కొందరు ఎంత సంపాదించినా నెలాఖరుకు ఏమీ మిగిల్చరు. కొద్దిమంది జీతం అంతంతమ్రాతం అయినా సరైన ఆర్థిక ప్రణాళికతో నగదు పోగు చేస్తారు. డబ్బు నిర్వహణ గురించి తెలియకపోతే భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అంతటి ప్రాధాన్యం ఉన్న మనీ మేనేజ్‌మెంట్‌ను పిల్లలకు చిన్నప్పుడే పరిచయం చేయాలి. సరైన ఆర్థిక పాఠాల్ని ఇంట్లోనే నేర్పించాలి. ఈ విషయాలపై పిల్లలకు ఎంత తొందరగా అవగాహన కల్పిస్తే అంత మంచిది. చిన్న వయసులో పిల్లలకు నేర్పాల్సిన కనీస అంశాల గురించి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
జీవితంలో డబ్బు పాత్ర ఎంటో వారికి వివరించాలి. ఎలా సంపాదిస్తారు? అందుకు ఎలాంటి మార్గాలను ఎంచుకుంటారు? వంటి అంశాల్ని వారికి తెలియజేయాలి. ఈ దశలోనే అవసరాలు.. సౌకర్యాలకు మధ్య తేడా ఏంటో ఉదాహరణతో చెప్పాలి. ‘రూపాయి ఆదా చేస్తే.. రూపాయి సంపాదించినట్లే..’ ఈ సూత్రం పిల్లలకు చిన్నప్పుడే నేర్పించాలి. అప్పుడే వారికి ప్రతి రూపాయి విలువ అర్థమవుతుంది. పొదుపు చేస్తే వచ్చే లాభాలను ప్రత్యక్షంగా చూపించాలి. వారితో పొదుపు చేయించి వారికి కావాల్సిన వస్తువుల్ని వాటితోనే కొనివ్వండి. అప్పుడు వారికి ఇంకా సులభంగా అర్థమవుతుంది.
పొదుపు గురించి వారికి అర్థమవుతుందనే దశ వచ్చిన తర్వాత నెమ్మదిగా పెట్టుబడుల గురించి వివరించాలి. దీర్ఘకాలికంగా వారికి చేకూరే ప్రయోజనాలను తెలపాలి. ఇంట్లో మీరు చేసిన పెట్టుబడిని.. దాని వల్ల కలిగిన లాభాల్ని వారికి ప్రత్యక్షంగా చూపించాలి. పోస్టాఫీసులు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు వంటి చిన్న చిన్న పెట్టుబడి మార్గాల్ని అలవర్చండి.
ఇదీచదవండి: నంబర్ ప్లేట్‌కే రూ.141 కోట్లు.. కారు విలువ ఎంతంటే..
చాలా మంది ఖర్చు చేసిన తర్వాత మిగిలిన సొమ్ముతో పొదుపు చేస్తారు. కానీ పొదుపు చేసిన తర్వాత అవసరాలకు వెచ్చించాలి. ఆదాయానికి తగ్గట్టే ఖర్చు చేయాలనే సూత్రాన్ని పిల్లలకు వివరించాలి. అందుకోసం ఆర్థిక ప్రణాళిక ఎలా వేసుకోవాలో తెలియజేయాలి. ఇంట్లో ఆదాయం.. దాన్ని ఎలా ఖర్చు చేస్తున్నాం.. ఎంత పొదుపు చేస్తున్నాం అనే విషయాలను చూపించాలి. వారికి కూడా ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేయాలి. దానికి అనుగుణంగానే ఖర్చు చేయమని చెప్పాలి.
అత్యవసర సమయంలో మన ఆర్థిక అవసరాల నిమిత్తం తీసుకునే రుణాలపై పిల్లలకు అవగాహన కల్పించాలి. ఎలాంటి సమయంలో అప్పు తీసుకోవాలి? ఎప్పుడు ఇతరులకు ఇవ్వాలి అనే విషయాలను వివరించాలి. సకాలంలో చెల్లించకపోతే ఉండే రిస్క్‌ను తెలియజేయాలి. అలాగే మార్కెట్లో ఉన్న వివిధ రకాల రుణ సదుపాయాలు, వాటి లబ్ధిని చెప్పాలి.
ప్రజలు ఎదో ఒక పనిచేసి సంపాదిస్తుంటారు. మరి ప్రభుత్వానికి ఎలా ఆదాయం సమకూరుతుందనే అనుమానం పిల్లలకు ఉంటుంది. సర్కార్‌కు ఎలా ఆదాయం వస్తుందో వివరించాలి. పన్నుల విధానం ఎలా ఉంటుందో తెలపాలి. వాటిని ఎలా వసూలు చేస్తారో చెప్పాలి. పిల్లలు కాస్త పెద్ద వారైతే జీఎస్టీ విధానంపై అవగాహన కల్పించాలి.
ఇదీచదవండి: విప్రోలో ఉద్యోగం వదిలి.. వ్యవసాయంతో రూ.205 కోట్లు సంపాదన
డబ్బు నిర్వహణ, ఆదాయ-వ్యయాల నమోదు, ఆర్థిక ప్రణాళిక కోసం అనేక యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. వాటిని పిల్లలకు పరిచయం చేయాలి. అవి ఎలా వినియోగించాలో వివరించాలి. ఈఎంఐ, ఇన్సూరెన్స్ ప్రీమియం వంటి వాటిని లెక్కించేందుకు ఉన్న కాలిక్యులేటర్లను పరిచయం చేయాలి. వివిధ పేమెంట్ యాప్స్ పనితీరును వివరించాలి. ఈ-పేమెంట్స్ వల్ల కలిగే లాభాలను తెలియజేయాలి.
Comments
Please login to add a commentAdd a comment