
సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీ ఎన్నికలకు అవసరమైతే కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులను పోలింగ్ సిబ్బందిగా వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సూచించారు. తనకున్న విశేషాధికారాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అన్ని జిల్లాల కలెక్టర్లకు సమాచారమిస్తూ నిమ్మగడ్డ సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీచేశారు.
జిల్లాల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా కలెక్టర్లు మొదటి ప్రాధాన్యతగా రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఆర్గనైజేషన్స్, రాష్ట్ర సహకార సంస్థల ఉద్యోగులనే ఎన్నికల విధులలో వినియోగించుకోవాలని నిమ్మగడ్డ ఆ ఉత్తర్వులో సూచించారు. అప్పటికీ సిబ్బంది సరిపోని పక్షంలోనే కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులను వినియోగించుకోవాలన్నారు. ఇదిలా ఉంటే.. ఎన్నికల విధులకు కేంద్ర ప్రభుత్వోద్యోగులను వినియోగించుకోవడానికి అవకాశమివ్వాలని కేంద్ర కేబినేట్ సెక్రటరీకి కూడా లేఖ రాసినట్లు నిమ్మగడ్డ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయండి
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి చర్చించేందుకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో ఈనెల 27 లేదా అంతకంటే ముందుగా వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటుచేయాలంటూ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు లేఖ రాశారు. ఎన్నికల ప్రక్రియకు ప్రభుత్వపరంగా పూర్తి తోడ్పాటు, సహాయ సహకారాలు అందించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment