23.55% వేతనాల పెంపుదల ఫలితం
సాక్షి, హైదరాబాద్: వేతనాలను 23.55 శాతం పెంచాలన్న వేతన సంఘం సిఫారసుతో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని లక్షకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మరో లక్ష మందికిపైగా పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. తెలంగాణలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 55 వేల మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. 60 వేలకు పైగా పెన్షనర్లు ఉన్నారు. ఏపీలో 50 వేల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు. పెన్షనర్లు 60 వేల మందికిపైగా ఉన్నారు. వేతన సంఘం సిఫారసుల ఆమోదానంతరం వీరందరికీ పెరిగిన వేతనాలు వర్తించనున్నాయి.
ప్రస్తుతం పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో పోల్చి చూస్తే పెరిగే (23.55% మేరకు) వేతనాలతో పెద్దగా ప్రయోజనం ఉండదని, ఇది తీవ్ర నిరాశ కలిగించిందని కాన్ఫడరేషన్ ఆఫ్ సెంట్రల్ ఎంప్లాయిస్ ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు చెప్పారు. గత పదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 82 శాతం ఫిట్‌మెంట్ పెరిగితే, కేంద్రం అందులో సగం కూడా పెంచకపోవడం బాధాకరమన్నారు.