
ఈవారం మార్కెట్లు ఇలా..
భారీ ఆటుపోట్లు చవిచూసిన మార్కెట్లు గతవారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లను ఓ రకమైన నిస్తేజం ఆవరించింది. పెరగడానికి ప్రయత్నిస్తున్న ప్రతిసారీ అమ్మకాల ఒత్తిడి ఎదురవుతూనే ఉంది. ముఖ్యంగా మార్కెట్లలో కొనుగోళ్లు పెరుగుతున్న తరుణంలో వెంటనే విదేశీ మదుపర్లు రంగంలోకి దిగి విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. ఈ ధోరణి మదుపరులకు చుక్కలు చూపిస్తోంది. మరోపక్క యథావిధిగానే కార్పొరేట్ ఫలితాలు ఉసూరుమనిపించాయి. అమెరికా వాణిజ్య విధానాల్లో స్పష్టత లేకపోవడం, ముఖ్యంగా టారిఫ్‌ల విషయంలో ట్రంప్ ధోరణి అంతుచిక్కకపోవడం మార్కెట్లకు ఇబ్బందికరంగా పరిణమిస్తోంది. అదే సమయంలో అమెరికాలో ద్రవ్యోల్బణం పెరగడంతో రాబోయే రోజుల్లో వడ్డీ రేట్ల కొత్త విషయంలో సందేహం నెలకొంది.
పారిశ్రామికోత్పత్తి గణాంకాలు నిరుత్సాహకారంగా ఉండటమూ ప్రతికూలంగా మారింది. గత వారాంతాన వడ్డీరేట్లు తగ్గిస్తూ ఆర్‌బీఐ తీసుకున్ననిర్ణయం సంతృప్తికరంగానే ఉన్నా మార్కెట్‌కు అది పెద్దగా ఉపయోగపడలేదనే చెప్పాలి. రూపాయి బలహీనతలు పుండు మీద కారంలా మారాయి. చమురు ధరలు కాస్త ఫర్వాలేదనిపిస్తున్నాయి. గతవారం మొత్తానికి సెన్సెక్స్, నిఫ్టీలు చెరో 2.5 శాతం క్షీణించాయి. సెన్సెక్స్ 1921 పాయింట్లు నష్టపోయి పెరిగి 75,939 వద్ద, నిఫ్టీ 631 పాయింట్లు కోల్పోయి 22929 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 7.4 శాతం, స్మాల్ క్యాప్ 9.4 శాతం పడిపోయాయి. బ్యాంకు నిఫ్టీ సైతం ఇందుకు మినహాయింపు కాదు.
ఈవారం మార్కెట్లు..
ఇప్పటికే మార్కెట్లు భారీ స్థాయిలో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈతరుణంలో ఈవారం కొంత ఉపశమన ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. అయితే అధిక స్థాయిల వద్ద లాభాల స్వీకరణ రూపంలో విక్రయాలను తోసిపుచ్చలేం. కార్పొరేట్ సంస్థల ఆర్థిక ఫలితాలు ముగిశాయి. దీంతో ట్రెండ్‌నుబట్టే మార్కెట్లో కదలికలు ఉండొచ్చు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ తాలూకు మినిట్స్, అలాగే మన ఆర్‌బీఐ వెలువరించిన క్రెడిట్ పాలసీ మినిట్స్‌పై మార్కెట్లు దృష్టి సారిస్తాయి. మరోపక్క రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చలు కూడా మార్కెట్లను ప్రభావితం చేస్తాయి. అమెరికా ఆధ్వర్యంలో జరిగే ఈ చర్చలు సానుకూలంగా ముగిస్తే మార్కెట్లకు కొండంత బలాన్ని ఇస్తాయి.
అమెరికా జాబ్ డేటా, బ్రిటన్, జపాన్, జర్మనీ తదితర దేశాల పీఎమ్ఐ గణాంకాలపైనా ఓ కన్నేసి ఉంచొచ్చు. ఇంతకు మించి పెద్దగా ప్రభావిత అంశాలేవీ ఈవారం లేవు. రంగాలవారీగా ఆయా సెక్టార్లకు సంబంధించి వెలువడే ప్రకటనలు సంబంధిత రంగాల షేర్లను ప్రభావితం చేస్తాయి. అదే సమయంలో మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో ఒడుదొడుకులు కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈమధ్య కాలంలో మార్కెట్లకు పెనుశాపంగా మారిన విదేశీ మదుపర్ల నిరంతర అమ్మకాలు ఈవారమూ కొనసాగవచ్చు.
రూపాయి కదలికలు
అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి నానాటికీ బలహీనపడుతూనే ఉంది. గతవారం స్థాయికి చేరుకున్న రూపాయి మార్కెట్లకు చుక్కలు చూపిస్తోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.88 చేరడం రిజర్వు బ్యాంకు చేపట్టిన కొన్ని చర్యల కారణంగా గత వారం చివర్లో తేరుకోగలిగింది. దాదాపు 1.15 రూపాయలు పెరిగి 86.58 వద్ద స్థిరపడింది. ఈవారం కూడా రిజర్వ్ బ్యాంకు రంగంలోకి దిగుతుందా... డాలర్లను భారీ స్థాయిలో విక్రయిస్తుండగా... రూపాయిని మరింత పడిపోనివ్వకుండా ఆదుకుంటుందా అనే విషయాలను నిశితంగా పరిశీలించాలి.
విదేశీ మదుపర్లు
మార్కెట్ వర్గాలకు సంబంధించి కీలక ప్రకటనలేవీ లేకపోయినప్పటికీ సమాజంలోని అన్ని వర్గాలను సంతృప్తి పరిచే స్థాయిలోనే బడ్జెట్ ఉంది. కానీ దీన్ని విదేశీ మదుపర్లు పెద్దగా పట్టించుకోవడం లేదు. అలాగే వడ్డీ రేట్లు తగ్గిస్తూ ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాన్నీ వీరు పట్టించుకోలేదు. నిరంతర అమ్మకాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అంతర్జాతీయ వాణిజ్యం విషయంలో ఓ స్పష్టత రావడం, కార్పొరేట్ సంస్థల ఫలితాలు మెరుగుపడటం జరిగే వరకూ వీరి అమ్మకాల ధోరణిలో మార్పు రాకపోవచ్చని నిపుణులు చెబుతున్నప్పటికీ కొంత ఉపశమనాన్ని కలిగించే విధంగా వీరు వ్యవహరించవచ్చనే చెప్పొచ్చు. గత జనవరి నెల మొత్తానికి వీరు రూ.87,000 కోట్ల విక్రయాలు జరిపిన విషయం తెల్సిందే. ఫిబ్రవరి నెలలో ఇప్పటివరకు రూ.29,000 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దేశీయ మదుపర్లు మాత్రం యధావిధిగా మార్కెట్ కు మద్దతుగా నిలిచారు. వీరు ఈ నెలలో ఇప్పటివరకు రూ.26,000 కోట్ల నికర కొనుగోళ్లతో మార్కెట్ ను ఆదుకునే ప్రయత్నాలు చేశారు.
ఇదీ చదవండి: అంకెలు మారాయి కానీ.. ప్రశ్న మారలేదు..
సాంకేతిక స్థాయులు
అడపాదడపా కొనుగోళ్లు జరుగుతున్నప్పటికీ నిఫ్టీ ఇప్పటికీ బేర్ ఆపరేటర్ల గుప్పిట్లోనే ఉందని చెప్పొచ్చు. సూచీలు భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ఈవారం కొంత కొనుగోళ్ల మద్దతు లభించే అవకాశాలు లేకపోలేదు. నిఫ్టీకి 23250-300 స్థాయి చాలా కీలకం. దీన్ని దాటి ముందుకెళ్తే మాత్రం తొలుత 23,500, ఆ తర్వాత 23,750 స్థాయి ని చేరే అవకాశం ఉంటుంది. అలాకాక అమ్మకాల ఒత్తిడి కొనసాగితే మాత్రం 22,900 అనేది ప్రధాన స్థాయిగా భావించొచ్చు. దీన్ని బ్రేక్ చేసి కిందకెళ్ళిపోతే మాత్రం 22,750 వద్ద తొలి మద్దతు లభించొచ్చు. దీన్ని కూడా ఛేదించి పడిపోతే 22,500, ఆతర్వాత 22,300 స్థాయిలను పరీక్షించే అవకాశం ఉంటుంది. రంగాలవారీగా చూస్తే ఫార్మా షేర్లకు మద్దతు లభించవచ్చు. లోహ, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లు ఓ పరిమితికి లోబడి కదలాడొచ్చు. బ్యాంకింగ్ షేర్లు అమ్మక ఒత్తిడి ఎదుర్కోవచ్చు. సిమెంట్ రంగంలో కొనుగోళ్ళకు అవకాశం ఉండగా, కేపిటల్ గూడ్స్, ఆటోమొబైల్ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి ఎదురుకావొచ్చు. ఇక మార్కెట్లో హెచ్చుతగ్గులకు దిక్సూచిగా నిలిచే ఇండియా విక్స్ గత వారాంతానికి 9.72 శాతం పెరిగి 15.02 దగ్గర ఉంది. బుల్స్ అప్రమత్తంగా ఉండాలి అనేందుకు ఇది సంకేతం.
-బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment