ఫలితాల్లో తుస్: నష్టాల్లో షేర్లు
Published Wed, Feb 15 2017 1:50 PM | Last Updated on Tue, Sep 5 2017 3:48 AM
ముంబై : ఆటో, ఫార్మా, రియల్ ఎస్టేట్ స్టాక్స్ బుధవారం స్టాక్ మార్కెట్లకు భారీగా దెబ్బకొడుతున్నాయి. సెన్సెక్స్ 150 పాయింట్లకు పైగా పడిపోతుండగా.. నిఫ్టీ తన కీలక మార్కు 8750 కిందకి దిగజారింది. నిరాశజనకమైన ఫలితాలను ప్రకటించడంతో టాటా మోటార్స్, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ భారీగా నష్టపోతున్నాయి. టాటా మోటార్స్ 8.51 శాతం ఢమాల్ మని 441.00 వద్ద షేరు ధర నమోదవుతోంది. 2016 డిసెంబర్ 7 తర్వాత ఇదే కనిష్ట స్థాయి. ఒకానొక దశలో టాటా మోటార్స్ షేర్లు 13 శాతం మేర నష్టపోయాయి.
అంచనావేసిన దానికంటే చాలా చెత్తగా టాటా మోటార్స్ తన ఫలితాలను ప్రకటించడంతో నేటి మార్కెట్లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. డిసెంబర్ క్వార్టర్లో ఈ కంపెనీ 96 శాతం లాభాలను కోల్పోయింది. మొదటిసారి త్రైమాసిక లాభాలు పడిపోయినట్టు ప్రకటించిన సన్ ఫార్మా కూడా 3.56 శాతం నష్టపోతోంది. ధరల విషయం, సరఫరా అంశాలు కంపెనీ విక్రయాలను ఫార్మాకు అతిపెద్ద మార్కెటైన యూఎస్లో దెబ్బతీశాయని సన్ ఫార్మా తెలిపింది.
మధ్యాహ్నం 12.35 వద్ద, సెన్సెక్స్ 210 పాయింట్లు పడిపోయి 28,129 వద్ద ట్రేడైంది. నిఫ్టీ సైతం 68 పాయింట్ల డౌన్తో 8,724గా నమోదైంది. నిఫ్టీ ఆటో 2 శాతం పైగా, నిఫ్టీ ఫార్మా 1.3 శాతం పడిపోయాయి. కేంద్రప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు కంపెనీ క్వార్టర్లీ ఫలితాలను దెబ్బతీసినట్టు తెలిసింది. డీఎల్ఎఫ్ లిమిటెడ్, స్పైస్ జెట్ డిసెంబర్ క్వార్టర్లో పడిపోయాయి. ప్రస్తుతం డీఎల్ఎఫ్ షేర్లు 6శాతం, స్పైస్ జెట్ షేర్లు 6.8 శాతం క్షీణించాయి.
Advertisement