
కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజు స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా పతనమవుతున్నాయి. బీఎస్‌ఈకి చెందిన సెన్సెక్స్ ఏకంగా 1160 పాయింట్లు పడిపోయి 76,261కు చేరింది. ఎన్‌ఎస్‌ఈ ఆధ్వర్యంలోని నిఫ్టీ 280 పాయింట్లు పడిపోయి 23,243 మార్కు వద్ద కదలాడుతుంది. దాంతో ఈరోజు మార్కెట్ సెషన్‌లో ప్రస్తుత సమయం వరకు మదుపర్ల సంపద దాదాపు రూ.4 లక్షల కోట్లు ఆవిరైంది. భారీగా మార్కెట్ సూచీల పతనానికిగల కారణాలను మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇదీ చదవండి: తగ్గిన ఎల్‌పీజీ గ్యాస్ ధరలు
2025 ఏప్రిల్ 2న అమెరికా సుంకాల విధింపు నిర్ణయాలపై స్పష్టత ఇవ్వనున్నట్లు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
టారిఫ్ విధానాలపై అనిశ్చితి నెలకొనడం వాణిజ్య యుద్ధ భయాలను రేకెత్తిస్తుంది. దాంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
అమెరికా భారత్‌ను నేరుగా టార్గెట్ చేయనప్పటికీ, ప్రపంచ మార్కెట్ సెంటిమెంట్ ప్రభావం భారత మార్కెట్లపై కనిపిస్తుంది.
ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించడంతో సూచీలు పతనమవుతున్నాయి. ఎఫ్ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్ మినహా చాలా రంగాల సూచీలు నష్టాల్లో కదలాడుతున్నాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా భారీగానే క్షీణించాయి.
ఇటీవల మార్కెట్లు పడి క్రమంగా పుంజుకున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు పూనుకుంటున్నారు.
అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలతో అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ తగ్గుతుంది. దాంతో దేశీయ దిగుమతులకు అధికంగా చెల్లింపులు చేయాల్సి వస్తుంది.