చిన్న షేర్లకు డిమాండ్
స్టాక్ మార్కెట్ల జోరు కొసాగుతోంది. జీడీపీపై అంచనాలతో బుధవారం హైజంప్ చేసిన మార్కెట్లు గురువారం సైతం కొత్త రికార్డులను సాధించాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 22,792ను తాకగా, నిఫ్టీ గరిష్టంగా 6,819ను చేరింది. ఇవి చరిత్రాత్మక గరిష్ట స్థాయిలు కాగా, అమ్మకాల ఒత్తిడితో ఇండెక్స్‌లు చివర్లో డీలాపడ్డాయి. వెరసి సెన్సెక్స్ కేవలం 13 పాయింట్ల లాభంతో 22,715 వద్ద నిలవగా, నిఫ్టీ యథాతథంగా 6,796 వద్దే స్థిరపడింది. కాగా, ఇటీవల జోరుమీదున్న చిన్న షేర్లు ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో మరోసారి దూసుకెళ్లాయి. బీఎస్‌ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు మార్కెట్లను మించుతూ 0.6% బలపడగా, ట్రేడైన షేర్లలో 1,551 లాభపడ్డాయి. 1,251 షేర్లు తిరోగమించాయి. మోడీ ఎఫెక్ట్‌తో అదానీ ఎంటర్‌ప్రైజెస్ 22% జంప్‌చేయడం విశేషం!
క్యాపిటల్ గూడ్స్, రియల్టీ ఓకే
బీఎస్‌ఈలో పవర్ ఇండెక్స్ 2.5% పుంజుకోగా, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ 1.5% లాభపడ్డాయి. అయితే హెల్త్‌కేర్ అదే స్థాయిలో డీలాపడింది. పవర్, క్యాపిటల్ గూడ్స్ షేర్లలో రిలయన్స్ ఇన్‌ఫ్రా, భారత్ ఎలక్ట్రానిక్స్, పుంజ్‌లాయిడ్, క్రాంప్టన్ గ్రీవ్స్, జిందాల్ సా, టాటా పవర్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, భెల్, ఎన్‌టీపీసీ, పీటీసీ, సద్భావ్ ఇంజినీరింగ్ 9-2.5% మధ్య దూసుకెళ్లాయి. ఇక రియల్టీ షేర్లు హెచ్‌డీఐఎల్, యూనిటెక్, ఇండియాబుల్స్ 5.5-3% మధ్య బలపడ్డాయి. హెల్త్‌కేర్‌లో అరబిందో, స్ట్రైడ్స్, గ్లెన్‌మార్క్, డాక్టర్ రెడ్డీస్, లుపిన్, సన్ ఫార్మా 3.5-2% మధ్య నీర సించాయి.
మిడ్ క్యాప్స్ జోష్
సెన్సెక్స్ దిగ్గజాలలో ఎస్‌బీఐ 2.5%, హెచ్‌యూఎల్ 1.5% చొప్పున లాభపడగా, ఇన్ఫోసిస్, ఐటీసీ, ఐసీఐసీఐ 1%పైగా నష్టపోయాయి. ఇక మిడ్ క్యాప్స్‌లో బీఈఎంఎల్, మహీంద్రా సీఐఈ, జిందాల్ స్టెయిన్‌లెస్, ఎస్‌ఆర్‌ఎఫ్, ఎస్సార్ ఆయిల్, ఎన్‌సీసీ, ఎడిల్‌వీజ్, శ్రేయీ ఇన్‌ఫ్రా, ఎస్సార్ పోర్ట్స్ 18-7% మధ్య ఎగశాయి. బుధవారం రూ. 1,044 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌ఐఐలు తాజాగా రూ. 343 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.