
అదిరిందయ్యా జుకర్ బర్గ్!
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ క్వార్టర్లీ ఫలితాల్లో అదరగొట్టింది. ఈ త్రైమాసిక ఆదాయాలను 50శాతం పెంచుకుని, వాల్ స్ట్రీట్ అంచనాలను అధిగమించింది. లైవ్ వీడియోలతో కొత్త అడ్వర్ టైజర్లను ఆకర్షించడం, మొబైల్ యాప్ విశేషంగా ప్రాచుర్యం పొందడం, అడ్వర్ టైజింగ్ రెవెన్యూల్లో పాత వారిని ప్రోత్సహించడం ఫేస్ బుక్ ను ఒక్కసారిగా ఆదాయాల్లో ముంచెత్తాయి. ఫేస్ బుక్ కంపెనీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. సుమారు 9.5 శాతంపైగా లాభాలతో జోరుమీదున్నాయి. నాలుగేళ్ల క్రితం మొదటి సారి పబ్లిక్ ఆఫర్ కు వచ్చిన దానికంటే ఇది మూడురెట్లు అధికమని కంపెనీ పేర్కొంది.
గతేడాది ఇదే సమయంలో1.44 బిలియన్లగా ఉన్న ఫేస్ బుక్ యూజర్లు, ఈ ఏడాది నెలకు 1.65 బిలియన్లగా ఉన్నారని ఫేస్ బుక్ పేర్కొంది. రోజులో 50 నిమిషాల కంటే ఎక్కువగానే ఫేస్ బుక్ ను బ్రౌజ్ చేస్తున్నారని మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు. అడ్వర్ టైజర్లు టెలివిజన్ నుంచి మొబైల్, వెబ్ ప్లాట్ ఫామ్ లోకి మరిలాకా, ఫేస్ బుక్ కు ఎక్కువగా మేలు చేకూరిందని పేర్కొన్నారు. అడ్వర్ టైజర్లను ఎక్కువగా ఆకర్షించుకోవడంతో, నిర్వహణ లాభాలు 52 శాతం నుంచి 55 శాతం పెరిగాయని త్రైమాసిక ఫలితాలు చూపుతున్నాయి. టెక్నాలజీ సంస్థల పుట్టినిలైన సిలికాన్ వ్యాలీలో చాలా సంస్థలు ఈ త్రైమాసికంలో నష్టాలనే నమోదుచేశాయి. ఇంటెల్ సంస్థ ను మొదలుకుని గతవారం ఐబీఎమ్, నిన్న ట్విట్టర్, యాపిల్ లు రెవెన్యూలను చాలా తక్కువగా చూపించాయి. అయితే ఫేస్ బుక్ ఆదాయాలను పెంచుకోవడంతో ఇన్వెస్టర్లలో కొత్త నమ్మకాన్ని పెంచినట్టు మార్కెట్ నిపుణులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.కంపెనీ మొత్తం ఆదాయం 3.54 బిలియన్ డాలర్ల నుంచి 5.38 బిలియన్ డాలర్లకు పెరిగింది.యాడ్ రెవెన్యూ 56.8 శాతం పెరిగి, 5.20 బిలయన్ డాలర్లుగా, మొబైల్ యాడ్ రెవెన్యూ మొత్తం అడ్వర్ టైజింగ్ రెవెన్యూలో 82 శాతం ఉందని కంపెనీ పేర్కొంది.
ఈ నేపథ్యంలోనే కంపెనీకి సీఈవోగా ఉంటున్న మార్క్ జుకర్ బర్గ్, ఓటింగ్ అర్హత లేని కొత్త తరం షేర్లను ప్రవేశపెట్టబోతున్నట్టు ఫేస్ బుక్ ప్రకటించింది.కొత్త రకానికి చెందిన నాన్ ఓటింగ్ షేర్ల లో ఇప్పటికే వాటా కల్గి ఉన్న హోల్డర్స్ కు డివిడెంట్ ఇవ్వాలని కంపెనీ భావిస్తోంది.సంపదలో 99 శాతం ట్రస్టులకు దానంగా ఇస్తానన్న మార్క్ జుకర్ బర్గ్, ఫండ్ దాతృత్వానికి ఈ నాన్ ఓటింగ్ స్టాక్ లను అమ్ముతానని తెలిపారు. ఓటింగ్ స్టాక్స్ మాత్రం అతని నియంత్రణలోనే ఉంటున్నట్టు చెప్పారు.ఒకవేళ స్టాక్ ప్రపోజల్స్ కు ఆమోదం లభిస్తే మెజార్టీ ఓటింగ్ స్టాక్స్ మార్క్ జుకర్ బర్గ్ ఆధీనంలోనే ఉంటాయి. జుకర్ బర్గ్ నియంత్రణ ఎక్కువగా కలిగి ఉండటాన్ని పట్టించుకోమని, కంపెనీ స్థిరంగా అభివృద్ధి చెందుతుందని, అంచనాలను అధిగమిస్తుందని పెట్టుబడిదారులు తెలిపారు. జుకర్ బర్గ్ కు ఎక్కువ అధికారాలు కలిగి ఉన్నట్టు ఎవరూ భావించడం లేదని, ప్రజల్లోకి వెళ్లిన దగ్గర్నుంచి అతను అంతా మంచే చేస్తున్నాడని పెట్టుబడిదారి పాచెర్ చెప్పారు.