ఎవరి నోరు తీపో.. | Financial Budget today expectations from Arun Jaitley | Sakshi
Sakshi News home page

ఎవరి నోరు తీపో..

Published Mon, Feb 29 2016 1:49 AM | Last Updated on Sun, Sep 3 2017 6:37 PM

ఎవరి నోరు తీపో..

ఎవరి నోరు తీపో..

ఎవరి రుచులు వారివే...

రైతులు, కార్పొరేట్లపై ప్రత్యేక దృష్టి?
వేతన జీవులకు ఈసారి నిరాశే !
ఐటీ మినహాయింపు పరిమితులు యథాతథం

ధనికులపై ఇంకాస్త వడ్డింపు?
సేవల పన్ను పెంపు.. స్టార్టప్ సెస్సు విధింపు!

 
ఐటీ యథాతథం
 ఉద్యోగులు, మధ్యతరగతి వర్గాలు ఎంతగానో ఎదురుచూసే ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి (బేసిక్ లిమిట్ ప్రస్తుతం రూ.2.5 లక్షలు)లో ఎలాంటి మార్పులూ చేయకపోవచ్చని అంచనా. పన్ను శ్లాబ్‌లను యథాతథంగానే కొనసాగిస్తూ.. కొన్ని మినహాయింపుల్లో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. కార్మికులు అధికంగా ఉండే తోలు, ఆభరణాల రంగాలకు పన్ను రాయితీలు కల్పించొచ్చు.
 
 పరిశ్రమలకు ప్రాధాన్యం..
 కార్పొరేట్ పెట్టుబడులను పెంచేందుకు ప్రాధాన్యం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీతో పోలిస్తే ఈ పెట్టుబడులు 1.7 శాతంగా ఉండగా.. దీన్ని వచ్చే ఏడాది 2 శాతం వరకూ పెంచేందుకు చర్యలు తీసుకోవచ్చు. మరిన్ని రంగాల్లో విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరవొచ్చు. మొండి బకాయిల భారంతో ఇక్కట్లు ఎదుర్కొంటున్న బ్యాంకులకు మరింత మూలధనం సమకూర్చే దిశగా చర్యలు చేపట్టవచ్చు.
 
 అన్నదాతను ఆదుకుంటారా?
 వరుసగా రెండేళ్లు కరువు నెలకొన్న నేపథ్యంలో వ్యవసాయ రంగానికి కేటాయింపులు పెంచే అవకాశం ఉంది. పంటల బీమా పథకాన్ని విస్తరించడం, సాగునీటి పారుదలకు కేటాయింపులు పెంచడం వంటివి ప్రకటించవచ్చు. గ్రామీణ ఉపాధి పథకానికి కేటాయింపులు పెంచే అవకాశం ఉంది. చిన్న సాగునీటి పథకాలు, వర్షపు నీటి నిల్వ సదుపాయాలకు కేటాయింపులు ఉండొచ్చు.
 
 మేకిన్ ఇండియాకు పెద్దపీట
 ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మేకిన్ ఇండియాకు పెద్దపీట వేయొచ్చు. ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఆర్థిక, అధికారిక అడ్డంకులు తొలగించేందుకు చర్యలు ప్రకటించవచ్చు. తయారీ రంగానికి నూరు శాతం ట్యాక్స్ క్రెడిట్‌ను ప్రకటించవచ్చని అంచనా. విదేశీ ఇన్వెస్టర్లకు పన్ను ప్రోత్సాహకాలిస్తూ సంస్కరణలు మరింత వేగంగా అమలు చేసే చర్యలు తీసుకోవచ్చు.
 
 ఎవరి నోరు తీపో..
 వేతన జీవుల నుంచి రైతన్న వరకూ.. కార్పొరేట్ల నుంచి సామాన్యుడి దాకా దేశమంతా ఎదురుచూసే రోజు వ చ్చింది! కేంద్రంలో మోదీ సర్కారు కొలువుదీరాక వరుసగా మూడో బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం ఉదయం 11 గంటలకు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వ పన్ను వసూళ్లలో మందగమనం, ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులు, ద్రవ్యలోటుకు కళ్లెం వేయాల్సిన పరిస్థితుల నేపథ్యంలో ఈసారి బడ్జెట్ జైట్లీకి బడ్జెట్ కత్తిమీద సామేనని ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు. మొత్తమ్మీద ఈసారి తాయిలాల విషయంలో ఆచితూచి వ్యవహరించవచ్చని.. కొంత కఠిన వైఖరి అవలంబించే అవకాశం ఉందనేది అధిక శాతం మంది విశ్లేషకుల అభిప్రాయం.
 
 న్యూఢిల్లీ: సామాజిక పథకాలకు బడ్జెట్‌లో తప్పనిసరిగా నిధులను పెంచాల్సిన ఒత్తిడిని ఆర్థికమంత్రి జైట్లీ ఎదుర్కోనున్నారు. దేశంలో వరుసగా రెండేళ్లపాటు కరువు పరిస్థితులు నెలకొనడంతో గ్రామీణ భారతావని దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటుండటమే ఇందుకు ప్రధాన కారణం. మరోవైపు ప్రధాని మేకిన్ ఇండియా కలలను నెరవేర్చాలంటే.. విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ప్రోత్సాహకాలను పెంచడం, సంస్కరణలను మరింతగా పరుగులు పెట్టించడం వంటివి కూడా ముఖ్యమే. ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలు కారణంగా ప్రభుత్వంపై రూ.1.02 లక్షల కోట్ల అదనపు భారం పడనుంది.

వీటికి తోడు గత బడ్జెట్‌లో ప్రకటించినట్లుగా జీడీపీలో ద్రవ్యలోటును రానున్న ఆర్థిక సంవత్సరంలో 3.5 శాతానికి కట్టడి చేసే లక్ష్యానికి కట్టుబడి ఉంటారా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు లక్ష్యం 3.9 శాతం నెరవేరే అవకాశం లేదని.. ఇది 4 శాతానికి పైనే ఉండొచ్చన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే తరుణంలో కార్పొరేట్ పన్నును నాలుగేళ్లలో క్రమంగా ఇప్పుడున్న 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గిస్తామని గత బడ్జెట్‌లోనే ప్రకటించారు. ఈ ప్రక్రియను ఈ ఆర్థిక సంవత్సరం నుంచే అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. కార్పొరేట్లకు ఇస్తున్న పన్ను రాయితీల ఉపసంహరణపై కూడా కీలక ప్రకటనలు వెలువడనున్నాయి.

బడ్జెట్‌లో ఇతర అంచనాలు ఇవీ..
 సేవా పన్ను పెంచొచ్చు
 పెరగనున్న వ్యయాలకు నిధుల కోసం పరోక్ష పన్నుల పెంపు, కొత్తగా పన్నుల విధింపు వంటివి ఉండొచ్చు. సేవల పన్నును ఇప్పటికే 14.5 శాతానికి పెంచిన కేంద్రం (0.5 శాతం స్వచ్ఛ భారత్ సెస్సుతో కలిపి) దీన్ని ఈ బడ్జెట్‌లో మరింత పెంచే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) అమల్లోకి వస్తే సేవల పన్నును 18 శాతానికి పెంచాల్సి వస్తుంది. దీనికి అనుగుణంగా ప్రజలను సంసిద్ధం చేసేందుకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది.

 క్రూడ్‌పై మళ్లీ దిగుమతి సుంకం
 అంతర్జాతీయంగా ముడి చమురు(క్రూడ్) ధరలు తీవ్రంగా పడిపోయిన నేపథ్యంలో దిగుమతి చేసుకునే క్రూడ్, పెట్రోలు, డీజిల్‌లపై మళ్లీ కస్టమ్స్ సుంకం విధింపునకు అవకాశం ఉంది. క్రూడ్ రేట్లు 100 డాలర్లకు చేరడంతో 2011లో దీన్ని తొలగించారు.
 ఇతరత్రా..
►    బంగారం అధిక దిగుమతుల కారణంగా వాణిజ్య లోటు పెరిగిపోవడం, రూపాయి బలహీనతల కారణంగా పుత్తడిపై దిగుమతి సుంకం మరింత పెంచేలా చర్యలు.
►    పారిశ్రామిక రంగంలో ప్రైవేటు పెట్టుబడులు ఆశించినంతగా పెరగనందున.. మౌలిక రంగంలో పెట్టుబడుల పెంపు, ప్రభుత్వ వ్యయాలను పెంచడంపై దృష్టి పెట్టొచ్చు.
 ►    గ్లోబల్ డిమాండ్ పడిపోవడం, అధిక సరఫరా కారణంగా సమస్యల్లోకి కూరుకుపోయిన కమోడిటీ ఆధారిత రంగాలకు చేయూతనిచ్చేందుకు రక్షణాత్మక చర్యలు ఉండొచ్చు.
 ►   మొండి బకాయిల భారంతో ఇక్కట్లు ఎదుర్కొంటున్న బ్యాంకులకు మరింత మూలధనం సమకూర్చే దిశగా చర్యలు.

 స్టార్టప్స్‌కు చేయూత
 మోదీ ఇటీవల జపిస్తున్న స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా కార్యక్రమాలకు నిధుల బూ స్ట్ ఇచ్చేందుకు చర్యలు ఉండొచ్చు. దీని కోసం కొత్తగా సెస్సు విధిం చొచ్చు.
 
 ‘రాబిన్‌హుడ్’ ట్యాక్స్!
 మోదీ సర్కారు ఖజానా నింపుకోవడానికి సంపన్నుల (సూపర్ రిచ్)పై మరింతగా పన్నుల కొరడా ఝళిపించే అవాకాశం ఉంది. ఇప్పటికే ఆర్థిక సర్వే కూడా అధికాదాయ వర్గాలపై తగినంత పన్ను విధించడం లేదని.. దీన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో సూపర్ రిచ్ నుంచి అదనంగా పిండుకునే అవకాశం ఉందని(దీన్నే రాబిన్‌హుడ్ ట్యాక్స్‌గా చెబుతారు) విశ్లేషకులు పేర్కొంటున్నారు. గతేడాది బడ్జెట్‌లో వెల్త్ ట్యాక్స్‌ను తొలగించిన సర్కారు.. రూ. కోటికి పైగా వార్షిక ఆదాయం ఉన్న సూపర్ రిచ్‌పై ఉన్న 10 శాతం సర్‌చార్జీ(ఆదాయపు పన్ను కాకుండా అదనంగా విధించేది)ని 12 శాతానికి పెంచారు. ఇప్పుడు దీన్ని మరింత పెంచొచ్చని అంచనా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement