
హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో వాటాపై కన్ను
ఈ నెలాఖరులోగా చర్చల వివరాలు వెల్లడి
ముంబై: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్‌ఐసీ) ఆరోగ్య బీమాలోకి ప్రవేశిస్తోంది. ఇందుకు వీలుగా స్టాండెలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో వాటా కొనుగోలు చేయనున్నట్లు ఎల్‌ఐసీ సీఈవో సిద్ధార్థ మొహంతీ పేర్కొన్నారు. రానున్న రెండు వారాల్లోగా డీల్ కుదుర్చుకోనున్నట్లు తెలియజేశారు. చర్చలు తుది దశకు చేరడంతో మార్చి 31కల్లా వివరాలు వెల్లడికానున్నట్లు తెలియజేశారు. ఆరోగ్య బీమాలోకి ఎల్‌ఐసీ ప్రవేశించడం సాధారణ అంశమేనని ఇక్కడ జరిగిన జీసీఏ25 వేడుక సందర్భంగా పేర్కొన్నారు. అయితే లక్షిత కంపెనీలో నియంత్రిత లేదా 51 శాతం లేదా అంతకుమించిన వాటా కొనుగోలు చేయబోమన్నారు.
ఎంత వాటా సొంతం చేసుకునేదీ టార్గెట్ కంపెనీ విలువ, ఎల్‌ఐసీ బోర్డు నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని తెలియజేశారు. ప్రస్తుతం జీవిత బీమా కంపెనీలను ఆసుపత్రి ఖర్చులు, ఇతర వ్యయాలను కవర్ చేసే ఆరోగ్య బీమా పాలసీలు ఆఫర్ చేసేందుకు అనుమతించని కారణంగా ఎల్‌ఐసీ వాటా కొనుగోలుకి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే బీమా కంపెనీలకు కాంపోజిట్ లైసెన్స్‌ను జారీ చేయాలన్న ప్రతిపాదనలున్నప్పటికీ కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక శాఖ ఈ అంశంపై ఎలాంటి ప్రస్తావన తీసుకురాని సంగతి తెలిసిందే.
మణిపాల్‌సిగ్నా కొనుగోలు?
హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మణిపాల్‌సిగ్నాలో వాటా కొనుగోలుకి ఎల్‌ఐసీ చర్చలు నిర్వహిస్తున్నట్లు కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి. రూ. 4,000 కోట్ల విలువలో డీల్ కుదుర్చుకోనున్నట్లు అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో ఎల్‌ఐసీ స్టాండెలోన్ ఆరోగ్య బీమా కంపెనీలో ప్రస్తావించదగ్గ స్థాయిలో వాటా కొనుగోలుకి చర్చలు చేపట్టినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. అయితే ఎలాంటి ఒప్పందమూ కుదుర్చుకోలేదని స్పష్టం చేసింది. ఇందుకు బోర్డు నిర్ణయాలుసహా వివిధ అంశాలు ప్రభావం చూపనున్నట్లు తెలిపింది.
100 ఏళ్ల ప్రభుత్వ బాండ్లు కావాలి..
దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్ల(జీసెక్‌లు) జారీకి అనుమతించమంటూ జీవిత బీమా పీఎస్‌యూ ఎల్‌ఐసీ ఆర్‌బీఐని కోరింది. 100 ఏళ్ల కాలపరిమితిగల బాండ్ల జారీకి విజ్ఞప్తి చేసింది. తద్వారా దీర్ఘకాలిక బాండ్లలో పెట్టుబడి అవకాశాలకు వీలుంటుందని ఎల్‌ఐసీ ఎండీ, సీఈవో సిద్ధార్థ మొహంతీ పేర్కొన్నారు. 20–30 ఏళ్ల బాండ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆర్‌బీఐ 40 ఏళ్ల కాలపరిమితికీ అనుమతిస్తున్నట్లు తెలియజేశారు. ఈ బాటలో 50 ఏళ్లు, 100 ఏళ్ల బాండ్లనూ అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
ఈ అంశంపై ఆర్‌బీఐతో ఎప్పటికప్పుడు చర్చలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ అంశాన్ని ఆర్‌బీఐ పరిశీలిస్తున్నట్లు తెలియజేశారు. ప్రపంచ మార్కెట్లలో పలు దేశాలు 100 ఏళ్ల గడువుతో బాండ్ల జారీని చేపడుతున్నట్లు ప్రస్తావించారు. సెకండరీ మార్కెట్‌లో పరిమిత డిమాండ్, తక్కువ లిక్విడిటీ కారణంగా భారత్‌సైతం ఈ తరహా బాండ్లకు తెరతీయవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. జీసెక్‌లలో ఎల్‌ఐసీ భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment