ఈవారం మార్కెట్లు
కేంద్ర ఆర్థికమంత్రి గత శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఓ రకంగా మార్కెట్‌కు రుచించలేదు. మధ్య తరగతి, వేతన జీవులకు ప్రాధాన్యమిస్తూ సాగిన బడ్జెట్లో మార్కెట్ డిమాండ్లేవీ నెరవేరకపోవడంతో బడ్జెట్‌కు ముందు వచ్చిన ర్యాలీ కొనసాగలేదు. పన్ను స్లాబులు, రేట్లలో చేసిన మార్పుల వల్ల సామాన్యుల ఆదాయం పెరుగుతుందని, తద్వారా కొనుగోలు శక్తి ఇనుమడిస్తుందన్న ఉద్దేశంతో ఆటో మొబైల్, ఎఫ్ఎంసీజీ షేర్లలో మాత్రం హడావుడి కనిపించింది. గతవారం మొత్తం మీద సెన్సెక్స్, నిఫ్టీ లు దాదాపు 1.5 శాతం దాకా పెరిగాయి. ప్రముఖ కంపెనీలు ప్రకటించిన ఆర్ధిక ఫలితాలు యధావిధిగానే నిరాశపరిచాయి. కేవలం బడ్జెట్ మీద దృష్టితోనే గత వారమంతా మార్కెట్ నడిచింది. అందువల్లే ప్రీ-బడ్జెట్ ర్యాలీ వచ్చింది. వారం మొత్తానికి సెన్సెక్స్ 1316 పాయింట్లు పెరిగి 77506 వద్ద, నిఫ్టీ 390 పాయింట్లు లాభపడి 23482 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ మిడ్క్యాప్, స్మాల్ క్యాప్, బ్యాంకు నిఫ్టీలు కూడా లాభాల్లోనే సాగాయి.
ఈవారం
బడ్జెట్ ప్రభావం సోమవారం మార్కెట్లపై స్పష్టంగా కనిపించవచ్చు. మార్కెట్ వర్గాలను మెప్పించే చర్యలు బడ్జెట్లో లేకపోయినప్పటికీ సామాన్యులకు కలిగే ప్రయోజనం వల్ల పెట్టుబడులు పెరగవచ్చని అంచనా. దీని ఫలితాలు రాబోయే రోజుల్లో తెలుస్తాయి. అదే సమయంలో వారం చివర్లో... అంటే శుక్రవారం రిజర్వు బ్యాంకు ప్రకటించబోయే పాలసీలో వడ్డీ రేట్లు పావు శాతం తగ్గించవచ్చనే అంచనాలున్నాయి. ఇది కొంత సానుకూల అంశం.
ట్రంప్ చర్యలు
కెనడా, మెక్సికో, చైనాలపై టారిఫ్ లతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విరుచుకుపడటం ప్రపంచ మార్కెట్లను మళ్లీ వణికిస్తోంది. మన స్టాక్ మార్కెట్లు సైతం ఇందుకు మినహాయింపు కాకపోవచ్చు. ఈవారం మార్కెట్లు భారీ ఆటుపోట్లకు లోనయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి కొన్ని బడా కంపెనీలు ఈవారం ఆర్ధిక ఫలితాలు ప్రకటించబోతున్నాయి. వీటి ప్రభావం ఎటూ ఉండనే ఉంటుంది. ఇక రూపాయి కదలికలు, చమురు ధరల్లో మార్పులపైనా దృష్టి పెట్టాలి. ఏది ఏమైనప్పటికీ ఆర్ధిక ఫలితాలు ప్రోత్సాహకరంగా లేకపోతే మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతినడం సహజం. అదేసమయంలో విదేశీ మదుపర్ల నిరంతర అమ్మకాలు మార్కెట్లను పడదోస్తూనే ఉంటాయి.
ఆర్థిక ఫలితాల కంపెనీలు
ఈవారం మార్కెట్లపై అధిక స్థాయిలో ప్రభావితం చూపగల వాటిలో పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, టైటాన్, భారతి ఎయిర్టెల్, బ్రిటానియా, హీరో మోటో, ఐటీసీ, ఎస్బీఐ, మహీంద్రా & మహీంద్రా ఫలితాలు ఉంటాయి. తర్వాతి స్థానంలో ఎల్ఐసీ, టాటా పవర్పె, ఆరోబిందో ఫార్మా, దివీస్, జైడస్ లైఫ్, టాటా కెమికల్, గోద్రెజ్ ప్రాపర్టీస్, థర్మాక్స్, టొరెంట్ పవర్, కమిన్స్, గుజరాత్ గ్యాస్, అపోలో టైర్స్, ఎన్ఎండీసీల ఫలితాలపైనా ఓ కన్నేసి
ఉంచాల్సిందే.
ఎఫ్ఐఐలు
మార్కెట్లో భారీ స్థాయిలో పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్న విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) గత జనవరి నెల మొత్తానికి రూ.87,000 కోట్ల విక్రయాలు జరిపారు. పెట్టుబడులను తరలిస్తున్నారు. గత అక్టోబర్‌లో రూ.1.14 లక్షల కోట్ల షేర్లు విక్రయించిన వీరు మళ్లీ అధిక స్థాయిలో అమ్మకాలకు పాల్పడింది జనవరి నెలలోనే కావడం గమనార్హం. దీని ప్రభావం రూపాయిపై పడుతోంది. అదే సమయంలో దేశీయ మదుపర్లు మార్కెట్‌కు మద్దతుగా నిలిచారు. వీరు నెల మొత్తానికి దాదాపు రూ.76,600 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. తద్వారా మార్కెట్లు భారీ స్థాయిలో పడిపోకుండా వీరు అడ్డుకోగలుగుతున్నారు. గత వారం మొత్తం మీద విదేశీ మదుపర్లు రూ.20,000 కోట్ల నికర అమ్మకాలు జరపగా అదే వారంలో దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.19,000 కోట్ల నికర కొనుగోళ్లు జరిపి మార్కెట్లను నిలబెట్టారు.
సాంకేతిక స్థాయిలు
మార్కెట్లలో ప్రస్తుతానికి సానుకూల సంకేతాలు అంతంతమాత్రంగానే కనిపిస్తున్నాయి. ఒకవేళ నిఫ్టీ 23500 పైన ఉన్నంతవరకు ఫర్వాలేదు. ఈ ధోరణి కొనసాగితే మాత్రం సూచీలు ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 23650 ని ప్రధాన నిరోధంగా భావించాలి. ఇది దాటితే 23800, 23920 వద్ద నిరోధాలున్నాయి. మొత్తం మీద 24000 పాయింట్లు అనేది ప్రస్తుతానికి పెద్ద అవరోధంగా భావించొచ్చు. దానికంటే ముందు 23200, 23050, 22850, స్థాయిల వద్ద నిఫ్టీ కి మద్దతు లభించొచ్చు. ఒకవేళ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి విస్తృతమైతే 22500 దాకా పడిపోయినా ఆశర్యపోనక్కర్లేదు. ఆర్ధిక ఫలితాల నేపథ్యంలో షేర్ల వారీ ప్రధాన కదలికలు చోటుచేసుకోవడం సహజమే అయినప్పటికీ ఇవి ఇండెక్స్ లను కచ్చితంగా ప్రభావితం చేస్తాయి. ప్రముఖ కంపెనీల ఆర్ధిక ఫలితాల
మెప్పించకపోయినా, ట్రంప్ నిర్ణయాలు మరింత ఇబ్బందికరంగా మారినా సూచీలు ఇంకా ఇంకా పడిపోవడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. మార్కెట్లో హెచ్చుతగ్గులకు దిక్సూచిగా నిలిచే ఇండియా విక్స్ సోమవారం నాటికి 15.1 శాతం క్షీణించి 14.1 దగ్గర ఉంది. ప్రస్తుతానికి మార్కెట్ బుల్స్ కు అనుకూలంగా ఉందనేందుకు ఇది నిదర్శనం.
-బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment