Smallcap index
-
ఐదు నెలల్లో రూ.14,000 కోట్లు - ఇన్వెస్టర్లలో పెరిగిన రిస్క్ ధోరణి
న్యూఢిల్లీ: అధిక రాబడుల కోసం థీమ్యాటిక్ (సెక్టోరల్ తదితర) మ్యూచువల్ ఫండ్స్ పథకాలకు ఇన్వెస్టర్లు ఆకర్షితులవుతున్నారు. గడిచిన ఐదు నెలల కాలంలో ఈ పథకాలు నికరంగా రూ.14,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం దీన్నే సూచిస్తోంది. ఇన్వెస్టర్లలో రిస్క్ తీసుకునే ధోరణి పెరిగినట్టు కూడా అర్థమవుతోంది. ఈ ఏడాది జూన్ నుంచి ప్రతి నెలా ఈ విభాగం నికరంగా పెట్టుబడులను ఆకర్షిస్తూనే ఉంది. అంతకుముందు చూస్తే, ఈ ఏడాది మే నెలలో థీమ్యాటిక్ ఫండ్స్ నుంచి రూ.169 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాలు పరిశీలిస్తే తెలుస్తోంది. థీమ్యాటిక్/సెక్టోరల్ ఫండ్స్‌లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పెట్టుబడులు మొత్తాన్ని ఇవి ఒకే రంగంలో, లేదా ఒకే తరహా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. వైవిధ్యానికి అవకాశం ఉండదు. రిస్క్ తీసుకునే ధోరణి పెరగడంతో ఇన్వస్టర్లు అధిక రిస్క్‌తో కూడిన థీమ్యాటిక్ లేదా సెక్టోరల్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకుంటున్నట్టు ఫైయర్స్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ గోపాల్ కావలిరెడ్డి అభిప్రాయపడ్డారు. స్మాల్‌క్యాప్ తర్వాత వీటికే ఆదరణ యాంఫి గణాంకాల ప్రకారం.. అక్టోబర్‌లో థీమ్యాటిక్ ఫండ్స్‌లోకి రూ.3,896 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అక్టోబర్‌లో అత్యధికంగా స్మాల్‌క్యాప్ ఫండ్స్ రూ.4,495 కోట్లను ఆకర్షించగా, ఆ తర్వాత అధిక పెట్టుబడులు థీమ్యాటిక్ పథకాల్లోకే వెళ్లాయి. ఇక ఈ ఏడాది సెప్టెంబర్‌లో రూ.3,417 కోట్లు, ఆగస్ట్‌లో రూ.4,806 కోట్లు, జూలైలో రూ.1,429 కోట్లు, జూన్‌లో రూ.459 కోట్ల చొప్పున థీమ్యాటిక్ పథకాల్లోకి పెట్టుబడులు వచ్చాయి. బ్యాంకింగ్ ఫండ్స్‌కు మొగ్గు ఇక థీమ్యాటిక్ ఫండ్స్‌లో బ్యాంకింగ్ ఫండ్స్ ఎక్కువ మంది ఇన్వెస్టర్ల ఎంపికగా ఉంటున్నాయి. ఇవి బ్యాంక్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి కనుక దేశ వృద్ధిలో పాలు పంచుకున్నట్టు అవుతుంది. గడిచిన పదేళ్లలో బీఎస్ఈ సెన్సెక్స్ 203 శాతం పెరిగితే, బీఎస్ఈ బ్యాంకెక్స్ (బ్యాంక్ స్టాక్స్‌తో కూడిన సూచీ) 282 శాతం పెరిగింది. ఇతర రంగాలతో పోలిస్తే గడిచిన కొన్ని త్రైమాసికాల్లో బ్యాంకులు లాభాల్లో ఎక్కువ వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. థీమ్యాటిక్ ఫండ్‌ను ఎంపిక చేసుకునే వారికి ఎప్పుడు పెట్టుబడులు పెట్టాలి, ఎప్పుడు వైదొలగాలనే విషయం తప్పక తెలిసి ఉండాలని టాటా అస్సెట్ మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూషనల్ క్లయింట్స్ హెడ్ ఆనంద్ వరదరాజన్ సూచించారు. 11 ఈక్విటీ ఫండ్ విభాగాల్లో థీమ్యాటిక్ కూడా ఒకటి. ఈ విభాగంలోని పథకాల నిర్వహణలో రూ.2.18 లక్షల కోట్ల ఆస్తులు అక్టోబర్ చివరికి ఉన్నాయి. -
చిన్న షేర్లు కుదేల్!
న్యూఢిల్లీ: చిన్న షేర్లు చితికిపోయాయి. ఒకపక్క ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి తోడు వడ్డీరేట్లకు రెక్కలు రావడం, అధిక ద్రవ్యోల్బణం సెగ వాటికి బాగానే తగిలింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో స్మాల్‌క్యాప్ సూచీ 1,617 పాయింట్లు (5.73%) దిగజారడం దీనికి నిదర్శనం. ఇదే కా లంలో బీఎస్ఈ సెన్సెక్స్, బ్లూచిప్ షేర్లతో పోలిస్తే చిన్న షేర్ల పతనం భారీగా ఉండటం గమనార్హం. తీవ్ర ఒడిదుడుకులు... 2022–23 ఏడాది భారత స్టాక్ మార్కెట్లను తీవ్రంగానే కుదిపేసింది. ప్రధానంగా తొలి క్వార్టర్లో ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రతో దేశీ సూచీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాయని.. అయితే, రెండు, మూడు త్రైమాసికాల్లో తిరిగి పుంజుకోగలిగాయని మార్కెట్ నిపుణులు విశ్లేషించారు. అయితే, రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో పాటు ధరాభారం, అధిక వడ్డీరేట్ల వల్ల చిన్న షేర్లపై ఇన్వెస్టర్ల ఆసక్తి సన్నగిల్లిందని వారు అంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఒక్క రోజు మాత్రమే ఉన్న నేపథ్యంలో, గడిచిన ఏడాది కాలాన్ని చూస్తే... మిడ్ క్యాప్ సూచీ 1.12 శాతం (270 పాయింట్లు) మాత్రమే తగ్గగా, సెన్సెక్స్ 1.03 శాతం (608 పాయింట్లు) పడింది. ‘‘ధరల కట్టడే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులన్నీ వడ్డీరేట్లను జోరుగా పెంచడం మొదలుపెట్టాయి. దీంతో ఇన్వెస్టర్లు రిస్క్ తగ్గించుకోవడంపై దృష్టిపెట్టడంతో మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడింది‘‘ అని మార్కెట్స్‌మోజో చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ సునీల్ దమానియా విశ్లేషించారు. కాగా, 2021–22లో మార్కెట్లు దుమ్మురేపడంతో స్మాల్ క్యాప్ సూచీ ఏకంగా 36.64 శాతం దూసుకెళ్లడం తెలిసిందే. ఇదే బాటలో మిడ్‌క్యాప్స్ 19.45 శాతం సెన్సెక్స్ 18.29 శాతం చొప్పున బలపడ్డాయి. ఏడాది తిరిగేసరికి చిన్న షేర్లు మళ్లీ వేగంగా కరిగిపోవడం గమనార్హం. ప్రధానంగా వడ్డీరేట్ల పెరుగుదలతో చిన్న, మధ్య స్థాయి కంపెనీలకు వడ్డీభారం పెరగడం వల్ల పెద్ద కంపెనీలతో పోలిస్తే అధిక ప్రభావం కనబడుతోందని దమానీ పేర్కొన్నారు. చిన్న షేర్లకు దూరం... ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్న తరుణంలో ఇన్వెస్టర్లు చిన్న షేర్లను అధిక రిస్క్‌తో కూడినవిగా పరిగణిస్తున్నారని స్వస్తికా ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా చెప్పారు. దీంతో వీటిలో పెట్టుబడులకు వెనుకాడటంతో పాటు తమ సొమ్మును వేగంగా వెనక్కి తీసుకోవడం వల్ల స్మాల్‌క్యాప్ సూచీ మిగతా వాటితో పోలిస్తే ఎక్కువగా పడిందన్నారు. ఫెడ్ భారీగా వడ్డీరేట్లను పెంచడం, ఉక్రెయిన్ యుద్ధం, అధిక ద్రవ్యోల్బణంతో మాంద్యం భయాలు నెలకొన్న కారణంగా గడిచిన ఏడాది కాలం మన మార్కెట్లు గడ్డు పరిస్థితులను చవిచూశాయని మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అర్విందర్ సింగ్ నందా పేర్కొన్నారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) తిరోగమనం, అదానీ గ్రూప్ స్టాక్స్‌లో ఎడాపెడా అమ్మకాల వంటి అనేక అంశాలు కూడా మన మార్కెట్ ప్రతికూల పనితీరుకు కారణమని నందా అభిప్రాయపడ్డారు. -
లాభాల్లో రేసుగుర్రాల్లా..ఇన్వెస్టర్లపై కాసుల వర్షం కురిపిస్తోన్న చిన్న షేర్లు..!
మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో చిన్న షేర్లు(స్మాల్ క్యాప్స్) భారీ లాభాలతో దూకుడు ప్రదర్శించాయి. బీఎస్ఈలో స్మాల్ క్యాప్ ఇండెక్స్ దాదాపు 37 శాతం వృద్ధి చూపింది. తద్వారా ప్రధాన ఇండెక్సులను సైతం అధిగమించి టాప్‌లో నిలిచింది. ఈ ర్యాలీలో భాగంగా 2022 జనవరి 18న 31,304 పాయింట్ల వద్ద సరికొత్త గరిష్టాన్ని అందుకోవడం విశేషం! వివరాలు చూద్దాం.. న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లు ఇన్వెస్టర్లకు గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో పలు విధాల లాభాల తీపిని రుచి చూపాయి. ప్రధానంగా చిన్న షేర్లు భారీగా ఎగశాయి. మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 18.3 శాతం(9,059 పాయింట్లు) లాభపడితే.. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 36.6 శాతం(7,566 పాయింట్లు) జంప్‌చేసింది. ఇదే కాలంలో బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 19.5 శాతమే(3,927 పాయింట్లు) బలపడింది. వెరసి గతేడాది స్మాల్ క్యాప్స్ హవా నడిచింది. కాగా.. ఈ స్పీడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23)లోనూ కొనసాగే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొనడం గమనార్హం! చివర్లో ఆటుపోట్లు భౌగోళిక ఆందోళనలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) అమ్మకాలు వంటి ప్రతికూలతల నేపథ్యంలో గతేడాది చివర్లో దేశీ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కొన్నాయి. తొలి అర్ధభాగంలో జోరు చూపిన మార్కెట్లు ద్వితీయార్థంలో కన్సాలిడేషన్ బాట పట్టినట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రపంచ అస్థిరతల కారణంగా భారీ హెచ్చుతగ్గులను చవిచూసినట్లు తెలియజేశారు. అయినప్పటికీ మార్కెట్లు పలు అందోళనల మధ్య కూడా నిలదొక్కుకుంటూ వస్తున్నట్లు తెలియజేశారు. ఇది నిర్మాణాత్మక బుల్ మార్కెట్‌కు నిదర్శనమని, మధ్యమధ్యలో దిద్దుబాట్లు దీనిలో భాగమని వివరించారు. క్లాసికల్ బుల్ క్లాసికల్ బుల్ మార్కెట్లో మధ్య, చిన్నతరహా షేర్లు ర్యాలీ చేయడం సహజమని ట్రేడింగో వ్యవస్థాపకుడు పార్థ్ న్యాటి పేర్కొన్నారు. ఈ ఏడాది సైతం మిడ్, స్మాల్ క్యాప్స్ జోరు చూపవచ్చని అంచనా వేశారు. స్వల్పకాలపు సవాళ్ల మధ్య దేశీ ఆర్థిక వ్యవస్థ కొన్నేళ్లపాటు వృద్ధి బాటలో సాగే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. చరిత్ర ప్రకారం ఈక్విటీ మార్కెట్లకు ఏప్రిల్ ఉత్తమ నెలగా పేర్కొన్నారు. మిడ్, స్మాల్ క్యాప్స్‌నకు ప్రధానంగా కలసి వస్తుందని తెలియజేశారు. గత 15 ఏళ్లలో 14సార్లు ఇది జరిగిందని, సగటున 7 శాతం లాభాలు అందించాయని వెల్లడించారు. రికార్డుల బాటలో 2021 ఏప్రిల్ 19న 52 వారాల కనిష్టానికి చేరిన బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఈ జనవరికల్లా 31,304 పాయింట్లను అధిగమించి చరిత్ర సృష్టించింది. ఇదే విధంగా మిడ్ క్యాప్ ఇండెక్స్ గతేడాది అక్టోబర్ 19న 27,246ను దాటి కొత్త గరిష్టాన్ని అందుకుంది. 2021 ఏప్రిల్ 19న 19,423 వద్ద 52 వారాల కనిష్టాన్ని చవిచూసింది. ఇక మరోవైపు సెన్సెక్స్ 2021 అక్టోబర్ 19న 62,245 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని సాధించింది. అయితే గత ఆరు నెలల్లో మార్కెట్లలో కరెక్షన్ చోటు చేసుకున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ ప్రస్తావించారు. ఇది మధ్య, చిన్నతరహా షేర్లలో పెట్టుబడులకు అవకాశమన్నారు. లార్జ్, మిడ్ క్యాప్స్‌తో పోలిస్తే స్మాల్ క్యాప్స్ అందుబాటులో ట్రేడవుతున్నట్లు పేర్కొన్నారు. అయితే స్వల్పకాలంలో ఆటు పోట్లు తప్పవని, ద్యవ్యోల్బణం, ఆర్థిక మందగమనం, ఆర్జనల డౌన్‌గ్రేడ్స్ వంటి ప్రతికూలతలు ఎదురవుతాయని తెలియజేశారు. కాగా.. కరోనా మహమ్మారి తదుపరి ఆర్థిక వ్యవస్థ పుంజుకోనుందని, దీంతో పలు మిడ్, స్మాల్ క్యాప్స్ ఊపందుకోనున్నాయని ఎల్కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ ఎస్.రంగనాథన్ అంచనా వేశారు. చదవండి: స్టాక్స్ మార్కెట్లలో తెలుగువారి హవా..భారీగా పెట్టుబడులు..! -
ఆదుకున్న ఐటీ
రోజంతా ఒడిదుడుకులు చివరికి స్వల్ప లాభాలు ఒక దశలో 25,711కు సెన్సెక్స్ 25,584 వద్ద ముగింపు తొలుత లాభాలతో మొదలైన మార్కెట్లు ఆపై అధిక భాగం నష్టాలకు లోనయ్యాయి. చివర్లో తిరిగి కోలుకుని స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ఉదయం సెషన్లో 25,711 పాయింట్ల వద్ద కొత్త చరిత్రాత్మక గరిష్ట స్థాయిని తాకిన సెన్సెక్స్ మిడ్ సెషన్లో అమ్మకాలు పెరగడంతో కనిష్టంగా 25,347కు చేరింది. ఈ స్థాయి నుంచి 236 పాయింట్లు కోలుకుంది. వెరసి 3 పాయింట్ల లాభంతో 25,584 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా ెహ చ్చుతగ్గులను చవిచూసి చివరికి 2 పాయింట్లు పెరిగి 7,656 వద్ద స్థిరపడింది. ఇవి సరికొత్త రికార్డులుకాగా, మార్కెట్లను 2% స్థాయిలో పుంజుకున్న ఐటీ, హెల్త్‌కేర్ రంగాలు ఆదుకున్నాయి. మరోవైపు రియల్టీ ఇండెక్స్ 3% పతనమైంది. ఎఫ్ఐఐల పెట్టుబడులు సోమవారం రూ. 537 కోట్లను ఇన్వెస్ట్‌చేసిన ఎఫ్ఐఐలు తాజాగా మరో రూ. 682 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, దేశీయ ఫండ్స్ రూ. 1,215 కోట్ల అమ్మకాలను చేపట్టాయి. సెన్సెక్స్‌లో ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ 3-2% మధ్య పుంజుకోగా, హెల్త్‌కేర్ షేర్లు సిప్లా, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా 3-1% చొప్పున లాభపడ్డాయి. అయితే మరోవైపు భెల్, ఓఎన్జీసీ, టాటా స్టీల్, హీరోమోటో, సెసాస్టెరిలైట్ 2.5% స్థాయిలో డీలాపడగా, యాక్సిస్, ఎస్బీఐ, ఎన్టీపీసీ 1.5% చొప్పున నష్టపోయాయి. ఇక రియల్టీ షేర్లు శోభా, ఇండియాబుల్స్, ఒబెరాయ్, డీఎల్ఎఫ్, యూనిటెక్ 6-3% మధ్య నీరసించాయి. ట్రేడైన షేర్లలో 1,834 లాభపడగా, 1,272 నష్టపోయాయి. -
చిన్న షేర్లకు డిమాండ్
స్టాక్ మార్కెట్ల జోరు కొసాగుతోంది. జీడీపీపై అంచనాలతో బుధవారం హైజంప్ చేసిన మార్కెట్లు గురువారం సైతం కొత్త రికార్డులను సాధించాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 22,792ను తాకగా, నిఫ్టీ గరిష్టంగా 6,819ను చేరింది. ఇవి చరిత్రాత్మక గరిష్ట స్థాయిలు కాగా, అమ్మకాల ఒత్తిడితో ఇండెక్స్‌లు చివర్లో డీలాపడ్డాయి. వెరసి సెన్సెక్స్ కేవలం 13 పాయింట్ల లాభంతో 22,715 వద్ద నిలవగా, నిఫ్టీ యథాతథంగా 6,796 వద్దే స్థిరపడింది. కాగా, ఇటీవల జోరుమీదున్న చిన్న షేర్లు ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో మరోసారి దూసుకెళ్లాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు మార్కెట్లను మించుతూ 0.6% బలపడగా, ట్రేడైన షేర్లలో 1,551 లాభపడ్డాయి. 1,251 షేర్లు తిరోగమించాయి. మోడీ ఎఫెక్ట్‌తో అదానీ ఎంటర్ప్రైజెస్ 22% జంప్‌చేయడం విశేషం! క్యాపిటల్ గూడ్స్, రియల్టీ ఓకే బీఎస్ఈలో పవర్ ఇండెక్స్ 2.5% పుంజుకోగా, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ 1.5% లాభపడ్డాయి. అయితే హెల్త్‌కేర్ అదే స్థాయిలో డీలాపడింది. పవర్, క్యాపిటల్ గూడ్స్ షేర్లలో రిలయన్స్ ఇన్ఫ్రా, భారత్ ఎలక్ట్రానిక్స్, పుంజ్‌లాయిడ్, క్రాంప్టన్ గ్రీవ్స్, జిందాల్ సా, టాటా పవర్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, భెల్, ఎన్టీపీసీ, పీటీసీ, సద్భావ్ ఇంజినీరింగ్ 9-2.5% మధ్య దూసుకెళ్లాయి. ఇక రియల్టీ షేర్లు హెచ్‌డీఐఎల్, యూనిటెక్, ఇండియాబుల్స్ 5.5-3% మధ్య బలపడ్డాయి. హెల్త్‌కేర్‌లో అరబిందో, స్ట్రైడ్స్, గ్లెన్‌మార్క్, డాక్టర్ రెడ్డీస్, లుపిన్, సన్ ఫార్మా 3.5-2% మధ్య నీర సించాయి. మిడ్ క్యాప్స్ జోష్ సెన్సెక్స్ దిగ్గజాలలో ఎస్బీఐ 2.5%, హెచ్‌యూఎల్ 1.5% చొప్పున లాభపడగా, ఇన్ఫోసిస్, ఐటీసీ, ఐసీఐసీఐ 1%పైగా నష్టపోయాయి. ఇక మిడ్ క్యాప్స్‌లో బీఈఎంఎల్, మహీంద్రా సీఐఈ, జిందాల్ స్టెయిన్లెస్, ఎస్ఆర్ఎఫ్, ఎస్సార్ ఆయిల్, ఎన్సీసీ, ఎడిల్వీజ్, శ్రేయీ ఇన్ఫ్రా, ఎస్సార్ పోర్ట్స్ 18-7% మధ్య ఎగశాయి. బుధవారం రూ. 1,044 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఎఫ్ఐఐలు తాజాగా రూ. 343 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.