి మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు. గతంలో ఈ జాతరపై వివక్ష ఉండేది అని తెలిపారు.
గత ప్రభుత్వాలు రూ. 10 కోట్ల నుంచి 20 కోట్లు మాత్రమే కేటాయించేవారు అని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేడారం జాతరకు రూ. వంద కోట్లు కేటాయించడం రికార్డు అని అన్నారు. 2016 సంవత్సరంలో రూ. 136 కోట్లు ఖర్చు పెట్టి పలు సౌకర్యాలు కల్పించామని చెప్పారు. జాతీయ పండుగగా గుర్తించాలని ఈ సభ ద్వారా తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరిగే జాతరకు ఇప్పటికే రూ. 80 కోట్లు విడుదల చేశామన్నారు. అవసరమైతే మరిన్ని నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో జరిగే ఈ జాతరపై ఇప్పటికే పలుసార్లు సమీక్షలు నిర్వహించామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment