
గతవారం సైతం మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. మార్కెట్లలో ఓ రకమైన భయాందోళనలు నెలకొన్నాయి. ఏమాత్రం కొనుగోళ్ల మద్దతు లభిస్తున్నా వెంటనే విదేశీ మదుపర్లు విక్రయాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుత పరిణామాలు గమనిస్తే మదుపర్లు ఇప్పట్లో తేరుకునే పరిస్థితులు కనిపించడం లేదు. అమెరికా వాణిజ్య విధానాల్లో స్పష్టత కొరవడటం, ముఖ్యంగా టారిఫ్‌ల విషయంలో ట్రంప్ ధోరణి అంతుచిక్కకపోవడం మార్కెట్లకు ఇబ్బందికరంగా పరిణమిస్తోంది. పారిశ్రామికోత్పత్తి గణాంకాలు నిరుత్సాహకరంగా ఉండటమూ ప్రతికూలంగా మారింది. రూపాయి బలహీనతలు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి. గతవారం మొత్తానికి సెన్సెక్స్ 0.56%, నిఫ్టీ 0.51% శాతం క్షీణించాయి. సెన్సెక్స్ 425 పాయింట్లు నష్టపోయి పెరిగి 75311 వద్ద, నిఫ్టీ 117 పాయింట్లు కోల్పోయి 22795 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. బ్యాంకు నిఫ్టీ సైతం ఇందుకు మినహాయింపు కాదు. మరోపక్క నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 1.7 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 1.5 శాతం పెరిగాయి.
ఈవారం
ఇప్పటికే మార్కెట్లు భారీ స్థాయిలో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. సాంకేతిక స్థాయులను పరిశీలిస్తే కచ్చితంగా ఈవారం సాంకేతిక మద్దతు లభించొచ్చు. ఇదే జరిగితే ఉపశమన ర్యాలీ ఖాయం. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి ఈనెల 28 న గణాంకాలు వెలువడతాయి. అలాగే ఈనెల 27 న అమెరికా జీడీపీ తాలూకు గణాంకాలు వెలువడనున్నాయి. ఇవి మార్కెట్లను ప్రభావితం చేస్తాయి. నిరుద్యోగ డేటా కూడా ఈవారాంతంలో రానుంది. అమెరికా ఎకనామిక్ డేటా గతవారం అక్కడి మార్కెట్లను బాగా పడేసింది. దీని ప్రభావం సోమవారం వివిధ ఆసియా మార్కెట్లపై పడింది. చైనా, హాంకాంగ్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మన మార్కెట్లు కూడా ఈవారాన్ని నష్టాలతోనే ప్రారంభించొచ్చు. సాధారణంగా మధ్యాహ్నం ఒంటిగంటన్నర తర్వాత రంగంలోకి దిగి విస్తృత స్థాయిలో అమ్మకాలు జరిపే విదేశీ మదుపర్లు ఇప్పుడు రూటు మార్చారు. పొద్దున్న ట్రేడింగ్ ప్రారంభమైన అరగంటలోనే తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఒకసారి మార్కెట్లు పడిపోయాక రోజు మొత్తంలో మళ్లీ తేరుకోవడం చాలా కష్టమవుతోంది. షేర్లలో కదలికలు చాలా తక్కువ స్థాయిలో ఉంటున్నాయి. అదే సమయంలో సూచీల్లో మాత్రం విపరీతమైన ఒడుదొడుకులు కొనసాగుతున్నాయి. దీనివల్ల ట్రేడర్లకు భారీ నష్టాలే మిగులుతున్నాయి. ఈ ట్రెండ్‌ను గమనించి ముందుకెళ్లడం అవసరం.
విదేశీ మదుపర్లు
విదేశీ మదుపర్లు ఎటువంటి సానుకూల ప్రకటనలనూ పెద్దగా పట్టించుకోవడం లేదు. నిరంతర అమ్మకాలు కొనసాగిస్తూనే ఉన్నారు. చైనా మార్కెట్ వారికిప్పుడు ప్రోత్సాహకరంగా కనిపిస్తోంది. దీంతో వీరు మన మార్కెట్లో అమ్మకాలకు పాల్పడుతూ పెట్టుబడులను అటువైపు తరలిస్తున్నారు. గత జనవరి నెల మొత్తానికి వీరు రూ.87,000 కోట్ల విక్రయాలు జరిపిన విషయం తెల్సిందే. ఫిబ్రవరి నెలలో ఇప్పటివరకు రూ.36,976 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దేశీయ మదుపర్లు మాత్రం యథావిధిగా మార్కెట్‌కు మద్దతుగా నిలిచారు. వీరు ఈ నెలలో ఇప్పటివరకు రూ.42,601 కోట్ల నికర కొనుగోళ్లతో మార్కెట్‌ను ఆదుకునే ప్రయత్నాలు చేశారు.
సాంకేతిక స్థాయిలు
అడపాదడపా కొనుగోళ్లు జరుగుతున్నప్పటికీ నిఫ్టీ ఇప్పటికీ బేర్ ఆపరేటర్ల గుప్పిట్లోనే ఉందని చెప్పొచ్చు. సూచీలు భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ఈవారం కొంత కొనుగోళ్ల మద్దతు లభించే అవకాశాలు లేకపోలేదు. నిఫ్టీకి 23000-200 స్థాయి చాలా కీలకం. దీన్ని దాటి ముందుకెళ్తే మాత్రం తొలుత 23,400, ఆ తర్వాత 23,600 స్థాయి ని చేరే అవకాశం ఉంటుంది. అలాకాక అమ్మకాల ఒత్తిడి కొనసాగితే మాత్రం 22,600 అనేది ప్రధాన స్థాయిగా భావించొచ్చు. దీన్ని బ్రేక్ చేసి కిందకెళ్లిపోతే మాత్రం 22,500 వద్ద తొలి మద్దతు లభించొచ్చు. దీన్ని కూడా ఛేదించి పడిపోతే 22,350, ఆతర్వాత 22,000 స్థాయులను పరీక్షించే అవకాశం ఉంటుంది.
రంగాలవారీగా
ఆయా సెక్టార్లకు సంబంధించి వెలువడే ప్రకటనలు సంబంధిత రంగాల షేర్లను ప్రభావితం చేస్తాయి. అదే సమయంలో మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో ఒడుదొడుకులు కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈమధ్య కాలంలో మార్కెట్లకు పెనుశాపంగా మారిన విదేశీ మదుపర్ల నిరంతర అమ్మకాలు ఈవారమూ కొనసాగవచ్చు. రంగాలవారీగా చూస్తే ఫార్మా, వాహన రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎదురుకావొచ్చు. ట్రంప్ నిర్ణయాల ప్రభావంతో ఐటీ షేర్లు సైతం నష్టాల బాటలో కొనసాగొచ్చు. యంత్ర పరికరాలు, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లు ఓ పరిమితికి లోబడి కదలాడొచ్చు. బ్యాంకింగ్ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోవచ్చు. లోహ, సిమెంట్ రంగాల్లో కొనుగోళ్లకు అవకాశం ఉండగా, చమురు, టెలికాం రంగాల్లో పరిమిత స్థాయిలో కదలికలు ఉండొచ్చు. వచ్చే నెల 28వ తేదీ నుంచి బ్రిటానియా, భారత్ పెట్రోలియం స్థానంలో జొమాటో, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు నిఫ్టీ-50లో అడుగుపెట్టబోతున్నాయి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, హ్యుందాయ్ మోటార్, ఇండియన్ హోటల్స్, బెల్, ఐఆర్సీటీసీ, స్విగ్గీ, అదానీ టోటల్ గ్యాస్, ఎన్‌హెచ్‌పీసీ షేర్లపైనా దృష్టి సారించొచ్చు. ఇక మార్కెట్లో హెచ్చుతగ్గులకు దిక్సూచిగా నిలిచే ఇండియా విక్స్ గత వారాంతానికి 3.23 శాతం క్షీణించి 14.53 దగ్గర ఉంది. 14 శాతం దిగువకు వచ్చేవరకు బుల్స్ ఆచితూచి వ్యవహరించాల్సిందే.
మహా శివరాత్రి సందర్భంగా బుధవారం మార్కెట్లకు సెలవు.
-బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment