అత్యవసర నిధి ఏర్పాటు ఇలా..!
పొదుపు సలహా
నా వయస్సు 28. నెలవారీ ఆదాయం రూ. 10,000. నేను ప్రస్తుతం ఎల్‌ఐసీ ప్రీమియం కింద ప్రతి నెలా రూ. 1,011 కడుతున్నాను. ఇంటి ఖర్చులు పోను నెలకు మరో రూ.1,700 మొత్తాన్ని మంచి రాబడినివ్వగలిగే మ్యూచువల్ ఫండ్ వంటి సాధనాల్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. తగిన సలహా ఇవ్వగలరు.
- నరసింగరావు, హైదరాబాద్
మీరు చెప్పిన వివరాలను బట్టి చూస్తే ఎల్‌ఐసీ తప్ప ఇతరత్రా మరే పొదుపు చేస్తున్నట్లు లేదు. మీరు ఇంకా వివాహం చేసుకోలేదన్నారు. కనుక రాబోయే రోజుల్లో వివాహ ప్రణాళిక కూడా ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మీరు తక్షణం చేయవలసిన పనులు...
1.అనుకోని ఖర్చులను ఎదుర్కొనేందుకు కనీసం 3-6 నెలల జీతాన్ని అత్యవసర నిధి కింద పక్కన పెట్టి ఉంచుకోవడం మంచిది. ఇందుకోసం రిస్కులు ఉండని బ్యాంకు రికరింగ్ డిపాజిట్లు, మెరుగైన వడ్డీనిచ్చే పొదుపు ఖాతాలు, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిల్లో నెలకు రూ. 1,000 చొప్పున ఇన్వెస్ట్ చేయొచ్చు.
2. పెళ్లి ఖర్చుల కోసం.. మీ ఖర్చులను కొంత తగ్గించుకోవడం ద్వారా మిగతా రూ. 700 కి మరో రూ. 300 జతయ్యేలా చూడండి. ఆ మొత్తాన్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి.
3. మీ నెలవారీ ఖర్చులు మరి కాస్త తగ్గించుకుని ఆరోగ్య బీమా కోసం ప్లాన్ చేసుకోవడం మంచిది.
- రజని భీమవరపు సీఎఫ్‌పీ, జెన్‌మనీ