
ఫిక్కీ, అనరాక్ సర్వేలో వెల్లడి
1,2,3 బీహెచ్‌కే.. ఇళ్లు ఏదైనా సరే బాల్కనీ ఉండాల్సిందే.. గృహ కొనుగోలుదారులు నిర్మాణం నాణ్యత, ప్రాంతం, ధర, వసతులతో పాటు బాల్కనీకి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో ఇంటిలోని ప్రతి అంగుళం స్థలాన్ని వినియోగించాలని భావించిన కస్టమర్లు.. ప్రస్తుతం ఎక్కువ ఓపెన్ స్పేస్ ఉండాలని కోరుకుంటున్నారు. 75 శాతం మంది బాల్కనీ ఉండే ఇళ్ల కొనుగోళ్లకే ఆసక్తి చూపిస్తున్నారని ఫిక్కీ, అనరాక్ సర్వేలో వెల్లడించింది. అలాగే 74 శాతం మంది కస్టమర్లు నాణ్యమైన నిర్మాణాలకే మొగ్గు చూపిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో
గృహాల ధరలు పెరుగుతున్నప్పటికీ కొనుగోలుదారులు విశాలమైన ఇళ్లకే ఆసక్తి చూపిస్తున్నారు. 50 శాతం మంది కస్టమర్లు 3 బీహెచ్‌కే కొనుగోలుకు ఆసక్తి చూపిస్తే.. 38 శాతం మంది 2 బీహెచ్‌కే గృహాలకు మొగ్గు చూపిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఎన్‌సీఆర్ నగరాలలో 3బీహెచ్‌కే యూనిట్లకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అధిక ధరల కారణంగా ముంబైలో 44 శాతం మంది కస్టమర్లు 2 బీహెచ్‌కేలకు, 17 శాతం 1 బీహెచ్‌కేలకు ఆసక్తి చూపిస్తున్నారు. పుణేలో 10 శాతం కొనుగోలుదారులు 1 బీహెచ్‌కే జై కొడుతున్నారు.
లగ్జరీ ఇళ్లకు డిమాండ్..
రూ.కోటిన్నర ధర ఉన్న గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. 2023 హెచ్–2లో 20 శాతం మంది లగ్జరీ ఇళ్లకు ఆసక్తి చూపించగా.. 2021 హెచ్–2లో ఇది కేవలం 12 శాతంగా ఉంది. రూ.45–90 లక్షల బడ్జెట్ గృహాలకు 33 శాతం మంది మొగ్గు చూపిస్తున్నారు. ఇక అందుబాటు గృహాలకు డిమాండ్ క్రమంగా తగ్గిపోతోంది. 2020 హెచ్–2లో 40 శాతంగా అఫర్డబుల్ హౌసింగ్ గిరాకీ.. 2021 హెచ్–2 నాటికి 25 శాతానికి, 2023 హెచ్–2లో ఏకంగా 21 శాతానికి క్షీణించింది.
లాంచింగ్‌లో కొంటున్నారు..
గృహ కొనుగోలుదారుల అభిరుచి మారింది. గతంలో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న వాటిల్లో కొనేందుకు ఆసక్తి చూపిన కస్టమర్లు.. ప్రస్తుతం లాంచింగ్ ప్రాజెక్ట్‌లలో కొనేందుకు ఇష్టపడుతున్నారు. 2020లో రెడీ టూ మూవ్, లాంచింగ్ ప్రాజెక్ట్‌లలో కొనుగోళ్ల నిష్పత్తి 46:18 శాతంగా ఉండగా.. 2024 నాటికి 23:24 శాతానికి మారింది. అలాగే 2021లో శివారు ప్రాంతాలలో స్థిరాస్తుల కొనుగోలుకు జై కొట్టిన కొనుగోలుదారులు 2024 నాటికి 36 శాతానికి తగ్గారు.
పెట్టుబడులకు రియలే బెటర్..
ఏటా దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఫ్లాట్ల విస్తీర్ణాలు 11 శాతం మేర పెరుగుతున్నాయి. 2022లో 1,175 చ.అ.లుగా ఉన్న సగటు ఫ్లాట్ల సైజు.. 2024 నాటికి 1,300 చ.అ.లకు పెరిగాయి. 58 శాతం మిలీనియల్స్, 39 శాతం జెన్స్–ఎక్స్ కస్టమర్లు ఇతర పెట్టుబడుల నుంచి వచ్చిన లాభాలతో ఇళ్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 57 శాతం మంది రియల్ ఎస్టేట్ అత్యంత ప్రాధాన్య పెట్టుబడిగా విశ్వసిస్తున్నారు. ఇందులోనూ 36 శాతం మంది నివాస విభాగంలో పెట్టుబడులకే ఆసక్తి చూపిస్తున్నారు. గృహ రుణ వడ్డీ రేట్లు 8.5 శాతం కంటే తక్కువగా ఉన్నంత కాలం ఇంటి కొనుగోలు నిర్ణయంపై ప్రభావం ఉండదని చెప్పారు.