inSight
-
గంటన్నర పాటు భారీ ప్రకంపనలతో ఊగిపోయిన మార్స్...!
భూగ్రహం కాకుండా మానవులకు నివాసయోగ్యంగా ఉండే ఇతర గ్రహాల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పరిశోధనలను చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా భూమికి అత్యంత సమీపంలోని అంగారక గ్రహం మానవులకు నివాసయోగ్యంగా ఉండవచ్చే అనే భావనతో నాసా ఇప్పటికే మార్క్‌పైకి క్యూరియాసిటీ, పర్సివరెన్స్ అనే రోవర్లను ప్రయోగించింది. ఈ రోవర్స్ సహాయంతో నాసా అనేక విషయాలను వెలుగులోకి తెచ్చింది. చదవండి: Jeff Bezos: జెఫ్‌బెజోస్ దెబ్బకు దిగివచ్చిన నాసా..! భారీ ప్రకంపనతో ఊగిపోయిన మార్స్....! తాజాగా అంగారక గ్రహంపై ఈ నెల 18 న సుమారు 90 నిమిషాల పాటు భారీ ప్రకంపనలు సంభవించాయని నాసా వెల్లడించింది. నాసాకు చెందిన ఇన్సైట్ ల్యాండర్ అంగారక గ్రహంపై నమోదైన భారీ ప్రకంపనలను రికార్డు చేసింది. రిక్టర్ స్కేల్‌పై 4.2 తీవ్రతతో ప్రకంపనలు సంభవించాయి. అయితే నెల రోజుల వ్యవధిలో ఇలాంటి ప్రకంపనలు సంభవించడం ఇది మూడోసారి. 2019లో వచ్చిన 3.7 తీవ్రతతో పోలిస్తే.. తాజాగా కనిపించిన 4.2 తీవ్రత ప్రకంపనల ప్రభావం ఐదు రెట్లు అధికమని నాసా పేర్కొంది. ఇన్సైట్ ల్యాండర్ ఇప్పటివరకు అంగారకపై సుమారు 700 ప్రకంపనలను గుర్తించింది. ఇన్సైట్ అందించిన సమాచారంతో నాసా శాస్త్రవేత్తలు భావించినా దాని కంటే అంగారక క్రస్ట్ అత్యంత పలుచగా ఉందని గుర్తించారు. భూగ్రహంతో పోలిస్తే అంగారకపై ప్రకంపనలు ఎక్కువ సమయం పాటు రావడానికి కారణం అంగారక క్రస్ట్ అత్యంత పలుచగా ఉండడమే కారణమని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. కాగా ఇన్సైట్ ల్యాండర్ పగటి సమయంలో ప్రకంపనలను రికార్డు చేయడం ఇదే తొలిసారి. చదవండి: క్రిప్టో కరెన్సీ: ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్.. ‘సొల్లు’ రీజన్స్!! అనూహ్య ప్రకటన -
అంగారకుడిపై కంపనాలు
వాషింగ్టన్: అంగారకుడిపై మొదటిసారి కంపనాలకు సంబంధించిన శబ్దాలు రికార్డయ్యాయి. మార్స్‌పై పరిశోధనలు చేసేందుకు నాసా ప్రయోగించిన ‘ఇన్సైట్’ అంతరిక్ష నౌక ఈ కంపనాల ధ్వనులను గుర్తించింది. ఇన్‌సైట్‌లో అమర్చిన సిస్మిక్ ఎక్స్పరిమెంట్ ఫర్ ఇంటీరియర్ స్ట్రక్చర్(ఎస్ఈఐఎస్) పరికరం ఈ నెల 6వ తేదీన ఈ కంపనాలను రికార్డు చేసినట్లు నాసా తెలిపింది. గతేడాది మేలో ఇన్‌సైట్‌ను ప్రయోగించగా డిసెంబర్లో సిసిమోమీటర్ను అది అంగారకుడి ఉపరితలంపై ఉంచింది. ఈ కంపనాల్ని మార్టియన్ సోలార్ 128 కంపనాలుగా పిలుస్తున్నారు. ఇక అంగారకుడి అంతర్భాగం నుంచి మొట్టమొదటిసారి వచ్చిన కంపనాలు ఇవే కావడం గమనార్హం. ఇప్పటివరకు అంగారకుడిపై మార్చి 14, ఏప్రిల్ 10, ఏప్రిల్ 11 తేదీల్లో అత్యంత చిన్న చిన్న కంపనాలను కూడా సిసిమోమీటర్ గుర్తించింది. అయితే సోలార్ 128 కంపనాలు ఇంతకుముందు నాసా చేపట్టిన మూన్ మిషన్‌లో కనుగొన్న కంపనాలను పోలి ఉన్నాయి. దీంతో సోలార్ 128 కంపనాలపైనే శాస్త్రవేత్తలు ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. ఈ కంపనాలు ఏర్పడటానికి గల అసలు కారణాన్ని విశ్లేషిస్తున్నారు. ఈ కంపనాలు చాలా చిన్నవని, ఇటువంటి చిన్న చిన్న కంపనాలను గుర్తించడమే ఇన్సైట్ నౌక అసలు లక్షమని ఇన్సైట్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ బ్రూస్ బానెర్డ్ తెలిపారు. ఇన్సైట్ బృందానికి 128 కంపనాలు మైలురాయి లాంటిదని, ఇలాంటి సంకేతాల కోసం కొన్ని నెలలుగా తాము ఎదురుచూస్తున్నామని శాస్త్రవేత్త ఫిల్ లాగ్నొన్నె తెలిపారు. -
ఫైనల్లీ.. మార్స్ మాతో మాట్లాడుతోంది!
అనంత విశ్వంలో మానవాళి మనుగడకు అనుకూలమైన ఏకైక గ్రహం భూమి మాత్రమేనని మెజారిటీ శాస్త్రవేత్తల అభిప్రాయం. ఒకవేళ భూ గ్రహం అంతమయ్యే పరిస్థితులు తలెత్తితే.. మానవజాతి అంతం కావాల్సిందేనా? భూమి కాకుండా మనుషులు నివసించేందుకు మరే ఇతర గ్రహం అనుకూలం కాదా? అనే ప్రశ్నలకు బదులు కనుగొనేందుకు శాస్త్రవేత్తలు.. అంగారకుడి(మార్స్) మీద ప్రయోగాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అమెరికా పరిశోధన సంస్థ నాసా ఇన్సైట్ ల్యాండర్ అనే స్పేస్‌క్రాఫ్ట్‌ను మార్స్‌పైకి పంపింది. అయితే ఇప్పటిదాకా అరుణగ్రహ పరిసరాలకు సంబంధించిన ఫోటోలు, గాలి శబ్దాలను మాత్రమే ఇన్సైట్ రికార్డు చేసింది. తాజాగా ఇన్‌సైట్‌లో రికార్డైన శబ్దాలు శాస్త్రవేత్తలకు అంతులేని ఆనందాన్ని ఇస్తున్నాయి. మార్స్ ఉపరితలం, అంతర్గత వాతావరణం, కంపనాలు(భూకంపం వంటిది), వాటి ద్వారా ఏర్పడే ధ్వనులను రికార్డు చేయడమే ప్రధాన లక్ష్యంగా అక్కడ దిగిన ఇన్సైట్ త్వరలోనే తన టార్గెట్ పూర్తి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మార్స్‌పై ఇన్నాళ్లు నిశ్చలంగా ఉన్న ఇన్సైట్ తొలిసారి కుదుపులకు లోనైందని, కంపనాలకు సంబంధించిన శబ్దాలను రికార్డు చేసిందని జెట్ ప్రపల్షన్ లాబొరేటరీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇవి విమానం ఎగురుతున్నపుడు వచ్చే శబ్దాలను పోలి ఉన్నాయని తెలిపారు. ఫైనల్లీ మార్స్ మాతో మాట్లాడుతోంది.. ఈ విషయం గురించి మార్స్ మిషన్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ బ్రూస్ బెనెర్డ్ మాట్లాడుతూ... ‘ మార్స్‌పై విజయవంతంగా ప్రయోగాలు చేయగలుతామా అనే సందేహాలు నేటితో కాస్త తీరాయి. అక్కడ కంపన తరంగాలు యాక్టివ్‌గా ఉన్నట్లు కనుగొన్నాం. అవును మార్స్ ఇప్పుడు మాతో మాట్లాడుతోంది. తొలిసారి కంపించింది. కంపన తీవ్రత 2 నుంచి 2.5 యూనిట్లు ఉన్నట్లు అంచనా వేస్తున్నాం. భూమి కాకుండా తొలిసారి మరో గ్రహంపై సిస్మాలజీ గురించి అధ్యయనానికి ముందడుగు పడింది. అయితే ఇంకాస్త ఓపికగా ఎదురుచూడాలి. వాటిని నిశితంగా పరిశీలించాలి. ఇలాంటి కంపనాలు తరచుగా నమోదు అయినపుడే ఈ విషయంపై పూర్తి అవగాహన వస్తుంది’ అని పేర్కొన్నారు. అయితే ఏప్రిల్ 6న నాసా విడుదల చేసిన తాజా శబ్దాలు నిజంగా కంపనాలకు సంబంధించినవేనా అనే విషయంపై శాస్త్రవేత్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పెద్ద చర్చే నడుస్తోంది. -
అరుదైన శబ్దాలను రికార్డ్ చేసిన నాసా
తంపా : ఇప్పటివరకూ శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఈ అనంత విశ్వంలో మానవ మనుగడకు అనుకూలంగా ఉన్న ఏకైక ప్రదేశం భూ గ్రహం మాత్రమే. పెరుగుతున్న జనాభాకు అనుకూలంగా ఈ భూమి పరిమాణం మాత్రం పెరగడం లేదు, పెరగదు కూడా. దాంతో మానవ మనుగడకు అవసరమైన మరో గ్రహాన్ని అన్వేషించాల్సిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో శాస్త్రవేత్తల చూపు అరుణగ్రహం(మార్స్) మీదకు వెళ్లింది. అరుణ గ్రహం మనుషుల ఆవాసానికి అనుకూలంగా ఉందా, లేదా తెలసుకునేందుకు శాస్త్రవేత్తలు పలు ప్రయోగాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది. తొలిసారి శాస్త్రవేత్తలు అంగారకుడి మీద వచ్చే శబ్ద తరంగాలను రికార్డ్ చేశారు. నాసా అంగారకుడి పైకి పంపిన ఇన్సైట్ ల్యాండర్ అనే స్పేస్‌క్రాఫ్ట్ మార్స్‌పై వచ్చే గాలి తరంగాల శబ్దాలను రికార్డు చేసింది. ఇంత వరకూ మార్స్ పరిసరాలకు సంబంధించిన ఫోటోలను మాత్రమే పంపిన ఇన్సైట్ తొలిసారిగా అంగారకుడిపై వచ్చే గాలి శబ్దాలను రికార్డు చేసిందని నాసా తెలిపింది. గంటకు 10 నుంచి 15 మైళ్ల వేగంతో వీస్తున్న గాలి తరంగాలను ఇన్సైడర్ ల్యాండర్ రికార్డు చేసింది. స్పేస్‌క్రాఫ్ట్‌లోని రెండు సెన్సార్లు గాలి తరంగాల శబ్దాలను నమోదు చేశాయని.. ఈ శబ్దాలు గాలిలో జెండా ఎగుతున్నప్పుడు వచ్చిన శబ్దాల మాదిరిగా ఉన్నాయని లండన్‌కు చెందిన పరిశోధకులు థామస్ పైక్ వెల్లడించారు. అంగారకుడిపై మరిన్ని పరిశోధనలు చేసేందుకు నాసా ప్రయోగించిన ఈ స్పేస్‌క్రాఫ్ట్ నవంబరు 26న మార్స్‌పై విజయవంతంగా దిగింది. అయితే గతంలో మాదిరి కాకుండా చాలా అధునాతన టెక్నాలజీతో ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను నాసా రూపొందించింది. అంగారకుడి గ్రహంలోని రాతి పొరల నిర్మాణాల గురించి, అక్కడ వచ్చే భూకంపాలను అధ్యయనం చేయడం కోసం, దాని ఉపరితలం నుంచి వెలువడే వేడి గురించి అధ్యాయనం చేయడం కోసం ఈ స్పేస్ క్రాఫ్ట్‌లో అత్యాధునిక భూకంప శాస్త్రపు సాధనాలను వినియోగించినట్లు నాసా తెలిపింది. -
మార్స్‌పై లక్ష మంది భారతీయులు!
ఆశ్చర్యంగా ఉందా? మనిషే అడుగు పెట్టని అంగారక గ్రహం (మార్స్)పైకి అప్పుడే లక్షమంది భారతీయులు ఎలా వెళ్లగలిగారు? అని ముక్కున వేలేసుకుంటున్నారా?.... కాస్త ఆగండి. నాసా ప్రయోగించిన ఇన్ సైట్ ప్రోబ్ అంగారక గ్రహంపైకి చేరింది కదా. దాంతోపాటే లక్షా 39 వేల 899 మంది భారతీయుల పేర్లు కూడా ఆ గ్రహంపైకి చేరాయి. అదీ సంగతి. ఎలక్ట్రాన్ బీమ్ సాయంతో పలుచటి సిలికాన్ పొరపై వీరందరి పేర్లు ముద్రించి, దానిని ఇన్సైట్ ల్యాండర్ పైభాగంలో బిగించారు. మనిషి వెంట్రుక మందంలో వేల వంతులు తక్కువ సైజున్న అక్షరాలతో ఈ పేర్లను ముద్రించడం విశేషం. నాసా పిలుపు మేరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 24,29,807 మంది తమ పేర్లు పంపారు. అమెరికా నుంచి 6.76 లక్షలు, చైనా నుంచి 2.62 లక్షల మంది తమ పేర్లు పంపగా భారత్ మూడోస్థానంలో నిలిచింది. -
అంగారకుడిపైకి ‘ఇన్సైట్’
వాండెన్‌బర్గ్ ఎయిర్‌ఫోర్స్ బేస్ (అమెరికా): అంగారకుడిపై దిగి గ్రహాంతర్భాగాలను అధ్యయనం చేసేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శనివారం ‘ఇన్సైట్’ అనే అంతరిక్ష నౌకను విజయవంతంగా ప్రయోగించింది. కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.35 గంటలకు అట్లాస్ వీ రాకెట్ సహాయంతో ఇన్సైట్ ల్యాండర్ అరుణ గ్రహం దిశగా దూసుకెళ్లింది. అమెరికా పశ్చిమ తీర ప్రాంతం నుంచి నాసా చేపట్టిన మొట్టమొదటి ఇంటర్‌ప్లానెటరీ ప్రయోగమిది. అన్నీ సజావుగా సాగితే ఈ ఏడాది నవంబర్ 26 నాటికి గ్రహం ఉపరితలంపై ఇన్సైట్ దిగనుంది. ‘ఇన్సైట్’ పూర్తి పేరు ఇంటీరియర్ ఎక్స్‌ప్లోరేషన్ యూజింగ్ సీస్మిక్ ఇన్వెస్టిగేషన్స్, జియోడెసి అండ్ హీట్ ట్రాన్స్పోర్ట్. ఈ ప్రాజెక్టు కోసం నాసా సుమారు రూ.6,635 కోట్లు(99.3 కోట్ల డాలర్లు) ఖర్చుచేసింది. సౌరవిద్యుత్, బ్యాటరీతో పనిచేసే ల్యాండర్ 26 నెలలపాటు గ్రహంపై అధ్యయనం కొనసాగించనుంది. అంతర్భాగంపై అధ్యయనం.. గ్రహంపై అడుగుపెట్టిన తర్వాత ఉపరితలాన్ని 10 నుంచి 16 అడుగుల లోతుకు తవ్వి అంతర్భాగ పరిస్థితులపై అధ్యయనం చేస్తుంది. అనంతరం దీనికి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారాన్ని అందించడంతోపాటు కొన్ని కోట్ల ఏళ్ల కిందట భూమి లాంటి రాతి గ్రహాలు ఏవిధంగా ఏర్పడ్డాయన్నది తెలుపుతుందని పరిశోధకులు చెబుతున్నారు. భూకంపాల మాదిరిగానే అంగారకుడిపై ప్రకంపనలు, హిమపాతాలు, ఉల్కాపాతాలు చోటుచేసుకున్న విషయం తమకు తెలిసిందేనని.. అయితే ఇవి ఎలా జరుగుతాయన్న ముఖ్యమైన సమాచారాన్ని దీని ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నామని నాసా ముఖ్య శాస్త్రవేత్త జిమ్ గ్రీన్ చెప్పారు. ఇన్సైట్ అక్కడి ఉష్ణోగ్రతలను పరిశీలించనుంది. గ్రహం మధ్యధరా రేఖ ప్రాంతంలో వేసవి కాలంలో పగటి పూట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ కాగా.. రాత్రి మైనస్ 73 డిగ్రీలకు పడిపోతుంది. -
అంగారకా.. మేం వచ్చేస్తున్నాం
వాషింగ్టన్, న్యూఢిల్లీ : అంగారక గ్రహం మీదకు యాత్రికులుగా వెళ్లి వచ్చేందుకు భారతీయులు క్యూ కడుతున్నారు. నాసా చేపట్టిన ఇన్సైట్ (ఇంటీరియర్ ఎక్లోరిషన్ యూజింగ్ సెస్మిక్ ఇన్వెస్టిగేషన్) మిషన్లోభాగంగా అంగారక గ్రహ ప్రయాణానికి 1,38,899 మంది తమ టిక్కెట్లను బుక్ చేసుకున్నారు. ఇదే విషయాన్ని నాసా ధృవీకరించింది. ఈ మిషన్ 2018 మే 8న ప్రారంభం కానుంది. ప్రయాణానికి రిజిస్టర్ చేసుకున్న వ్యక్తులకు ఆన్లైన్లోనే బోర్డింగ్ పాస్‌లను జారీ చేస్తున్నట్లు నాసా తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మిషన్‌లో పాల్గొనేందుకు 24 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు నాసా తెలిపింది. అందులో 2,62752 మందిని ఎంపిక చేసినట్లు నాసా జెట్ ప్రాపల్సన్ లేబరేటరీ అధికారి అండ్రూ గుడ్ తెలిపారు. ఈ మిషన్ మొత్తం 720 రోజుల పాటు కొనసాగుతుందని అండ్రూ గుడ్ తెలిపారు. అంగారకుడి భూ మధ్య రేఖ మీదుగా వెళ్లి.. అక్కడనుంచి అంగారకుడి భూ ఉపరితల పరిస్థితులను అధ్యయనం చేస్తామని ఆయన చెప్పారు. అంతేకాకుండా అంగారక భూ ఉపరితలంపై భూ కంపాలను అధ్యయనం చేయనున్నట్లు ఆయన తెలిపారు. అంగారక గ్రహం నుంచి తిరిగి 2018 నవంబర్ 26 భూమికి తిరిగి వస్తామని అండ్రూ పేర్కొన్నారు. -
నాసా ఇన్సైట్ ప్రయోగం వాయిదా
వాషింగ్టన్: అరుణ గ్రహం(మార్స్) మీద ప్రయోగానికి అమెరికా అంతరిక్ష ప్రయోగ సంస్థ నాసా తలపెట్టిన 'ఇన్సైట్' ప్రయోగం వాయిదా పడింది. తొలుత ఈ ప్రయోగాన్ని 2016 మార్చిలో నిర్వహించాలని భావించారు. అయితే కొన్ని సాంకేతిక సమస్యల దృష్ట్యా ప్రయోగాన్ని నిర్వహించడం కుదరదని భావించి వాయిదా వేస్తున్నట్లు నాసా అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ గ్రన్స్‌ఫెల్డ్ మంగళవారం ప్రకటించారు. ఇన్సైట్ ప్రయోగంలో కీలకమైన సిస్మిక్ మీటర్లో ఏర్పడిన లీక్ ఫలితంగా ఈ ప్రయోగం వాయిదా పడినట్లు నాసా వర్గాలు తెలిపాయి. ఫ్రెంచ్ అంతరిక్ష సంస్థ తయారు చేసిన ఈ పరికరానికి పలుమార్లు మరమ్మతులు నిర్వహించినా తాజాగా మరోసారి మొరాయించడంతో ప్రయోగాన్ని వాయిదా వేయక తప్పలేదని తెలిపారు. ఈ వాయిదాతో భూమీ, అంగారకుని స్థానాల దృష్ట్యా మరో 26 నెలల వరకు ఈ ప్రయోగం నిర్వహించడం కుదరదు.