పురుషులతో సమానత్వం కోసం మహిళలు దశాబ్దాలుగా పోరాడాల్సి వచ్చింది. సుదీర్ఘకాలం పోరాటం ఫలితంగా.. నేడు మహిళలకు సముచిత స్థానం ఏర్పడింది. ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలను పురుషులతో సమానంగా మహిళలూ సొంతం చేసుకుంటున్నారు. స్త్రీలు కేవలం చదువుతోనే ఆగిపోవడం లేదు. కెరీర్ కొనసాగిస్తూ, ఎన్నో విజయాలను నమోదు చేస్తున్నారు. ఉన్నత శిఖరాల దిశగా దూసుకుపోతున్నారు. మహిళలు సొంత కాళ్లపై నిలబడుతూ, మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్న తరుణంలో, తమ సంపదను పెంచుకునేందుకు వారికంటూ ప్రత్యేకమైన పెట్టుబడుల విధానాలు, ప్రణాళికలు అవసరం అవుతాయి. పరిశీలించి చూస్తే ఆర్జించే మహిళల్లో అధిక శాతం మంది పెట్టుబడులు, ఆర్థిక విషయాలకు దూరంగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. పొదుపు, మదుపు గురించి అంతగా తెలియదనే ధోరణి వారిలో కనిపిస్తుంది. కానీ, ఇది సరికాదు. ప్రతి ఒక్క మహిళ తప్పకుండా ఆర్థిక విషయాలు, పెట్టుబడులు, వివిధ సాధనాల గురించి తెలుసుకోవాలి. జీవిత భాగస్వాములపై ఆధారపడక్కర్లేకుండా తమ సంపదను తామే నిర్వహించుకునే సామర్థ్యాలు అవసరం. ఈ దిశగా ఏం చేయాలన్నది చర్చించే కథనమే ఇది.
మహిళలే ఎందుకు?
మన దేశంలో చాలా మంది మహిళలు తమ పెట్టుబడుల వ్యవహారాలను భర్త లేదా తండ్రికే విడిచిపెడుతుంటారు. దీంతో వారికి పెట్టుబడుల వ్యవహారాల గురించి తెలియకుండా పోతుంది. కానీ, ఇది సరికాదు. సంపాదన ఒకరిది అయినప్పుడు, నిర్వహణ బాధ్యతలు మరొకరిపై మోపడం ఎందుకు..? ఇల్లాలిగానే కాదు, ఒంటరిగానూ మహిళలు ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు రావచ్చు. తమ జీవిత లక్ష్యాల సాధన కోసం ఇన్వెస్ట్ చేయడం తప్పనిసరి. సంపాదనను సంపదగా మలిచేందుకు అనుసరించాల్సిన మార్గాలపై మహిళలకు తప్పకుండా అవగాహన ఉండాల్సిందే. కారు కొనుక్కోవాలని, ఆభరణాలు కొనుగోలు చేయాలని, మంచి ట్రిప్లెక్స్ విల్లా సమకూర్చుకోవాలని, సెలవుల్లో ఎక్కడికైనా పర్యటించి రావాలనే కోరికలు, లక్ష్యాలు చాలా మందికి ఉంటాయి. వాటిని నెరవేర్చుకోవడానికి అవసరమైన అడుగులు పెట్టుబడుల రూపంలో వేయాలి. ఆర్థిక, పెట్టుబడుల వ్యవహారాలు నిర్వహించేందుకు మహిళలు ఆర్జనా పరులే కానక్కర్లేదు. గృహలక్ష్మి అయినా సరే ఈ విషయాలు తెలిసి ఉండడం వల్ల ఎంతో లాభం ఉంటుంది. కుటుంబ లక్ష్యాల కోసం మార్కెట్లో పెట్టుబడుల వ్యవహారాలు నిర్వహించడం ఎలాగో తెలుసుకోవాలి. మహిళలు తమ పిల్లల కోసం, కుటుంబ బాధ్యతల కోసం లేదంటే తల్లిదండ్రుల కోసం కెరీర్ మధ్యలో పలు సందర్భాల్లో విరామం తీసుకుంటుంటారు. తమ జీవిత భాగస్వాములతో పోలిస్తే అధిక కాలం జీవించే అవకాశాలు ఉంటాయి. కనుక మహిళలకు తప్పకుండా పెట్టుబడుల వ్యవహారాలు తెలిసి ఉండాలి.
నైపుణ్యాలు అవసరం..
పెట్టుబడుల ద్వారా సంపదను సృష్టించుకోవడం అన్నది నైపుణ్యాలపై ఆధారపడి ఉంటుంది. మొదటగా అసలు అందుబాటులో ఉన్న సాధనాలు ఏంటి? అనేది తెలుసుకోవాలి. తర్వాత వాటిల్లో ఏది తమకు అనుకూలమన్నది తేల్చుకోవాలి. పెట్టుబడుల్లో దేనికీ గ్యారంటీ ఉండదు. వివిధ సాధనాల గురించి లోతుగా తెలుసుకోవడం వల్ల మెరుగైన నిర్ణయాలకు వీలుంటుంది. పెట్టుబడుల అవకాశాలు, ప్రస్తుత మార్కెట్ ధోరణుల గురించి ఆన్‌లైన్‌లో సమాచారాన్ని అందించే పోర్టళ్లు ఎన్నో ఉన్నాయి. వాటి నుంచి కావాల్సిన సమాచారం తీసుకోవచ్చు. అవసరమైతే నిపుణుల సూచనలు తీసుకోవాలి. పెట్టుబడుల ఆరంభించే ముందు నెలవారీ నగదు ప్రవాహాలను ఒకసారి చెక్ చేసుకోవాలి. వస్తున్న ఆదాయం, పెడుతున్న ఖర్చులపై స్పష్టత ఉండాలి. నెలవారీ వేతనం, అద్దె ఆదాయం, ఇతర రూపాల్లో వచ్చేదంతా ఆదాయం కిందకే వస్తుంది. ఖర్చుల్లో తప్పనిసరి, తప్పనిసరి కాదు అని రెండు భాగాలు చేసుకోవాలి. విచక్షణారహితం కానివి అంటే.. ఇంటికి చెల్లించే అద్దె, గృహ రుణ చెల్లింపులు, పిల్లల స్కూల్ ఫీజులు, గ్రోసరీ, యుటిలిటీ కోసం చేసే ఖర్చు తదితరాలు. విచక్షణారహితం అంటే విలాసం, వినోదం కోసం చేసే ఖర్చులు. వీటి ఆధారంగా నెలవారీ ఎంత పొదుపు చేయాలి, ఎక్కడ ఖర్చులను తగ్గించుకోవాలనే దానిపై స్పష్టత వస్తుంది. దీంతో నెలవారీ బడ్జెట్‌ను రూపొందించుకోవచ్చు.
లక్ష్యాలపై స్పష్టత..
పెట్టుబడికి లక్ష్యాలు తోడు కావాలి. అప్పుడే స్పష్టమైన మార్గం తెలుస్తుంది. వచ్చే ఏడాది కాలానికి ఎలాంటి లక్ష్యాలు ఉన్నాయి. అలాగే, ఐదేళ్లు, పదేళ్లు? ఇలా ప్రశ్నించుకోవాలి. వచ్చే ఏడాది విదేశీ పర్యటనకు వెళ్లొచ్చు. లేదంటే 5–10 ఏళ్లలో సొంతిల్లు సమకూర్చుకోవచ్చు. లేదంటే 20–30 ఏళ్లకు వచ్చే రిటైర్మెంట్ తర్వాతి జీవితానికి నిధిని సమకూర్చుకోవడం కావచ్చు. ఇలా లక్ష్యాలన్నింటినీ నిర్ణయించుకున్న తర్వాత.. విడిగా ఒక్కో దానికి ఉన్న సమయం, ఎంత మొత్తం కావాలి, అందుకు నెలవారీగా ఎంత ఇన్వెస్ట్ చేయాలి, అందుకు అనుకూలించే పెట్టుబడి సాధనాలపై స్పష్టత తెచ్చుకోవాలి.
అత్యవసర నిధి
అన్నింటికంటే ముందు అత్యవసర నిధిని సమకూర్చుకోవాలి. ఏ కారణం వల్ల అయినా ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోవచ్చు. లేదా మానేయాల్సిన పరిస్థితి ఏర్పడొచ్చు. ప్రమాదం కారణంగా ఉద్యోగానికి తాత్కాలికంగా వెళ్లలేకపోవచ్చు. ఇలాంటి ఊహించని ఖర్చులను ఎదుర్కోవాలంటే అందుకు ఉన్న ఏకైక మార్గం అత్యవసర నిధి. అత్యవసర నిధి అనేది ఎప్పుడైనా వినియోగించుకోవడానికి అందుబాటులో ఉండే సాధనం. దీనివల్ల కష్ట కాలంలో రుణాలను ఆశ్రయించకుండా దీని సాయంతో గట్టెక్కవచ్చు. సాధారణంగా అత్యవసర నిధి మూడు నుంచి ఆరు నెలల అవసరాలను తీర్చే స్థాయిలో ఉండాలి. దీన్ని సమకూర్చుకునేందుకు ప్రతి నెలా కొంత చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి. బ్యాంక్ ఖాతా లేదంటే లిక్విడ్ ఫండ్స్‌లో ఈ మొత్తాన్ని ఉంచుకోవచ్చు. ఒకవేళ అత్యవసర నిధి ఏర్పాటుకు సరిపడా నగదు ప్రవాహం లేకపోతే, ఏవైనా అవసరాలను తగ్గించుకుని అయినా ఇన్వెస్ట్ చేయాలి.
బీమా రక్షణ
మహిళలకు జీవిత బీమా పాలసీ అవసరమా? చాలా మందికి ఎదురయ్యే ప్రశ్న ఇది. మహిళలకు కూడా జీవిత బీమా కావాలి. ఎందుకంటే వారు లేని లోటును పూర్తిగా కాకపోయినా, కొంత అయినా అధిగమించేందుకు జీవిత బీమా రక్షణ సాయపడుతుంది. బీమా రక్షణ ఉంటే, దురదృష్టవశాత్తూ ఏదైనా జరిగితే, వారిపై ఆధారపడిన వారు ఇబ్బందుల పాలు కాకుండా ఉంటుంది. జీవిత బీమా అంటే జీవితంపై పెట్టుబడి పెట్టేది. భవిష్యత్తుపై పెట్టుబడి పెట్టేది. చాలా మంది వివాహం అయి, తమకంటూ కుటుంబం ఏర్పాటైన తర్వాతే జీవిత బీమా గురించి ఆలోచిస్తుంటారు. కానీ, ఇది సరైనది కాదు. యుక్త వయసులోనే జీవిత బీమా పాలసీ తీసుకోవాలి. జీవితంలో వివిధ దశల్లో, పెరిగే తమ బాధ్యతలకు అనుగుణంగా బీమా కవరేజీ మొత్తాన్ని సవరించుకుంటూ వెళ్లాలి. ఇది భవిష్యత్తుకు భరోసానిచ్చేదిగా ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ సైతం మహిళలకు ఎంతో ముఖ్యం. పురుషులతో పోలిస్తే మహిళలకు అనారోగ్య సమస్యల రిస్క్ ఎక్కువ. గుండె జబ్బులు, కేన్సర్, స్ట్రోక్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అందుకే లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ తప్పకుండా తీసుకోవాలి.
పోర్ట్‌ఫోలియో నిర్వహణ
మహిళలు పెట్టుబడుల నిర్వహణలో పెద్దగా ఆసక్తి చూపించకపోవడాన్ని గమనించొచ్చు. ఇదంతా గతం నుంచి ఉన్న ధోరణి వల్లేనని చెప్పుకోవచ్చు. పెట్టుబడుల నిర్వహణ ఎలా? అన్న సందేహం ఎదురైతే.. ముందు తమ బలాల గురించి తెలుసుకోవాలి. రిస్క్‌కు దూరంగా సంప్రదాయ ధోరణితో ఉంటే డివిడెండ్ చెల్లించే కంపెనీలు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లు, యుటిలిటీ సంస్థలను పరిశీలించొచ్చు. రిస్క్ తీసుకునే వారు లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు పెట్టుబడులు కేటాయించుకోవచ్చు. అయితే మొత్తం పెట్టుబడులు అన్నింటినీ ఒకే చోట కాకుండా, వివిధ సాధనాల మధ్య వైవిధ్యం చేసుకోవడం తప్పనిసరి. తమ జీవిత లక్ష్యాల సాకారానికి, మెరుగైన విశ్రాంత జీవనానికి.. దీర్ఘకాలంలో సంపద సృష్టించుకునేందుకు మహిళల ముందు ఎన్నో మార్గాలున్నాయి. ఇందుకోసం వెంటనే పెట్టుబడులు ప్రారంభించాలి. చాలా ముందుగా ఆరంభిస్తే కాంపౌండింగ్ ప్రయోజనంతో సంపద వేగంగా వృద్ధి చెందుతుంది. మహిళలకు సంబంధించి జీవిత లక్ష్యాలకు మ్యూచువల్ ఫండ్స్ మెరుగైన మార్గం అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీతోపాటు డెట్, బంగారం తదితర సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. నిపుణుల నిర్వహణలో, తగినంత వైవిధ్యం, రిస్క్ బ్యాలన్స్‌తో నడిచే మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలంలో మెరుగైన రాబడిని ఇవ్వగలవు. ఇప్పటి వరకు ఉన్న గణాంకాలు ఇదే తెలియజేస్తున్నాయి. స్టాక్స్‌లో నేరుగా ఇన్వెస్ట్ చేసేంత విషయ పరిజ్ఞానం, సమయం లేని వారికి మ్యూచువల్ ఫండ్స్ మెరుగైన మార్గం. పరిమిత పెట్టుబడితోనే ఎన్నో రకాల కంపెనీలు, రంగాల్లో ఎక్స్‌పోజర్ లభిస్తుంది. అందులోనూ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల సగటు కొనుగోలు వ్యయం తగ్గి, అధిక రాబడి లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment