గతవారం స్టాక్ మార్కెట్లలో ఒడుదొడుకులు కొనసాగాయి. ప్రధాన సూచీలు దాదాపు 1 శాతం పడిపోయాయి. ఇందుకు వివిధ కారణాలు దోహదం చేశాయి. వాటిలో ప్రధానమైనది విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగడం. వెంటాడుతున్న చమురు ధరల భయం, ఈరోజు అమెరికా అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయబోయే డొనాల్డ్ ట్రంప్ విధానాలపై స్పష్టత కొరవడటం. ఈ మూడు అంశాలు ప్రధానంగా మార్కెట్లను పడగొట్టాయి. మరోపక్క రిలయన్స్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంకు ప్రకటించిన ఆర్థిక ఫలితాలూ మార్కెట్ల క్షీణతలో తమవంతు పాత్ర పోషించాయి. వాస్తవానికి ఫలితాలు ఫర్వాలేదు అనిపించినప్పటికీ మార్కెట్లను బలహీనత ఆవరించింది. ముఖ్యంగా ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంకు ఫలితాలు మదుపర్లను మెప్పించలేకపోయాయి. ఇన్ఫోసిస్ రూ.113, యాక్సిస్ బ్యాంకు రూ.45 దాకా క్షీణించాయి. దాదాపు రూ.35 దాకా పెరిగిన రిలయన్స్ మార్కెట్లని కాస్త ఆదుకోబట్టి సరిపోయింది కానీ, ఈ పతనం మరింత ఎక్కువగా ఉండేది. ఫార్మా, ప్రైవేట్ బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ, వాహన, ఐటీ రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోగా.. ప్రభుత్వ రంగ బ్యాంకులు, చమురు రంగానికి చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. వారం మొత్తానికి సెన్సెక్స్ 760 పాయింట్లు కోల్పోయి 77619 వద్ద, నిఫ్టీ 228 పాయింట్లు నష్టపోయి 23203 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ మిడ్క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు సానుకూలంగా ట్రేడ్ అయినప్పటికీ... చివరకు ప్రతికూలంగానే ముగిశాయి.
ఈవారం ఇలా..
గత వారం మాదిరిగానే ఈవారం కూడా మార్కెట్లు కన్సాలిడేషన్ దిశగానే సాగే అవకాశం ఉంది. మార్కెట్లను ప్రభావితం చేసే ప్రధాన సంఘటనలు తక్కువగా ఉండటం ఇందుకు ఒక కారణం. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించిన ఆర్ధిక ఫలితాల ప్రభావం ఎటూ ఉండనే ఉంటుంది. ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ట్రంప్ చేయబోయే ప్రకటనలపై కూడా మార్కెట్ ఓ కన్నేసి ఉంచుతుంది. ముఖ్యంగా టారిఫ్‌ల విషయంలో అమెరికా అధ్యక్షుడు చేయబోయే ప్రకటనలు రాబోయే రోజుల్లో మార్కెట్లకు దిశానిర్దేశం చేస్తాయి. గతంలో మాదిరి దేశీయ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ, అంతర్జాతీయ సంస్థలను ఏమైనా ఇరకాటంలో పెడతారా? లేదంటే విధానాలు మార్చుకుని కొంత సరళంగా వ్యవహరిస్తారా? అన్న విషయాన్ని మార్కెట్ సునిశితంగా గమనిస్తుంది. ఇక రూపాయి కదలికలు, చమురు ధరల్లో మార్పులపైనా దృష్టి పెట్టాలి. ఏది ఏమైనప్పటికీ ఆర్ధిక ఫలితాలు ప్రోత్సాహకరంగా లేకపోతే మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతినడం సహజం. అదే సమయంలో విదేశీ మదుపర్ల నిరంతర అమ్మకాలు అగ్గికి ఆజ్యం పోస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆర్థిక ఫలితాలు కీలకం
ఈవారం హిందుస్థాన్ లీవర్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, అల్ట్రాటెక్ సిమెంట్, డాక్టర్ రెడ్డీస్, హిందూస్థాన్ పెట్రోలియంలు ఫలితాలు ప్రకటించబోయే ప్రధాన కంపెనీలు. డీఎల్‌ఎఫ్, జొమాటో, ఎల్ & టీ ఫైనాన్స్, డిక్సాన్ టెక్నాలజీస్, పీఎన్‌బీ హౌసింగ్, ఇండియా మార్ట్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, జేకే సిమెంట్, టొరెంట్ ఫార్మా, జేఎస్ డబ్ల్యు స్టీల్, లారస్ లాబ్స్, గ్రాన్యూల్స్ ఇండియా, జిందాల్ సా, గోద్రెజ్ సీపీ, ఎంఫసిస్, సియెంట్, అదానీ గ్రీన్, పాలీక్యాబ్, హడ్కో, పెర్సిస్టెంట్, పెడిలైట్, హెరిటేజ్ ఫుడ్స్, కోఫర్జ్‌లు మరికొన్ని ప్రధాన కంపెనీలు.
ఎఫ్ఐఐల సరళి
అమెరికాలో బాండ్ల రాబడి ప్రోత్సాహకారంగా ఉండటం రూపాయి సెంటిమెంటును దెబ్బతీస్తోంది. ఫలితంగా రూపాయి క్షీణిస్తూ డాలర్ బలపడుతూ వస్తోంది. ఇది విదేశీ సంస్థాగత మదుపర్ల (ఎఫ్ఐఐలు) పెట్టుబడులను ప్రభావితం చేస్తోంది. గత ఏడాది మొత్తం మీద భారీ స్థాయిలో విక్రయాలకు ప్రాధాన్యం ఇచ్చిన విదేశీ మదుపర్లు ఈ ఏడాది మొదటి నెలలోనూ అదే ధోరణిలో సాగుతున్నారు. గత వారం వీరు దాదాపు రూ.25,000 కోట్ల దాకా షేర్లను విక్రయించారు. నెల మొత్తానికి వీరి నికర అమ్మకాలు రూ.46,576 కోట్లకు చేరుకున్నాయి. అదే సమయంలో దేశీయ మదుపర్లు మార్కెట్ కు మద్దతుగా నిలిచారు. వీరు దాదాపు రూ.49367 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.
సాంకేతిక స్థాయులు
మార్కెట్లు ప్రస్తుతం బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. ఆర్ధిక ఫలితాల నేపథ్యంలో స్టాక్ ప్రధాన కదలికలు చోటుచేసుకోవడం సహజమే అయినప్పటికీ ఇవి ఇండెక్స్‌లను ప్రభావితం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సెన్సెక్స్, నిఫ్టీల్లో ఒడుదొడుకులు కొంత మేర తగ్గే అవకాశం ఉన్నా ముఖ్యంగా బుల్స్ చేస్తున్న ప్రయత్నాలకు బేర్స్ అడ్డుగానే నిలుస్తున్నారు. మార్కెట్ కు కొనుగోళ్ల మద్దతు లభిస్తే మాత్రం మొదట దృష్టి పెట్టాల్సింది 23350 స్థాయి. దీన్ని అధిగమించనంతవరకు మార్కెట్ కొద్దిగా పెరిగినట్లు కనిపించినా మళ్లీ క్షీణత వైపే అడుగులేయవచ్చు. ఒకవేళ 23350 దాటితే తదుపరి నిరోధ స్థాయి 23500. దీన్ని కూడా దాటి ముందుకెళ్తే 23700, 23900 స్థాయిలను అందుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రముఖ కంపెనీల ఆర్ధిక ఫలితాల మెప్పించకపోయినా, ట్రంప్ నిర్ణయాలు ప్రతికూలంగా ఉన్నా సూచీలు పడిపోవడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రస్తుత స్థాయి నుంచి దిగజారితే మాత్రం మొదటి మద్దతు 23050 వద్ద లభిస్తుంది. దీన్ని కూడా బ్రేక్ చేసుకుని కిందకు పడిపోతే 22850 స్థాయిని టెస్ట్ చేయొచ్చు. ఆ తర్వాతి దశలు 22600, 22400 గా భావించాలి. ఫ్యూచర్స్ & ఆప్షన్స్ డేటాను పరిశీలిస్తే నిఫ్టీ 23000-24000 స్థాయిలోనే చలించవచ్చని తెలుస్తోంది. కాల్స్ డేటా ప్రకారం 24000 వద్ద అత్యధిక స్థాయిలో ఓపెన్ ఇంటరెస్ట్ ఉంది. పుట్స్ వైపు 22200 వద్ద అత్యధిక ఓపెన్ ఇంటరెస్ట్ కేంద్రీకృతమై ఉంది. మార్కెట్లో హెచ్చుతగ్గులకు దిక్సూచిగా నిలిచే ఇండియా విక్స్ గత వారం 5.58 శాతం పెరిగి 15.75 దగ్గర ఉంది.
రంగాలవారీగా...
బ్యాంకింగ్ షేర్లు తమ బలహీనతలను కొనసాగించే అవకాశం ఉంది. టెలికాం సంస్థలు ప్రోత్సాహక ఫలితాలు ప్రకటించవచ్చన్న అంచనాలతో ఈ రంగంలోని షేర్లు సానుకూలంగా కదలాడొచ్చు. వాహన రంగంలోని షేర్లు స్తబ్దుగానే చలించే అవకాశం ఉంది. క్షీణిస్తున్న రూపాయి ఫార్మా షేర్లకు మంచి బూస్ట్ అనే చెప్పాలి. మార్కెట్ ఒడుదొడుకుల్లో మదుపరులకు ఇది ఎప్పటికీ సురక్షిత రంగమే. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ ఫలితాలు నిరుత్సాహపరచడం ఐటీ రంగ షేర్లలో ఒత్తిడిని పెంచుతోంది. సిమెంట్ ధరలు పెరగవచ్చన్న వార్త నేపథ్యంలో ఈ రంగంలోని షేర్లకు మద్దతు లభించే అవకాశం ఉండగా, లోహ షేర్లు ఒత్తిళ్లు ఎదుర్కోవచ్చు. చమురు, ఎఫ్ఎంసీజీ షేర్లలో పెద్దగా దూకుడు ఉండకపోవచ్చు.
-బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment