న్యూఢిల్లీ: అధిక రాబడుల కోసం థీమ్యాటిక్ (సెక్టోరల్ తదితర) మ్యూచువల్ ఫండ్స్ పథకాలకు ఇన్వెస్టర్లు ఆకర్షితులవుతున్నారు. గడిచిన ఐదు నెలల కాలంలో ఈ పథకాలు నికరంగా రూ.14,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం దీన్నే సూచిస్తోంది. ఇన్వెస్టర్లలో రిస్క్ తీసుకునే ధోరణి పెరిగినట్టు కూడా అర్థమవుతోంది.
ఈ ఏడాది జూన్ నుంచి ప్రతి నెలా ఈ విభాగం నికరంగా పెట్టుబడులను ఆకర్షిస్తూనే ఉంది. అంతకుముందు చూస్తే, ఈ ఏడాది మే నెలలో థీమ్యాటిక్ ఫండ్స్ నుంచి రూ.169 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాలు పరిశీలిస్తే తెలుస్తోంది. థీమ్యాటిక్/సెక్టోరల్ ఫండ్స్‌లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పెట్టుబడులు మొత్తాన్ని ఇవి ఒకే రంగంలో, లేదా ఒకే తరహా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. వైవిధ్యానికి అవకాశం ఉండదు. రిస్క్ తీసుకునే ధోరణి పెరగడంతో ఇన్వస్టర్లు అధిక రిస్క్‌తో కూడిన థీమ్యాటిక్ లేదా సెక్టోరల్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకుంటున్నట్టు ఫైయర్స్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ గోపాల్ కావలిరెడ్డి అభిప్రాయపడ్డారు.
స్మాల్‌క్యాప్ తర్వాత వీటికే ఆదరణ
యాంఫి గణాంకాల ప్రకారం.. అక్టోబర్‌లో థీమ్యాటిక్ ఫండ్స్‌లోకి రూ.3,896 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అక్టోబర్‌లో అత్యధికంగా స్మాల్‌క్యాప్ ఫండ్స్ రూ.4,495 కోట్లను ఆకర్షించగా, ఆ తర్వాత అధిక పెట్టుబడులు థీమ్యాటిక్ పథకాల్లోకే వెళ్లాయి. ఇక ఈ ఏడాది సెప్టెంబర్‌లో రూ.3,417 కోట్లు, ఆగస్ట్‌లో రూ.4,806 కోట్లు, జూలైలో రూ.1,429 కోట్లు, జూన్‌లో రూ.459 కోట్ల చొప్పున థీమ్యాటిక్ పథకాల్లోకి పెట్టుబడులు వచ్చాయి.
బ్యాంకింగ్ ఫండ్స్‌కు మొగ్గు
ఇక థీమ్యాటిక్ ఫండ్స్‌లో బ్యాంకింగ్ ఫండ్స్ ఎక్కువ మంది ఇన్వెస్టర్ల ఎంపికగా ఉంటున్నాయి. ఇవి బ్యాంక్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి కనుక దేశ వృద్ధిలో పాలు పంచుకున్నట్టు అవుతుంది. గడిచిన పదేళ్లలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 203 శాతం పెరిగితే, బీఎస్‌ఈ బ్యాంకెక్స్ (బ్యాంక్ స్టాక్స్‌తో కూడిన సూచీ) 282 శాతం పెరిగింది. ఇతర రంగాలతో పోలిస్తే గడిచిన కొన్ని త్రైమాసికాల్లో బ్యాంకులు లాభాల్లో ఎక్కువ వృద్ధిని నమోదు చేయడం గమనార్హం.
థీమ్యాటిక్ ఫండ్‌ను ఎంపిక చేసుకునే వారికి ఎప్పుడు పెట్టుబడులు పెట్టాలి, ఎప్పుడు వైదొలగాలనే విషయం తప్పక తెలిసి ఉండాలని టాటా అస్సెట్ మేనేజ్‌మెంట్ ఇనిస్టిట్యూషనల్ క్లయింట్స్ హెడ్ ఆనంద్ వరదరాజన్ సూచించారు. 11 ఈక్విటీ ఫండ్ విభాగాల్లో థీమ్యాటిక్ కూడా ఒకటి. ఈ విభాగంలోని పథకాల నిర్వహణలో రూ.2.18 లక్షల కోట్ల ఆస్తులు అక్టోబర్ చివరికి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment