బంగారం ధరలు రోజు రోజుకి అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. జనవరి ప్రారంభంలో రూ.78,000 వున్న బంగారం ధర, ఇప్పుడు ఏకంగా రూ. 82,420 వద్ద ఉంది. దీన్నిబట్టి చూస్తే గోల్డ్ రేటు ఒక్క నెల రోజుల్లోనే ఎంత వేగంగా పెరిగిందో.. అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ గోల్డ్ రేటు పెరగడానికి కారణం ఏమిటి? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
భారతదేశంలో బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం.. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త టారిఫ్ ప్లాన్స్. కొత్త టారిఫ్ ప్లాన్స్ వల్ల పెట్టుబడిదారుల్లో కొంత భయం మొదలైంది. దీంతో చాలామంది బంగారం మీద ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపారు. అమెరికా డాలర్ విలువ కొంత తగ్గడం, అంతర్జాతీయంగా బంగారం ధరల పెరుగుదల.. మన దేశంలో కూడా గోల్డ్ రేట్లు పెరగడానికి కారణం అయింది.
మన దేశంలో కూడా పెట్టుబడిదారులు రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో మాత్రమే కాకుండా.. బంగారం మీద కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎక్కడైనా కొంత నష్టాలు రావొచ్చు.. కానీ బంగారం మాత్రం ఎప్పుడూ పెరుగుతూ ఉంటుందనే కారణంగానే ఇన్వెస్టర్లు ఇటువైపు తిరుగుతున్నారు. ఇది కూడా బంగారం ధర పెరగడానికి కారణం అవుతోంది.
భారతదేశంలో గోల్డ్ రేటు పెరగడానికి మరో కారణం ఏమిటంటే పండుగ సీజన్స్. పండుగల సమయంలో బంగారం కొంటే మంచిదని చాలామంది సెంటిమెంట్‌గా భావిస్తారు. దీంతో బంగారం కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంటుంది, ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కూడా బంగారం ధరలకు ఆజ్యం పోసినట్లే అయింది.
త్వరలో రూ. 90వేలు?
2023లో రూ. 58వేలు వద్ద ఉన్న బంగారం ధర.. 2024 చివరి నాటికి రూ. 77,000 దాటేసింది. ఈ ధరలు 2025లో రూ. 90వేలకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు ప్రతి ఏటా 2 నుంచి 3 శాతం పెరుగుతుందని కూడా చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే.. బంగారం 90000 రూపాయలకు చేరుకోవడానికి మరెన్నో రోజులు పట్టే అవకాశం లేదని స్పష్టంగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment