ముంబై: కార్పొరేట్ ఫలితాలు, దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్త రకం కరోనా వేరియంట్లు, రుతుపవనాల కదలికలు కూడా కీలకంగా మారొచ్చని భావిస్తున్నారు. వీటితో పాటు ప్రపంచ మార్కెట్ల పోకడ, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు, డాలర్‌తో రూపాయి మారకం, ముడిచమురు కదలికల అంశాలు సైతం ట్రేడింగ్ ప్రభావితం చేయగలవని విశ్లేషిస్తున్నారు. గత వారంలో సెన్సెక్స్ 98 పాయింట్లు, నిఫ్టీ 32 పాయింట్లు నష్టపోయాయి. ఐటీ, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లలో లాభాల స్వీకరణ జరగడం ఇందుకు కారణమైంది.
‘‘స్టాక్ మార్కెట్లో స్థిరీకరణ కొనసాగవచ్చు. జూన్ క్వార్టర్ ఫలితాల ప్రకటన నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. పతనమైన ప్రతిసారి కొనుగోలు తరహా విధానం నడుస్తోంది. కావున కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్లు మద్దతు లభిస్తోంది. సాంకేతికంగా నిఫ్టీ 15,600 వద్ద తక్షణ మద్దతు స్థాయిని కలిగి ఉంది. ఎగువస్థాయిలో 15,800 వద్ద కీలకమైన నిరోధాన్ని కలిగి ఉంది’’ రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ బినోద్ మోదీ తెలిపారు. మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలను మరింత లోతుగా విశ్లేషిస్తే..
ఆర్థిక గణాంకాల విడుదలతో అప్రమత్తత
కేంద్రం గణాంకాల శాఖ జులై 12న సోమవారం మే నెలకు సంబంధించిన పారిశ్రామికోత్పత్తి గణాంకాలను మార్కెట్ ముగిసిన తర్వాత వెల్లడించనుంది. ఇవాళే జూన్ నెలకు సంబంధించిన రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలను ప్రకటించనుంది. ఇక టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు జులై 14న (బుధవారం)వస్తాయి. జూన్ నెల వాణిజ్య లోటు గణాంకాలు గురువారం విడుదల అవుతాయి. ఆర్‌బీఐ జూన్ 2తో ముగిసిన వారపు డిపాజిట్లు, బ్యాంక్ రుణ వృద్ధి గణాంకాలను శుక్రవారం విడుదల చేయనుంది. అదే రోజున జూన్ 9వ తేదితో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటాను విడుదల చేయనుంది. కీలక స్థూల గణాంకాల విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది. దీంతో స్టాక్ మార్కెట్ ఒకింత ఒడిదుడుకులకు లోనుకావచ్చని అంచనా.
ఈ వారం త్రైమాసిక ఫలితాలు...
ఐటీ దిగ్గజం టీసీఎస్ గత వారంలో క్యూ1 ఆర్థిక గణాంకాలను ప్రకటించి కార్పొరేట్ రంగంలో ఫలితాల సందడిని షురూ చేసింది. ఈ వారంలో ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ ట్రీ, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, ఎల్‌అండ్‌టీతో సహా 75కు పైగా కంపెనీలు తమ తొలి త్రైమాసికపు ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. రెండో దశ కోవిడ్ కట్టడికి స్థానిక ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలతో కంపెనీల పనితీరు అంతంత మాత్రంగానే ఉండొచ్చు. అయితే ఫలితాల ప్రకటన సందర్భంగా యాజమాన్యం చేసే అవుట్‌లుక్ వ్యాఖ్యలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. దొడ్ల డైయిరీ, హెచ్‌ఎఫ్‌సీఎల్, హెచ్‌ఎంటీ, డెక్కన్ హెల్త్ కేర్, టాటా మోటాలిక్స్, 5పైసా క్యాపిటల్, క్రాఫ్ట్‌మెన్ ఆటోమెషన్, ఎస్సార్ సెక్యూరిటీస్, హట్సన్ ఆగ్రో ప్రాడెక్ట్స్, ఏంజిల్ బ్రోకింగ్, ఆదిత్య బిర్లా మనీ, సియెంట్, మంగళం టింబర్ ప్రాడెక్ట్స్, టాటా ఎలక్సీ, టాటా స్టీల్, డెన్ నెట్‌వర్క్స్ తదితర కంపెనీలు ఇదే వారంలో క్యూ1 ఫలితాలను వెల్లడించనున్నాయి.
డెల్టా వేరియంట్ ఆందోళనలు...
పలు దేశాల్లో కొత్త రకం కరోనా డెల్టా వేరియంట్ వైరస్ విజృంభిస్తోంది. ఈ తాజా పరిణామం జాతీయ, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లను భయపెడుతోంది. వైరస్ శరవేగంగా విస్తరిస్తుండటంతో ప్రపంచ ఆర్థిక వృద్ధి ఏ విధంగా ఉంటుందనే అంశంపై ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తున్నారు. మన దేశంలో గత మూడు రోజుల నుంచి కరోనా కేసులు అనూహ్యంగా పుంజుకుంటుండటంతో మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఎఫ్‌ఐఐలు అమ్మేస్తున్నారు
బెంచ్‌మార్క్ సూచీలు సరికొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేసిన తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) లాభా ల స్వీకరణకు మొగ్గుచూపారు. ఈ జూలై తొలి ఏడురోజుల్లో ఎఫ్‌ఐఐలు రూ.2,249 కోట్ల విలువైన షేర్లను అమ్మినట్లు ఎక్సే్చంజ్ గణాంకాలు తెలిపాయి. ‘‘ఇతర కరెన్సీ విలువల్లో యూఎస్ డాలర్ బలపడుతోంది. ఒపెక్ దేశాలు ఉత్పత్తికి ఆసక్తి చూపకపోవడంతో క్రూడాయిల్ ధరలు నిరంతరంగా పెరుగుతున్నాయి. తర్వలో వడ్డీరేట్లను పెంచుతామని యూఎస్ ఫెడ్ కమిటీ తెలిపింది. ఈ పరిణామాల దృష్ట్యా రానున్న రోజుల్లో భారత మార్కెట్లోకి విదేశీ పెట్టుబడులు రాక పరిమితంగా ఉండొచ్చు’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment