central employees
-
ప్రసవంలో బిడ్డ మరణిస్తే.. 60 రోజుల ప్రత్యేక సెలవులు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగుల కోసం మరో కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రసవం సమయంలో బిడ్డ గనుక మరణిస్తే.. ఆ తల్లులకు 60 రోజుల ప్రత్యేక ప్రసూతి సెలవులు ఇవ్వనున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ప్రసవం సమయంలోగానీ లేదంటే పుట్టిన కాసేపటికే గానీ బిడ్డ చనిపోతే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే మహిళా ఉద్యోగులకు ఈ సెలవులు వర్తిస్తాయని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(DoPT) శుక్రవారం తన ఆదేశాల్లో వెల్లడించింది. బిడ్డ పుట్టిన వెంటనే చనిపోతే.. ఆ తల్లి జీవితంపై తీవ్ర ప్రభావం పడుతుందని, అందువల్ల కలిగే మానసిక క్షోభను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీవోపీటీ ఆ ప్రకటనలో తెలిపింది. ప్రసవ సమయంలో బిడ్డ చనిపోవడం, మెటర్నీటీ లీవుల విషయంలో చాలామంది ఉద్యోగులు ఎంక్వైరీలు, విజ్ఞప్తులు చేస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ అంశంపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో సంప్రదించాకే ఆదేశాలు ఇస్తున్నట్లు ప్రకటించింది డీవోపీటీ. ఒకవేళ మెటర్నీటీ లీవులు గనుక ఉంటే.. అవి వర్తిస్తాయని, అవి అందుబాటులో లేకుంటే 60 రోజుల ప్రత్యేక మెటర్నిటీ లీవులు వర్తిస్తాయని(బిడ్డ మరణించిన నాటి నుంచి) సదరు ప్రకటన తెలిపింది. అలాగే బిడ్డ పుట్టిన వెంటనే మరణించే పరిస్థితిని పుట్టిన 28 రోజుల వరకు నిర్వచించవచ్చని అన్ని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/విభాగాలకు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రత్యేక ప్రసూతి సెలవుల ప్రయోజనం.. ఇద్దరు పిల్లల కంటే తక్కువ సంతానం ఉన్న కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగికి, అథరైజ్డ్ ఆస్పత్రిలో పిల్లల ప్రసవం జరిగితేనే వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS) కింద గుర్తింపు ఉన్న ప్రైవేట్ లేదంటే ప్రభుత్వాసుపత్రిలో మాత్రమే ప్రసవం జరగాల్సి ఉంటుంది. ఒకవేళ ఎంప్యానెల్ లేని ప్రైవేట్ ఆసుపత్రిలో అత్యవసర ప్రసవాలు జరిగితే, అత్యవసర ధృవీకరణ పత్రం తప్పనిసరి అని పేర్కొంది. ఇదీ చదవండి: బాహుబలి.. ఐఎన్ఎస్ విక్రాంత్ -
పోలింగ్ విధులకు కేంద్ర ఉద్యోగులు!
సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీ ఎన్నికలకు అవసరమైతే కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులను పోలింగ్ సిబ్బందిగా వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సూచించారు. తనకున్న విశేషాధికారాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అన్ని జిల్లాల కలెక్టర్లకు సమాచారమిస్తూ నిమ్మగడ్డ సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా కలెక్టర్లు మొదటి ప్రాధాన్యతగా రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఆర్గనైజేషన్స్, రాష్ట్ర సహకార సంస్థల ఉద్యోగులనే ఎన్నికల విధులలో వినియోగించుకోవాలని నిమ్మగడ్డ ఆ ఉత్తర్వులో సూచించారు. అప్పటికీ సిబ్బంది సరిపోని పక్షంలోనే కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులను వినియోగించుకోవాలన్నారు. ఇదిలా ఉంటే.. ఎన్నికల విధులకు కేంద్ర ప్రభుత్వోద్యోగులను వినియోగించుకోవడానికి అవకాశమివ్వాలని కేంద్ర కేబినేట్ సెక్రటరీకి కూడా లేఖ రాసినట్లు నిమ్మగడ్డ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయండి పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి చర్చించేందుకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో ఈనెల 27 లేదా అంతకంటే ముందుగా వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటుచేయాలంటూ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు లేఖ రాశారు. ఎన్నికల ప్రక్రియకు ప్రభుత్వపరంగా పూర్తి తోడ్పాటు, సహాయ సహకారాలు అందించాలని కోరారు. -
రైల్వే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు
సాక్షి, న్యూఢిల్లీ : 7వ వేతన సంఘం సిఫారసుల మేరకు నరేంద్ర మోదీ సర్కార్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు తీపి కబురు అందించింది. ఈ నెలలోనే (జనవరి15) ఉపాధ్యాయులకు సంబంధించి ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలుకు అంగీకరించిన కేంద్రం, తాజాగా రన్నింగ్ అలవెన్స్ పెంపుపై రైల్వే ఉద్యోగుల దీర్ఘకాల డిమాండ్‌ను నెరవేర్చనుంది. రన్నింగ్ అలవెన్స్‌ను 200శాతం పెంచేందుకు అంగీకరించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని క్యాష్ అండ్ క్యారీ ఉద్యోగులకు 300 శాతం అలవెన్సును పెంచేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో క్యాష్ అండ్ ట్రెజరీ ఉద్యోగులకు నెలకు రూ.800 నుండి వెయ్యి రూపాయల వరకు, రైల్వే ఉద్యోగులకు నెలకు సుమారు 12వేల నుంచి 25వేల రూపాయల దాకా అదనపు ప్రయోజనం చేకూరనుంది. దీని ప్రకారం రైల్వే ఉద్యోగుల విషయంలో గార్డులు, లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్లు ఇప్పుడు ప్రతి 100 కిలోమీటర్‌కు 520 రూపాయల భత్యం పొందుతారు. అంతకుముందు ఇది 255 రూపాయలుగా ఉంది. ఒకవైపు రన్నింగ్ అలవెన్సును ప్రభుత్వం రెట్టింపు చేయగా, మరోవైపు 2017 జూలై నుంచి డిసెంబరు 2018 వరకు ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ .4,500 కోట్ల బకాయిలను రైల్వేశాఖ చెల్లించనుంది. కేంద్ర బడ్జెట్ 2019 ఫిబ్రవరి 1న ప్రకటించనున్నందున, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆశలను నెరవేర్చేలా ప్రభుత్వం పెద్ద ప్రకటనలు చేయనుందనే ఊహాగానాలు కూడా భారీగా నెలకొన్నాయి. ముఖ్యంగా 7వ వేతన సంఘం నెలకు కనీస వేతనాన్ని రూ.18వేలుగా సిఫారసు చేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వోద్యోగుల కోరిక మేరకు నెలకు కనీస వేతనాన్ని రూ.26వేలుగా నిర్ణయించనుందని సమాచారం. -
కేంద్ర ఉద్యోగుల డిప్యుటేషన్ భత్యం రెట్టింపు
న్యూఢిల్లీ: ప్రస్తుతం డిప్యుటేషన్‌పై వెళ్లే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న భత్యాన్ని రూ.2 వేల నుంచి రూ.4,500కు పెంచుతున్నట్లు కేంద్ర సిబ్బంది శిక్షణా సంస్థ(డీవోపీటీ) తెలిపింది. ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు ఈ పెంపు చేపట్టినట్లు పేర్కొంది. ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాంతంలోనే డిప్యుటేషన్‌పై వెళ్లే కేంద్ర ఉద్యోగులకు వారి మూలవేతనంలో 5% లేదా గరిష్టంగా నెలకు రూ.4,500 చెల్లిస్తామని తెలిపింది. ఒకవేళ ఉద్యోగులు మరో ప్రాంతానికి డిప్యుటేషన్‌పై వెళితే..వారి మూలవేతనంలో 10% లేదా గరిష్టంగా రూ.9 వేలు చెల్లిస్తామంది. -
సమ్మె నాలుగు నెలలు వాయిదా
న్యూఢిల్లీ: ఏడో వేతన సంఘం సిఫార్సులను నిరసిస్తూ ఈ నెల 11నుంచి తలపెట్టిన నిరవధిక సమ్మెను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. వినతుల పరిష్కారానికి కమిటీని నియమించేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో సమ్మెను 4 నెలలపాటు వాయిదా వేస్తున్నామన్నాయి. తమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అందువల్లనే ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జాతీయ ఉమ్మడి కార్యాచరణ మండలి (ఎన్‌జేసీఏ) కన్వీనర్ శివగోపాల్ మిశ్రా చెప్పారు. అంతకుముందు ఆయా సంఘాల నేత కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలసి తమ సమస్యల గురించి ఏకరువు పెట్టారు. దీంతో ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని నియమించాలని నిర్ణయించింది. ఉద్యోగుల సమస్యలపై త్వరలోనే కొత్త కమిటీని నియమిస్తామని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కాగా, బీఎంఎస్ మాత్రం తొలుత నిర్ణయించినట్లు ఈనెల 8న తమ నిరసనలు కొనసాగుతాయంది. -
లక్షకు పైగా కేంద్ర ఉద్యోగులకు లబ్ధి
23.55% వేతనాల పెంపుదల ఫలితం సాక్షి, హైదరాబాద్: వేతనాలను 23.55 శాతం పెంచాలన్న వేతన సంఘం సిఫారసుతో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని లక్షకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మరో లక్ష మందికిపైగా పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. తెలంగాణలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 55 వేల మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. 60 వేలకు పైగా పెన్షనర్లు ఉన్నారు. ఏపీలో 50 వేల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు. పెన్షనర్లు 60 వేల మందికిపైగా ఉన్నారు. వేతన సంఘం సిఫారసుల ఆమోదానంతరం వీరందరికీ పెరిగిన వేతనాలు వర్తించనున్నాయి. ప్రస్తుతం పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో పోల్చి చూస్తే పెరిగే (23.55% మేరకు) వేతనాలతో పెద్దగా ప్రయోజనం ఉండదని, ఇది తీవ్ర నిరాశ కలిగించిందని కాన్ఫడరేషన్ ఆఫ్ సెంట్రల్ ఎంప్లాయిస్ ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు చెప్పారు. గత పదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 82 శాతం ఫిట్మెంట్ పెరిగితే, కేంద్రం అందులో సగం కూడా పెంచకపోవడం బాధాకరమన్నారు. -
జెన్కో చీఫ్ ఇంజినీర్ నిర్బంధం
సీలేరు, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమాన్ని దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఏపీజెన్కో మోతుగూడెం విభాగం చీఫ్ ఇంజినీర్‌ను డొంకరాయి విద్యుదుత్పత్తి కేంద్రం ఉద్యోగులు మంగళవారం నిర్బంధించారు. చీఫ్ ఇంజనీర్ కృష్ణయ్య తమను విధులకు హాజరు కాకపోతే చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము సమ్మె చేస్తుండగా కృష్ణయ్య కొందరు ఉద్యోగులతో ముందే డొంకరాయిలో గేట్లు ఎత్తించి నీటిని విడుదల చేయించారని వీరు ఆరోపించారు. సీఈ వైఖరిని నిరసిస్తూ వారు స్థానిక తెలంగాణ ఉద్యోగులతో కలిసి ఆయన్ను ఓ గదిలో నిర్బంధించారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సంప్రదింపులు చేపట్టారు. దాంతో సుమారు రెండు గంటల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎట్టకేలకు సీఈ సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేయడంతో విడిచిపెట్టారు. అయితే ఆయన తిరిగి వెళ్లే దారిలో చెట్లు నరికి పడేశారు. అనంతరం జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరగదని ప్రకటించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ అధికారుల బెదిరింపులకు లొంగేదిలేదని తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి సమ్మె కారణంగా 25 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. 220 కేవీ లైన్‌ద్వారా విజయవాడ వెళ్లే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మాచ్‌ఖండ్‌లో కాస్త మెరుగు ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాలు ఉమ్మడిగా నిర్మించిన మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో 57 మెగావాట్ల విద్యుదుత్పత్తిని మంగళవారం ఉదయం పునఃప్రారంభించారు. దీంతో యథాప్రకారం విద్యుత్తు సరఫరా అవుతోంది. మాచ్‌ఖండ్‌లోని కొన్ని యూనిట్లు ట్రిప్ కావడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే ఒడిశా జెన్కో అధికారులు వెంటనే బాగుచేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.