ఒక మంచి ప్రయత్నం | Maneka Gandhi Releases Human Trafficking Draft Bill, Says Victims Will Not Go To Jail | Sakshi
Sakshi News home page

ఒక మంచి ప్రయత్నం

Published Wed, Jun 1 2016 12:15 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

Maneka Gandhi Releases Human Trafficking Draft Bill, Says Victims Will Not Go To Jail

మాయమవుతున్నవారు ఏమవుతున్నారన్న స్పృహ...వారి ఆచూకీ రాబట్టి కార కుల్ని దండించాలన్న ఆదుర్దా ప్రభుత్వ యంత్రాంగానికి లేనంతకాలమూ మనుషుల అపహరణ, అక్రమ తరలింపు, వెట్టిచాకిరీవంటివి కొనసాగుతూనే ఉంటాయి. అందుకే ప్రపంచంలో ఆధునిక బానిసత్వం వర్ధిల్లుతున్న దేశాల్లో భారత్‌ అగ్ర భాగాన ఉన్నదని ‘వాక్‌ ఫ్రీ’ ఫౌండేషన్‌ మంగళవారం వెల్లడించిన సర్వే ఎవరినీ ఆశ్చర్యపరచదు. వివిధ దేశాల్లో అక్రమ తరలింపు బాధితులు 4 కోట్ల 58 లక్షల మంది ఉండొచ్చునని అంచనా వేస్తే అందులో దాదాపు సగం మంది భారత్‌లోనే ఉన్నారని ఆ సర్వే చెబుతోంది. చైనా(33.90లక్షలు), పాకిస్తాన్‌(21.30 లక్షలు), బంగ్లాదేశ్‌(15.30లక్షలు), ఉజ్బెకిస్తాన్‌(12.30లక్షలు)లను కూడా భారత్‌తో కలిపి లెక్కేస్తే మొత్తం బాధితుల్లో 58శాతంమంది ఈ దేశాల్లోనే ఉన్నారని వెల్లడవుతోంది. ఈ విషయంలో ఇకపై కఠినంగా వ్యవహరించబోతున్నామని సంకేతాలు పంపుతూ మనుషుల అక్రమ తరలింపుపై రూపొందించిన ముసాయిదా బిల్లును కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి మేనకాగాంధీ మంగళవారం విడుదల చేశారు.  


డబ్బు, పలుకుబడి, అధికారం, బాధితుల నిస్సహాయత వంటివి మనుషుల అక్రమ తరలింపునకు ప్రధానంగా దోహదపడుతున్నాయి. ప్రపంచంలో మాదక పదార్ధాల క్రయవిక్రయాల తర్వాత అతి పెద్ద వ్యాపారం మనుషుల అక్రమ తర లింపే. ఈ సమస్యపై 1949లోనే ఐక్యరాజ్యసమితి ఒక తీర్మానాన్ని ఆమోదించినా.. 2012 డిసెంబర్‌లో మాత్రమే అడుగు ముందుకు పడింది. మనుషుల అక్రమ తర లింపుపై ఆ సంవత్సరం రూపొందిన అంతర్జాతీయ ప్రొటోకాల్‌  అక్రమ తరలింపు బాధితులకుండే మానవ హక్కులను గుర్తించింది. ఈ విషయంలో అన్ని దేశాలూ కఠినమైన చట్టాలు రూపొందించాలన్న సూచన వచ్చింది. ఆ ప్రొటోకాల్‌పై మన దేశం కూడా సంతకం చేసినా కఠినమైన నిబంధనలతో సమగ్ర రూపంలో బిల్లు తీసుకురావడం మరో నాలుగేళ్లకుగానీ సాధ్యంకాలేదు. ఈ సమస్యకు సంబంధించి నిర్దిష్టమైన చట్టాలు లేకపోవడంతో దోషులు సులభంగా తప్పించుకోగలుగుతు న్నారు. బాధితులు నిస్సహాయులుగా మిగిలిపోతున్నారు. ఏ శిక్షా లేకుండా బయటి కొస్తున్న దుర్మార్గులు మళ్లీ వారిని ఆ నరక కూపాల్లోకి తోసేస్తు న్నారు. కనుకనే ఈ సమస్యపై దృష్టి పెట్టి సమగ్రమైన చట్టం తీసుకురావాలని స్వచ్ఛంద సంస్థలు ఎప్పటినుంచో డిమాండు చేస్తున్నాయి. ఇన్నాళ్లకు వారి ఆకాంక్ష నెరవేరింది.


మన రాజ్యాంగంలోని 23(1) అధికరణ బలవంతంగా చాకిరీ చేయించడాన్ని నిషేధిస్తున్నది. ఆర్ధిక అవసరాల కారణంగా ఎవరూ తమ వయసుకు మించిన పని చేసే పరిస్థితి లేకుండా చూడాలని, ఆరోగ్యకరమైన వాతావరణంలో గౌరవప్రదంగా బతికే వీలు వారికి కల్పించాలని ఆదేశిక సూత్రాలు చెబుతున్నాయి. 1956లో వచ్చిన వ్యభిచార నిరోధక చట్టం మహిళలనూ, బాలికలనూ వ్యభిచార రొంపిలోకి దించే వారిపైనే అధికంగా దృష్టి సారించింది. మనుషుల అక్రమ తరలింపు వ్యవహారం కోణంలో దీన్ని చూడలేదు. 2000లో వచ్చిన జువెనైల్‌ జస్టిస్‌ చట్టానికి కూడా ఇలాంటి పరిమితులే ఉన్నాయి. పిల్లలతో క్రూరంగా వ్యవహరించడం, వారిని బిక్షాటనలోకి దించడం, వారితో వయసుకు మించిన పనులు చేయించడంలాంటి అంశాలే అందులో అధికంగా ఉన్నాయి. భారత శిక్షాస్మృతి(ఐపీసీ)లోని సెక్షన్‌ 370ని సవరిస్తూ 2013లో తెచ్చిన సవరణ చట్టం తొలిసారి పిల్లల అక్రమ తరలింపు అంశాన్ని నేరంగా పరిగణించింది. ఎవరినైనా కొనడం లేదా అమ్మడం నేరమని పాత నిబంధన చెబుతుండగా ఆ సవరణ దాన్ని మరింత విస్తృతీకరించింది. ఈ ప్రక్రియలోని వివిధ దశల్లో పాలుపంచుకునేవారంతా నేరస్తులే అవుతారని స్పష్టం చేసింది. ఇలా పలు సందర్భాల్లో ఉన్న చట్టాలను సవరించడమో, కొత్త చట్టాలు చేయడమో జరుగుతున్నా పోలీసుల అలసత్వం వల్ల, ఈ చట్టాల్లో ఉండే లొసుగుల వల్ల నేరస్తులు సులభంగా తప్పించుకోగలుగుతున్నారు. 2006లో బాలల వెట్టిచా కిరీకి సంబంధించి 1,672 కేసులు నమోదు కాగా ఎవరికీ శిక్ష పడలేదు. అదే సంవత్సరం వ్యభిచార రొంపిలోకి దించుతున్నారని 685మందిపై కేసులు నమోదైతే ఒక్కరంటే ఒక్కరికి శిక్ష పడలేదు.


అక్రమ తరలింపు అనేక రూపాల్లో ఉంటున్నది. ఉపాధి కల్పిస్తామని కొందరు, ఆశ్రయమిస్తామని కొందరు సంస్థలు స్థాపించి అమాయకులను మభ్యపెట్టి వివిధ రకాల నరకకూపాల్లోకి దించుతున్నారు. అది వ్యవసాయ పనుల్లో లేదా పరిశ్రమల్లో వెట్టిచాకిరీ కావొచ్చు...బిక్షాటన కావొచ్చు...వ్యభిచారంలాంటివి కావొచ్చు. తప్పిం చుకుని వచ్చినవారు చెప్పడం వల్లనో, నిర్దిష్టమైన సమాచారం అందడంవల్లనో, కొన్ని స్వచ్ఛంద సంస్థల నిరంతర నిఘా వల్లనో దాడులు నిర్వహిస్తే ఈ అభా గ్యులకు విముక్తి లభిస్తున్నది. హైదరాబాద్‌ పాత బస్తీలో నిరుడు గాజుల బట్టీలు, ఇతర కుటీర పరిశ్రమలపై దాడులు చేసినప్పుడు వందలమంది పిల్లలు చెర వీడటం తెలిసిందే. ఒక సమగ్ర చట్టానికి వీలు కల్పిస్తున్న తాజా బిల్లు... మనుషుల అక్రమ తరలింపు అరికట్టడంలో స్వచ్ఛంద సంస్థల సాయం తీసుకోవ డానికి వీలు కల్పిస్తోంది. పునరావాస కల్పన బాధితుల హక్కుగా పరిగణిస్తోంది. వ్యభిచారం కేసుల్లో బాధితులను కూడా అరెస్టు చేసే ప్రస్తుత విధానానికి స్వస్తి పలకబోతున్నది. బాలికలను చిన్న వయసులోనే వ్యభిచారంలోకి దించడం కోసం ఆక్సిటోసిన్‌ వంటి హార్మోన్‌ ఇంజక్షన్లు ఇవ్వడం, వారి ఆరోగ్యానికి ముప్పు కలిగించడంవంటివాటిని నేరంగా పరిగణిస్తోంది. అక్రమ తరలింపు బాధితులను సరిహద్దులు దాటించేవారి పనిబట్టడం కోసం ప్రత్యేక దర్యాప్తు సంస్థ ఏర్పాటు చేయాలని నిర్దేశిస్తోంది. అయితే చట్టాలు ఎంత పటిష్టంగా ఉన్నా అమలు చేసే యంత్రాంగం సరిగా లేకపోతే ఆశించిన ఫలితాలు రావు. అందువల్లే సకాలంలో చర్యలు తీసుకోవడంలో విఫల మైనా, నేరగాళ్లతో కుమ్మక్కయినట్టు తేలినా...బాధితులకు పునరావాసంలో అల సత్వం ప్రదర్శించినా కఠిన చర్యలు తీసుకునే ఏర్పాటు కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ సమస్యకొక శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement