ఆర్ధిక ఫలితాల సీజన్ (Q3 Results) మొదలైంది. స్టాక్ మార్కెట్ (Stock market) మదుపర్లు, ట్రేడర్ల కళ్లన్నీ ఇప్పుడు వాటిమీదే ఫోకస్ అయి ఉన్నాయి. గత గురువారం రిలయన్స్, ఇన్ఫోసిస్ (Infosys), యాక్సిస్ బ్యాంకులు ఆర్ధిక ఫలితాలు ప్రకటించాయి. ఈ మూడు కంపెనీలు ప్రకటించిన ఫలితాలు ప్రోత్సాహకరంగానే ఉన్నాయి. అయితే... శుక్రవారం రిలయన్స్ షేరు ధర రూ.35 పెరిగితే యాక్సిస్ బ్యాంకు షేర్ ధర రూ. 47, ఇన్ఫోసిస్ రూ.113 పడిపోయాయి. ఫలితాలు బానే ఉన్నా షేర్ ధర ఎందుకు పడిపోతుందో చాలామందికి తెలియదు. కేవలం ఫలితాలను నమ్ముకుని షేర్ కొంటే చివరకు నష్టపోతారు. ఎందుకిలా జరుగుతుంది?
ఈ ప్రశ్నకు అనేకానేక సమాధానాలు. వాటిని విశ్లేషించి చూద్దాం.
సాధారణంగా కంపెనీలు ఒక ఏడాది/త్రైమాసికానికి సదరు కాలంలో ఆర్జించిన ఆదాయాలు, లాభాలు/నష్టాలను ప్రకటిస్తూ ఉంటాయి.
ఆ మూడు నెలలు, ఏడాది కాలంలో కంపెనీ పనితీరు బావుందా, క్షీణించిందా, కొత్త ప్రాజెక్టులు ఏమి వచ్చాయి, ఉద్యోగులు పెరిగారా/తగ్గారా, ఎంత డివిడెండ్ ప్రకటించాయి, భవిష్యత్ గురించి కంపెనీ ఏం చెబుతోంది? ఇత్యాది ప్రశ్నలు అన్నిటికీ ఈ ఫలితాలు సమాధానం చెబుతాయి.
ఒక కంపెనీ ప్రకటించే లాభాలు, డివిడెండ్ లే ఆ కంపెనీ ఎంత ఆరోగ్యకరంగా పనిచేస్తోందో తెలియచెబుతాయి.ఆ కంపెనీ ఏ రంగానికి చెందిందో.. ఆ రంగానికి ప్రస్తుతం, భవిష్యత్ ఎలా ఉండొచ్చు అన్న అంశాన్ని కూడా విశ్లేషకులు అంచనా వేసి ఒక నిర్ణయానికి వస్తారు.
కంపెనీ ఆదాయం స్థిరంగా పెరుగుతూ వస్తోందా... రాబోయే రోజుల్లో వేరే కంపెనీలను కొనుగోలు చేసే స్థాయిలో పుష్కలంగా నిధులను సంపాదించగలుగుతోందా అని కూడా చూస్తారు.
అలాగే ఈపీఎస్ అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈపీఎస్ అంటే ఎర్నింగ్ పర్ షేర్ అని అర్ధం. సింపుల్ గా చెప్పాలంటే ఒక్కో షేర్ పై గిట్టుబాటు అయ్యేది ఎంత అన్నది తెలుస్తుంది.
ఈ పై అంశాలన్నీ స్టాక్ మార్కెట్లో ఒక షేర్ ధరను నిర్ధారిస్తాయి. ఒక కంపెనీ మంచి ఆదాయాలు, లాభాలు ఆర్జించినంత మాత్రాన ఆ కంపెనీ షేర్ ధర పెరిగిపోదు. ఒక్కోసారి పడిపోతుంది కూడా. ఇలా ఎందుకు జరుగుతుందో చూద్దాం.
ఇన్ఫోసిస్ నే ఉదాహరణగా తీసుకుందాం. ఈ కంపెనీ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి రూ.41,764 కోట్ల ఆదాయంపై రూ. 6,806 కోట్ల లాభాన్ని ప్రకటించింది. ఆదాయం 8 శాతం, లాభం 11 శాతం పెరిగాయి. పైగా భవిష్యత్లో ఆర్జించబోయే ఆదాయాల అంచనాలను కూడా పెంచింది. ఫలితాలు ప్రోత్సాహకరంగానే ఉన్నాయి. అయినా శుక్రవారం ఈ కంపెనీ షేర్ ధర రూ.113 పడిపోయింది. దీనికి అనేక కారణాలు...
ఫలితాలు ప్రకటించడానికి ముందే మార్కెట్ కు కొంత సమాచారం ఉంటుంది. దాన్నిబట్టి ప్రస్తుత ఫలితాలు ఉన్నాయా, లేదా అని మార్కెట్ వర్గాలు చూస్తాయి. కంపెనీ మంచి ఫలితాలు ప్రకటించినా, వాళ్ళ అంచనాలు అందుకోలేకపోతే షేర్ ధరను పడగొడతారు. ఈ విషయంపై ఓ కన్నేయాలి.
ఫలితాలకు ముందే ఆ షేర్ ధర పెరిగి ఉంటుంది. "వదంతులు వ్యాపించినప్పుడు కొనాలి. అవి నిజమైనప్పుడు అమ్మేయాలి..." అన్నది మార్కెట్లో ఉన్న సామెత. సాధారణంగా మార్కెట్లో బడా వర్గాలకు ముందే కాస్త ఉప్పు అందుతుంది కాబట్టి వాళ్ళు రూమర్ల సమయంలోనే కొనేస్తారు. కొద్ది రోజుల తర్వాత ఆ షేర్ అమ్మేసి మంచి లాభాలు సంపాదిస్తారు. ఇలా ఎందుకు జరుగుతోందో చాలామంది చిన్న ఇన్వెస్టర్లకు తెలియదు. ఈలోపు సదరు కంపెనీ ఆ రూమర్లను నిజం చేస్తూ ప్రకటన చేస్తుంది. అది చూసి రిటైల్ ఇన్వెస్టర్లు కొనడం మొదలెడతారు. సరిగ్గా ఈ సమయంలోనే అంతకుముందే కొనుగోలు చేసిన పెద్ద ఇన్వెస్టర్లు మెల్లగా బయటకు వచ్చేయడం మొదలెడతారు. దీంతో షేర్ ధర పడటం మొదలవుతుంది. అలా ఎందుకు జరుగుతోందో వీళ్లకు అర్ధం కాదు. మంచి పాజిటివ్ న్యూస్ కదా.. ఇప్పుడు పడినా కానీ మళ్ళీ పెరుగుతుందిలే అని ఎదురుచూస్తూ ఉంటారు. కానీ ఆ షేర్ ఇంకా పడుతూనే ఉంటుంది. చివరకు నష్టాన్ని బుక్ చేసి బయటకు రావాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇలా జరక్కూడదంటే మార్కెట్ తో పాటు నడవడం నేర్చుకోవాలి.
ఒక్కోసారి కంపెనీ చాలా చెత్త ఫలితాలు ప్రకటిస్తుంది. అయినా షేర్ ధర భారీగా పెరుగుతుంది. నష్టాలు వచ్చాయి కదా.. షేర్ ధర పడుతుంది అని షార్ట్ సెల్ చేసిన చిన్న ఇన్వెస్టర్లు లాస్ భరించాల్సి వస్తుంది. దీనికి కారణం ఏమిటంటే.. కంపెనీ పరిస్థితి బాలేదని, నష్టాలు ప్రకటించబోతోందని ముందే పసిగట్టిన మార్కెట్... అవే మాదిరి ఫలితాలు రాగానే పెద్దగా ఆందోళన చెందదు. అంచేత షేర్ ధర పెరుగుతుంది. ఇదే సమయంలో ఈ విషయం ఊహించని చిన్న ఇన్వెస్టర్ మాత్రం నష్టపోతాడు. ఇలా ప్రతిసారీ జరక్కపోవచ్చు కానీ, ఈ ప్రమాదాన్ని పసిగట్టగలగాలి.
కొన్ని కంపెనీలు ఆర్ధిక ఫలితాల విషయంలో తిమ్మిని బమ్మి చేసి చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. సెబీ నిబంధనలకు ఇది విరుద్ధం. ఇలా మదుపర్లను మోసం చేయాలని చూసే ఆయా కంపెనీలపై సెబీ తగిన చర్యలు తీసుకుంటుంది. సత్యం రామలింగరాజు జైలు పాలవడం, ఆ కంపెనీని మహీంద్రా గ్రూప్ హస్తగతం చేసుకోవడం గుర్తుండే ఉంటుంది. వాస్తవానికి లాభాలు తగిన స్థాయిలో రాకపోయినా, అధిక లాభాలు వచ్చినట్లు చూపిస్తూ మభ్యపెట్టడం ద్వారా మదుపర్లను నిట్టనిలువునా ముంచేయడమే రామలింగరాజు చేసిన పని. అంచేత కంపెనీ పనితీరు, ఫండమెంటల్స్ పై అవగాహన లేకుండా ఇష్టమొచ్చినట్లు షేర్లు కొనేయకూడదు.
కంపెనీ పనితీరు అద్భుతంగా ఉన్నా షేర్ ధర పడటం అనేది తాత్కాలికమే కావచ్చు. పైగా అదే రంగంలోని మరో కంపెనీ అంతకుముందే ప్రకటించిన ఆర్ధిక ఫలితాలతో బేరీజు వేసుకుని చూడటం వల్ల కూడా ఒక్కోసారి షేర్ ధర పడుతుంది. కాబట్టి ఈ విషయంపైనా కూడా మదుపర్లు అవగాహన కలిగి ఉండటం అవసరం.
మార్కెట్లో ట్రేడ్/ఇన్వెస్ట్ చేసే వ్యక్తులు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానాంశం... ఆ ఫలితాలను విశ్లేషించే కొన్ని ప్రాథమిక విషయాలు తెలిసి ఉండటం. లేదంటే నిండా మునిగిపోతారు. ఫలితాల సందర్భంగా కంపెనీ ఎలాంటి ప్రకటన చేసింది? విశ్లేషకులు ఏం చెబుతున్నారు? ఆరోజు మార్కెట్లో షేర్ కదలికలు ఎలా ఉన్నాయి? వంటి విషయాలు తెలుసుకోకుండా గుడ్డిగా షేర్లు కొనేస్తే... తగిన ఫలితం అనుభవించక తప్పదు. తస్మాత్ జాగ్రత్త.
-బెహరా శ్రీనివాస రావు
స్టాక్ మార్కెట్ విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment