financial budget
-
శాసనసభలో సెల్ఫోన్లు వాడొద్దు
సాక్షి, హైదరాబాద్: శాసనస సభ స్పీకర్ రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక నుంచి సభలో సభ్యులెవరూ సెల్ఫోన్లు, ట్యాబ్‌లు, ఇతర ఎల్రక్టానిక్ గ్యాడ్జెట్స్‌ను వినియోగించకూడదని రూలింగ్ ఇచ్చారు. వాటిని ఉపయోగించి వీడియోలు ప్రదర్శించకూడదని ఆదేశించారు. ‘కృష్ణా నది మీద నిర్మించిన ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కేఆర్ఎంబీకి అప్పగించే అంశం’మీద సభలో ఇటీవల జరిగిన చర్చ సందర్భంగా అధికార–ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగిన విషయం తెలిసిందే. కేఆర్ఎంబీకి తాము ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యత అప్పగించటం లేదని ప్రభుత్వం స్పష్టం చేసిన సమయంలో, ఆ నిర్ణయానికి భిన్నమైన అభిప్రాయాన్ని వెల్లడించిన అప్పటి నీటి పారుదల శాఖ ఈఎన్సీ (ప్రస్తుతం మాజీ) మురళీధర్‌రావు పేర్కొన్నట్టుగా ఉన్న వీడియోను ఫోన్ ద్వారా ప్రదర్శించారు. ఇది ప్రభుత్వాన్ని కొంత ఇ రుకున పెట్టింది. ఈ నేపథ్యంలో సభలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వినియోగంపై గురువారం స్పీకర్ నిర్ణ యం వెల్లడించటం విశేషం. స్పీక ర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా సభలో వాటిని వినియోగించవద్దని స్పష్టం చేశారు. మీడియా పాయింట్ వద్ద కూడా ఇక సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన మీదట బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం వారు మీడియాతో మాట్లాడేందుకు సభ ఆవరణలోని మీడియా పాయింట్ వద్దకు వస్తుండగా భద్రత సిబ్బంది అడ్డుకున్నారు. సభ జరుగుతున్న తరుణంలో మీడియా పాయింట్ వద్ద మీడియా సమావేశానికి అనుమతి లేదంటూ వారు పేర్కొనడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ బీఆర్ఎస్ సభ్యులు నేలమీద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం సభ ప్రారంభం అవుతూనే స్పీకర్ ప్రసాద్‌కుమార్ కీలక ప్రకటన చేశారు. సభ జరుగుతున్న తరుణంలో సభా ప్రాంగణంలో మీడియా పాయింట్ వద్ద విలేకరుల సమావేశానికి అనుమతి లేదని, టీ, లంచ్ విరామ సమయాల్లో, సభ వాయిదా పడ్డ తర్వాత యధావిధిగా మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడవచ్చని పేర్కొన్నారు. -
ఇది వాస్తవిక బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: సామాజిక సమానత్వం తెచ్చే రీతిలోనే బడ్జెట్ రూపకల్పన చేశామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క పేర్కొ న్నారు. గురువారం శాసనసభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై జరిగిన చర్చకు మంత్రి బదులిస్తూ..అడ్డగోలుగా హామీలిచ్చిన ప్రభుత్వాలు, వాటి అమలుకు ఆదాయం ఎలా సమకూరుతుందో తెలియని స్థితిలో బడ్జెట్ ప్రవేశపెట్టాయని దుయ్యబట్టారు. బడ్జెట్లో నిధులు కేటాయించినా, మంజూరులేని పరిస్థితిలో అనేక వర్గాలు ఫలితం పొందలేకపోయారని తెలిపారు. ఇలాంటి పొరపాటుకు తావులేకుండా వాస్తవిక బడ్జెట్ రూపొందించామని చెప్పారు. అందుకే బడ్జెట్‌ను కుదించాల్సి వచ్చిదని వివరించారు. ప్రవేశపెట్టిన రూ.2,75, 891 బడ్జెట్... ఆదాయం, ఖర్చు కు మధ్య మహా అయితే 6% కన్నా తక్కువ ఉండబోదని తెలిపారు. గత పదేళ్ల కాలంలో మొత్తం బడ్జెట్ కేటాయిపులు రూ.14,87,834 కోట్లు అయితే, ఖర్చు చేసింది మాత్రం రూ.12,25,312 కోట్లు అని తెలిపారు. ఆదాయమే లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టడం వల్ల ఈ పదేళ్లలో రూ. 2,65,212 కోట్లు కేటాయింపుల్లో ఖర్చు చేయలేదన్నారు. కేంద్రనిధులు తెచ్చేందుకు బీజేపీ సభ్యులు కూడా సహకరించాలని కోరారు. ఆర్థికలోటు అధిగమించేందుకు అప్పులు చేయక తప్పదన్నారు. ఇచ్చిన ఆరు గ్యారంటీలు తప్పకుండా అమలు చేస్తామన్నారు. నిరుద్యోగుల కష్టాలు తొలగించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేశామని, నిరుద్యోగుల కలలు నిజం చేస్తూ ఉద్యోగాల జాతర కొనసాగుతుందని చెప్పారు. -
వృద్ధాప్యంలో సంక్షోభానికి దూరంగా.. తల్లిదండ్రుల కోసం ఏం చేయాలంటే?
ప్రతి కుటుంబానికి సమగ్ర ఆర్థిక ప్రణాళిక ఉండాలి. కుటుంబ లక్ష్యాలు అన్నింటికీ ఇందులో చోటు కల్పించుకోవడం ఎంతో అవసరం. స్కూల్, కాలేజీ ఫీజులు, విదేశీ విద్య, జీవిత, ఆరోగ్య బీమా పథకాలు, అత్యవసర నిధి, విహార, పర్యాటక యాత్రలు ఇలా అన్నింటికీ చోటు కల్పించుకోవాలి. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని, ఈ లక్ష్యాలు అన్నింటికీ కావాల్సిన మేర సమకూర్చుకునేందుకు వీలుగా తగిన పెట్టుబడుల ప్రణాళిక రూపొందించుకోవాలి. అందరూ కాకపోయినా కొందరు అయినా దీన్ని అనుసరిస్తుంటారు. కాకపోతే ఎక్కువ మంది ఇక్కడ విస్మరించే విషయం ఒకటి ఉంది. తమపై ఆధారపడిన వృద్ధాప్య తల్లిదండ్రుల సంరక్షణను ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకోరు. దీన్ని ఒక లక్ష్యంగా చూడరు. గతంతో పోలిస్తే వృద్ధాప్యంలో సంరక్షణ వ్యయాలు గణనీయంగా పెరిగాయి. కనుక ప్రతి ఒక్కరి ఆర్థిక ప్రణాళికలో దీనికి తప్పకుండా చోటు ఉండాల్సిందే. లేదంటే ఆర్థిక సంక్షోభాన్ని ఆహ్వానించినట్టు అవుతుంది.. పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు అతిపెద్ద ఆర్థిక వ్యయంతో కూడుకున్న లక్ష్యాల్లో వృద్ధాప్య సంరక్షణ (జెరియాట్రిక్ కేర్) ఒకటి. అయినా, అధిక శాతం మంది ఆర్థిక ప్రణాళికల్లో దీనికి చోటు ఉండదు. వృద్ధుల సంక్షేమం కోసం ఎంత ఖర్చు అవుతుందన్న అవగాహన కూడా ఉండడం లేదు. ఇది ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంటుంది. వృద్ధులైన తల్లిదండ్రులు తమతోనే ఉంటున్నారా? లేక మరో చోట నివసిస్తున్నారా? లేక వృద్ధాశ్రమంలో చేరారా? వారికి ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? లేదంటే వారికి సంరక్షకులను ఏర్పాటు చేయాలా? వారికి పింఛను సదుపాయం ఉందా లేక ఇతరత్రా వేరే రూపంలో ప్రతి నెలా ఆదాయం వచ్చే ఏర్పాటు ఉందా? ఇలాంటి అంశాలన్నింటి ఆధారంగా వృద్ధుల సంక్షేమం కోసం ఏ విధంగా సన్నద్ధం కావాలనేది తేల్చుకోవచ్చు. వృద్ధాప్య సంరక్షణ ఇంత కాలం పాటు, నిర్ధిష్ట సమయం అని నిర్ణయించుకోవడం కష్టం. వృద్ధులైన తల్లిదండ్రులకు ఇప్పుడు ప్రత్యేక సంరక్షణ అవసరం పడకపోవచ్చు. అలా అని ముందు ముందు వయసు మీద పడితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలియదు. అప్పుడు ప్రత్యేక సంరక్షకుల అవసరం ఏర్పడొచ్చు. దీనికి ఎంత వ్యయం అవుతుందన్నది ముందుగా అంచనా వేయలేం. ఎన్నో నిదర్శనాలు.. నేడు ఆరోగ్య సంరక్షణ వ్యయాలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. సామాజిక భద్రత ఉండడం లేదు. నేటి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని చూస్తే వృద్ధుల సంక్షేమం అతిపెద్ద ఆర్థిక లక్ష్యాల్లో ఒకటిగా మారిపోయింది. ఉదాహరణకు హైదరాబాద్‌కు చెందిన దత్తాత్రేయ తల్లికి కిడ్నీల సమస్య ఉంది. కిడ్నీల డయాలసిస్, ఇతర చికిత్సా వ్యయాల కోసం రూ.80,000 వరకు ప్రతి నెలా ఖర్చు చేయాల్సి వస్తోంది. గతేడాది వరకు కేవలం ఔషధాల వరకే ఖర్చు అయ్యేది. కానీ, కిడ్నీల సమస్య మరింత తీవ్రతరం కావడంతో వారంలో మూడు సార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోంది. ఒక్క సెషన్‌కు రూ.3,000 ఖర్చు అవుతోంది. ఇక దత్తాత్రేయ తల్లి మృణాళిని టెస్ట్‌లు, వైద్యుల కన్సల్టేషన్ కోసం ఏటా మరో రూ.లక్ష ఖర్చు చేస్తున్నారు. నిజానికి దత్తాత్రేయకు పనిచేసే సంస్థ అందిస్తున్న హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. ఇప్పటి వరకు బీమా కంపెనీ మృణాళిని వైద్య ఖర్చుల భారం మోస్తోంది. కాకపోతే ఇటీవల డయాలసిస్, ఇతర వ్యయాలు పెరిగిన నేపథ్యంలో కవరేజీ చాలడం లేదు. సొంతంగా తమ వంతు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇక పట్టణాల్లో తల్లిదండ్రుల సంక్షేమ వ్యయాలు మరింత ఎక్కువగా ఉంటున్నాయి. అందులోనూ తల్లిదండ్రులు ఒకచోట, పిల్లలు మరో చోట నివసిస్తుంటే, వారికి అదనపు వ్యయాలతోపాటు ఇతరత్రా సవాళ్లు ఎదురవుతుంటాయి. ఇందుకు ముంబైకి చెందిన భట్టాచార్యే నిదర్శనం. ఆయన తల్లిదండ్రులు కోల్‌కతాలో నివసిస్తున్నారు. వారి సంరక్షణ బాధ్యతలు ఏకైక కుమారుడైన దత్తాత్రేయపైనే ఉన్నాయి. వాటిని ఆయన నెరవేరుస్తున్నారు కూడా. కాకపోతే తాను నివస్తున్న పట్టణానికి దూరంగా తల్లిదండ్రులు ఉంటుండడం, పైగా తల్లి కేన్సర్‌తో బాధపడుతూ పూర్తి స్థాయిలో సొంతంగా నడవలేకపోతుండడం సవాలుగా మారింది. దీంతో ఆమెకు తన కుమారుడి నుండి భౌతిక సాయం కూడా అవసరమవుతోంది. దీంతో భట్టాచార్య ముంబై నుంచి కోల్‌కతాకు తరచూ వెళ్లి రావాల్సి వస్తోంది. తనతో పాటు ఆస్పత్రికి వెళ్లి రావడానికి అమ్మ సౌకర్యంగా భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. తన తల్లిదండ్రులను ముంబైకి మార్చుదామంటే ఆర్థికంగా అది సులువైన నిర్ణయం కాదని అతడికి తెలుసు. కోల్‌కతాలో అయితే వారి సంరక్షణకు నెలకు రూ.60,000–65,000 ఖర్చు అవుతోంది. ముంబైకి మారిస్తే రూ.లక్ష ఖర్చు చేయాల్సి వస్తుంది. ముంబైలో జీవన వ్యయాలు ఎక్కువ. ఇప్పుడు కాకపోతే మరికొంత కాలం తర్వాత అయినా తన తల్లిదండ్రులను ముంబైకి తీసుకురావడం ఒక్కటే ఆయన ముందున్న ఆప్షన్. ఏడాది క్రితం వరకు తల్లిదండ్రుల ఔషధాలకు నెలకు రూ.30,000 ఖర్చు అయితే, ఇప్పుడు రూ.45,000కు పెరిగింది. తమపై ఆధారపడిన లేదంటే భవిష్యత్తులో తమ సంరక్షణ అవసరం పడే తల్లిదండ్రులు ఉంటే, వారి కోసం ముందు నుంచే ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవాల్సిన అవసరాన్ని ఈ నిదర్శనాలు తెలియజేస్తున్నాయి. అస్పష్ట సవాళ్లు ఆర్థికంగా పడే భారాన్ని అధిగమించడం ఒక్కటే కాదు, ఇతర సవాళ్లు కూడా ఎదురుకావచ్చు. ఢిల్లీకి చెందిన మంజీత్ తండ్రికి శస్త్రచికిత్స తర్వాత ఆస్పత్రిలోనే చాలా రోజులు ఉండాల్సి వచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రి కావడంతో రాత్రి సమయాల్లో సంరక్షణ చూసేందుకు ఒక వార్డ్ బోయ్ ఉంటే బాగుంటుందని అనిపించింది. ప్రభుత్వ హాస్పిటల్ కావడంతో ప్రతి రోగికి విడిగా ఒక్కో వార్డ్ బోయ్ లేదా కేర్‌టేకర్ ఏర్పాటు సదుపాయం ఉండదు. దీంతో ప్రైవేటుగా ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకోవడం మినహా వేరే మార్గం కనిపించలేదు. అందుకు అర్హత కలిగిన వ్యక్తిని గుర్తించడం, వారి చార్జీలు చెల్లించడం కష్టమైన టాస్క్‌గా మారింది. కొన్ని పేరొందిన ఆస్పత్రుల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ వ్యయాలు 40–50 శాతం అధికంగా ఉంటాయి. వృద్ధాప్య సంరక్షణ కేంద్రాల్లో ఈ సేవలు అన్నీ అందుబాటులో ఉంటాయి. కానీ, తమ తల్లిదండ్రులను వృద్ధాప్యంలో, అనారోగ్యంతో ఉన్నప్పుడే వేరే కొత్త ప్రాంతానికి మారిస్తే.. వారు ఒంటరితనంతో వేదనకు గురవుతారు. పైగా తమ పిల్లలు అలక్ష్యం చేస్తున్నారనే బాధ కూడా ఉంటుంది. బంధు మిత్రుల నుంచి ఈ విషయంలో అవహేళనలు కూడా ఎదురుకావచ్చు. కొన్ని ప్రముఖ పట్టణాల్లో సర్జరీల తర్వాత వృద్ధుల కోసం తాత్కాలిక సంరక్షణ కేంద్రాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక్కడ సర్జరీ అనంతరం కావాల్సిన సేవలను 3–8 వారాల పాటు అందిస్తారు. ప్రత్యేక రూమ్, నర్స్, అటెండెంట్ తదితర సేవలు పొందొచ్చు. వైద్యులు కూడా వచ్చి చూసి వెళుతుంటారు. కైట్స్ సీనియర్ కేర్‌తోపాటు కేర్ హాస్పిటల్ తదితర కొన్ని సంస్థలు ఈ తరహా సేవలను ఆఫర్ చేస్తున్నాయి. కాకపోతే రోజువారీ రూ.3,000–4,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. వృద్ధులకు ఉన్న సమస్యల ఆధారంగా ఈ వ్యయం మారుతుంది. భార్యా, భర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే వారిపై ఆధారపడిన పెద్దలకు తాత్కాలికంగా ఇలాంటి కేంద్రాల్లో సేవలు అందించొచ్చు. ఒకవైపు భవిష్యత్తులో పెద్దల సంక్షేమం కోసం అయ్యే వ్యయాలకు ప్రణాళిక రూపొందించుకోవడం ఎంత ముఖ్యమో.. భవిష్యత్ అవసరాలకు తగిన విధంగా సన్నద్ధం కావడం కూడా అంతే అవసరం. ప్రణాళిక ఎలా..? తమపై తల్లిదండ్రులు ఆధారపడి ఉంటే, వారి కంటూ హెల్త్ ఇన్సూరెన్స్ ముందుగా తీసుకోవాలి. వీలైతే 45 ఏళ్లలోపు, అది వీలు పడకపోతే 60 ఏళ్లలోపు తప్పకుండా తీసుకోవాలి. దీంతో ఏదైనా ఆరోగ్య సమస్యతో వారు హాస్పిటల్లో చేరితే, అయ్యే వ్యయాన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీయే భరిస్తుంది. ముఖ్యంగా కుటుంబ ఆర్థిక చరిత్ర గురించి ఒక్కసారి విశ్లేషించుకోవాలి. తల్లిదండ్రులను అడిగి, వారి తల్లిదండ్రులు, సోదరుల్లో ఎవరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా మధుమేహం, ఆర్థరైటిస్, డిమెన్షియా, గుండె జబ్బులు, కేన్సర్, స్ట్రోక్ తదితర సమస్యలు ఉన్నాయేమో విచారించాలి. క్రిటికల్ ఇల్నెస్ కవర్‌ను కూడా తీసుకోవడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా డయాలసిస్, ఓరల్ కీమోథెరపీ తదితర చికిత్సలకు డేకేర్ కింద కవరేజీ ఉండేలా చూసుకోవాలి. అలాగే, హోమ్‌కేర్ కవర్ కూడా ఉండాలి. దీనివల్ల ఇంట్లో ఉండి చికిత్స తీసుకుంటే బీమా కంపెనీ నుంచి క్లెయిమ్ పొందొచ్చు. అయినప్పటికీ ఇంట్లో అటెండెంట్, హోమ్ నర్స్, మెడికల్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయాల్సి వస్తే అందుకే అయ్యే చార్జీలను కంపెనీలు చెల్లించవు. నెలకు ఒక అటెండెంట్ సేవలు పొందేందుకు మెట్రోల్లో అయితే రూ.25,000–30,000, చిన్న పట్టణాల్లో అయితే రూ.15,000–20,000 వరకు ఖర్చు అవుతుంది. ఇంటి వద్దే నర్స్ సేవల కోసం నెలవారీ వ్యయాలు 25–40 శాతం అధికంగా అవుతాయి. అందుకే ముందస్తుగా ప్రణాళిక రూపొందించుకోవడం వల్ల తర్వాత ఆర్థికంగా సతమతం కాకుండా ఉంటుంది. ఎందుకంటే వృద్ధులైన తల్లిదండ్రుల సంక్షేమం రూపంలో ఖర్చులు ఎదురైన సమయంలోనే పిల్లల ఉన్నత విద్య, ఇతర కీలక లక్ష్యాలు తారసపడతాయి. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరూ తమ కుటుంబానికి అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం ఎంత అవసరమో.. తల్లిదండ్రుల కోసం ప్రత్యేక అత్యవసర నిధిని కూడా సమకూర్చుకోవడం అంతే అవసరమనేది ఆర్థిక నిపుణుల సూచన. నిజానికి తల్లిదండ్రుల కోసం కొంత ఫండ్‌ను సిద్ధంగా ఉంచుకునే వారు అరుదుగా కనిపిస్తారు. అవసరం అయితే జీవన వ్యయాలను కొంత తగ్గించుకుని అయినా, తమపై ఆధారపడి వారి కోసం అత్యవసర నిధిని సమకూర్చుకోవాలే కానీ, వాయిదా వేయరాదని నిపుణుల సూచన. కనుక తల్లిదండ్రులు లేదా తమపై ఆధారపడిన అత్త మామల వృద్ధాప్య సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్‌తోపాటు అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి. -
ఆర్ధిక అవసరాలు,ఇతరులపై ఆధారపడుతున్న భారతీయ మహిళలు
ఇంటికే పరిమితం.. భర్త, పిల్లలు, కుటుంబ పోషణ మాత్రమే ఆమె విధి... అంటూ కొన్నేళ్ల క్రితం మహిళలకు సంబంధించి ఇలాంటివి మాటల్ని తరచూ వింటుండేవాళ్లం. కానీ ఇప్పుడు..ఇంటా మేమే, బయటా మేమే అన్నట్లుగా అన్ని రంగాల్లోనూ మహిళలు ప్రతిభ కనబరుస్తున్నారు. శాస్త్ర, సాంకేతిక, ఉద్యోగ రంగాల్లోనే కాదు.. వృత్తి, వ్యాపారాల్లోనూ మహిళలు సాధిస్తున్న విజయాలు అన్నీ ఇన్నీ కావు. కానీ ఇప్పటికీ ఆర్ధిక పరమైన నిర్ణయాలు తీసుకోవడంలో వెనకబడిపోతున్నట్లు ఓ అధ్యయనం తెలిపింది. మహిళలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అన్నీ రంగాలకు చెందిన సంస్థల్ని ముందుండి నడిపిస్తున్నారు. అటువంటి వారే ఆర్ధిక నిర్ణయాలు తీసుకునే విషయంలో కాస్త వెనకబడిపోతున్నారు. ఇటీవల టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఫైనాన్షియల్ అవేర్నెస్ ఎమాంగ్ విమెన్ పేరుతో దేశవ్యాప్తంగా 18 నగరాల్లో 22 నుంచి 55 ఏళ్ల వయసున్న 1000 మందిపై ఈ అధ్యయనం నిర్వహించింది. అధ్యయనంలో భారతీయ మహిళల్లో అత్యధిక శాతం మంది ఇప్పటికీ భర్తలపై ఆధారపడుతున్నట్టు పేర్కొంది. అయితే, తమకు అవకాశం వస్తే నిర్ణయాలు తీసుకుంటామని 44 శాతం మంది తమ అధ్యయనంలో చెప్పినట్టు హైలెట్ చేసింది. -
కరోనా 'వేలకోట్ల'లో దెబ్బకొట్టింది, గాల్లో ఎగిరేదెలా!
న్యూఢిల్లీ: విమానయాన సంస్థలను (ఎయిర్‌లైన్స్) కరోనా గట్టిగానే దెబ్బకొట్టింది. వైరస్ నేపథ్యంలో కార్యకలాపాలు సజావుగా నిర్వహించలేని పరిస్థితి ఏర్పడడం వల్ల.. గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2020–21) ఈ రంగం ఏకంగా రూ.22,400 కోట్ల నష్టాలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. అంతేకాదు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిర్వహించే విమానాశ్రయాల్లో 75 శాతం గత ఆర్థిక సంవత్సరంలో నష్టాలను ఎదుర్కొన్నాయి. పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ ఈ వివరాలను లోక్‌సభకు తెలియజేశారు. కరోనా మహమ్మారి అంతర్జాతీయంగా పౌర విమానయాన రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసినట్టు మంత్రి చెప్పారు. ఫలితంగా దేశీయంగా ఎయిర్‌లైన్స్‌తోపాటు, విమానాశ్రయాలు, అనుబంధ సేవల్లోనూ నష్టాలు ఎదురైనట్టు వివరించారు. ‘‘భారత ఎయిర్‌లైన్స్ సంస్థలకు 2020–21లో నష్టాలు సుమారుగా రూ.19,000 కోట్ల వరకు ఉంటాయి. ఎయిర్‌పోర్ట్‌లకు ఈ నష్టాలు రూ.3,400 కోట్లుగా ఉన్నాయి’’ అని మంత్రి పేర్కొన్నారు. కరోనా వైరస్ కారణంగా ప్రయాణించే వారు 61.7 శాతం తగ్గినట్టు తెలిపారు. వచ్చే కొన్నేళ్లలో దేశీయ ప్రయాణికుల మార్కెట్ రెట్టింపు అవుతుందన్న అంచనాను వ్యక్తం చేశారు. విమానయాన సేవల్లో ఎక్కువగా ఇంధనానికే (ఏటీఎఫ్) ఖర్చవుతున్నట్టు చెప్పారు. -
ఆదుకున్న ‘భృతి’
కోరుట్ల: అసలే అరకొర పనులతో అవస్థలు పడుతున్న బీడీ కార్మికుల ఉపాధికి కరోనా గండికొట్టింది. బీడీలు చేసి కుటుంబాలను పోషించుకోవడం తప్ప ఇతర పనులు చేసుకోలేని కార్మికులకు జీవనభృతి ఆసరాగా నిలిచింది. మినీ సిగరేట్లతో బీడీ కార్మికుల ఉపాధి ఇప్పటికే ప్రశార్థకంగా మారగా..కరోనా లాక్డౌన్ మరింత సమస్యల్లోకి నెట్టింది. రెండేళ్లుగా కరోనా ప్రభావంతో బీడీ కార్మికుల ఉపాధి అవకాశాలు నానాటికి తీసికట్టుగా మారుతున్నాయి. రెండురోజులకోసారి.. గతేడాది సుమారు 9 నెలలపాటు సాగిన కరోనా లాక్డౌన్ ఫలితంగా పూర్తి స్థాయిలో బీడీ కంపెనీలు బంద్ కాగా చాలా మంది కార్మికులు వర్ధి బీడీలు చేసి కంపెనీలు ఇచ్చినంత కూలి తెచ్చుకొని కాలం గడిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో పాజిటివ్ కేసులు పెరగడంతో ప్రభుత్వం మొదట నైట్ కర్ఫ్యూ ప్రక టించింది. మేలో పాజిటివ్ కేసులు మరింత పెరగడంతో 12వ తేదీ నుంచి సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించింది. నైట్ కర్ఫ్యూ సమయంలో రెండురోజులకోసారి బీడీ కంపెనీలు కార్మికులకు పనులు కల్పించాయి. నెలకు పదిరోజులకు మించి బీడీ కార్మికులకు పని దొరకలేదు. మే 12 తర్వాత సంపూర్ణ లాక్‌డౌన్‌తో కంపెనీలు బంద్ చేయడంతో కార్మికులకు పూర్తిగా ఉపాధి కరువై నానాతిప్పలుపడ్డారు. మూడునెలలపాటు.. లాక్డౌన్లో సుమారు 3 నెలలపాటు అరకొర పనులు ఉండడంతో ఇబ్బందులుపడ్డ బీడీ కార్మికులను సర్కార్ అందిస్తున్న జీవన భృతి ఆదుకుంది. జిల్లాలో సుమారు 1.20 లక్షల మంది బీడీ కార్మికులు ఉండగా 84 వేల మందికి పింఛన్ కింద ప్రతీ నెల రూ.2వేల జీవనభృతి అందుతోంది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో బీడీ తయారీ కుంటుపడిన కాలంలో కార్మికులు పింఛన్ డబ్బుతో కాలం వెల్లదీశారు. పింఛన్ రాకుంటే తమ పరిస్థితి మరింత అధ్వానంగా మారేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేసినా బీడీ కంపెనీలు పూర్తిస్థాయిలో పనులు కల్పించడం లేదు. కార్మిక చట్టాల ప్రకారం ప్రతీనెల 26 రోజులపాటు పనులు కల్పించాల్సి ఉంటుంది. బీడీ పింఛనే దిక్కయింది కరోనాతో బీడీ కంపెనీలు రెండునెలలపాటు బంద్ పాటించాయి. రోజు 800 నుంచి వెయ్యి బీడీలు చేసి నెలకు రూ.4 వేల దాకా సంపాదించుకునే మేము రెండునెలలు పనులు లేక తిప్పలు పడ్డాం. అంతో ఇంతో బీడీ పింఛన్ రూ.2వేలు రావడం మాకు ఆసరా అయింది. – పొలాస లక్ష్మి, కోరుట్ల పూర్తి పనులు కల్పించాలి కరోనా లాక్డౌన్ ఎత్తివేసి వారంరోజులు గడుస్తుంది. ఇప్పటికీ బీడీ కంపెనీలు రోజు విడిచి రోజు ఆకు తంబాకు ఇస్తున్నాయి. లాక్డౌన్ ఎత్తేసినట్లే కానీ కంపెనీలు మాత్రం పూర్తిగా పనివ్వడం లేదు. నెలరోజుల్లో కనీసం 20 రోజులైనా పని ఇస్తే బీడీల తయారీపై ఆధారపడిన మాకు కొంత మేలు జరుగుతుంది. – గోనె సరోజ, బీడీ వర్కర్, కోరుట్ల -
హేతుబద్ధంగా వనరుల వినియోగం
న్యూఢిల్లీ: దేశ వనరులను హేతుబద్ధంగా, న్యాయబద్ధంగా ఉపయోగించాలన్నదే తమ ఉద్దేశమని, అందుకే కరోనా మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వలేకపోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఇందులో ఆర్థిక భారం ప్రసక్తే లేదని, అది కారణం కాదని పేర్కొంది. కరోనా బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని కోరుతూ దాఖలైన రెండు పిటిషన్లపై న్యాయస్థానం తన తీర్పును జూన్ 21న రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం 39 పేజీల అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. కరోనా వైరస్ మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోందని, ఇది జీవిత కాలంలో ఒకసారి ఎదురయ్యే విపత్తు అని పేర్కొంది. ఈ పరిణామాన్ని ఎదుర్కొనేందుకు అనేక చర్యలు చేపట్టినట్లు గుర్తుచేసింది. నిపుణుల సూచన ప్రకారం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్(ఎస్డీఆర్ఎఫ్)తోపాటు సంచిత నిధి నుంచి సైతం నిధులు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించింది. 2015 నుంచి 2020 వరకూ అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం.. జాతీయ స్థాయిలో గుర్తించిన 12 రకాల విపత్తులకే ఆర్థిక సాయం అందించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ జాబితాలో ‘కరోనా వ్యాప్తి’ లేదని వివరించింది. అయినప్పటికీ సహజ విపత్తుల వల్ల నష్టపోయిన వారికోసం ఎస్డీఆర్ఎఫ్ నుంచి 10 శాతం నిధులు ఖర్చు చేయవచ్చని వెసులుబాటు కల్పించినట్లు గుర్తుచేసింది. జులై చివరికల్లా 51.6 కోట్ల డోసులు జులై చివరికల్లా రాష్ట్రాలకు 51.6 కోట్ల డోసులు అందిస్తామని, అందులో ఇప్పటికే 35.6 కోట్ల డోసులు ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ సందర్భంగా పిల్లలకు వ్యాక్సిన్‌పై కోర్టుకు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న జైడస్ క్యాడిలా 12–18 ఏళ్ల లోపు వారిపై ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ పూర్తిచేసిందని, కోవాగ్జిన్‌కు 2–18 ఏళ్లలోపు పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి డీసీజీఐ అనుమతి ఇచ్చిందని ప్రభుత్వం పేర్కొంది. చట్టబద్ధమైన అనుమతులు లభిస్తే సమీప భవిష్యత్తులో పిల్లలకు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో వస్తాయని కోర్టుకు తెలిపింది. భవిష్యత్తులో మరోవేవ్ వస్తే ఎదుర్కొనేలా రాష్ట్రాలను నిరంతరం సిద్ధం చేస్తున్నామని, మౌలిక సదుపాయాలను పెంచుతున్నామని పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా మరోవేవ్ వచ్చే అవకాశాలు.. వైరస్ మ్యుటేషన్లు, ప్రజలు తగిన కోవిడ్ ప్రొటోకాల్‌ను పాటించడంపై ఆధారపడి ఉంటాయని స్పష్టం చేసింది. ► దేశంలో 18 ఏళ్లు దాటినవారు పేదలైనా, ధనవంతులైనా కరోనా టీకా ఉచితంగా పొందడానికి సరిసమానంగా అర్హులేనని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అర్హులందరికీ సురక్షితమైన, ప్రభావవంతమైన టీకాను సాధ్యమైనంత త్వరగా ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించింది. ► కరోనా టీకా కోసం కోవిన్ పోర్టల్‌లో ముందే అపాయింట్మెంట్ పొందడం, ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సెల్ఫ్–రిజిస్ట్రేషన్ తప్పనిసరేమీ కాదని కేంద్రం స్పష్టం చేసింది. నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రంలోనే రిజిస్ట్రేషన్ చేయించుకొని, టీకా పొందవచ్చని సూచించింది. -
వరుసగా రెండో ఏడాది నీటి బడ్జెట్లో మిగులు
సాక్షి, అమరావతి: జలవనరులను ఒడిసి పట్టి యాజమాన్య పద్ధతులతో పొదుపుగా వాడుకుని అధిక విస్తీర్ణంలో సాగు చేసి ఎక్కువ దిగుబడులు సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది విజయం సాధించింది. ఆర్థిక బడ్జెట్ తరహాలో నీటి బడ్జెట్‌ను సమర్థంగా అమలు చేయడం వల్లే ఇది సాధ్యమైందని నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏపీడబ్ల్యూఆర్‌ఐఎంఎస్ (ఆంధ్రప్రదేశ్ జలవనరుల సమాచారం, యాజమాన్య వ్యవస్థ) ద్వారా ఎప్పటికప్పుడు లెక్కలను విశ్లేషిస్తున్న జలవనరుల శాఖ అధికారులు నీటి వృథాకు అడ్డుకట్ట వేసి పొదుపుగా వాడుకునేలా ప్రజలను చైతన్యం చేస్తున్నారు. ఫలితంగా బుధవారం ఉదయం 8.30 గంటల నాటికి ఈ నీటి సంవత్సరంలో 946.38 టీఎంసీలు మిగులు ఉండటం గమనార్హం. బొట్టు బొట్టుకూ లెక్క.. నీటి సంవత్సరం జూన్ 1తో ప్రారంభమై మే 31తో ముగుస్తుంది. రాష్ట్రంలో ప్రతి రోజూ వర్షాన్ని రెయిన్‌గేజ్‌ల ద్వారా ఏపీడబ్ల్యూఆర్‌ఐఎంఎస్ లెక్కిస్తుంది. అంతర్రాష్ట్ర నదుల ద్వారా వచ్చే ప్రవాహాన్ని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ), జలవనరుల శాఖ ఏర్పాటు చేసిన గేజింగ్ కేంద్రాల ద్వారా అంచనా వేస్తుంది. భూగర్భంలోకి ఇంకే జలాలు, వాడుకునేలా జలాలను ఫీజియోమీటర్ల ద్వారా లెక్కిస్తుంది. భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు, చెరువుల్లో నిల్వ ఉన్న నీరు, రోజువారీ ఆయకట్టుకు విడుదల చేసే నీటిని జలవనరుల శాఖ అందజేసే రికార్డుల ఆధారంగా అంచనా వేస్తుంది. ఈ లెక్కలను బట్టి నీటి బడ్జెట్‌ను ఏపీడబ్ల్యూర్ఐఎంఎస్ నిర్వహిస్తుంది. ఎక్కడైనా నీటి వృథా జరిగితే జలవనరుల శాఖను అప్రమత్తం చేస్తుంది. ఆ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి యాజమాన్య పద్ధతుల ద్వారా నీటి వృథాకు అడ్డుకట్ట వేస్తున్నారు. దేశంలో నీటి నిర్వహణలో అత్యుత్తమం.. దేశవ్యాప్తంగా నీటి నిర్వహణపై 2019–20 నుంచి నేషనల్ వాటర్ మిషన్ పథకం కింద కేంద్ర జల్ శక్తి శాఖ పోటీలు నిర్వహిస్తోంది. ఇందులో గతేడాది ఏపీడబ్ల్యూఆర్‌ఐఎంఎస్ మొదటి ర్యాంకు సాధించి అవార్డు దక్కించుకోవడం గమనార్హం. వర్షపాతం, అంతర్రాష్ట్ర నదీ ప్రవాహాల ఆధారంగా నీటి పరిమాణాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఆవిరి, ప్రవాహ నష్టాలు, సాగు, తాగు, గృహావసరాలు, పారిశ్రామిక అవసరాలకు వినియోగించే నీటిని లెక్కిస్తూ వృథాకు అడ్డుకట్ట వేసి జలవనరులను సమర్థంగా వాడుకోవడంలో ఈ వ్యవస్థ అత్యుత్తమంగా పనిచేస్తోందని కేంద్ర జల్ శక్తి శాఖ ప్రశంసించింది. యాజమాన్య పద్ధతులపై ప్రత్యేక దృష్టి ‘వర్షపాతం, అంతర్రాష్ట్ర నదీ ప్రవాహాల వల్ల వచ్చే జలాలను ఎప్పటికప్పుడు అంచనా వేయడం, రోజువారీ ప్రవాహ నష్టాలు, ఆవిరి నష్టాలు, వినియోగాన్ని లెక్కించడం, నీటి వృథాను పరిశీలించడం కోసం ఏపీడబ్ల్యూఆర్ఐఎంఎస్ను ఏర్పాటు చేశాం. యాజమాన్య పద్ధతుల ద్వారా నీటిని పొదుపుగా వాడుకునేలా రైతులను చైతన్యం చేస్తున్నాం. నీటి వృథా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అడ్డుకట్ట వేసేందుకు అత్యుత్తమ విధానాలను అమలు చేస్తున్నాం. తాగు, గృహ, పారిశ్రామిక అవసరాలకు నీటి కొరత లేకుండా చేయగలిగాం. జలవనరుల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధికి ఇది నిదర్శనం’ – సి.నారాయణరెడ్డి, ఇంజనీర్–ఇన్–చీఫ్, జలవనరుల శాఖ -
ఆర్టీసీపై ‘రెఫరల్’ భారం
సాక్షి, హైదరాబాద్ : అసలే రకరకాల సమస్యలతో కొట్టుమిట్టా డుతూ నష్టాల బాటలో పయనిస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)పై సొంత ఆసుపత్రి మరింత ఆర్థిక భారం మోపుతోంది. సరైన వసతులు లేకపోవడం, స్పెషలిస్టు వైద్యులు కరువవడం, ఆపరేషన్లు చేసే వెసులుబాటు లేకపోవడంతో ఆర్టీసీ ఉద్యోగులు ఓ మోస్తరు వైద్యానికి కూడా ప్రైవేటు ఆసుపత్రులవైపు చూడాల్సి వస్తోంది. ఫలితంగా రెఫరల్ ఆసుపత్రులకు భారీగా బిల్లులు చెల్లించాల్సి రావడం ఆర్టీసీని బెంబేలెత్తిస్తోంది. వేసవిలో సిబ్బంది కోసం బస్టాండ్లలో మజ్జిగ కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్న ఆర్టీసీ... ప్రతి సంవత్సరం ప్రైవేటు ఆసుపత్రులకు రూ. 30 కోట్ల కంటే ఎక్కువ మొత్తం రెఫరల్ బిల్లులు చెల్లిస్తోంది. అందులో కనీసం ఏటా రూ. 10 కోట్లు సొంత ఆసుపత్రి అభివృద్ధికి వెచ్చించి ఉంటే ఈపాటికి అది సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తరహాలో అభివృద్ధి చెంది ఉండేదని సొంత ఉద్యోగులు వాపోతున్నారు. ఇదీ సంగతి.... ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు వైద్యం కోసం హైదరాబాద్‌లోని తార్నాకలో ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులకు చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమైతే చికిత్స చేసి మందులు ఇచ్చేందుకు స్థానికంగా డిస్పెన్సరీలు ఉన్నా పెద్ద సమస్యలు వస్తే తార్నాకలోని ఆసుపత్రికే వస్తుంటారు. వైద్యులు వారి సమస్యలు గుర్తించి చికిత్స చేయాల్సి ఉంటుంది. కానీ కొంతకాలంగా ఈ ఆసుపత్రి నిర్లక్ష్యానికి గురవుతూ వస్తోంది. కొన్ని రకాల సమస్యలకు సంబంధించి ఆసుపత్రిలో స్పెషలిస్టు వైద్యులు లేరు. అలాగే ఆయా సమస్యలకు సంబంధించి నిర్వహించాల్సిన ఆపరేషన్ల కోసం వైద్య పరికరాలు కూడా అందుబాటులో లేవు. ఇటీవలి కాలంలో మందులకూ కొరత ఏర్పడ్డా ఇప్పుడిప్పుడే ఆ సమస్య పరిష్కారమవుతోంది. వెరసి చిన్నచిన్న చికిత్సలు మాత్రమే ఆసుపత్రిలో అందిస్తున్నారు. కాస్త పెద్ద సమస్యతో వచ్చే వారిని వెంటనే రెఫరల్ ఆసుపత్రులకు పంపేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో సంస్థకు ఏటా ఈ రెఫరల్ ఆసుపత్రుల బిల్లు తడిసి మోపెడవుతోంది. ఆసుపత్రి అభివృద్ధికి నిధులు కేటాయించలేకపోతున్న ఆర్టీసీ... రెఫరల్ ఆసుపత్రుల బిల్లులకు మాత్రం సగటున ప్రతి సంవత్సరం రూ. 30 కోట్లకుపైగా చెల్లించాల్సి వస్తోంది. ఈ మొత్తంలో సగం కంటే తక్కువ నిధులను ఆసుపత్రి అభివృద్ధికి ఖర్చు చేస్తే ఈపాటికి ముఖ్యమైన చికిత్సలకు సంబంధించి పరికరాలు, ఇతర వసతులు సమకూరి ఉండేవన్న వాదన సొంత ఉద్యోగుల నుంచే వినిపిస్తోంది. ఒక్కో సంవత్సరం కనీసం రూ.10 కోట్లు ఖర్చు చేసినా.. అన్ని ముఖ్యమైన పరికరాలు సమకూరి ఉండేవన్నది వారి మాట. మూడేళ్ల రెఫరల్ బిల్లు రూ. 105 కోట్లు... 2015–16లో ఆర్టీసీ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న రోగులకు అందించిన మందుల ఖర్చు రూ. 9.14 కోట్లు అవగా ప్రస్తుత ఉద్యోగుల రెఫరల్ వ్యయం రూ. 28.45 కోట్లు, విశ్రాంత ఉద్యోగుల రెఫరల్ వ్యయం రూ. 5 కోట్లు అయింది. గడచిన మూడేళ్లలో సొంత ఆసుపత్రిలో చికిత్స చేసి మందులు ఇచ్చినందుకు రూ. 32 కోట్లు ఖర్చవగా రెఫరల్ ఆసుపత్రులకు చెల్లించిన బిల్లు మాత్రం రూ. 105 కోట్ల వరకు అయింది. చేతిలో చాలినన్ని నిధుల్లేక కొన్నేళ్లుగా కొత్త బస్సులు కొనడాన్ని నిలిపివేసిన ఆర్టీసీ... గత్యంతరం లేని స్థితిలో ఈ బిల్లుల భారాన్ని మాత్రం మోయాల్సి వస్తోంది. ప్రభుత్వ వైద్యుల సేవలు వాడుకునే అవకాశం ఉన్నా... ఆర్టీసీలో దాదాపు 51 వేల మంది పనిచేస్తున్నారు. వారితోపాటు వారి కుటుంబ సభ్యులు కలిపి 2 లక్షల మంది కంటే ఎక్కువ ఉన్నారు. ఇంతమందికి వైద్యం అందించే ప్రధాన ఆసుపత్రి అయినందున ఇక్కడ అన్ని విభాగాలకు చెందిన వైద్యులు, చికిత్సకు అవసరమైన పరికరాలు ఉండాలి. అయితే సాధారణ వైద్యులు మాత్రమే ఉండటంతో గుండె, కిడ్నీ, ఆర్థో సహా ఇతర పెద్ద సమస్యలతో వచ్చే వారిని నేరుగా రెఫరల్ ఆసుపత్రులకు పంపుతున్నారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రిల్లో ఉన్న స్పెషలిస్టు వైద్యుల్లో కొందరిని గుర్తించి విడతలవారీగా ఈ ఆసుపత్రికి వచ్చి వైద్యం అందించేలా చేసే అవకాశం ఉన్నా అధికారులు అలా చేయడం లేదు. అలాగే కొన్ని ప్రైవేటు ఆసుపత్రులకు చెందిన వైద్యులను గౌరవ భృతిపై పిలిపించే ఒప్పందం ఉన్నా అది కూడా సరిగా అమలు కావడం లేదు. దీంతో స్కానింగ్, ఎమ్మారైలకు కూడా వేరే చోటకు వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడ వసతులు, స్పెషలిస్టు డాక్టర్లు లేనందున ఈ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడం కంటే ప్రైవేటు ఆసుపత్రులకు రెఫర్ చేయించుకొనేందుకే ఉద్యోగులు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల కొత్తగా ఆర్టీసీ కొన్ని ప్రైవేటు ఆసుపత్రులతో రెఫరల్ జాబితాను విడుదల చేసింది. అందులో మూడు మాత్రమే పెద్ద ఆసుపత్రులు ఉండటంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘తార్నాక ఆసుపత్రిలో అన్ని విభాగాలకు పూర్తిస్థాయి వసతులు, స్పెషలిస్టు వైద్యులు లేనందున రెఫరల్ ఆసుపత్రుల జాబితాలో సన్‌షైన్, కిమ్స్, గ్లోబుల్, యశోద, అపోలో, ఉషా ముళ్లపూడి, కామినేని లాంటి ఆసుపత్రులను కూడా చేర్చాలి’అని ఆర్టీసీ బోర్డు మాజీ డైరక్టర్ నాగేశ్వరరావు ఓ ప్రకటనలో కోరారు. సొంత ఆసుపత్రిపై నమ్మకం లేక ఇలాంటి డిమాండ్లు తరచూ వినిపిస్తున్నాయి. 2015–16 2016–17 2017–18 2018–19 (అంకెలు రూ. కోట్లలో) మందుల ఖర్చు 9.14 5.91 17.15 8.95 ప్రైవేట్ రెఫరల్ వ్యయం 33.51 38.20 35.21 31.69 -
మీ ద్రవ్యోల్బణం రేటు ఎంత?
ఆర్థిక ప్రణాళికలకు ధరల స్పీడ్ గుర్తించాలి... భవిష్యత్తు లక్ష్యాలు, ఆర్థిక ప్రణాళికల విషయంలో పరిగణనలోకి తీసుకోవాల్సిన వాటిల్లో అత్యంత ముఖ్యమైనది ద్రవ్యోల్బణం. చాలా మంది ఈ ద్రవ్యోల్బణాన్ని పెద్దగా పట్టించుకోరు. వాస్తవంగా మీరు ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణం రేటు కంటే మీ అంచనాలు కనీసం 1–2 శాతం తక్కువ ఉన్నా కానీ, లక్ష్యాలకు విఘాతం ఏర్పడినట్టే. అందుకే ఆర్థిక ప్రణాళికల్లో ద్రవ్యోల్బణం విషయంలో అంచనాలు కచ్చితంగా ఉండడం ఎంతో అవసరం అవుతుంది. నివసించే ప్రాంతం కూడా... మీరు పట్టణాల్లో ఉంటున్నారా లేక గ్రామీణ ప్రాంతాల్లోనా అన్నది కూడా మీ వ్యక్తిగత ద్రవ్యోల్బణ రేటు, అధికారిక ద్రవ్యోల్బణ రేటు మధ్య వ్యత్యాసానికి కారణమవుతుంది. ఎందుకంటే ఈ ఏడాది ఏప్రిల్ వరకు చూసుకుంటే, పట్టణాల్లో నివసించే వారు 4.2 శాతం ద్రవ్యోల్బణ ప్రభావాన్ని చవిచూడగా, ఇదే కాలంలో గ్రామీణ ప్రజలు ఎదుర్కొన్న రేటు 1.8 శాతంగానే ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో సీపీఐ ద్రవ్యోల్బణం 1–2 శాతం మధ్య నమోదు కాగా, కేరళలో ఇది 5 శాతం స్థాయిలో ఉంది. అందుకనే పట్టణాల్లో ఉండేవారు, దక్షిణాది రాష్ట్రాల్లో నివాసం ఉండే వారు తమ వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికల రచనకు అధికారిక ద్రవ్యోల్బణ రేటు కంటే అదనంగా మరో 2 శాతాన్ని కలిపి పరిగణనలోకి తీసుకోవాలన్నది ఆర్థిక నిపుణుల సూచన. ఇక మీ వ్యక్తిగత ద్రవ్యోల్బణం ఎంతన్నది కచ్చితంగా తెలుసుకునేందుకు, మీ నెలవారీ ఇంటి ఖర్చులను జాగ్రత్తగా పరిశీలించుకోవడం మరో మార్గం. దాంతో మీ పరిస్థితులకు తగ్గ ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే, ఈ విషయంలో మీరు పెద్దగా శ్రమ పడాల్సిన పని లేకుండా ఆ పనిచేసి పెట్టే మొబైల్ యాప్స్ కూడా ఉన్నాయి. సంబంధిత యాప్స్ పెరిగే ఖర్చులతోపాటు, మీ జీవనశైలి మార్పులను ట్రాక్ చేస్తాయి. లక్ష్యాలకు అనుగుణంగా అంచనాలు రిటైర్మెంట్ వంటి దీర్ఘకాలిక ప్రణాళికలకు సంబంధించి పెట్టుబడులకు పైన చెప్పుకున్న విధానాలు అక్కరకు వస్తాయి. అయితే, మీ పిల్లల విద్య లేదా ఇంటి కొనుగోలు లేదా మీ ఆరోగ్య సంరక్షణ వంటి ప్రత్యేక లక్ష్యాల కోసం నిధిని సమకూర్చుకోదలిచిన వారు, ఆయా విభాగాల్లో పెరిగే రేట్లకు అనుగుణంగా ద్రవ్యోల్బణ అంచనాలు వేసుకోవాలని అంటున్నారు నిపుణులు. ఉదాహరణకు మీ పిల్లల ఉన్నత విద్యనే తీసుకోండి. చాలా వరకు ఫైనాన్షియల్ కాలిక్యులేటర్లు విద్యా ద్రవ్యోల్బణ రేటును 7–8 శాతం మధ్య అంచనాగా చూపిస్తుంటాయి. అయితే, ప్రతిష్టాత్మక, పేరున్న విద్యా సంస్థల్లో చదివించాలన్న లక్ష్యంతో ఉన్న వారు, ఈ రేటుకు అదనంగానే పరిగణనలోకి తీసుకోవాలి. 2012లో ఐఐటీల్లో సాధారణ కేటగిరీలో ఇంజనీరింగ్ విద్య కోసం ఏడాదికి రూ.50వేలు వెచ్చించాల్సి రాగా, ఈ రోజు అదే కేటగిరీ ఫీజు రూ.2 లక్షలకు చేరింది. అంటే అక్షరాలా 22 శాతం ద్రవ్యోల్బణ రేటు. బిట్స్ పిలానీ అయితే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ఫీజులను ఏటా 15 శాతం పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఇక ఐఐఎం అహ్మదాబాద్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు ఫీజు ఐదేళ్ల క్రితం రూ.16.5 లక్షలు ఉంటే, అదిప్పుడు రూ.23 లక్షలకు పెరిగింది. ఇక ఇతర ఇంజనీరింగ్ లేదా మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూషన్లలో ఫీజుల పెరుగుదల వీటి కంటే కాస్త తక్కువగా ఉంది. అందుకని విద్యా ద్రవ్యోల్బణం అనేది పిల్లలను ఏ కోర్సుల వైపు పంపిద్దామనుకుంటున్నారనే దానిపైనా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే, ఒకవేళ మీ పిల్లలను ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపించాలనుకుంటే, కచ్చితంగా డాలర్‌తో రూపాయి తరుగుదల ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కోర్సు ఫీజుల పెరుగుదల ప్రభావానికి తోడు, రూపాయి క్షీణతను 4–5 శాతం మధ్య పరిగణనలోకి తీసుకోవచ్చని నిపుణుల సూచన. ఇల్లు విషయంలో... ఇక ఇల్లు కొనుగోలు చేయాలన్నది మీ లక్ష్యం అయితే, సాధారణ ద్రవ్యోల్బణ రేటు కాకుండా, ప్రాపర్టీ మార్కెట్లో ధరల పెరుగుదల ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. పట్టణంలో అయితే మీరు ఎంచుకున్న ప్రాంతం డిమాండ్ ఉన్నదా లేక శివారులోనా లేక మరో చోటా అనే దాని ఆధారంగా ద్రవ్యోల్బణ ప్రభావంలో మార్పు వస్తుంది. ప్రాపర్టీ ధరలను తెలియజేసే నేషనల్ హౌసింగ్ బ్యాంక్ రెసిడెక్స్ గణాంకాలను పరిశీలిస్తే... ఢిల్లీ, గురుగ్రామ్‌లో 2013–2018 మధ్య ప్రాపర్టీ ధరలు ఫ్లాట్‌గా ఉండగా, హైదరాబాద్ మార్కెట్లో 6.9 శాతం, వైజాగ్, కోచిలో 7 శాతం, బెంగళూరులో 7.4 శాతం, చెన్నైలో 5.3 శాతం చొప్పున ఏటేటా పెరిగినట్టు తెలుస్తోంది. ఇక ఆరోగ్య సంరక్షణ అవసరాల కోసం ఏర్పాటు చేసుకునే నిధికి 6–7 శాతం ద్రవ్యోల్బణ రేటును పరిగణనలోకి తీసుకుంటే అవసరమైన సందర్భంలో నిధులకు కటకట ఎదురవకుండా ఉంటుంది. ముఖ్యంగా ఇటీవలి సంవత్సరాల్లో వైద్య చికిత్సల వ్యయాలు రెండంకెల స్థాయిలో పెరిగిపోవడం గమనార్హం. ఊహించని వైద్య అవసరాల కోసం ఓ నిధిని ఏర్పాటు చేసుకునేట్టు అయితే, 10 శాతం ద్రవ్యోల్బణ రేటును పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతీ నెలా వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంటుంది. దీన్నే దేశంలో ఎక్కువ మంది అనుసరిస్తుంటారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేసిన గణాంకాల ఆధారంగా గత ఆరేళ్లలో సగటు ద్రవ్యోల్బణం 4.8 శాతంగా ఉన్నట్టు తెలుస్తోంది. కానీ, మీ ఆర్థిక ప్రణాళికలకు ఈ రేటును పరిగణనలోకి తీసుకుంటే అది తప్పులో కాలేసినట్టే అవుతుంది. ఎందుకంటే, మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే... ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే సీపీఐ ద్రవ్యోల్బణం, మీరు వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణం కంటే తక్కువే ఉంటుంది. సీపీఐ అన్నది దేశంలో సాధారణ ఆదాయం కలిగిన గృహస్థులపై ఉండే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. భిన్న వస్తు, సేవల ఆధారంగా తక్కువ ఆదాయం కలిగిన ఇంటి ఖర్చులకు ప్రాధాన్యం ఇస్తుంది. ఉదాహరణకు ఆహారం, పానీయాలకు ఈ సూచీలో 46 శాతం వెయిటేజీ ఉంది. అదే సమయంలో ఇంటి కోసం చేసే అద్దె ఖర్చులకు 10 శాతం, రవాణా, హెల్త్, విద్య, వినోదం అన్నింటికీ కలిపి 25 శాతమే వెయిటేజీ ఉంది. కానీ, మధ్యస్త ఆదాయం నుంచి అధిక ఆదాయ వర్గాలు ఆహారం, పానీయాలకు కాస్త తక్కువగా, అదే సమయంలో ఇల్లు, సేవలపై ఎక్కువగా వెచ్చిస్తుంటారు. మరి ఆహార ధరలు తగ్గుతుంటే, సేవలు ఖరీదవుతున్నాయి. కనుక సగటు ఇంటిపై ద్రవ్యోల్బణం విషయంలో సీపీఐ రేటు వాస్తవికంగా ఉండదని గమనించాలి. సీపీఐ రేటు ఆహారోత్పత్తుల ధరల పెరుగుదల గత ఆరేళ్లలో 4 శాతంగానే అని చూపిస్తున్నప్పటికీ... సగటు గృహస్థులు ఎదుర్కొన్న రేటు 7 శాతంగా ఉంది. అదే విద్యా సంబంధిత ద్రవ్యోల్బణం 6.3 శాతం, ఆరోగ్య సంరక్షణ వ్యయాలపై 5.8 శాతం ద్రవ్యోల్బణ ప్రభావం ఉంది. అందుకే సీపీఐ ద్రవ్యోల్బణంలో ఆహారోత్పత్తుల రేటు కంటే కూడా సేవల రంగ రేటును పరిగణనలోకి తీసుకోవడం సమంజసమన్నది నిపుణుల అభిప్రాయం. -
నిధుల సమీకరణపై దృష్టి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక అవసరాలు భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో.. అవసరమైన నిధుల సమీకరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2019–20లోని తదుపరి 3 త్రైమాసికాలకు అవసరమైన నిధులను సమీకరించేందుకు అందుబాటులో ఉన్న మార్గాలను అన్వేషిస్తోంది. వివిధ ఆదాయ మార్గాల ద్వారా రానున్న నెలల్లో రాష్ట్రానికి వచ్చే నిధులను అత్యంత జాగ్రత్తగా వినియోగించుకోవడంతోపాటుగా పెరిగిన ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి అవసరమైన నిధులను బయటి ఆర్థిక సంస్థల నుంచి రాబట్టేందుకు ఉన్న అవకాశాలను ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల సలహాదారు, రిటైర్డు ఐఏఎస్ జీఆర్ రెడ్డికి ప్రభుత్వం ఈ బాధ్యతను అప్పగించినట్లు తెలిసింది. వచ్చేనెలలో పూర్తి స్థాయి రాష్ట్ర బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టాల్సి ఉండగా, ఆర్థిక అవసరాలు, నిధుల లభ్యతపై స్పష్టత కోసం ఈ కసరత్తును ప్రారంభించింది. హామీల పూర్తికే భారీగా నిధులు శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన కొత్త హామీలను నెరవేర్చడం, పెండింగ్ బిల్లుల చెల్లింపులు, ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేయడం, నిర్మాణంలో ఉన్న సాగునీటి పథకాలు, ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టుల కొనసాగింపునకు రానున్న రోజుల్లో భారీగా నిధులు అవసరం కానుంది. ఇదే విషయాన్ని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్నికల హామీల అమలుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించడంతో రాష్ట్ర సంక్షేమ పథకాల వ్యయం రూ.40,000 కోట్ల నుంచి రూ.60,000 కోట్లకు పెరిగిపోయింది. రైతుబంధు పథకం కింద అన్నదాతలకు చేసే ఆర్థిక సాయాన్ని ప్రస్తుత ఖరీఫ్ నుంచి ఎకరానికి రూ.4వేల నుంచి రూ.5వేలకు పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ పథకం వార్షిక వ్యయం ఒక్కసారిగా రూ.12,000 కోట్ల నుంచి రూ.15,000 కోట్లకు పెరిగింది. ఇప్పటి వరకు 70% మందికి ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించగా, ఇంకా 30% మంది సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అదే విధంగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పంపిణీ చేస్తున్న సామాజిక పింఛన్లను రెట్టింపు చేసి ప్రస్తుత జూలై నెల నుంచి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో సామాజిక పింఛన్ల వార్షిక భారం రూ.6000 కోట్ల నుంచి రూ.12వేల కోట్లకు చేరింది. దీనికి తోడు ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు సంబంధించి రూ.10,000 కోట్ల వరకు పెండింగ్ బిల్లులను ప్రభుత్వం కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. పీఆర్సీ నిర్ణయం తీసుకుంటే.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ఖజానాపై ఏటా మరో రూ.4వేల కోట్ల నుంచి రూ.5వేల కోట్ల వరకు అదనపు భారం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు మినహాయిస్తే రాష్ట్రంలో నిర్మిస్తున్న ఇతర నీటిపారుదల ప్రాజెక్టులకు రాష్ట్రఖజానా నుంచే నిధులు వెచ్చించాల్సి ఉంది. మిషన్ కాకతీయతోసహా నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుల కొనసాగింపుకు మరో రూ.15 వేల కోట్లను ఈ ఏడాది ఖర్చు చేయకతప్పదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అవసరాలను తీర్చాలంటే ప్రస్తుతం రాష్ట్రానికి వస్తున్న ఆదాయానికి తోడుగా మరో రూ.40వేల కోట్ల నిధులు అవసరమవుతాయని ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు నిధులు సమీకరించేందుకు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు సంప్రదింపులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఎఫ్ఆర్బీఎం పరిమితులకు లోబడి బయటి సంస్థల నుంచి ఆర్థిక సహాయం పొందేందుకున్న అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అదే విధంగా కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టుల కోసం కార్పొరేషన్లు స్థాపించి నిధులను సమీకరించిన తీరులోనే మరికొన్ని మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల విషయంలో కొత్త కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలియవచ్చింది. -
పరిశ్రమలకు ప్రోత్సాహమేదీ?
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల శాఖకు జరిగిన కేటాయింపులను గత ఏడాదితో పోలిస్తే 2016-17 ఆర్థిక బడ్జెట్లో రూ.6.64 కోట్ల మేర కోతలు విధిస్తూ ఆర్థిక మంత్రి ప్రతిపాదనలు సమర్పించారు. గత ఏడాది పరిశ్రమల శాఖకు రూ.973.73 కోట్లను ప్రణాళిక, ప్రణాళికేతర పద్దుల క్రింద ప్రతిపాదించగా.. ఈ ఏడాది రూ.967.09 కోట్లకు పరిమితం చేశారు. ఇందులో రూ.859.63 కోట్లను ప్రణాళికా వ్యయం కింద ప్రతిపాదించారు. గతేడాది ప్రతిపాదించిన బడ్జెట్లో ఇప్పటి వరకు రూ.689.26 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు సవరణ ప్రతిపాదించారు. ప్రస్తుత బడ్జెట్లో పరిశ్రమల విభాగానికి మినహా.. ఇతర అనుబంధ శాఖల కోటాలో భారీగా కోత విధించారు. విదేశీ వాణిజ్యం, ఎగుమతులు, చక్కెర పరిశ్రమ శాఖ కు నయాపైసా విదల్చలేదు. చక్కెర శాఖను వ్యవసాయ శాఖలో.. విదేశీ వాణిజ్య విభాగాన్ని టీఎస్ఐఐసీలో విలీనం చేస్తారనే వార్తల నేపథ్యంలో నయాపైసా కేటాయించక పోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిజాం దక్కన్ షుగర్స్ పునరుద్ధరణకు ప్రభుత్వం చొరవ చూపుతుందని ఆశించినా.. బడ్జెట్లో ప్రస్తావనకు రాలేదు. ఆహార నిల్వ, గిడ్డంగులకు గత ఏడాది రూ.101.56 కోట్లు ప్రతిపాదించి, రూ.60.26 కోట్లు ఖర్చు చేయగా.. ఈ ఏడాది ప్రతిపాదన ల్లో కేవలం రూ.10 కోట్లకు పరిమి తం చేశారు. చేనేత, జౌళి శాఖకు సంబంధించి కేటాయింపుల్లోనూ భారీగా కోతలు విధించారు. గనులు, భూగర్భ వనరుల శాఖకు గత ఏడాది మాదిరిగానే ప్రణాళికా వ్యయం కింద రూ.కోటి కేటాయించారు. గ్రామీణ పరిశ్రమలు, ఇతర పరిశ్రమలకు గతంలో రూ.562.88 కోట్లు ప్రతిపాదించగా.. ప్రస్తుత బడ్జెట్లో రూ.778.63 కోట్లు ప్రతిపాదించారు. -
ఎవరి నోరు తీపో..
ఎవరి రుచులు వారివే... ► రైతులు, కార్పొరేట్లపై ప్రత్యేక దృష్టి? ► వేతన జీవులకు ఈసారి నిరాశే ! ► ఐటీ మినహాయింపు పరిమితులు యథాతథం ► ధనికులపై ఇంకాస్త వడ్డింపు? ► సేవల పన్ను పెంపు.. స్టార్టప్ సెస్సు విధింపు! ఐటీ యథాతథం ఉద్యోగులు, మధ్యతరగతి వర్గాలు ఎంతగానో ఎదురుచూసే ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి (బేసిక్ లిమిట్ ప్రస్తుతం రూ.2.5 లక్షలు)లో ఎలాంటి మార్పులూ చేయకపోవచ్చని అంచనా. పన్ను శ్లాబ్‌లను యథాతథంగానే కొనసాగిస్తూ.. కొన్ని మినహాయింపుల్లో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. కార్మికులు అధికంగా ఉండే తోలు, ఆభరణాల రంగాలకు పన్ను రాయితీలు కల్పించొచ్చు. పరిశ్రమలకు ప్రాధాన్యం.. కార్పొరేట్ పెట్టుబడులను పెంచేందుకు ప్రాధాన్యం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీతో పోలిస్తే ఈ పెట్టుబడులు 1.7 శాతంగా ఉండగా.. దీన్ని వచ్చే ఏడాది 2 శాతం వరకూ పెంచేందుకు చర్యలు తీసుకోవచ్చు. మరిన్ని రంగాల్లో విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరవొచ్చు. మొండి బకాయిల భారంతో ఇక్కట్లు ఎదుర్కొంటున్న బ్యాంకులకు మరింత మూలధనం సమకూర్చే దిశగా చర్యలు చేపట్టవచ్చు. అన్నదాతను ఆదుకుంటారా? వరుసగా రెండేళ్లు కరువు నెలకొన్న నేపథ్యంలో వ్యవసాయ రంగానికి కేటాయింపులు పెంచే అవకాశం ఉంది. పంటల బీమా పథకాన్ని విస్తరించడం, సాగునీటి పారుదలకు కేటాయింపులు పెంచడం వంటివి ప్రకటించవచ్చు. గ్రామీణ ఉపాధి పథకానికి కేటాయింపులు పెంచే అవకాశం ఉంది. చిన్న సాగునీటి పథకాలు, వర్షపు నీటి నిల్వ సదుపాయాలకు కేటాయింపులు ఉండొచ్చు. మేకిన్ ఇండియాకు పెద్దపీట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మేకిన్ ఇండియాకు పెద్దపీట వేయొచ్చు. ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఆర్థిక, అధికారిక అడ్డంకులు తొలగించేందుకు చర్యలు ప్రకటించవచ్చు. తయారీ రంగానికి నూరు శాతం ట్యాక్స్ క్రెడిట్‌ను ప్రకటించవచ్చని అంచనా. విదేశీ ఇన్వెస్టర్లకు పన్ను ప్రోత్సాహకాలిస్తూ సంస్కరణలు మరింత వేగంగా అమలు చేసే చర్యలు తీసుకోవచ్చు. ఎవరి నోరు తీపో.. వేతన జీవుల నుంచి రైతన్న వరకూ.. కార్పొరేట్ల నుంచి సామాన్యుడి దాకా దేశమంతా ఎదురుచూసే రోజు వ చ్చింది! కేంద్రంలో మోదీ సర్కారు కొలువుదీరాక వరుసగా మూడో బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం ఉదయం 11 గంటలకు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వ పన్ను వసూళ్లలో మందగమనం, ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులు, ద్రవ్యలోటుకు కళ్లెం వేయాల్సిన పరిస్థితుల నేపథ్యంలో ఈసారి బడ్జెట్ జైట్లీకి బడ్జెట్ కత్తిమీద సామేనని ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు. మొత్తమ్మీద ఈసారి తాయిలాల విషయంలో ఆచితూచి వ్యవహరించవచ్చని.. కొంత కఠిన వైఖరి అవలంబించే అవకాశం ఉందనేది అధిక శాతం మంది విశ్లేషకుల అభిప్రాయం. న్యూఢిల్లీ: సామాజిక పథకాలకు బడ్జెట్లో తప్పనిసరిగా నిధులను పెంచాల్సిన ఒత్తిడిని ఆర్థికమంత్రి జైట్లీ ఎదుర్కోనున్నారు. దేశంలో వరుసగా రెండేళ్లపాటు కరువు పరిస్థితులు నెలకొనడంతో గ్రామీణ భారతావని దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటుండటమే ఇందుకు ప్రధాన కారణం. మరోవైపు ప్రధాని మేకిన్ ఇండియా కలలను నెరవేర్చాలంటే.. విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ప్రోత్సాహకాలను పెంచడం, సంస్కరణలను మరింతగా పరుగులు పెట్టించడం వంటివి కూడా ముఖ్యమే. ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలు కారణంగా ప్రభుత్వంపై రూ.1.02 లక్షల కోట్ల అదనపు భారం పడనుంది. వీటికి తోడు గత బడ్జెట్లో ప్రకటించినట్లుగా జీడీపీలో ద్రవ్యలోటును రానున్న ఆర్థిక సంవత్సరంలో 3.5 శాతానికి కట్టడి చేసే లక్ష్యానికి కట్టుబడి ఉంటారా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు లక్ష్యం 3.9 శాతం నెరవేరే అవకాశం లేదని.. ఇది 4 శాతానికి పైనే ఉండొచ్చన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే తరుణంలో కార్పొరేట్ పన్నును నాలుగేళ్లలో క్రమంగా ఇప్పుడున్న 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గిస్తామని గత బడ్జెట్లోనే ప్రకటించారు. ఈ ప్రక్రియను ఈ ఆర్థిక సంవత్సరం నుంచే అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. కార్పొరేట్లకు ఇస్తున్న పన్ను రాయితీల ఉపసంహరణపై కూడా కీలక ప్రకటనలు వెలువడనున్నాయి. బడ్జెట్లో ఇతర అంచనాలు ఇవీ.. సేవా పన్ను పెంచొచ్చు పెరగనున్న వ్యయాలకు నిధుల కోసం పరోక్ష పన్నుల పెంపు, కొత్తగా పన్నుల విధింపు వంటివి ఉండొచ్చు. సేవల పన్నును ఇప్పటికే 14.5 శాతానికి పెంచిన కేంద్రం (0.5 శాతం స్వచ్ఛ భారత్ సెస్సుతో కలిపి) దీన్ని ఈ బడ్జెట్లో మరింత పెంచే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమల్లోకి వస్తే సేవల పన్నును 18 శాతానికి పెంచాల్సి వస్తుంది. దీనికి అనుగుణంగా ప్రజలను సంసిద్ధం చేసేందుకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. క్రూడ్‌పై మళ్లీ దిగుమతి సుంకం అంతర్జాతీయంగా ముడి చమురు(క్రూడ్) ధరలు తీవ్రంగా పడిపోయిన నేపథ్యంలో దిగుమతి చేసుకునే క్రూడ్, పెట్రోలు, డీజిల్‌లపై మళ్లీ కస్టమ్స్ సుంకం విధింపునకు అవకాశం ఉంది. క్రూడ్ రేట్లు 100 డాలర్లకు చేరడంతో 2011లో దీన్ని తొలగించారు. ఇతరత్రా.. ► బంగారం అధిక దిగుమతుల కారణంగా వాణిజ్య లోటు పెరిగిపోవడం, రూపాయి బలహీనతల కారణంగా పుత్తడిపై దిగుమతి సుంకం మరింత పెంచేలా చర్యలు. ► పారిశ్రామిక రంగంలో ప్రైవేటు పెట్టుబడులు ఆశించినంతగా పెరగనందున.. మౌలిక రంగంలో పెట్టుబడుల పెంపు, ప్రభుత్వ వ్యయాలను పెంచడంపై దృష్టి పెట్టొచ్చు. ► గ్లోబల్ డిమాండ్ పడిపోవడం, అధిక సరఫరా కారణంగా సమస్యల్లోకి కూరుకుపోయిన కమోడిటీ ఆధారిత రంగాలకు చేయూతనిచ్చేందుకు రక్షణాత్మక చర్యలు ఉండొచ్చు. ► మొండి బకాయిల భారంతో ఇక్కట్లు ఎదుర్కొంటున్న బ్యాంకులకు మరింత మూలధనం సమకూర్చే దిశగా చర్యలు. స్టార్టప్స్‌కు చేయూత మోదీ ఇటీవల జపిస్తున్న స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా కార్యక్రమాలకు నిధుల బూ స్ట్ ఇచ్చేందుకు చర్యలు ఉండొచ్చు. దీని కోసం కొత్తగా సెస్సు విధిం చొచ్చు. ‘రాబిన్‌హుడ్’ ట్యాక్స్! మోదీ సర్కారు ఖజానా నింపుకోవడానికి సంపన్నుల (సూపర్ రిచ్)పై మరింతగా పన్నుల కొరడా ఝళిపించే అవాకాశం ఉంది. ఇప్పటికే ఆర్థిక సర్వే కూడా అధికాదాయ వర్గాలపై తగినంత పన్ను విధించడం లేదని.. దీన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో సూపర్ రిచ్ నుంచి అదనంగా పిండుకునే అవకాశం ఉందని(దీన్నే రాబిన్‌హుడ్ ట్యాక్స్‌గా చెబుతారు) విశ్లేషకులు పేర్కొంటున్నారు. గతేడాది బడ్జెట్లో వెల్త్ ట్యాక్స్‌ను తొలగించిన సర్కారు.. రూ. కోటికి పైగా వార్షిక ఆదాయం ఉన్న సూపర్ రిచ్‌పై ఉన్న 10 శాతం సర్‌చార్జీ(ఆదాయపు పన్ను కాకుండా అదనంగా విధించేది)ని 12 శాతానికి పెంచారు. ఇప్పుడు దీన్ని మరింత పెంచొచ్చని అంచనా. -
నేల విడిచి సాము
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటుకు సమర్పించిన 2016-17 ఆర్థిక సర్వే నిరాశాజనకమైన ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో భారత ఆర్థిక వృద్ధి పట్ల ఆశావహ దృక్పథాన్ని ప్రదర్శించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీ యోత్పత్తిలో 7 నుంచి 7.5 వృద్ధి రేటునూ, ఆ తర్వాతి రెండేళ్లలో 8 నుంచి 10 శాతం వృద్ధి రేటునూ సాధిస్తామని సర్వే పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని ప్రతికూల పరిస్థితుల ప్రాబల్యాన్ని సర్వే తక్కువ చేసి చూసినట్టుంది. భారత్, వృద్ధికి బలీయమైన కేంద్రంగా ఉన్నదన్న అంతర్జాతీయ ఆర్థిక సంస్థల అంచనాకు ఎక్కువ ప్రాధ్యాన్యం ఇచ్చినట్టుంది. 2016-17 తదుపరి రెండేళ్లలో 8.1 నుంచి 8.5 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వృద్ధి రేట్ల సాధనతోపాటూ కోశ (ఫిస్కల్) లోటు లక్ష్యాలను సాధిస్తామని, ఈ ఏడాది లోటును 3.9 శాతానికి, వచ్చే ఏడాది 3.5 శాతానికి తగ్గిస్తామని సర్వే తెలిపింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి ఈ ఏడాది 3 శాతం, వచ్చే ఏడాది 3.3 శాతంగా ఉంటుందని సంపన్న దేశాల సంస్థ, ఓఈసీడీ తాజా అంచనా. ఆ మాత్రం వృద్ధి కూడా కష్టమేనని, సంపన్న దేశాల వృద్ధి 2 శాతమన్న అంచనా పూర్తి అవాస్తవికమైనదని నిపుణులు భావిస్తున్నారు. గత ఏడాది ద్వితీయార్థం నుంచి మొదలై దఫదఫాలుగా కొనసాగుతున్న మార్కెట్ పతనాలు ప్రపంచం దీర్ఘకాలిక ఆర్థిక ప్రతిష్టంభనలోకో లేక ఒక విధమైన మాంద్యంలోకో దిగజారుతున్నదని సూచిస్తున్నాయని ఆర్థిక వేత్తలు హెచ్చరి స్తున్నారు. 2008 నాటి సంక్షోభ కాలంలో ప్రపంచ వృద్ధికి చోదక శక్తులుగా నిలిచిన వేగంగా వృద్ధి చెందుతున్న వ్యవస్థల్లో చైనా పతనం, యువాన్ విలువ తగ్గింపు భారత్ సహా ప్రపంచాన్ని కుదిపేశాయి. బ్రెజిల్ వృద్ధి క్షీణత కూడా ఆందోళన కరంగా ఉంది. ఇక రష్యా, జపాన్‌లాంటి దేశాలు కూడా వృద్ధి క్షీణతలను నమోదు చేస్తున్నాయి. 2014 డిసెంబర్ నుంచి 13 నెలలుగా మన ఎగుమతులు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. ఏప్రిల్-జనవరి మధ్యనే 17.65 శాతం తగ్గాయని సర్వే తెలిపింది. ప్రపంచ డిమాండు క్షీణతే ఎగుమతి ఆధారిత చైనా ఆర్థిక వ్యవస్థ పతనానికి ముఖ్య కారణం. ఈ పరిస్థితులు తాత్కాలి కమైనవనే సర్వే అంచనా నిజమనిపించదు. వచ్చే ఏడాది ఎగుమతులు పుంజు కుంటాయని సర్వే ఆశిం చడం, దానిపై ఆధారపడి కరెంటు అకౌంటు లోటు జీడీపీలో 1-1.5గా ఉంటుంద నడం వాస్తవికమైన అంచనాలేనా అని అనుమా నించక తప్పదు. గత ఏడాది 7.4, ఈ ఏడాది 7.6 వృద్ధి రే ట్లతో మన దేశమే అత్యధిక వృద్ధిని నమోదు చేసిందనడం వాస్తవమే. కానీ, గత ఏడాది లక్ష్యంగా పెట్టుకున్న దాని కంటే తక్కువ వృద్ధిని నమోదు చేయడమంటే తక్కువ ఆదాయాలు, తక్కువ రాబడి అని కూడా అర్థం. పైగా ప్రపంచ డిమాండే కాదు దేశీయ డిమాండు కూడా తక్కువగా ఉన్నదని జైట్లీ అంగీకరించారు. ఈ పరిస్థితుల్లో కూడా గత ఏడాది కంటే పన్నుల రాబడిని పెంచుకోగలమని సర్వే చెబుతోంది. సంపన్నులకు ఇస్తున్న లక్ష కోట్ల రూపాయల పన్ను రాయితీల ఉపసంహరణను ఎలా అమలు చేస్తారో బడ్జెట్ సూచించవచ్చు. ఆదాయపు పన్ను చెల్లింపుదార్ల బేస్‌ను 5 శాతం నుంచి 20 శాతానికి పెంచుకోవాలనే సర్వే లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి ఆదాయపు పన్ను మినహాయింపు గరిష్ట పరిమితిని పెంచే అవకాశాలు లేనట్టేనని అనుకోవచ్చు. వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆర్బీఐకి, ప్రభుత్వానికి మధ్య రగులుతున్న వివాదాన్ని సర్వే పరోక్షంగా ప్రస్తావించింది. ఆసియా కరెన్సీల విలువలో సర్దుబాట్లు తప్పవంటూ రూపాయి ఒడిదుడుకులకు అవకాశాలను, రూపాయి విలువ సర్దుబాటు అంటే మరింత తగ్గడం అవసరమని సూచించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణాన్ని 4.5-5 శాతానికి తగ్గిస్తామని అది పేర్కొంది. చమురు ధరలు తగ్గడం అనే అనుకూలాంశం ఉన్నా, ఏడవ పే కమిషన్ వేతనాలు, సైన్యానికి ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ అమలు ప్రభావం ద్రవ్యోల్బణంపై ఉండదని సర్వే భావించినట్టుంది. ఇటు ఖజానాపై వత్తిడి పెరుగుతుండగా, అటు రాబడులు పెద్దగాలేని పరిస్థితి, ఎగుమతులలో క్షీణత అనే రేపటి స్థూల జాతీయ ఆర్థిక చిత్ర ం కళ్ల ముందు నిలుస్తుండగా... సర్వే చెప్పిన 7-7.5 వృద్ధి ఎలా సాధ్యమనే ప్రశ్న తలెత్తడం సహజం. ప్రైవేటు పెట్టుబడి రాయితీలను పొందడమే తప్ప, భారీ మదుపులకు వచ్చేసరికి ఊగిసలాడుతూ, తాత్సారం చేస్తూ, సంశయిస్తూనే గడిపేస్తోంది. ప్రైవేటు రంగం ఆశించిన భారీ పెట్టుబడులను కుమ్మరించడం లేదని ఆర్థిక మంత్రికి తెలియంది కాదు. ప్రభుత్వ పెట్టుబడుల వృద్ధిని సర్వే సూచించింది. కోశ లోటును 3.5 శాతానికి తగ్గించాలని యత్నిస్తూ భారీ ప్రభుత్వ పెట్టుబడులనడం పరస్పర విరుద్ధ దిశలకు బండిని ఒకేసారి లాగడం లాంటిదే. 2013 నుంచి కేంద్ర బ్యాంకు రేట్లను (ఫెడ్ రేట్) తగ్గిస్తామంటూ గత డిసెంబర్లోనే 25 పాయింట్లు తగ్గించిన అమెరికా, రెండు నెలలు గడిచేలోగానే పరిమాణాత్మక ద్రవ్య సడలింపు గురించి మాట్లాడుతున్నదంటేనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎంతటి తిరోగమనంలో ఉన్నదో అర్థమవుతుంది. ఇటువంటి అసాధారణ పరిస్థితుల్లో కోశ లోటు తగ్గింపునకు కట్టుబడకపోతే... భారీ ఎత్తున ప్రభుత్వ పెట్టుబడులను పెట్టి దేశీయ డిమాండును, ఉపాధిని పెంచడానికి, వృద్ధికి ప్రోత్సాహం కల్పించడానికి ఆ నిధులు తోడ్పడేవి. అందుకు బదులుగా అది కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు, బ్యాంకుల రీకేపిటలేజేషన్ పేరిట ప్రభుత్వ బ్యాంకుల షేర్లను ప్రైవేటు రంగానికి కట్టబెట్టడానికి పూనుకుంటున్నట్టు సర్వే తెలుపుతోంది. మార్కెట్లు భారీ పతనాలను చూస్తూ, లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు హఠాత్తుగా ఆవిరైపోతుండగా, మార్కెట్ సూచీలు అథోగతికి చూస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ అంటే ప్రభుత్వ అస్తులను కారు చౌకకు అమ్మేయడమే తప్ప మరేం కాదు. వ్యవసాయ ఉత్పాదకత పెంపుదల గురించి సర్వే పేర్కొన్న విషయాలన్నీ... బహుశా ఒక్క జన్యుమార్పిడి పంటల అంశం తప్ప... ఆకాంక్షలే తప్ప లక్ష్యాలూ కావు, అంచనాలూ కావు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇంటా, బయటా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నా... అటు కోశ లోటు తగ్గింపుకు కట్టుబడుతూనే, ఇటు వృద్ధి రేట్లను పెంచాలని రెండు పడవల మీద కాళ్లు వేసే ప్రయత్నం చేశారని సర్వే సూచిస్తోంది. -
ఎన్నో ఆశలు... ఆకాంక్షలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ఆర్థిక బడ్జెట్‌పై జిల్లా గంపెడాశలు పెట్టుకుంది. వెనుకబడిన జిల్లాగా గుర్తించి ఆర్థికంగా ఆదుకోవాలని విభజన దగ్గరి నుంచి కోరుతున్న ప్రజానీకం ఆశలు ఏమేరకు నెరవేరుతాయోనని ఎదురుచూస్తోంది. రెండేళ్లుగా గిరిజన యూనివర్సిటీ కోసం ప్రకటనలు చేయడమే తప్ప మంజూరుపై ఇంతవరకు స్పష్టత లేదు. గత బడ్జెట్లో యూనివర్సిటీ కోసం రూ. 2కోట్లు కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు. కానీ ఇంతవరకు దానిపై అతీగతి లేదు. ఎక్కడ, ఎప్పుడు ఏర్పాటు చేస్తారో చెప్పడం లేదు. పాచిపెంట, బొండపల్లి, కొత్తవలస మండలాల్లో స్థలాలను పరిశీలించారు. కొత్తవలసకే పరిశీలకులు మొగ్గు చూపారు. కానీ దాని అడుగులు ఇంతవరకు పడలేదు. ఈ బడ్జెట్లోనైనా దానికొక స్పష్టత వస్తుందేమోనని జిల్లా ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల డిమాండ్ కూడా పెండింగ్‌లోనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రయివేటు వైద్య కళాశాలతో సరిపెట్టేద్దామని యోచిస్తున్నా జిల్లాలోని ఏజెన్సీ, మైదాన ప్రజలకు మెరుగైన వైద్యం అందాలంటే ప్రభుత్వ వైద్య కళాశాల అవసరం ఎంతైనా ఉంది. రుణ వితరణ పెరగాలి : జిల్లాలో దాదాపుగా ఉన్నది సామాన్య, మధ్య తరగతి రైతులే. బ్యాంకులు రుణమిస్తే తప్ప వ్యవసాయం చేసుకోలేని పరిస్థితి వారిది. బ్యాం కులు రుణాలిచ్చేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. గత బకాయిలు రాకపోవడం, రాష్ర్ట ప్రభుత్వం పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేయకపోవడం వంటి కారణాలతో బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు వెనుకంజ వేస్తున్నాయి. జిల్లాలో 4.29లక్షల మంది రైతులు ఉన్నారు. ఖరీఫ్ సీజన్లో రూ. 1008కోట్ల లక్ష్యం పెట్టినప్పటికీ బ్యాంకులు కొత్తగా రూ. కోటి వరకు రుణాలిచ్చాయి. మరో రూ. 629కోట్ల మేర లక్షా 40వేల మంది రైతుల రుణాలు రీషెడ్యూల్ చేశాయి. దీనివల్ల ప్రయోజనం ఆశించినంతగా లేదు. బ్యాంకులు రుణ లక్ష్యం, వితరణ పెంచేలా బడ్జెట్లో చర్యలు తీసుకోవాలని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహం అవసరం : జిల్లాలో 2,830చిన్న, మధ్య తరహా పరిశ్రమలుండగా, 35భారీ పరిశ్రమలు ఉన్నాయి. వీటితో జిల్లాలో నిరుద్యోగం తీరడం లేదు. ఉత్పత్తి సామర్ధ్యం పెరగడం లేదు. కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తేనే సమస్య పరిష్కారమయ్యేది. ఇప్పుడు పరిశ్రమలకు అనుమతులు, బ్యాంకు రుణాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత బడ్జెట్లో ప్రకటించిన పారిశ్రామిక విధానంతో జిల్లాకు ఎటువంటి మేలు జరగలేదు. ఈసారైనా స్థానిక పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని పారిశ్రామిక విధానాలను రూ పకల్పన చేయాల్సిన అవసరం ఉంది. మేకిన్ ఇండియా లో భాగంగా యువత కొత్త ఆవిష్కరణలు, పరిశోధనల కోసం ప్రత్యేక నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. ఇళ్లకు మోక్షం కలగదా : గత బడ్జెట్లో పట్టణాల్లో ఇళ్లు నిర్మించి తీరుతామని పేర్కొన్నారు. కానీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. గ్రామాల్లో పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. జిల్లాకు మరో 3లక్షల వరకు ఇళ్లు మంజూరు కావల్సిన అవసరం ఉంది. గత బడ్జెట్లో జిల్లాలోని స్మార్ట్ విలేజ్‌లన్నింట్లోనూ వైఫై సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. ఇంతవరకు ఒక్క పంచాయతీలో కూడా ఏర్పాటు చేయలేదు. ఈ- పంచాయతీ పాలన నత్తనడకన సాగుతోంది. జిల్లాలో 490క్లస్టర్లుండగా గత బడ్జెట్లో 203 క్లస్టర్లలో గల పంచాయతీలను ఈ పంచాయతీలుగా మార్చుతామని వెల్లడించారు. ఇంతవరకు 91క్లస్టర్లలో మాత్రమే ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు చేశారు. మిగతా వాటిపై అతీగతీ లేదు. వాటికి ఇప్పుడు కేటాయింపులు చేయడంతో పాటు గత బడ్జెట్లో పేర్కొన్న 483క్లస్టర్లపై కూడా నిర్ణయం తీసుకోవల్సిన అవసరం ఉంది. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. -
గంపెడాశలు
నేడు రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ రాజధానిపై వరాల జల్లు కురిసేనా.. పెండింగ్‌లో వేల కోట్ల రూపాయల ప్రతిపాదనలు పోర్టు, ఎయిర్‌పోర్టుకు సపోర్టు దక్కేనా.. కృష్టా డెల్టా అభివృద్ధి నిధుల కోసం అన్నదాతల ఎదురుచూపులు విజయవాడ : నూతన రాష్ట్రంలో ఆర్థికమంత్రి రామకృష్ణుడు గురువారం తొలిసారిగా ప్రవేశపెట్టనున్న రాష్ట్ర ఆర్థిక బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జిల్లాకు ఏయే అంశాల్లో ఏమేరకు ప్రాధాన్యత ఇస్తారనే దానిపై అటు అధికార, ప్రతిపక్ష పార్టీల్లో జోరుగా చర్చ సాగుతోంది. నూతన రాష్ట్ర రాజధాని విజయవాడ రూపురేఖలు మారుస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ప్రభుత్వం బడ్జెట్ ద్వారా ఎంతవరకు కార్యరూపంలోకి తెస్తుందనే అంశంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజధాని అభివృద్ధికి హామీలెన్నో... కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గత ఏడాది జూన్‌లో మంగళగిరి సమీపంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలు, రాష్ట్ర స్థాయి సమీక్షలు అనేకం విజయవాడలో నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక బడ్జెట్‌కు సంబంధించి ముందుగా కసరత్తు చేయటం కోసం నిర్వహించే ప్రీబడ్జెట్ మీటింగ్ కూడా విజయవాడలోనే జరిగింది. ఇప్పటివరకు దాదాపు 15 పర్యాయాలు విజయవాడలో పర్యటించిన ముఖ్యమంత్రి ఈ క్రమంలో అనేక హామీలు ఇచ్చారు. వాటిలో ప్రధానంగా విజయవాడలోని కాల్వలను అభివృద్ధి చేసి సుందరీకరించటం, కేంద్ర నిధులు రాబట్టి ఇంద్రకీలాద్రి వద్ద ఫ్లైఓవర్ నిర్మించటం, భవానీద్వీపం అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయటం, గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయటం, మచిలీపట్నంలో రూ.20 వేల అంచనా వ్యయంతో ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టు ఏర్పాటు, మచిలీపట్నంలో పోర్టు నిర్మాణం, నూజివీడులో వ్యవసాయ ఉత్పత్తుల అనుబంధ పరిశ్రమ ఏర్పాటు ఇలా అనేక హామీలు ఇచ్చారు. వీటిలో ఒక్కటీ కార్యరూపం దాల్చలేదు. ఇక కృష్ణాడెల్టా ఆధునికీకరణ పనుల కోసం నిధుల కేటాయింపు తదితర హామీలు కూడా కార్యరూపంలోకి రావాల్సి ఉంది. పోర్టుకి రూ.500 కోట్లు కావాలి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2008 ఏప్రిల్ 23న రూ.1500 కోట్ల అంచనా వ్యయంతో బందరు పోర్టుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీనిని అటకెక్కించాయి. స్థానికుల పోరుబాట ఫలితంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో 5,324 ఎకరాల భూసేకరణ చేయాలని, ఐదువేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పోర్టును నిర్మించాలని జీవో జారీ చేశారు. ఆ తర్వాత దానిని పట్టించుకున్న దాఖలాలు లేవు. కోస్తా కారిడార్, సముద్ర మార్గాలను అభివృద్ధి చేస్తామని ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఈ క్రమంలో ఇప్పటికే పోర్టుకు 450 ఎకరాల భూమి ఉండగా, మిగిలిన భూమిని సేకరించి పరిహారం చెల్లించటానికి రూ.500 కోట్లు అవసరం. ఈ బడ్జెట్లో పరిహారం మంజూరు కోసం తక్షణం రూ.500 కోట్లు కేటాయిస్తే పోర్టు పనుల్లో కొంత కదలిక వస్తుంది. గన్నవరం విమానాశ్రయానికి రూ.300 కోట్లు... గన్నవరం విమానాశ్రయ విస్తరణకు 490 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. అందులో 50 ఎకరాలు అసైన్డ్ భూమి. మిగిలిన 440 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ జారీ చేయటం, ఆ తర్వాత రైతులతో కలెక్టర్, ఎమ్మెల్యే చర్చలు జరపటం అవి విఫలం కావటం తెలిసిందే. ఈ క్రమంలో రన్‌వే విస్తరణకు మరో 220 ఎకరాల భూమి కావాలని విమానాశ్రయ అధికారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో కనీసం 440 ఎకరాల భూసేకరణ చేపట్టి, పరిహారం అందజేసేందుకు కనీసం రూ.300 కోట్లు అవసరం. ఈ బడ్జెట్లో ఈ నిధులు మంజూరు చేస్తే విమానాశ్రయ విస్తరణ పనులు ప్రారంభమయ్యే అవకాశముంటుంది. ఇప్పటికే ఈ అంశాన్ని ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే మరికొన్ని... భవానీద్వీపంలో రూ.5 కోట్ల వ్యయంతో ఐదెకరాల విస్తీర్ణంలో శిల్పారామం నిర్మించాలని నిర్ణయించారు. దీనిని తక్షణ అవసరంగా పరిగణించి పూర్తి చేయాలని ప్రజాప్రతినిధులు సూచించారు. ఆగిరిపల్లి, తోటపల్లి గ్రామాల సమీపంలో 1000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బ్రహ్మలింగయ్య చెరువును అభివృద్ధి చేయాలని, కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు ఉన్న రెండు లైన్ల రహదారిని నాలుగు లైన్ల రహదారిగా విస్తరించాలని ప్రతిపాదనలు చేశారు. నీటిపారుదల, విద్య, వైద్య రంగాలకు కేటాయింపులు చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. -
బాబు విమర్శలను ఖండించిన విశాఖ ఎమ్మెల్యే విష్ణు
విశాఖ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, నరేంద్ర మోదీ సర్కార్‌పై చేసిన విమర్శలను విశాఖపట్నం తూర్పు బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఖండించారు. శనివారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై ఆయన స్పందించారు. ఆర్థిక బడ్జెట్ ఏమాత్రం ఆశాజనకంగా లేదన్నారు. రైల్వే బడ్జెట్ కూడా ఆంద్రప్రదేశ్‌కు తీరని మానసిక క్షోభ కలిగించిందని చెప్పారు. బడ్జెట్ ఇలా ఉండటం దురదృష్టకరమని చెప్పారు. మోదీ సర్కార్‌ను కలిసి తమకిది కావాలని అడిగారా? అంటూ సూటిగా ప్రశ్నించారు. ''నేను పూర్తిగా హైపోథిటికల్గా మాట్లాడుతున్నా'' అని చెప్పారు. రాష్ట్రానికి ఏమి కావాలో కేవలం వినతిపత్రాలు ఇచ్చి ఊరుకుంటే సరిపోదన్నారు. పదవులపై తీపి, ప్రేమ ఉంటే రాష్ట్రానికి న్యాయం ఎలా జరుగుతుందని విష్ణు ప్రశ్నించారు. అన్నిపార్టీలు కలిసి ఒక టీంగా ఏర్పడి నరేంద్ర మోదీ, అమిత్‌షాలను కలవాల్సిన అవసరముందని చెప్పారు. అటువంటి ఏర్పాటు ఏపీ సీఎం చంద్రబాబు కల్పించాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కోరారు. -
బీఎంసీ బడ్జెట్ రూ. 33,514 కోట్లు
సాక్షి, ముంబై: మహానగర పాలక సంస్థ (బీఎంసీ) 2015-2016 ఆర్థిక బడ్జెట్ ను బీఎంసీ కమిషనర్ సీతారాం కుంటే స్థాయి సమితి అధ్యక్షుడు యశోధర్ ఫణసేకు సమర్పించారు. మొత్తం రూ. 33,514 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టగా అందులో రూ. 500 కోట్లతో వివిధ అభివృద్ధి పనుల ప్రతిపాదనలకు స్థాయి సమితి మంజూరునిచ్చింది. స్థాయి సమితి సభ్యులకు ఒక్కొక్కరికి రూ.50 లక్షలు, వివిధ రాజకీయ పార్టీలకు రూ. 2.50 కోట్ల నుంచి రూ. ఏడు కోట్ల వరకు నిధులు కేటాయించింది. అధికారంలో ఉన్న శివసేన దాదాపు రూ.140 కోట్ల నిధులు తమ వాటాలో వేసుకుంది. వార్డుల్లో వివిధ అభివృద్ధి పనులకోసం 227 మంది కార్పొరేటర్లకు రూ. 1.60 కోట్లు చొప్పున, మేయర్‌కు రూ. 100 కోట్లు, రేస్‌కోర్స్‌లో థీమ్ పార్క్ నిర్మాణం కోసం రూ.ఐదు కోట్లు మంజూరయ్యాయి. డబ్బావాలా భవనానికి రూ. రెండు కోట్లు, కస్తూర్బా ఆస్పత్రిలో అంటు వ్యాధుల పరీక్షల ఆధునిక ల్యాబ్‌కు, తూర్పు, పశ్చిమ శివారు ప్రాంతాల్లో ఒక్కో ల్యాబ్ ఏర్పాటుకు, కళ, సాంృ్కతిక భవనం కోసం రూ. రెండు కోట్లు మంజూరయ్యాయి. అలాగే మాథాడి కార్మికుల భవనానికి రూ. రెండు కోట్లు, ఆరే కాలనీలో వినాయకుడి విగ్రహాల నిమజ్జనానికిగానూ కృత్రిమ చెరువు ఆధునీకీకరణ, ముంబైతోపాటు శివారు ప్రాంతాల్లో ఉన్న చౌక్ల అలంకరణ పనులకు రూ. ఎనిమిది కోట్ల నిధులు మంజూరు చేశారు. -
ఆశ..నిరాశే..!
సాక్షి, ఒంగోలు: దండగమారి వ్యవసాయం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పదేళ్ల కిందట చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపాయి. గత ఎన్నికల ప్రచారంలో రైతు పక్షపాతినంటూ నమ్మబలికి..గద్దెనెక్కిన బాబు నిజరూపం మరోమారు బయటపడింది. పంట రుణాల మాఫీ అమలుపై ఇన్నాళ్లూ కొనసాగిన సర్కారు దోబూచులాట..బుధవారం ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్‌తో వీడిపోతుందని రైతులు భావించారు. రైతు కుటుంబానికి రూ.లక్షన్నర వరకు రుణమాఫీ చేస్తున్నామంటూ .. ఇటీవల ప్రభుత్వ జీవో సైతం విడుదల చేసిన ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తాజా బడ్జెట్లో ఆ ప్రస్తావనే తీసుకురాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఐదు లక్షల మంది రైతులు జాతీయబ్యాంకులతో పాటు సహకార బ్యాంకుల్లోనూ రుణాలు తీసుకున్నారు. కిందటేడాది జిల్లాలోని రైతులకు రూ.5800 కోట్ల పంట రుణాల్ని పంపిణీ చేస్తే.. ఈఏడాది రూ.4100 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నా.. ఇంత వరకు ఒక్క రూపాయి అందివ్వలేదు. బ్యాంకుల్లో మొత్తం రూ.6,900 కోట్ల వ్యవసాయ రుణాలున్నాయి. తీరాచూస్తే.. బడ్జెట్లో రుణాలమాఫీ అంశమే లేకపోవడంతో జిల్లాలోని లబ్ధిదారులు డీలాపడిపోయారు. వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రవేశపెట్టనున్న ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్లో ఉండొచ్చని అధికార పార్టీ నేతలు చెప్పుకుంటున్నప్పటికీ.. రైతుల్లో అంతగా నమ్మకం కలగడం లేదు. సర్కారు మెలికలు.. రుణమాఫీ కావాలంటే ఆధార్‌కార్డు, పట్టాదారు పాసుపుస్తకంతో టైటిల్‌డీడ్ ఉండాలంటూ తదితర కొర్రీలు పెట్టినా రైతులు వాటన్నింటినీ అంగీకరించారు. తాజాగా, దీనికి సంబంధించి ప్రభుత్వం జీవో నంబర్ 174ను జారీచేసింది. దీనివలన చిన్నసన్నకారు రైతులకు ఏమాత్రం లబ్ధి చేకూరదంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. గత డిసెంబర్ 31వ తేదీకి ముందు రుణం తీసుకుని గత మార్చి 31 వరకు రుణగ్రస్తులైన రైతులకే రుణమాఫీ వర్తిస్తుందని జీవో సారాంశం. డిసెంబర్ 31లోపు రుణాలు తీసుకున్న రైతులకే అన్న నిబంధన సహకార బ్యాంకుల్లో బకాయి పడిన మెజార్టీ రైతులను నట్టేటముంచింది. ఈ విషయంపై రెండ్రోజుల కిందట హైదరాబాద్‌లో జరిగిన ఆప్కాబ్ సమావేశంలో చర్చించారు. ఈ జీవో కారణంగా సకాలంలో పంటరుణాలు చెల్లించిన వారికి రుణమాఫీ పథకం వర్తించదని బ్యాంకర్లు చెబుతున్నారు. జిల్లాలో సుమారు 1.5 లక్షల మంది రైతులు రూ.500 కోట్లమేర లబ్ధిని కోల్పోతారని తేలింది. 2014 మార్చి 31 నాటికి ఔట్‌స్టాండింగ్‌గా ఉన్న రుణాలు 2013 డిసెంబర్ 31లోపు తీసుకుని ఉండాలని జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. నష్టపోతున్న సన్నచిన్నకారు రైతులు: సహకార సంఘాల్లోని రైతులు పీసీసీబీ నిబంధనల మేరకు ఏటా రెండు పర్యాయాలు అంటే 0 శాతం వడ్డీరాయితీ, పావలావడ్డీ పథకాలు ఉపయోగించుకునేందుకు మార్చి 31లోపు ఒక పర్యాయం, ఖరీఫ్‌లో పంటలబీమా పథకం పొందేందుకు జూన్ 30లోపు మరోపర్యాయం రుణాలు చెల్లిస్తుంటారు. అదీ చాలా వరకు బుక్‌అడ్జస్ట్‌మెంట్ చేసి మళ్లీ తీసుకోవడం పరిపాటి. జీవోనంబర్ 174 ప్రకారం సకాలంలో రుణాలు కట్టిన రైతులకు రుణమాఫీ పథకం వర్తించనట్లే.. 2013 డిసెంబర్ 31 నాటికి జిల్లాలో చాలామంది రైతులు రుణాలను తిరిగి చెల్లించారు. ఈవిధంగా సుమారు రూ.500 కోట్లు చెల్లింపులు జరిగాయని.. సర్కారు జీవో నంబర్‌ను సవరించాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. -
సీఎన్జీకి బీఎంసీ ఓకే..
అంత్యక్రియలకు గ్యాస్ వినియోగించాలని నిర్ణయం సగం ఖర్చుతో కార్యక్రమం పూర్తి పైపులైన్లకు దగ్గరగా ఉన్న శ్మశాన వాటికలకు అనుసంధానం ఆర్థిక బడ్జెట్లో నిధులు మంజూరు సాక్షి, ముంబై: శ్మశాన వాటికలో అంత్యక్రియలకు గ్యాస్ ద్వారా నిర్వహించాలని నగర పాలక సంస్థ (బీఎంసీ) నిర్ణయం తీసుకుంది. విడతలవారీగా అన్ని హిందూ శ్మశాన వాటికలో ఏర్పాట్లు చేయాలని, అందుకు ఆర్థిక బడ్జెట్లో నిధులు కూడా మంజూరు చేసింది. కట్టెల ద్వారా దహనకాండ చేయడంవల్ల పర్యావరణానికి హాని, కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో గ్యాస్ ద్వారా నిర్వహించాలని నిర్ణయించింది. ముంబైలో దాదాపు 35 శ్మశాన వాటికలు ఉన్నాయి. సాధారణంగా ఒక్కో శవానికి అంత్యక్రియలు నిర్వహించాలంటే సుమారు 300 కేజీల కట్టెలు అవసరమవుతాయి. అందుకు బీఎంసీ శ్మశాన వాటికలో రూ.1,890 ఖర్చవుతాయి. అదే ప్రైవేటు శ్మశాన వాటిలో రూ.2,090 చెల్లించాల్సి ఉంటుంది. కాగా శవం తాలూకు కుటుంబం ఆర్థిక పరిస్థితిని బట్టి ఇందులో కొంత శాతం రుసుం వారి నుంచి వసూలు చేస్తారు. దారిద్య్ర రేఖకు దిగువనున్న పేదలకు మాత్రం ఉచితంగానే అంత్యక్రియలు నిర్వహించేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ భారాన్ని బీఎంసీ స్వయంగా భరిస్తోంది. అదేవిధంగా ఒక్కో శవానికి విద్యుత్ ద్వారా దహనకాండకు రూ.700 ఖర్చుకాగా సీఎన్జీ ద్వారా రూ.630 ఖర్చవుతోంది. కట్టెలతో పోలిస్తే గ్యాస్ ద్వారా దహన క్రియలు పూర్తిచేయడం బీఎంసీకి ఎంతో గిట్టుబాటు అవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని గ్యాస్ ద్వారా అంత్యక్రియలు పూర్తిచేయాలని బీఎంసీ నిర్ణయం తీసుకుంది. మొదటి విడతలో మహానగర్ గ్యాస్ పైపులైన్లు ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయో ఆ సమీపంలో ఉన్న శ్మశాన వాటికలను గ్యాస్‌తో అనుసంధానించాలని యోచిస్తోంది. ప్రస్తుతం గ్యాస్ పైపులైన్లకు వంద మీటర్ల లోపు ఉన్న తొమ్మిది, వంద మీటర్ల తర్వాత ఉన్న 11 శ్మశాన వాటికలను గ్యాస్‌తో అనుసంధించాలని బీఎంసీ పరిపాలన విభాగం నిర్ణయించింది.