6,600 దాటేసింది!
విదేశీ సానుకూల సంకేతాలు, దేశీయంగా పుంజుకున్న సెంటిమెంట్ మార్కెట్లకు ఉత్సాహాన్నిస్తున్నాయి. దీనికి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) పెట్టుబడులు జత కలుస్తున్నాయి. వెరసి స్టాక్ ఇండెక్స్‌లు మరోసారి రికార్డులు నెలకొల్పాయి. ప్రధానంగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 6,600 పాయింట్ల కీలక స్థాయిని అధిగమించడ ం బుధవారం ట్రేడింగ్‌లో విశేషం. 12 పాయింట్లు లాభపడి 6,601 వద్ద నిలిచింది. ఇక మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ కూడా 40 పాయింట్లు బలపడి 22,095 వద్ద ముగిసింది.
ఇవి కొత్త రికార్డులు! గత రెండు రోజుల్లో రూ. 2,700 కోట్లను ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌ఐఐలు తాజాగా దాదాపు రూ. 1,005 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొనుగోలు చేయడం ఇందుకు దోహదపడింది. దేశీయ ఫండ్స్ మాత్రం రూ. 356 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 22,172ను తాకగా, నిఫ్టీ 6,627ను చేరింది. ఇవి మార్కెట్ చరిత్రలోనే గరిష్ట స్థాయిలు! ఎఫ్‌అండ్‌వో ముగింపు నేపథ్యంలో జరిగిన షార్ట్ కవరింగ్ కూడా మార్కెట్ల దూకుడుకి సహకరిస్తున్నట్లు నిపుణులు తెలిపారు.
మెటల్స్ జోరు
గోవాలో మైనింగ్‌పై నిషేధం తొలగనుందన్న వార్తలతో బీఎస్‌ఈలో మెటల్ ఇండెక్స్ 3% ఎగసింది. సెయిల్, సెసాస్టెరిలైట్, హిందాల్కో, జిందాల్ స్టీల్, కోల్ ఇండియా, టాటా స్టీల్ 6-2% మధ్య పురోగమించాయి. ఈ బాటలో క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ రంగాలు 1.5% స్థాయిలో పుంజుకోగా, హెల్త్‌కేర్ మాత్రం 2% నష్టపోయింది. గ్లెన్‌మార్క్, డాక్టర్ రెడ్డీస్, లుపిన్, బయోకాన్, సన్ ఫార్మా, ఇప్కా ల్యాబ్, దివీస్ 4-2% మధ్య నీరసించాయి. ఇక మిగిలిన దిగ్గజాలలో టాటా మోటార్స్, ఎల్‌అండ్‌టీ, యాక్సిస్ బ్యాంక్, మారుతీ, ఓఎన్‌జీసీ, ఎస్‌బీఐ, గెయిల్, ఆర్‌ఐఎల్, బజాజ్ ఆటో, భారతీ 2.7-1.2% మధ్య బలపడగా, టీసీఎస్, ఎంఅండ్‌ఎం, ఐటీసీ 2-1% మధ్య డీలాపడ్డాయి. మార్కెట్లు లాభపడినప్పటికీ ట్రేడైన షేర్లలో 1,610 నష్టపోగా, 1,272 లాభపడ్డాయి.