పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్
సత్వరమే నిర్ణయాలు తీసుకోగల సౌలభ్యత, సవాళ్లకు అనుగుణంగా వేగంగా మారిపోగల ప్రత్యేకత, కొత్తగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవడం ఇవన్నీ ఫ్లెక్సీక్యాప్ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఉండే అనుకూలతలు. అన్ని రకాల మార్కెట్ విభాగాల్లో (స్మాల్, మిడ్, లార్జ్‌క్యాప్) ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు ఫ్లెక్సీక్యాప్ పథకాలకు ఉంటుంది. మార్కెట్ పరిస్థితులు, వ్యాల్యూషన్ల ఆధారంగా ఫండ్ మేనేజర్లు తమ నిర్వహణలోని పథకాల పెట్టుబడుల్లో మార్పులు చేసుకోగలరు. దీనివల్ల దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు ఇవ్వగల సామర్థ్యం ఫ్లెక్సీక్యాప్ పథకాలకు ఉంటుంది. ఈ విభాగంలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్‌ను పరిశీలించొచ్చు.
పెట్టుబడుల విధానం
ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల వైవిధ్యానికి చోటు ఇచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే చెప్పుకోతగ్గ మేర పెట్టుబడులను అంతర్జాతీయ కంపెనీలకు కూడా కేటాయిస్తుంటుంది. ఫ్లెక్సీక్యాప్ విభాగాన్ని సెబీ 2020 నవంబర్ 6 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. పెట్టుబడుల పరంగా సౌలభ్యం కోరుకునే పథకాలు ఈ విభాగం కింద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో అప్పటి వరకు పరాగ్ పారిఖ్ లాంగ్‌టర్మ్ ఈక్విటీ ఫండ్‌గా కొనసాగిన ఈ పథకం, ఆ తర్వాత పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్‌గా మారిపోయింది. మల్టీక్యాప్ విభాగం నుంచి ఫ్లెక్సీక్యాప్ విభాగంలోకి చేరింది.
ఈ పథకం తన నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో కనీసం 65 శాతం మేర దేశీ స్టాక్స్‌కు కేటాయిస్తుంటుంది. విదేశీ స్టాక్స్‌కు గరిష్టంగా 35 శాతం వరకు కేటాయింపులు చేసే ఆప్షన్ కలిగి ఉంది. వ్యాల్యూ స్టాక్స్‌కు ఈ పథకం ప్రాధాన్యం ఇస్తుంది. పోటీ సంస్థలు ప్రవేశించలేని, ధరల నిర్ణయంలో బలాలు కలిగిన కంపెనీలను ఎంపిక చేసి ఇన్వెస్ట్ చేస్తుంటుంది. పెట్టుబడులపై అధిక రాబడులు, బలమైన బ్యాలన్స్ షీట్, యాజమాన్య దక్షతను చూస్తుంది. ఆకర్షణీయమైన వ్యాల్యూషన్లలో ఉన్న కంపెనీలను కొనుగోలు చేసి దీర్ఘకాలం పాటు వేచి చూడగలదు. స్వల్పకాలంలో అధిక రాబడుల కోసం తరచుగా పోర్ట్‌ఫోలియోలో మార్పులు చేయదు.
రాబడులు
ఈ పథకం అన్ని కాలాల్లోనూ మంచి రాబడులను ఇస్తూ వస్తోంది. గడిచిన ఏడాది కాలంలో 21 శాతం రాబడిని తెచ్చి పెట్టింది. కానీ, ఫ్లెక్సీక్యాప్ విభాగం సగటు రాబడి 16 శాతంగానే ఉంది. మూడేళ్ల కాలంలో 24 శాతం, ఐదేళ్లలో 18.47 శాతం, ఏడేళ్లలో 18.60 శాతం, పదేళ్లలో 20 శాతం చొప్పున వార్షిక రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. ఫ్లెక్సీక్యాప్ విభాగం సగటు రాబడితో పోలిస్తే పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీక్యాప్‌లో 3–5 శాతం మేర అధిక రాబడులు ఉన్నాయి.
ఇదీ చదవండి: పిల్లల ఉన్నత విద్య కోసం.. ఇంటర్నేషనల్ ఫండ్స్ గురించి తెలుసా?
పోర్ట్‌ఫోలియో
ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.40వేల కోట్లు ఉన్నాయి. ఇందులో 85 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి ఉంది. డెట్ సాధనాల్లో 13 శాతం పెట్టుబడులు ఉండగా, 1.62 శాతం మేర నగదు నిల్వలు ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో 39 స్టాక్స్ ఉన్నాయి. ఈక్విటీల్లోనూ 89 శాతాన్ని లార్జ్‌క్యాప్ కంపెనీలకే కేటాయించింది. మిడ్‌క్యాప్‌లో 8 శాతం, స్మాల్‌క్యాప్‌లో 2 శాతం వరకు పెట్టుబడులు పెట్టింది. అత్యధికంగా 30 శాతం పెట్టుబడులను బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు కేటాయించింది. సేవల రంగ కంపెనీల్లో 16 శాతం, టెక్నాలజీ కంపెనీల్లో 12 శాతం, కన్జ్యూమర్ స్టాపుల్స్ కంపెనీల్లో 7 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. ముఖ్యంగా విదేశీ స్టాక్స్‌కు 17.59 శాతం కేటాయింపులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment