గతవారం స్టాక్ మార్కెట్లు బాగా కుదేలయ్యాయి. ప్రధాన సూచీలు దాదాపు 2 శాతం పడిపోయాయి. ఇందుకు మూడు ప్రధాన కారణాలను చెప్పుకోవచ్చు. విదేశీ ఇన్వెస్టర్ల నిరంతర అమ్మకాలు, పెరిగిన చమురు ధరలు, పూర్తి ఆర్ధిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గించడం.. ఈ మూడూ మార్కెట్లను కిందకు నడిపించాయి. టీసీఎస్ ఆర్ధిక ఫలితాలు మార్కెట్లను మెప్పించి ఐటీ కంపెనీలపై కాస్త భరోసా ఇచ్చినప్పటికీ.. ఈ డోస్ సరిపోలేదు. అంతర్జాతీయంగా చూస్తే.. అమెరికా ప్రెసిడెంట్‌గా వచ్చే వారం బాధ్యతలు స్వీకరించబోతున్న 'డొనాల్డ్ ట్రంప్' (Donald Trump) అనుసరించబోయే విధానాలపై పూర్తి క్లారిటీ లేకపోవడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసిందని చెప్పవచ్చు. ఇక వారం మొత్తానికి సెన్సెక్స్ 1845 పాయింట్లు కోల్పోయి 77378 వద్ద, నిఫ్టీ 573 పాయింట్లు నష్టపోయి 23432 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి.
ఈవారం
అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించిన ఆర్ధిక ఫలితాల సందడి మొదలయ్యింది. ఈవారం మార్కెట్లను పెద్దగా ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడం వళ్ళ ఆయా కంపెనీలు ప్రకటించబోయే త్రైమాసిక ఫలితాలే రాబోయే రోజుల్లో మార్కెట్లకు దిశానిర్దేశం చేయబోతున్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, విప్రో, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, ఎల్టీటీఈఎస్, ఎల్టీఐఎమ్, ఇండియన్ హోటల్స్, సియట్, ఐసీఐసీఐ లొంబార్డ్ తదితర ప్రముఖ సంస్థలు ఈవారం ఆర్ధిక ఫలితాలను ప్రకటించబోయే జాబితాలో ఉన్నాయి.
ఇక క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకల తర్వాత మళ్ళీ మార్కెట్లో విదేశీ మదుపర్ల సందడి మొదలైందని గతవారం మార్కెట్ ట్రెండ్‌ను బట్టే తెలుస్తోంది. గతవారం క్షీణత తర్వాత ఈవారం మార్కెట్లు కొంత మేర కన్సాలిడేషన్ దిశగా సాగే అవకాశం ఉంది. అదే సమయంలో కాస్త ప్రతికూల వార్తలొచ్చినా.. అది మరింత కిందకు లాగేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ద్రవ్యోల్బణ గణాంకాలు, రూపాయి కదలికలు, చమురు ధరల్లో మార్పులపైనా మదుపర్లు ఓ కన్నేసి ఉంచాలి.
ఎఫ్ఐఐలు
విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) గత డిసెంబర్ నెల మొత్తం మీద రూ.16982 కోట్ల నికర విక్రయాలు జరపగా.. దేశీయ మదుపర్లు రూ. 34194 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. ఇక ఈ ఏడాది ఇప్పటిదాకా విదేశీ మదుపర్లు రూ.21,357 కోట్ల నికర అమ్మకాలు చేశారు. అదే సమయంలో దేశీయ మదుపర్లు మాత్రం రూ. 24,215 కోట్ల నికర కొనుగోళ్లతో మార్కెట్‌కు అండగా నిలిచారు.
సాంకేతిక స్థాయిలు
మార్కెట్లో ప్రస్తుతం బేరిష్ సెంటిమెంట్ ఉంది. గత ఏడాది జూన్ తర్వాత నిఫ్టీ మళ్ళీ ప్రస్తుతం ఆ స్థాయిలకు వచ్చింది. సెన్సెక్స్, నిఫ్టీల్లో ఒడుదొడుకులు కొంత మేర తగ్గి మార్కెట్లు కన్సాలిడేషన్ దిశగా సాగుతాయని భావించవచ్చు. ముఖ్యంగా బుల్స్ చేస్తున్న ప్రయత్నాలను ఎప్పటికప్పుడు బేర్స్ అడ్డుకుంటూ మార్కెట్లను కిందకు లాగడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.
కొనుగోళ్ల సహకారం లభిస్తే మాత్రం 23700 పాయింట్ల వద్ద నిరోధం ఎదురుకావొచ్చు. అదికూడా అధిగమిస్తే తదుపరి నిరోధక స్థాయి 23830 దగ్గర ఉంది. ప్రముఖ కంపెనీల ఆర్ధిక ఫలితాల మెప్పించకపోయినా, ద్రవ్యోల్బణ గణాంకాలు మరింత నీరసంగా ఉన్నా, సూచీలు పడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అదే జరిగితే మొదట 23270 వద్ద మద్దతు దొరుకుతుంది. దీన్ని కూడా ఛేదించి కిందకు జారితే మాత్రం తదుపరి నిరోధం 23000 వద్ద, ఆపైన 22800 స్థాయి వద్ద సహకారం లభించవచ్చు.
ఫ్యూచర్స్ & ఆప్షన్స్ డేటాను పరిశీలిస్తే నిఫ్టీ 23000 - 24000 స్థాయిలోనే చలించవచ్చని తెలుస్తోంది. కాల్స్ డేటా ప్రకారం 24500 వద్ద అత్యధిక స్థాయిలో ఓపెన్ ఇంటరెస్ట్ ఉంది. పుట్స్ వైపు 22500 వద్ద అత్యధిక ఓపెన్ ఇంటరెస్ట్ కేంద్రీకృతమై ఉంది. మార్కెట్లో హెచ్చుతగ్గులకు దిక్సూచిగా నిలిచే ఇండియా విక్స్ గత వారం 10 శాతం పెరిగి 14.9 దగ్గర ఉంది.
రంగాలవారీగా..
గత వారమంతా చాలా బలహీనంగా సాగిన బ్యాంకింగ్ షేర్లు.. ఈవారం కొద్దిగా పుంజుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా షార్ట్ కవరింగ్ లావాదేవీలు ఈ రంగం సెంటిమెంట్ ను పెంచుతాయి. టెలికాం రంగంలోని సంస్థలు ప్రోత్సాహక ఫలితాలు ప్రకటించవచ్చన్న అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ రంగంలోని షేర్లు సానుకూలంగా కదలాడొచ్చు.
వాహన రంగంలోని షేర్లు స్తబ్దుగా చలించే అవకాశం ఉంది. ముఖ్యంగా మారుతీ, అశోక్ లేలాండ్, బజాజ్ ఆటో షేర్లు ప్రతికూలతలను చూడొచ్చు. అదే సమయంలో హీరో, టీవీఎస్ కొంతమేర ప్రోత్సాహకరంగా ఉండొచ్చు. క్షీణిస్తున్న రూపాయి.. ఫార్మా షేర్లకు మంచి బూస్ట్ అనే చెప్పాలి. గత త్రైమాసికానికి సంబంధించి రూపాయి క్షీణత వాటి ఆర్ధిక ఫలితాలను ప్రభావితం చేస్తుంది. ఇది ఒకింత ప్రోత్ససహకమే.
మార్కెట్ ఒడుదొడుకుల్లో మదుపరులకు ఇది ఎప్పటికీ సురక్షిత రంగమే. ఇక టీసీఎస్ ప్రకటించిన ఆర్ధిక ఫలితాలు మార్కెట్ వర్గాలను మెప్పించాయి. ఈవారం ఫలితాల ప్రకటించబోయే ఐటీ కంపెనీల్లో ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ వంటివి ఉన్నాయి. వీటి ఫలితాల మార్కెట్లకు.. ముఖ్యంగా ఐటీ రంగానికి దిశానిర్దేశం చేస్తాయి. సిమెంట్ షేర్లకు మద్దతు లభించే అవకాశం ఉండగా, లోహ షేర్లు ఒత్తిళ్లు ఎదుర్కోవచ్చు. చమురు, ఎఫ్ఎంసీజీ షేర్లలో పెద్దగా దూకుడుvఉండకపోవచ్చు.
- బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు.
Comments
Please login to add a commentAdd a comment