ప్రతి కుటుంబానికి సమగ్ర ఆర్థిక ప్రణాళిక ఉండాలి. కుటుంబ లక్ష్యాలు అన్నింటికీ ఇందులో చోటు కల్పించుకోవడం ఎంతో అవసరం. స్కూల్, కాలేజీ ఫీజులు, విదేశీ విద్య, జీవిత, ఆరోగ్య బీమా పథకాలు, అత్యవసర నిధి, విహార, పర్యాటక యాత్రలు ఇలా అన్నింటికీ చోటు కల్పించుకోవాలి. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని, ఈ లక్ష్యాలు అన్నింటికీ కావాల్సిన మేర సమకూర్చుకునేందుకు వీలుగా తగిన పెట్టుబడుల ప్రణాళిక రూపొందించుకోవాలి. అందరూ కాకపోయినా కొందరు అయినా దీన్ని అనుసరిస్తుంటారు. కాకపోతే ఎక్కువ మంది ఇక్కడ విస్మరించే విషయం ఒకటి ఉంది. తమపై ఆధారపడిన వృద్ధాప్య తల్లిదండ్రుల సంరక్షణను ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకోరు. దీన్ని ఒక లక్ష్యంగా చూడరు. గతంతో పోలిస్తే వృద్ధాప్యంలో సంరక్షణ వ్యయాలు గణనీయంగా పెరిగాయి. కనుక ప్రతి ఒక్కరి ఆర్థిక ప్రణాళికలో దీనికి తప్పకుండా చోటు ఉండాల్సిందే. లేదంటే ఆర్థిక సంక్షోభాన్ని ఆహ్వానించినట్టు అవుతుంది..
పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు
అతిపెద్ద ఆర్థిక వ్యయంతో కూడుకున్న లక్ష్యాల్లో వృద్ధాప్య సంరక్షణ (జెరియాట్రిక్ కేర్) ఒకటి. అయినా, అధిక శాతం మంది ఆర్థిక ప్రణాళికల్లో దీనికి చోటు ఉండదు. వృద్ధుల సంక్షేమం కోసం ఎంత ఖర్చు అవుతుందన్న అవగాహన కూడా ఉండడం లేదు. ఇది ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంటుంది. వృద్ధులైన తల్లిదండ్రులు తమతోనే ఉంటున్నారా? లేక మరో చోట నివసిస్తున్నారా? లేక వృద్ధాశ్రమంలో చేరారా? వారికి ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? లేదంటే వారికి సంరక్షకులను ఏర్పాటు చేయాలా? వారికి పింఛను సదుపాయం ఉందా లేక ఇతరత్రా వేరే రూపంలో ప్రతి నెలా ఆదాయం వచ్చే ఏర్పాటు ఉందా? ఇలాంటి అంశాలన్నింటి ఆధారంగా వృద్ధుల సంక్షేమం కోసం ఏ విధంగా సన్నద్ధం కావాలనేది తేల్చుకోవచ్చు. వృద్ధాప్య సంరక్షణ ఇంత కాలం పాటు, నిర్ధిష్ట సమయం అని నిర్ణయించుకోవడం కష్టం. వృద్ధులైన తల్లిదండ్రులకు ఇప్పుడు ప్రత్యేక సంరక్షణ అవసరం పడకపోవచ్చు. అలా అని ముందు ముందు వయసు మీద పడితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలియదు. అప్పుడు ప్రత్యేక సంరక్షకుల అవసరం ఏర్పడొచ్చు. దీనికి ఎంత వ్యయం అవుతుందన్నది ముందుగా అంచనా వేయలేం.
ఎన్నో నిదర్శనాలు..
నేడు ఆరోగ్య సంరక్షణ వ్యయాలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. సామాజిక భద్రత ఉండడం లేదు. నేటి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని చూస్తే వృద్ధుల సంక్షేమం అతిపెద్ద ఆర్థిక లక్ష్యాల్లో ఒకటిగా మారిపోయింది. ఉదాహరణకు హైదరాబాద్‌కు చెందిన దత్తాత్రేయ తల్లికి కిడ్నీల సమస్య ఉంది. కిడ్నీల డయాలసిస్, ఇతర చికిత్సా వ్యయాల కోసం రూ.80,000 వరకు ప్రతి నెలా ఖర్చు చేయాల్సి వస్తోంది. గతేడాది వరకు కేవలం ఔషధాల వరకే ఖర్చు అయ్యేది. కానీ, కిడ్నీల సమస్య మరింత తీవ్రతరం కావడంతో వారంలో మూడు సార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోంది. ఒక్క సెషన్‌కు రూ.3,000 ఖర్చు అవుతోంది. ఇక దత్తాత్రేయ తల్లి మృణాళిని టెస్ట్‌లు, వైద్యుల కన్సల్టేషన్ కోసం ఏటా మరో రూ.లక్ష ఖర్చు చేస్తున్నారు. నిజానికి దత్తాత్రేయకు పనిచేసే సంస్థ అందిస్తున్న హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. ఇప్పటి వరకు బీమా కంపెనీ మృణాళిని వైద్య ఖర్చుల భారం మోస్తోంది. కాకపోతే ఇటీవల డయాలసిస్, ఇతర వ్యయాలు పెరిగిన నేపథ్యంలో కవరేజీ చాలడం లేదు. సొంతంగా తమ వంతు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇక పట్టణాల్లో తల్లిదండ్రుల సంక్షేమ వ్యయాలు మరింత ఎక్కువగా ఉంటున్నాయి. అందులోనూ తల్లిదండ్రులు ఒకచోట, పిల్లలు మరో చోట నివసిస్తుంటే, వారికి అదనపు వ్యయాలతోపాటు ఇతరత్రా సవాళ్లు ఎదురవుతుంటాయి.
ఇందుకు ముంబైకి చెందిన భట్టాచార్యే నిదర్శనం. ఆయన తల్లిదండ్రులు కోల్‌కతాలో నివసిస్తున్నారు. వారి సంరక్షణ బాధ్యతలు ఏకైక కుమారుడైన దత్తాత్రేయపైనే ఉన్నాయి. వాటిని ఆయన నెరవేరుస్తున్నారు కూడా. కాకపోతే తాను నివస్తున్న పట్టణానికి దూరంగా తల్లిదండ్రులు ఉంటుండడం, పైగా తల్లి కేన్సర్‌తో బాధపడుతూ పూర్తి స్థాయిలో సొంతంగా నడవలేకపోతుండడం సవాలుగా మారింది. దీంతో ఆమెకు తన కుమారుడి నుండి భౌతిక సాయం కూడా అవసరమవుతోంది. దీంతో భట్టాచార్య ముంబై నుంచి కోల్‌కతాకు తరచూ వెళ్లి రావాల్సి వస్తోంది. తనతో పాటు ఆస్పత్రికి వెళ్లి రావడానికి అమ్మ సౌకర్యంగా భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. తన తల్లిదండ్రులను ముంబైకి మార్చుదామంటే ఆర్థికంగా అది సులువైన నిర్ణయం కాదని అతడికి తెలుసు. కోల్‌కతాలో అయితే వారి సంరక్షణకు నెలకు రూ.60,000–65,000 ఖర్చు అవుతోంది. ముంబైకి మారిస్తే రూ.లక్ష ఖర్చు చేయాల్సి వస్తుంది. ముంబైలో జీవన వ్యయాలు ఎక్కువ. ఇప్పుడు కాకపోతే మరికొంత కాలం తర్వాత అయినా తన తల్లిదండ్రులను ముంబైకి తీసుకురావడం ఒక్కటే ఆయన ముందున్న ఆప్షన్. ఏడాది క్రితం వరకు తల్లిదండ్రుల ఔషధాలకు నెలకు రూ.30,000 ఖర్చు అయితే, ఇప్పుడు రూ.45,000కు పెరిగింది. తమపై ఆధారపడిన లేదంటే భవిష్యత్తులో తమ సంరక్షణ అవసరం పడే తల్లిదండ్రులు ఉంటే, వారి కోసం ముందు నుంచే ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవాల్సిన అవసరాన్ని ఈ నిదర్శనాలు తెలియజేస్తున్నాయి.
అస్పష్ట సవాళ్లు
ఆర్థికంగా పడే భారాన్ని అధిగమించడం ఒక్కటే కాదు, ఇతర సవాళ్లు కూడా ఎదురుకావచ్చు. ఢిల్లీకి చెందిన మంజీత్ తండ్రికి శస్త్రచికిత్స తర్వాత ఆస్పత్రిలోనే చాలా రోజులు ఉండాల్సి వచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రి కావడంతో రాత్రి సమయాల్లో సంరక్షణ చూసేందుకు ఒక వార్డ్ బోయ్ ఉంటే బాగుంటుందని అనిపించింది. ప్రభుత్వ హాస్పిటల్ కావడంతో ప్రతి రోగికి విడిగా ఒక్కో వార్డ్ బోయ్ లేదా కేర్‌టేకర్ ఏర్పాటు సదుపాయం ఉండదు. దీంతో ప్రైవేటుగా ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకోవడం మినహా వేరే మార్గం కనిపించలేదు. అందుకు అర్హత కలిగిన వ్యక్తిని గుర్తించడం, వారి చార్జీలు చెల్లించడం కష్టమైన టాస్క్‌గా మారింది. కొన్ని పేరొందిన ఆస్పత్రుల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ వ్యయాలు 40–50 శాతం అధికంగా ఉంటాయి. వృద్ధాప్య సంరక్షణ కేంద్రాల్లో ఈ సేవలు అన్నీ అందుబాటులో ఉంటాయి. కానీ, తమ తల్లిదండ్రులను వృద్ధాప్యంలో, అనారోగ్యంతో ఉన్నప్పుడే వేరే కొత్త ప్రాంతానికి మారిస్తే.. వారు ఒంటరితనంతో వేదనకు గురవుతారు. పైగా తమ పిల్లలు అలక్ష్యం చేస్తున్నారనే బాధ కూడా ఉంటుంది. బంధు మిత్రుల నుంచి ఈ విషయంలో అవహేళనలు కూడా ఎదురుకావచ్చు.
కొన్ని ప్రముఖ పట్టణాల్లో సర్జరీల తర్వాత వృద్ధుల కోసం తాత్కాలిక సంరక్షణ కేంద్రాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక్కడ సర్జరీ అనంతరం కావాల్సిన సేవలను 3–8 వారాల పాటు అందిస్తారు. ప్రత్యేక రూమ్, నర్స్, అటెండెంట్ తదితర సేవలు పొందొచ్చు. వైద్యులు కూడా వచ్చి చూసి వెళుతుంటారు. కైట్స్ సీనియర్ కేర్‌తోపాటు కేర్ హాస్పిటల్ తదితర కొన్ని సంస్థలు ఈ తరహా సేవలను ఆఫర్ చేస్తున్నాయి. కాకపోతే రోజువారీ రూ.3,000–4,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. వృద్ధులకు ఉన్న సమస్యల ఆధారంగా ఈ వ్యయం మారుతుంది. భార్యా, భర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే వారిపై ఆధారపడిన పెద్దలకు తాత్కాలికంగా ఇలాంటి కేంద్రాల్లో సేవలు అందించొచ్చు. ఒకవైపు భవిష్యత్తులో పెద్దల సంక్షేమం కోసం అయ్యే వ్యయాలకు ప్రణాళిక రూపొందించుకోవడం ఎంత ముఖ్యమో.. భవిష్యత్ అవసరాలకు తగిన విధంగా సన్నద్ధం కావడం కూడా అంతే అవసరం.
ప్రణాళిక ఎలా..?
తమపై తల్లిదండ్రులు ఆధారపడి ఉంటే, వారి కంటూ హెల్త్ ఇన్సూరెన్స్ ముందుగా తీసుకోవాలి. వీలైతే 45 ఏళ్లలోపు, అది వీలు పడకపోతే 60 ఏళ్లలోపు తప్పకుండా తీసుకోవాలి. దీంతో ఏదైనా ఆరోగ్య సమస్యతో వారు హాస్పిటల్‌లో చేరితే, అయ్యే వ్యయాన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీయే భరిస్తుంది. ముఖ్యంగా కుటుంబ ఆర్థిక చరిత్ర గురించి ఒక్కసారి విశ్లేషించుకోవాలి. తల్లిదండ్రులను అడిగి, వారి తల్లిదండ్రులు, సోదరుల్లో ఎవరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా మధుమేహం, ఆర్థరైటిస్, డిమెన్షియా, గుండె జబ్బులు, కేన్సర్, స్ట్రోక్ తదితర సమస్యలు ఉన్నాయేమో విచారించాలి. క్రిటికల్ ఇల్‌నెస్ కవర్‌ను కూడా తీసుకోవడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ముఖ్యంగా డయాలసిస్, ఓరల్ కీమోథెరపీ తదితర చికిత్సలకు డేకేర్ కింద కవరేజీ ఉండేలా చూసుకోవాలి. అలాగే, హోమ్‌కేర్ కవర్ కూడా ఉండాలి. దీనివల్ల ఇంట్లో ఉండి చికిత్స తీసుకుంటే బీమా కంపెనీ నుంచి క్లెయిమ్ పొందొచ్చు. అయినప్పటికీ ఇంట్లో అటెండెంట్, హోమ్ నర్స్, మెడికల్ ఎక్విప్‌మెంట్ ఏర్పాటు చేయాల్సి వస్తే అందుకే అయ్యే చార్జీలను కంపెనీలు చెల్లించవు. నెలకు ఒక అటెండెంట్ సేవలు పొందేందుకు మెట్రోల్లో అయితే రూ.25,000–30,000, చిన్న పట్టణాల్లో అయితే రూ.15,000–20,000 వరకు ఖర్చు అవుతుంది. ఇంటి వద్దే నర్స్ సేవల కోసం నెలవారీ వ్యయాలు 25–40 శాతం అధికంగా అవుతాయి. అందుకే ముందస్తుగా ప్రణాళిక రూపొందించుకోవడం వల్ల తర్వాత ఆర్థికంగా సతమతం కాకుండా ఉంటుంది. ఎందుకంటే వృద్ధులైన తల్లిదండ్రుల సంక్షేమం రూపంలో ఖర్చులు ఎదురైన సమయంలోనే పిల్లల ఉన్నత విద్య, ఇతర కీలక లక్ష్యాలు తారసపడతాయి. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
ప్రతి ఒక్కరూ తమ కుటుంబానికి అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం ఎంత అవసరమో.. తల్లిదండ్రుల కోసం ప్రత్యేక అత్యవసర నిధిని కూడా సమకూర్చుకోవడం అంతే అవసరమనేది ఆర్థిక నిపుణుల సూచన. నిజానికి తల్లిదండ్రుల కోసం కొంత ఫండ్‌ను సిద్ధంగా ఉంచుకునే వారు అరుదుగా కనిపిస్తారు. అవసరం అయితే జీవన వ్యయాలను కొంత తగ్గించుకుని అయినా, తమపై ఆధారపడి వారి కోసం అత్యవసర నిధిని సమకూర్చుకోవాలే కానీ, వాయిదా వేయరాదని నిపుణుల సూచన. కనుక తల్లిదండ్రులు లేదా తమపై ఆధారపడిన అత్త మామల వృద్ధాప్య సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్‌తోపాటు అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి.
Comments
Please login to add a commentAdd a comment