ప్రభుత్వం జీవిత బీమా రంగ సంస్థ ఎల్‌ఐసీ హెల్త్ ఇన్సూరెన్స్ రంగంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో దేశంలో ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ అందించేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
అందుకోసం పలు ఇన్సూరెన్స్ సేవల్ని అందిస్తున్న సంస్థల్ని కొనుగోలు చేసే అంశంపై ఎల్‌ఐసీ ప్రయత్నాలు చేస్తోందంటూ పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
ఎల్‌ఐసీ క్యూ4 ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీ ఛైర్మన్ సిద్ధార్థ్ మొహంతీ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హెల్త్ ఇన్సూరెన్స్ రంగం పట్ల ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. అయితే, సాధారణ బీమాలో తమకు పెద్దగా అనుభవం లేదని అందుకే ఈ రంగంలో ఉన్న కంపెనీలను కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్టు చెప్పారు.
ప్రస్తుతం జీవిత బీమా కంపెనీలకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలను అందించడానికి వీల్లేదు. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంటరీ కమిటీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లకు కాంపోజిట్ లైసెన్స్‌ను మంజూరు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. తద్వారా దీనివల్ల ఆయా సంస్థలకు ఖర్చులు తగ్గడంతో పాటు ఆయా సంస్థలపై నియంత్రణపరమైన భారాలు తగ్గుతాయని సూచించింది. ఇందుకోసం బీమా చట్టానికి సవరణలు చేయాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment