కేంద్ర బడ్జెట్ 2025-26 ప్రకటన సమీపిస్తున్న తరుణంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) భారతదేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే సామర్థ్యం ఉన్న కీలక రంగాలను హైలైట్ చేస్తూ అంచనాలను వెల్లడించింది. ఎస్‌బీఐ ప్రీ బడ్జెట్ విశ్లేషణలో భాగంగా ప్రస్తావించిన అంశాలు కింది విధంగా ఉన్నాయి. ఫిబ్రవరి 1న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెడుతారు.
గ్రామీణాభివృద్ధిపై దృష్టి
కీలక గ్రామీణ పథకాలకు కేటాయింపులు పెరిగే అవకాశం ఉండటంతో ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుంది. ఇందులో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ), గ్రామీణ గృహనిర్మాణం, గ్రామీణ రహదారులు వంటి కార్యక్రమాలు ఉన్నాయి. ప్రత్యేకించి పట్టణ వినియోగం నెమ్మదించడంతో గ్రామీణ డిమాండ్‌ను పెంచడం, విస్తృత ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వడం దీని లక్ష్యం.
ఆరోగ్య సంరక్షణ, బీమా సంస్కరణలు
హెల్త్ కేర్, ఇన్సూరెన్స్ రంగాల్లో పలు సంస్కరణలు చేపట్టే అవకాశం ఉంది. టర్మ్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను మరింత చౌకగా ఉండేలా జీఎస్టీ, పన్నులను మినహాయించడం, ఆరోగ్య సంరక్షణ వ్యయాన్ని జీడీపీలో 5 శాతానికి పెంచడం, వైద్య పరికరాలపై జీఎస్టీ రేట్లను హేతుబద్ధీకరించడం వంటి వాటిపై దృష్టి సారించవచ్చు. ఈ చర్యలు బీమా సదుపాయాన్ని మరింత మందికి చేరువ చేసేందుకు ఉపయోగపడుతాయి. ఆరోగ్య సంరక్షణ సేవలకు డిమాండ్ పెరుగుతుండడంతో ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలు ఈ సమస్యకు పరిష్కారంగా నిలుస్తాయి.
ఎంఎస్ఎంఈలకు మద్దతు
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)ను ఆదుకునేలా బడ్జెట్‌లో చర్యలు ఉండబోతున్నాయి. ఇందులో ఎంఎస్‌ఎంఈలకు తక్కువ వడ్డీ ఫైనాన్సింగ్, పన్ను మినహాయింపులు, రిటైల్, ఇతర రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలు ఉండవచ్చు. నిర్వహణ సవాళ్లను తగ్గించడం, సృజనాత్మకతను పెంపొందించడం దీని లక్ష్యం.
ఇదీ చదవండి: లిక్విడిటీ లోటు రూ.3 లక్షల కోట్లు
డిజిటల్ మౌలిక సదుపాయాలు
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ మౌలిక సదుపాయాల విస్తరణపై బడ్జెట్లో దృష్టి సారించనున్నారు. ఎక్కువ మంది వినియోగదారులు, వ్యాపారాలను ఆన్‌లైన్ బాటపట్టించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను పెంచడానికి ఇది సహాయపడుతుంది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక లావాదేవీలను క్రమబద్ధీకరించడం సులువుకానుంది.
Comments
Please login to add a commentAdd a comment