ఆమె ఇళయరాజానా లేక రెహమానా అనే సందేహం వస్తుంది ఇంగ్లండ్‌కు చెందిన అల్మా ఎలిజబెత్ డీషర్‌ను చూస్తే. చిన్నవయసులోనే కచరీలు చేసే స్థాయికి ఎదిగితే అనుమానం రాదూ?
రెండేళ్ల వయసు నుంచే అల్మా పియానో వాయించడం మొదలుపెట్టింది. ఆ వయసులోనే స్పష్టంగా పాటలు పాడటం మొదలుపెట్టింది. అంత చిన్నవయసులో తన ఆసక్తి చూసి తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ఆమె మూడో పుట్టినరోజు నాడు చిన్న వయెలిన్‌ని బహుమతిగా ఇచ్చారు. దాన్ని ఆటబొమ్మలా కాక, వాయిద్యంలా చూసి సాధన చేయడం మొదటుపెట్టింది అల్మా. ఏడాదిలోనే వయోలిన్ వాయించడంలో ఎంతో ప్రతిభ చూపింది అల్మా.
ఐదో ఏట నుంచి పియానోపై సొంతంగా బాణీలు కట్టడం మొదలుపెట్టింది. అయితే అవన్నీ అస్పష్టంగా ఉండేవి. ఆరో ఏట నుంచి స్పష్టంగా అనేక బాణీలు కంపోజ్ చేసింది. 2013లో తన 8వ ఏట ఆ బాణీలన్నీ కలిపి ఆల్బమ్‌గా విడుదల చేశారు ఆమె తల్లిదండ్రులు. పదేళ్ల వయసుకు అల్మా వయోలిన్ వాయించడంలో మరింత నేర్పు సాధించింది. పూర్తి స్థాయి కచేరీకి అవసరమైన కంపోజిషన్‌ను రూపొందించింది.
ఆమె ప్రతిభ చూసి అందరూ తనను మెచ్చుకున్నారు. మరి అల్మా స్కూల్ సంగతులేంటి? ఐదేళ్ల వయసులో తల్లిదండ్రులు ఆమెను స్కూల్‌కి పంపారు. కానీ అక్కడి పాఠాలు ఆమెకు నచ్చలేదు. దీంతో మొదటిరోజే ఆమె స్కూల్ మానేసింది. అప్పట్నుంచి ఇంట్లోనే అమ్మానాన్న ఆమెకు చదువు చెప్పడం మొదలుపెట్టారు. కళాకారులకు స్వేచ్ఛ కావాలని, ఎవరూ అడ్డుకోని స్వతంత్రం కావాలని అంటున్నారు.
బాల సంగీతకారురాలిగా పేరు పొందిన అల్మా ‘ది స్వీపర్ ఆఫ్ డ్రీమ్స్(2012), ‘సిండ్రెల్లా’(2015), ‘ది ఎంపరర్స్ న్యూ వాల్డ్జ్(2023) వంటి సంగీత రూపకాలను స్వరపరిచి, ప్రదర్శించింది. 2021లో లియోనార్డో డావిన్సీ అంతర్జాతీయ పురస్కారం అందుకుని, ఆ పురస్కారం అందుకున్న చిన్నవయస్కురాలిగా రికార్డు సాధించింది. అనేక అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలు ఇస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment