
ఆదాయంలో వృద్ధి పరిమితమే
టెలికం, రిటైల్‌లో బలమైన పనితీరు
క్యూ4పై క్రిసిల్ రేటింగ్స్ అంచనా
ముంబై: భారత కంపెనీల ఆదాయ వృద్ధి ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో (2024–25 క్యూ4) ఫ్లాట్‌గా 5–6 శాతం స్థాయిలో ఉంటుందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. అదే సమయంలో లాభదాయకత విస్తరిస్తుందని పేర్కొంది. కంపెనీల నిర్వహణ మార్జిన్లు 8 శాతం స్థాయిలో ఉంటాయని.. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే ఇది 0.60 శాతం అధికమని తెలిపింది. ఎన్‌ఎస్‌ఈ మార్కెట్ విలువలో 50 శాతం వాటా కలిగిన 400 కంపెనీల ఖాతాలను క్రిసిల్ రేటింగ్స్ విశ్లేషించింది. వినియోగ ఆధారిత రంగాలు ఆదాయ వృద్ధిలో కిలక పాత్ర పోషిస్తాయని తెలిపింది. కన్జ్యూమర్ డిస్కీషినరీ ఉత్పత్తులు, సేవలు, స్టెపుల్ సర్వీసెస్ విభాగాల్లో ఆదాయం 8–9 శాతం మేర పెరుగుతుందని పేర్కొంది.
‘‘ముఖ్యంగా టెలికం సేవల కంపెనీల ఆదాయం 15 శాతం పెరుగుతుంది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో టారిఫ్‌లను గణనీయంగా పెంచడం, ప్రీమియం 5జీ ప్లాన్లను ప్రవేశపెట్టడం ఇందుకు మద్దతుగా నిలుస్తుంది. రిటైల్ రంగంలో ఆదాయం 17 శాతం వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా వ్యాల్యూ ఫ్యాషన్, ఫుడ్, గ్రోసరీ విభాగాల్లో డిమాండ్ బలంగా ఉంది. స్టోర్ల నెట్‌వర్క్ విస్తరణ కూడా ఇందుకు మద్దతునిస్తుంది’’అని క్రిసిల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ పూషన్ శర్మ తెలిపారు.
ఆదాయాల్లో వృద్ధి..
▸క్యూ4లో ఆటోమైబైల్ రంగం ఆదాయం 6 శాతం పెరగొచ్చు. ప్యాసింజర్ వాహన విక్రయాలు ఊపందుకోవడం, ఎగుమతుల వాటా పెరగడం అనుకూలిస్తుంది.
ఎఫ్‌ఎంసీజీ రంగం ఆదాయం 4–6 శాతం మేర పెరుగుతుంది. విక్రయాల్లో స్తబ్దత నేపథ్యంలో కంపెనీలు ధరలను పెంచడం ఇందుకు మద్ద తునిస్తుంది. పట్టణ వినియోగంలో స్తబ్దత నెలకొంటే, గ్రామీణ వినియోగం బలంగా ఉంది.
▸ఎగుమతుల ఆదాయం 4% పెరుగుతుంది. ఐటీ సేవల ఆదాయం 2–3% మేర పెరగొచ్చు. ఫార్మాస్యూటికల్స్ ఆదాయం 8% పెరుగుతుంది.
▸వ్యవసాయ రంగంలో ఎరువులు తదితర కంపె నీల ఆదాయం 17–19% స్థాయిలో వృద్ధి చెందొచ్చు. వేసవిలో సాగు స్థిరంగా ఉండడం, మెరుగైన దిగుబడులు, ఖరీఫ్‌లో వరికి మంచి ధరలు పలకడం వినియోగాన్ని పెంచుతాయి.
▸నిర్మాణ అనుబంధ రంగాల్లో ఆదాయం కేవలం 1–2 శాతమే పెరగొచ్చు. ఏడాది వ్యాప్తంగా చౌక స్టీల్ దిగుమతులతో ధరలు తక్కువగా ఉండడాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. ప్రభుత్వం దిగుమతులపై సుంకాలు పెంచిన తర్వాత ధరల్లో పెరుగుదలను గుర్తు చేసింది.
వీటి మార్జిన్లు ప్లస్
▸ఫార్మాస్యూటికల్స్, విద్యుత్, కన్జ్యూమర్ డిస్క్రిíÙనరీ, టెలికం సేవల్లో మార్జిన్లు విస్తరించొచ్చు.
▸ఆటోమొబైల్, ఐటీ సేవలు, ఎఫ్‌ఎంసీజీ, సిమెంట్, స్టీల్ కంపెనీల మార్జిన్లు తగ్గొచ్చు.
▸అల్యూమినియం ధరలు పెరగడంతో ఆటోమొబైల్ రంగ కంపెనీల మార్జిన్లు ఒక శాతం తగ్గొచ్చు.
▸ఐటీ కంపెనీల మార్జిన్లు 0.40 శాతం మేర క్షీణించొచ్చు. ఎఫ్‌ఎంసీజీ రంగ కంపెనీల మార్జిన్లు 0.50–1 శాతం మధ్య తగ్గొచ్చు. పామాయిల్, టీ, ఎండు కొబ్బరి చిప్పల ధరలు పెరగడాన్ని కారణంగా క్రిసిల్ రేటింగ్స్ నివేదిక పేర్కొంది.