తెలంగాణ బడ్జెట్ లో పలు కేటాయింపులు ప్రస్తావించిన ఈటెల రాజేందర్, వాటికి ఆదాయ మార్గాలు మాత్రం వెల్లడించలేదు.
తెలంగాణ రాష్ట్రానికి తొలి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నందుకు తనకు చాలా గర్వంగా ఉందని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. పది నెలల కాలానికి గాను ఆయన తన బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అందులో వివిధ శాఖలకు ఎంతెంత మొత్తాలు కేటాయిస్తున్నారో సమగ్రంగా వివరించారు. అంతవరకు బాగానే ఉంది గానీ, అసలు ఆయా కేటాయింపులు చేయడానికి ఆదాయ మార్గాలు ఏంటన్న విషయాన్ని మాత్రం ఆయన ప్రస్తావించలేదు. పన్నుల విషయాన్ని మాట మాత్రంగా కూడా చెప్పలేదు.
పన్నుల రహితంగా బడ్జెట్ను తాము ఇస్తామని ఈటెల రాజేందర్ ఇంతకుముందు పలు సందర్భాల్లో చెప్పారు. అయితే.. దానికి అర్థం ఇలా ఉంటుందని మాత్రం ఎవరూ భావించలేదు. ఆదాయం లేకుండా ఈ పథకాలను ఎలా అమలుచేస్తారో, వాటికి సొమ్ములు ఎక్కడినుంచి తెస్తారో ఆయనకే తెలియాలని పలువురు విపక్ష నాయకులు కూడా విమర్శలు గుప్పించారు.