సాక్షి, న్యూఢిల్లీ : 7వ వేతన సంఘం సిఫారసుల మేరకు నరేంద్ర మోదీ సర్కార్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు తీపి కబురు అందించింది. ఈ నెలలోనే (జనవరి15) ఉపాధ్యాయులకు సంబంధించి ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలుకు అంగీకరించిన కేంద్రం, తాజాగా రన్నింగ్ అలవెన్స్ పెంపుపై రైల్వే ఉద్యోగుల దీర్ఘకాల డిమాండ్‌ను నెరవేర్చనుంది.
రన్నింగ్ అలవెన్స్‌ను 200శాతం పెంచేందుకు అంగీకరించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని క్యాష్ అండ్ క్యారీ ఉద్యోగులకు 300 శాతం అలవెన్సును పెంచేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో క్యాష్ అండ్ ట్రెజరీ ఉద్యోగులకు నెలకు రూ.800 నుండి వెయ్యి రూపాయల వరకు, రైల్వే ఉద్యోగులకు నెలకు సుమారు 12వేల నుంచి 25వేల రూపాయల దాకా అదనపు ప్రయోజనం చేకూరనుంది.
దీని ప్రకారం రైల్వే ఉద్యోగుల విషయంలో గార్డులు, లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్లు ఇప్పుడు ప్రతి 100 కిలోమీటర్‌కు 520 రూపాయల భత్యం పొందుతారు. అంతకుముందు ఇది 255 రూపాయలుగా ఉంది. ఒకవైపు రన్నింగ్ అలవెన్సును ప్రభుత్వం రెట్టింపు చేయగా, మరోవైపు 2017 జూలై నుంచి డిసెంబరు 2018 వరకు ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ .4,500 కోట్ల బకాయిలను రైల్వేశాఖ చెల్లించనుంది.
కేంద్ర బడ్జెట్ 2019 ఫిబ్రవరి 1న ప్రకటించనున్నందున, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆశలను నెరవేర్చేలా ప్రభుత్వం పెద్ద ప్రకటనలు చేయనుందనే ఊహాగానాలు కూడా భారీగా నెలకొన్నాయి. ముఖ్యంగా 7వ వేతన సంఘం నెలకు కనీస వేతనాన్ని రూ.18వేలుగా సిఫారసు చేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వోద్యోగుల కోరిక మేరకు నెలకు కనీస వేతనాన్ని రూ.26వేలుగా నిర్ణయించనుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment