నేల విడిచి సాము | Editorial on Financial budget survey 2016-17 | Sakshi
Sakshi News home page

నేల విడిచి సాము

Published Sat, Feb 27 2016 1:46 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

Editorial on Financial budget survey 2016-17

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటుకు సమర్పించిన 2016-17 ఆర్థిక సర్వే  నిరాశాజనకమైన ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో భారత ఆర్థిక వృద్ధి పట్ల ఆశావహ దృక్పథాన్ని ప్రదర్శించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీ యోత్పత్తిలో 7 నుంచి 7.5 వృద్ధి రేటునూ, ఆ తర్వాతి రెండేళ్లలో 8 నుంచి 10 శాతం వృద్ధి రేటునూ సాధిస్తామని సర్వే పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని ప్రతికూల పరిస్థితుల ప్రాబల్యాన్ని సర్వే తక్కువ చేసి  చూసినట్టుంది. భారత్, వృద్ధికి బలీయమైన కేంద్రంగా ఉన్నదన్న అంతర్జాతీయ ఆర్థిక సంస్థల అంచనాకు ఎక్కువ ప్రాధ్యాన్యం ఇచ్చినట్టుంది. 2016-17 తదుపరి రెండేళ్లలో 8.1 నుంచి 8.5 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వృద్ధి రేట్ల సాధనతోపాటూ కోశ (ఫిస్కల్) లోటు లక్ష్యాలను సాధిస్తామని, ఈ ఏడాది లోటును 3.9 శాతానికి, వచ్చే ఏడాది 3.5 శాతానికి తగ్గిస్తామని సర్వే తెలిపింది.

ప్రపంచ ఆర్థిక వృద్ధి ఈ ఏడాది 3 శాతం, వచ్చే ఏడాది 3.3 శాతంగా ఉంటుందని సంపన్న దేశాల సంస్థ, ఓఈసీడీ తాజా అంచనా. ఆ మాత్రం వృద్ధి కూడా కష్టమేనని, సంపన్న దేశాల వృద్ధి 2 శాతమన్న అంచనా పూర్తి అవాస్తవికమైనదని నిపుణులు భావిస్తున్నారు. గత ఏడాది ద్వితీయార్థం నుంచి మొదలై దఫదఫాలుగా కొనసాగుతున్న మార్కెట్ పతనాలు ప్రపంచం దీర్ఘకాలిక ఆర్థిక ప్రతిష్టంభనలోకో లేక ఒక విధమైన మాంద్యంలోకో దిగజారుతున్నదని సూచిస్తున్నాయని ఆర్థిక వేత్తలు హెచ్చరి స్తున్నారు. 2008 నాటి సంక్షోభ కాలంలో ప్రపంచ వృద్ధికి చోదక శక్తులుగా నిలిచిన  వేగంగా వృద్ధి చెందుతున్న వ్యవస్థల్లో చైనా పతనం, యువాన్ విలువ తగ్గింపు భారత్ సహా ప్రపంచాన్ని కుదిపేశాయి. బ్రెజిల్ వృద్ధి క్షీణత కూడా ఆందోళన కరంగా ఉంది. ఇక రష్యా, జపాన్‌లాంటి దేశాలు కూడా వృద్ధి క్షీణతలను నమోదు చేస్తున్నాయి. 2014 డిసెంబర్ నుంచి 13 నెలలుగా మన ఎగుమతులు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. ఏప్రిల్-జనవరి మధ్యనే 17.65 శాతం తగ్గాయని సర్వే తెలిపింది. ప్రపంచ డిమాండు క్షీణతే ఎగుమతి ఆధారిత చైనా ఆర్థిక వ్యవస్థ పతనానికి ముఖ్య కారణం. ఈ పరిస్థితులు తాత్కాలి కమైనవనే సర్వే అంచనా నిజమనిపించదు. వచ్చే ఏడాది ఎగుమతులు పుంజు కుంటాయని సర్వే ఆశిం చడం, దానిపై ఆధారపడి కరెంటు అకౌంటు లోటు జీడీపీలో 1-1.5గా ఉంటుంద నడం వాస్తవికమైన అంచనాలేనా అని అనుమా నించక తప్పదు.  
 

గత ఏడాది 7.4, ఈ ఏడాది 7.6 వృద్ధి రే ట్లతో మన దేశమే అత్యధిక వృద్ధిని నమోదు చేసిందనడం వాస్తవమే. కానీ, గత ఏడాది లక్ష్యంగా పెట్టుకున్న దాని కంటే తక్కువ వృద్ధిని నమోదు చేయడమంటే తక్కువ ఆదాయాలు, తక్కువ రాబడి అని కూడా అర్థం. పైగా ప్రపంచ డిమాండే కాదు దేశీయ డిమాండు కూడా తక్కువగా ఉన్నదని జైట్లీ అంగీకరించారు. ఈ పరిస్థితుల్లో కూడా గత ఏడాది కంటే పన్నుల రాబడిని పెంచుకోగలమని సర్వే చెబుతోంది. సంపన్నులకు ఇస్తున్న లక్ష కోట్ల రూపాయల పన్ను రాయితీల ఉపసంహరణను ఎలా అమలు చేస్తారో బడ్జెట్ సూచించవచ్చు. ఆదాయపు పన్ను చెల్లింపుదార్ల బేస్‌ను 5 శాతం నుంచి 20 శాతానికి పెంచుకోవాలనే సర్వే లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి ఆదాయపు పన్ను మినహాయింపు గరిష్ట పరిమితిని పెంచే అవకాశాలు లేనట్టేనని అనుకోవచ్చు. వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆర్‌బీఐకి, ప్రభుత్వానికి మధ్య  రగులుతున్న వివాదాన్ని సర్వే పరోక్షంగా ప్రస్తావించింది. ఆసియా కరెన్సీల విలువలో సర్దుబాట్లు తప్పవంటూ రూపాయి ఒడిదుడుకులకు అవకాశాలను, రూపాయి విలువ సర్దుబాటు అంటే మరింత తగ్గడం అవసరమని సూచించింది.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణాన్ని 4.5-5 శాతానికి తగ్గిస్తామని అది పేర్కొంది. చమురు ధరలు తగ్గడం అనే అనుకూలాంశం ఉన్నా, ఏడవ పే కమిషన్ వేతనాలు, సైన్యానికి ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ అమలు ప్రభావం ద్రవ్యోల్బణంపై ఉండదని సర్వే భావించినట్టుంది.
 ఇటు ఖజానాపై వత్తిడి పెరుగుతుండగా, అటు రాబడులు పెద్దగాలేని పరిస్థితి, ఎగుమతులలో క్షీణత అనే రేపటి స్థూల జాతీయ ఆర్థిక చిత్ర ం కళ్ల ముందు నిలుస్తుండగా... సర్వే చెప్పిన 7-7.5 వృద్ధి ఎలా సాధ్యమనే ప్రశ్న తలెత్తడం సహజం. ప్రైవేటు పెట్టుబడి రాయితీలను పొందడమే తప్ప, భారీ మదుపులకు వచ్చేసరికి ఊగిసలాడుతూ, తాత్సారం చేస్తూ, సంశయిస్తూనే గడిపేస్తోంది. ప్రైవేటు రంగం ఆశించిన భారీ పెట్టుబడులను కుమ్మరించడం లేదని ఆర్థిక మంత్రికి తెలియంది కాదు. ప్రభుత్వ పెట్టుబడుల వృద్ధిని సర్వే సూచించింది. కోశ లోటును 3.5 శాతానికి తగ్గించాలని యత్నిస్తూ భారీ ప్రభుత్వ పెట్టుబడులనడం పరస్పర విరుద్ధ దిశలకు బండిని ఒకేసారి లాగడం లాంటిదే.

2013 నుంచి కేంద్ర బ్యాంకు రేట్లను (ఫెడ్ రేట్) తగ్గిస్తామంటూ గత డిసెంబర్లోనే 25 పాయింట్లు తగ్గించిన అమెరికా, రెండు నెలలు గడిచేలోగానే పరిమాణాత్మక ద్రవ్య సడలింపు గురించి మాట్లాడుతున్నదంటేనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎంతటి తిరోగమనంలో ఉన్నదో అర్థమవుతుంది. ఇటువంటి అసాధారణ పరిస్థితుల్లో  కోశ లోటు తగ్గింపునకు కట్టుబడకపోతే...  భారీ ఎత్తున ప్రభుత్వ పెట్టుబడులను పెట్టి దేశీయ డిమాండును, ఉపాధిని పెంచడానికి, వృద్ధికి ప్రోత్సాహం కల్పించడానికి ఆ నిధులు తోడ్పడేవి. అందుకు బదులుగా అది కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు, బ్యాంకుల రీకేపిటలేజేషన్ పేరిట ప్రభుత్వ బ్యాంకుల షేర్లను ప్రైవేటు రంగానికి కట్టబెట్టడానికి పూనుకుంటున్నట్టు సర్వే తెలుపుతోంది. మార్కెట్లు భారీ పతనాలను చూస్తూ, లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు హఠాత్తుగా ఆవిరైపోతుండగా, మార్కెట్ సూచీలు అథోగతికి చూస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ అంటే ప్రభుత్వ అస్తులను కారు చౌకకు అమ్మేయడమే తప్ప మరేం కాదు. వ్యవసాయ ఉత్పాదకత పెంపుదల గురించి సర్వే పేర్కొన్న విషయాలన్నీ... బహుశా ఒక్క జన్యుమార్పిడి పంటల అంశం తప్ప... ఆకాంక్షలే తప్ప లక్ష్యాలూ కావు, అంచనాలూ కావు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇంటా, బయటా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నా... అటు కోశ లోటు తగ్గింపుకు కట్టుబడుతూనే, ఇటు వృద్ధి రేట్లను పెంచాలని రెండు పడవల మీద కాళ్లు వేసే ప్రయత్నం చేశారని సర్వే సూచిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement