
2024–25లో మార్కెట్‌ను మించి పరుగు
బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 8 శాతం అప్
ఇదే కాలంలో సెన్సెక్స్ ర్యాలీ 5 శాతమే
మార్కెట్లకు రిటైల్ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల దన్ను
తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరం(2024–25)లో దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్పంగా బలపడ్డాయి. ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 5 శాతం లాభపడింది. అయితే అత్యధిక శాతం ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడంతో చిన్న షేర్ల ఇండెక్స్ బీఎస్‌ఈలో 8 శాతం పురోగమించింది. ఇందుకు ప్రధానంగా మార్చి నెల మద్దతిచ్చింది.
న్యూఢిల్లీ: పలు ఆటుపోట్ల మధ్య 2024–25లో స్టాక్ మార్కెట్లు నికరంగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 3,764 పాయింట్లు(5.1 శాతం) పుంజుకోగా.. బీఎస్‌ఈలో స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 3,472 పాయింట్లు(8 శాతం) ఎగసింది. ఈ బాటలో మిడ్‌క్యాప్ సైతం 2,209 పాయింట్లు(5.6 శాతం) వృద్ధి చెందింది. ఇందుకు ప్రధానంగా మార్చి నెల దన్నుగా నిలిచింది. గతేడాది అక్టోబర్ నుంచి అమ్మకాల బాట పట్టిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) గత నెలలో ఉన్నట్టుండి కొనుగోళ్ల యూటర్న్ తీసుకోవడంతో మార్కెట్లు భారీ నష్టాల నుంచి రికవరీ సాధించాయి. దీంతో పూర్తి ఏడాదికి లాభాలతో నిలిచాయి. ప్రధానంగా రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపడం మిడ్, స్మాల్‌క్యాప్ కౌంటర్లకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.
నష్టాలకు చెక్
గతేడాది అక్టోబర్ మొదలు వరుసగా 5 నెలలపాటు నష్టాలతో ముగిసిన మార్కెట్లు గత నెలలో బౌన్స్‌బ్యాక్ అయ్యాయి. తద్వారా గతేడాది నికరంగా లాభాలతో నిలిచినట్లు లెమన్ మార్కెట్స్ డెస్క్ విశ్లేషకులు సతీష్ చంద్ర ఆలూరి పేర్కొన్నారు. ప్రధానంగా మిడ్, స్మాల్‌క్యాప్ ఇండెక్సులు మార్కెట్లను మించి బలపడినట్లు తెలియజేశారు. అందుబాటు విలువలకు చేరిన పలు షేర్లకుతోడు దేశీయంగా నెలకొన్న ఆశావహ పరిస్థితులు, ఎఫ్‌పీఐల పెట్టుబడులు ఇందుకు కారణమైనట్లు వివరించారు. దీంతో ప్రస్తుతం చరిత్రాత్మక సగటులకు పలు కౌంటర్లు చేరినట్లు అభిప్రాయపడ్డారు.
ఈక్విటీల విలువలు ఖరీదుగా మారడంతో అక్టోబర్ నుంచి ఎఫ్‌పీఐలు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. వెరసి దేశీ స్టాక్ మార్కెట్లు ‘బేర్’ ట్రెండ్‌లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎఫ్‌పీఐలు పెట్టుబడులవైపు మళ్లడంతోపాటు.. భారీ సంఖ్యలో రిటైల్ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో మార్కెట్లు నష్టాలనుంచి బయటపడినట్లు నిపుణులు తెలియజేశారు. ఇది చివరికి మార్కెట్లు సానుకూల ధోరణిలో ముగిసేందుకు దోహదం చేసినట్లు వివరించారు. ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల యూఎస్ ఫెడరల్ రిజర్వ్ 2025లో వడ్డీ రేట్ల కోత సంకేతాలు ఇవ్వడం సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు పేర్కొన్నారు.
ప్రీమియం విలువల ఎఫెక్ట్
నిజానికి బుల్ మార్కెట్లలో ప్రధాన ఇండెక్సులతో పోలిస్తే మిడ్, స్మాల్ క్యాప్స్ మరింత అధికంగా ర్యాలీ చేయవలసి ఉన్నట్లు హైబ్రో సెక్యూరిటీస్ వ్యవస్థాపకులు తరుణ్ సింగ్ పేర్కొన్నారు. గతేడాది చిన్న షేర్ల ఇండెక్సులు రెండంకెల స్థాయిలో వృద్ఢి చూపకపోవడానికి మార్కెట్ల ర్యాలీ చాలా ముందుగానే ప్రారంభంకావడంతో షేర్ల ధరలు భారీగా పెరిగాయని, ఇందుకు తగిన స్థాయిలో కంపెనీల పనితీరు లేకపోవడం ఇన్వెస్టర్లను నిరాశపరచిందని వివరించారు. గత రెండు త్రైమాసికాలలో అంచనాలకంటే దిగువన వెలువడిన ఫలితాలు షేర్ల ప్రీమియం ధరలకు మద్దతివ్వలేకపోయినట్లు తెలియజేశారు. మరోవైపు యూఎస్ కొత్త ప్రెసిడెంట్ ట్రంప్ భారత్‌సహా పలు దేశాలపై ప్రతీకార టారిఫ్‌లకు తెరతీయడం సెంటిమెంటును బలహీనపరచినట్లు మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ డైరెక్టర్ పాల్క అరోరా చోప్రా పేర్కొన్నారు.
సరికొత్త రికార్డులు
గతేడాది(2024) సెప్టెంబర్ 27న సెన్సెక్స్ చరిత్రాత్మక గరిష్టం 85,978 పాయింట్లను అధిగమించగా.. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ అదేనెల 24న 49,701ను తాకి సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. ఈ బాటలో స్మాల్‌క్యాప్ సైతం 2024 డిసెంబర్ 12న 57,828 పాయింట్ల వద్ద లైఫ్‌టైమ్ గరిష్టానికి చేరింది. నిజానికి బ్లూచిప్స్ లేదా లార్జ్‌క్యాప్ స్టాక్స్‌ను ఎఫ్‌పీఐలు అత్యధికంగా కొనుగోలు చేస్తే.. రిటైలర్లు చిన్న షేర్లపట్ల ఆకర్షితులవుతుంటారని విశ్లేషకులు వివరించారు. అయితే ఇకపై ఆయా కంపెనీల ఫలితాల ఆధారంగా స్టాక్ విలువలు సర్దుబాటుకానున్నట్లు తెలియజేశారు. కొత్త ఆర్థిక సంవత్సరం(2025–26)లో అడుగుపెడుతున్న నేపథ్యంలో దేశీ ఈక్విటీ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య వృద్ధి బాటలో సాగే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ పరిస్థితులు, మార్కెట్ల ట్రెండ్‌సహా దేశీయంగా కార్పొరేట్ ఫలితాలు, ప్రభుత్వ, ప్రయివేట్ పెట్టుబడులు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు వివరించారు.
మార్చిలో బూస్ట్
ఎఫ్‌పీఐలు, రిటైలర్ల పెట్టుబడుల దన్నుతో ఒక్క మార్చి నెలలోనే మార్కెట్లు భారీగా టర్న్‌అరౌండ్ అయ్యాయి. సెన్సెక్స్ 4,217 పాయింట్లు(5.8 శాతం) ఎగసింది. బీఎస్‌ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3,555 పాయింట్లు(8.3%) జంప్‌చేస్తే, మిడ్‌క్యాప్ 2,939 పాయింట్లు(7.6%) బలపడింది. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు తలెత్తినప్పటికీ దేశీయంగా సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు, విధానాల కొనసాగింపుపై అంచనాలు ఇన్వెస్టర్లలో మార్కెట్లపట్ల విశ్వాసాన్ని పెంచాయి. ఫలితంగా గతేడాది పలు
ఆటుపోట్ల మధ్య మార్కెట్లు నికరంగా లాభపడ్డాయి.