Saving advice
-
పసితనంలోనే పొదుపు పాఠాలు.. ఎందుకంటే..
కొందరు ఎంత సంపాదించినా నెలాఖరుకు ఏమీ మిగిల్చరు. కొద్దిమంది జీతం అంతంతమ్రాతం అయినా సరైన ఆర్థిక ప్రణాళికతో నగదు పోగు చేస్తారు. డబ్బు నిర్వహణ గురించి తెలియకపోతే భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అంతటి ప్రాధాన్యం ఉన్న మనీ మేనేజ్మెంట్ను పిల్లలకు చిన్నప్పుడే పరిచయం చేయాలి. సరైన ఆర్థిక పాఠాల్ని ఇంట్లోనే నేర్పించాలి. ఈ విషయాలపై పిల్లలకు ఎంత తొందరగా అవగాహన కల్పిస్తే అంత మంచిది. చిన్న వయసులో పిల్లలకు నేర్పాల్సిన కనీస అంశాల గురించి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. జీవితంలో డబ్బు పాత్ర ఎంటో వారికి వివరించాలి. ఎలా సంపాదిస్తారు? అందుకు ఎలాంటి మార్గాలను ఎంచుకుంటారు? వంటి అంశాల్ని వారికి తెలియజేయాలి. ఈ దశలోనే అవసరాలు.. సౌకర్యాలకు మధ్య తేడా ఏంటో ఉదాహరణతో చెప్పాలి. ‘రూపాయి ఆదా చేస్తే.. రూపాయి సంపాదించినట్లే..’ ఈ సూత్రం పిల్లలకు చిన్నప్పుడే నేర్పించాలి. అప్పుడే వారికి ప్రతి రూపాయి విలువ అర్థమవుతుంది. పొదుపు చేస్తే వచ్చే లాభాలను ప్రత్యక్షంగా చూపించాలి. వారితో పొదుపు చేయించి వారికి కావాల్సిన వస్తువుల్ని వాటితోనే కొనివ్వండి. అప్పుడు వారికి ఇంకా సులభంగా అర్థమవుతుంది. పొదుపు గురించి వారికి అర్థమవుతుందనే దశ వచ్చిన తర్వాత నెమ్మదిగా పెట్టుబడుల గురించి వివరించాలి. దీర్ఘకాలికంగా వారికి చేకూరే ప్రయోజనాలను తెలపాలి. ఇంట్లో మీరు చేసిన పెట్టుబడిని.. దాని వల్ల కలిగిన లాభాల్ని వారికి ప్రత్యక్షంగా చూపించాలి. పోస్టాఫీసులు, ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి చిన్న చిన్న పెట్టుబడి మార్గాల్ని అలవర్చండి. ఇదీచదవండి: నంబర్ ప్లేట్‌కే రూ.141 కోట్లు.. కారు విలువ ఎంతంటే.. చాలా మంది ఖర్చు చేసిన తర్వాత మిగిలిన సొమ్ముతో పొదుపు చేస్తారు. కానీ పొదుపు చేసిన తర్వాత అవసరాలకు వెచ్చించాలి. ఆదాయానికి తగ్గట్టే ఖర్చు చేయాలనే సూత్రాన్ని పిల్లలకు వివరించాలి. అందుకోసం ఆర్థిక ప్రణాళిక ఎలా వేసుకోవాలో తెలియజేయాలి. ఇంట్లో ఆదాయం.. దాన్ని ఎలా ఖర్చు చేస్తున్నాం.. ఎంత పొదుపు చేస్తున్నాం అనే విషయాలను చూపించాలి. వారికి కూడా ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేయాలి. దానికి అనుగుణంగానే ఖర్చు చేయమని చెప్పాలి. అత్యవసర సమయంలో మన ఆర్థిక అవసరాల నిమిత్తం తీసుకునే రుణాలపై పిల్లలకు అవగాహన కల్పించాలి. ఎలాంటి సమయంలో అప్పు తీసుకోవాలి? ఎప్పుడు ఇతరులకు ఇవ్వాలి అనే విషయాలను వివరించాలి. సకాలంలో చెల్లించకపోతే ఉండే రిస్క్‌ను తెలియజేయాలి. అలాగే మార్కెట్లో ఉన్న వివిధ రకాల రుణ సదుపాయాలు, వాటి లబ్ధిని చెప్పాలి. ప్రజలు ఎదో ఒక పనిచేసి సంపాదిస్తుంటారు. మరి ప్రభుత్వానికి ఎలా ఆదాయం సమకూరుతుందనే అనుమానం పిల్లలకు ఉంటుంది. సర్కార్‌కు ఎలా ఆదాయం వస్తుందో వివరించాలి. పన్నుల విధానం ఎలా ఉంటుందో తెలపాలి. వాటిని ఎలా వసూలు చేస్తారో చెప్పాలి. పిల్లలు కాస్త పెద్ద వారైతే జీఎస్టీ విధానంపై అవగాహన కల్పించాలి. ఇదీచదవండి: విప్రోలో ఉద్యోగం వదిలి.. వ్యవసాయంతో రూ.205 కోట్లు సంపాదన డబ్బు నిర్వహణ, ఆదాయ-వ్యయాల నమోదు, ఆర్థిక ప్రణాళిక కోసం అనేక యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. వాటిని పిల్లలకు పరిచయం చేయాలి. అవి ఎలా వినియోగించాలో వివరించాలి. ఈఎంఐ, ఇన్సూరెన్స్ ప్రీమియం వంటి వాటిని లెక్కించేందుకు ఉన్న కాలిక్యులేటర్లను పరిచయం చేయాలి. వివిధ పేమెంట్ యాప్స్ పనితీరును వివరించాలి. ఈ-పేమెంట్స్ వల్ల కలిగే లాభాలను తెలియజేయాలి. -
బంగారం మదుపు ఇలాగైతే సురక్షితం!
పొదుపు సలహా మేమొక చిన్న కిరాణాషాపు నడుపుకుంటున్నాం. మాకు 4, 6 తరగతులు చదువుతున్న ఇద్దరమ్మాయిలు. వాళ్లకోసం నెలకొక గ్రాము చొప్పున సంవత్సరానికో తులం బంగారం కొనాలనుకుంటున్నాను. అలా వాళ్ల పెళ్లి సమయానికి వారికి కావలసిన నగలు చేయించాలని నా ఆలోచన. బంగారం కొనుగోలుకు రకరకాల స్కీములున్నాయి కదా, వాటిలో ఏది మెరుగైనదో సలహా ఇవ్వగలరు. - కవిత, కైకలూరు మీరన్నట్లు నగదును బంగారం రూపంలో మదుపు చేసేందుకు అనేక మార్గాలున్నాయి. వాటి గురించి తెలియచేస్తాను. మీకు అనుకూలమైనదేదో మీరే ఎంచుకోవచ్చు. నగల దుకాణాలు: నాణేల రూపంలో లేదా ఆభరణాల రూపంలో మీరు నెలనెలా లేదా సంవత్సరానికోసారి నగల దుకాణాల్లో బంగారం కొనుక్కోవచ్చు. అయితే ఇందులో కొన్ని ఇబ్బందులున్నాయి. మీరు కొన్న నాణేలను లేదా ఆభరణాలను మార్పిడి చేసే సమయంలో తరుగు, మజూరీ రూపేణా భారీగా నష్టపోవాల్సి రావచ్చు. వాటి భద్రత, మన్నిక, నాణ్యత విషయంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్‌లు: బంగారం పెట్టుబడుల విషయంలో స్టాక్మార్కెట్లో ఉన్న విధానాల్లో ఇది మెరుగైనది. ఇందుకోసం మీరు డీమ్యాట్ ఖాతా తెరవాల్సి ఉంటుంది. కొనుగోలు చేయాల్సిన కనిష్టమొత్తం ఒక గ్రాము. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్: ఈ పద్ధతిలో మీరు నెలనెలా ఈ ఫండ్రూపంలో దాచుకునే మొత్తంతో మీ ఖాతాలో ఎప్పటికప్పుడు బంగారం జమ అవుతుంటుంది. కాకపోతే వస్తురూపంలో కాక బాండ్ల రూపంలో కనిపిస్తుంది. మొదటిదాని కంటె తర్వాతి రెండు విధానాలూ చాలా మెరుగైనవి, స్వచ్ఛత విషయంలో, భద్రత విషయంలో, బీమా విషయంలో కూడా సురక్షితమైనవి. ఈ పద్ధతుల్లో బంగారం మదుపు చేయడానికి మీరు కొద్దిమొత్తంలో బ్రోకరేజి, ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఆభరణాల మజూరీ, తరుగు, లాకర్లలో దాచుకోవడానికయ్యే ఖర్చులు, శ్రమతో పోల్చితే ఇది చాలా తక్కువ. - రజనీ భీమవరపు సీఎఫ్‌పీ, జెన్‌మనీ -
అత్యవసర నిధి ఏర్పాటు ఇలా..!
పొదుపు సలహా నా వయస్సు 28. నెలవారీ ఆదాయం రూ. 10,000. నేను ప్రస్తుతం ఎల్ఐసీ ప్రీమియం కింద ప్రతి నెలా రూ. 1,011 కడుతున్నాను. ఇంటి ఖర్చులు పోను నెలకు మరో రూ.1,700 మొత్తాన్ని మంచి రాబడినివ్వగలిగే మ్యూచువల్ ఫండ్ వంటి సాధనాల్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. తగిన సలహా ఇవ్వగలరు. - నరసింగరావు, హైదరాబాద్ మీరు చెప్పిన వివరాలను బట్టి చూస్తే ఎల్ఐసీ తప్ప ఇతరత్రా మరే పొదుపు చేస్తున్నట్లు లేదు. మీరు ఇంకా వివాహం చేసుకోలేదన్నారు. కనుక రాబోయే రోజుల్లో వివాహ ప్రణాళిక కూడా ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మీరు తక్షణం చేయవలసిన పనులు... 1.అనుకోని ఖర్చులను ఎదుర్కొనేందుకు కనీసం 3-6 నెలల జీతాన్ని అత్యవసర నిధి కింద పక్కన పెట్టి ఉంచుకోవడం మంచిది. ఇందుకోసం రిస్కులు ఉండని బ్యాంకు రికరింగ్ డిపాజిట్లు, మెరుగైన వడ్డీనిచ్చే పొదుపు ఖాతాలు, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిల్లో నెలకు రూ. 1,000 చొప్పున ఇన్వెస్ట్ చేయొచ్చు. 2. పెళ్లి ఖర్చుల కోసం.. మీ ఖర్చులను కొంత తగ్గించుకోవడం ద్వారా మిగతా రూ. 700 కి మరో రూ. 300 జతయ్యేలా చూడండి. ఆ మొత్తాన్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. 3. మీ నెలవారీ ఖర్చులు మరి కాస్త తగ్గించుకుని ఆరోగ్య బీమా కోసం ప్లాన్ చేసుకోవడం మంచిది. - రజని భీమవరపు సీఎఫ్‌పీ, జెన్‌మనీ -
పిల్లల ఇంజినీరింగ్ చదువు కోసం...
పొదుపు సలహా మాకు 5, 8 ఏళ్ల వయసు పిల్లలున్నారు. వాళ్ల పై చదువుల కోసమని ప్రతి నెలా చెరి ఐదువందలు ఆర్డీ (రికరింగ్ డిపాజిట్) కడుతున్నాను. ఈ ఆర్డీ ఇంకో రెండేళ్లలో పూర్తవుతుంది. ఆ వచ్చిన మొత్తాన్ని ఎందులో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ల ఇంజినీరింగ్, మెడిసిన్ చదువులకు ఉపయోగపడుతుంది? - చందన, హైదరాబాద్ ఆర్డీ ఒక సాంప్రదాయిక పెట్టుబడి మార్గం. ఇది సురక్షితమైనదే. నష్టభయం ఉండదు. ప్రస్తుతం బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు ఆర్డీపై దాదాపు 9 శాతం వరకు వడ్డీని ఇస్తున్నాయి. అయితే దీనివల్ల దీర్ఘకాలిక ఖర్చులను ఎదుర్కోవ డం సాధ్యం కాకపోవచ్చు. ప్రస్తుతం ఇంజినీరింగ్, మెడిసిన్ ఓపెన్ కేటగిరీలో చదవాలంటే నాలుగేళ్లకు కలిపి ఒక్కొక్క పాపకు 4 లక్షలు ఖర్చు అవుతుంది అనుకుందాం. ఐదేళ్ల పాపకు ఇంజినీరింగ్‌కు 12 ఏళ్లు, ఎనిమిదేళ్ల పాపకు తొమ్మిదేళ్ల వ్యవధి ఉంది. ప్రస్తుతం ఆరు శాతం ద్రవ్యోల్బణం ప్రకారం ఈ మొత్తం 12 సంవత్సరాలకు సుమారు 8 లక్షలు, తొమ్మిదేళ్లకు 7 లక్షలు అవుతాయి. కాబట్టి ఈ ఖర్చును దృష్టిలో ఉంచుకుని ఆర్డీని కొనసాగించండి. మరో చెరో రు. 1500 ఇప్పటి నుండి ఈక్విటీ గ్రోత్ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతూ, రెండు సంవత్సరాల తర్వాత వచ్చే ఆర్డీ మొత్తాన్ని కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరవచ్చు. - రజని భీమవరపు, సిఎఫ్‌పి, జెన్‌మనీ మీ ఆర్థిక, పొదుపు లక్ష్యాల సాధనలో ఎదురయ్యే సందేహాల నివృత్తికోసం, మీ సమస్యలను ఈ చిరునామాకు పంపించండి పొదుపు సలహా, కేరాఫ్ సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34, aame.sakshi@gmail.com