
భారతీయ పారిశ్రామికవేత్త, అత్యంత సంపన్నుడు అయిన 'ముకేశ్ అంబానీ' ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏట కూడా 'రిలయన్స్ యాన్యువల్ జనరల్ మీటింగ్' (AGM) ఈ నెల 29న నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకుంటారనే విషయాలను తెలుసుకోవడానికి సర్వత్రా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
ఆగష్టు 29న జరగనున్న 47వ వార్షిక సర్వసభ్య సమావేశంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. అంబానీ తీసుకునే నిర్ణయాలు ఏకంగా 35 లక్షల మందిని ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే లాభాల బాటలో దూసుకెళ్తున్న రిలయన్స్ కంపెనీ ఆగష్టు 29 తరువాత మరింత వృద్ధి చెందే అవకాశం లేకపోలేదు.
రిలయన్స్ యాన్యువల్ జనరల్ మీటింగ్ 2017లో కేవలం 1500 రూపాయలకే రీఫండబుల్ డిపాజిట్‌తో జియో ఫోన్ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. 2018లో 2999 రూపాయలకు జియో ఫోన్2, 2019లో సౌదీ ఆరామ్‌కో పెట్టుబడులతో పాటు జియో ఫైబర్ లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది. 2020లో గూగుల్ కంపెనీలో పెట్టుబడి, 2021లో రూ. 75000 కోట్ల పెట్టుబడితో కొత్త ఎనర్జీ బ్లూప్రింట్, 2022లో 5జీ కోసం రూ.2 లక్షల కోట్లు కేటాయింపు.. ఇలా సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ ఏడాది జరగబోయే సమావేశంలో.. రిలయన్స్ జియో ఫైనాన్షియల్ లిస్టింగ్ గురించి మాట్లాడే అవకాశం ఉంది. అంతే కాకుండా వారసత్వ ప్రణాళికలు కూడా వెల్లడయ్యే అవకాశం ఉంది. అంటే ఉన్న వ్యాపారాలలో ఎవరికి ఏది అప్పగిస్తారో.. గురువారం జరిగే సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది.
రిలయన్స్ కంపెనీ ఆయిల్ అండ్ కెమికల్, న్యూఎనర్జీ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగానే గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మెగా గ్రీన్ ఎనర్జీ కాంప్లెక్స్ సిద్ధమవుతోంది. కాబట్టి జరగబోయే సమావేశంలో గిగా ఫ్యాక్టరీలు, ఎనర్జీ స్టోరేజీలు, ఎలక్ట్రోలైసర్లు, ప్యూయల్ సెల్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ వంటి వాటిపై అప్డేట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.