బంగారం మదుపు ఇలాగైతే సురక్షితం!
పొదుపు సలహా
మేమొక చిన్న కిరాణాషాపు నడుపుకుంటున్నాం. మాకు 4, 6 తరగతులు చదువుతున్న ఇద్దరమ్మాయిలు. వాళ్లకోసం నెలకొక గ్రాము చొప్పున సంవత్సరానికో తులం బంగారం కొనాలనుకుంటున్నాను. అలా వాళ్ల పెళ్లి సమయానికి వారికి కావలసిన నగలు చేయించాలని నా ఆలోచన. బంగారం కొనుగోలుకు రకరకాల స్కీములున్నాయి కదా, వాటిలో ఏది మెరుగైనదో సలహా ఇవ్వగలరు.
- కవిత, కైకలూరు
మీరన్నట్లు నగదును బంగారం రూపంలో మదుపు చేసేందుకు అనేక మార్గాలున్నాయి. వాటి గురించి తెలియచేస్తాను. మీకు అనుకూలమైనదేదో మీరే ఎంచుకోవచ్చు. నగల దుకాణాలు: నాణేల రూపంలో లేదా ఆభరణాల రూపంలో మీరు నెలనెలా లేదా సంవత్సరానికోసారి నగల దుకాణాల్లో బంగారం కొనుక్కోవచ్చు. అయితే ఇందులో కొన్ని ఇబ్బందులున్నాయి. మీరు కొన్న నాణేలను లేదా ఆభరణాలను మార్పిడి చేసే సమయంలో తరుగు, మజూరీ రూపేణా భారీగా నష్టపోవాల్సి రావచ్చు. వాటి భద్రత, మన్నిక, నాణ్యత విషయంలో ఇబ్బందులు తలెత్తవచ్చు.
గోల్డ్ ఈటీఎఫ్‌లు: బంగారం పెట్టుబడుల విషయంలో స్టాక్‌మార్కెట్‌లో ఉన్న విధానాల్లో ఇది మెరుగైనది. ఇందుకోసం మీరు డీమ్యాట్ ఖాతా తెరవాల్సి ఉంటుంది. కొనుగోలు చేయాల్సిన కనిష్టమొత్తం ఒక గ్రాము. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్: ఈ పద్ధతిలో మీరు నెలనెలా ఈ ఫండ్‌రూపంలో దాచుకునే మొత్తంతో మీ ఖాతాలో ఎప్పటికప్పుడు బంగారం జమ అవుతుంటుంది. కాకపోతే వస్తురూపంలో కాక బాండ్ల రూపంలో కనిపిస్తుంది.
మొదటిదాని కంటె తర్వాతి రెండు విధానాలూ చాలా మెరుగైనవి, స్వచ్ఛత విషయంలో, భద్రత విషయంలో, బీమా విషయంలో కూడా సురక్షితమైనవి. ఈ పద్ధతుల్లో బంగారం మదుపు చేయడానికి మీరు కొద్దిమొత్తంలో బ్రోకరేజి, ఫండ్ మేనేజ్‌మెంట్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఆభరణాల మజూరీ, తరుగు, లాకర్లలో దాచుకోవడానికయ్యే ఖర్చులు, శ్రమతో పోల్చితే ఇది చాలా తక్కువ.
- రజనీ భీమవరపు సీఎఫ్‌పీ, జెన్‌మనీ