violin
-
ఆమె ఇళయరాజానా లేక రెహమానా..?
ఆమె ఇళయరాజానా లేక రెహమానా అనే సందేహం వస్తుంది ఇంగ్లండ్‌కు చెందిన అల్మా ఎలిజబెత్ డీషర్ను చూస్తే. చిన్నవయసులోనే కచరీలు చేసే స్థాయికి ఎదిగితే అనుమానం రాదూ?రెండేళ్ల వయసు నుంచే అల్మా పియానో వాయించడం మొదలుపెట్టింది. ఆ వయసులోనే స్పష్టంగా పాటలు పాడటం మొదలుపెట్టింది. అంత చిన్నవయసులో తన ఆసక్తి చూసి తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ఆమె మూడో పుట్టినరోజు నాడు చిన్న వయెలిన్ని బహుమతిగా ఇచ్చారు. దాన్ని ఆటబొమ్మలా కాక, వాయిద్యంలా చూసి సాధన చేయడం మొదటుపెట్టింది అల్మా. ఏడాదిలోనే వయోలిన్ వాయించడంలో ఎంతో ప్రతిభ చూపింది అల్మా. ఐదో ఏట నుంచి పియానోపై సొంతంగా బాణీలు కట్టడం మొదలుపెట్టింది. అయితే అవన్నీ అస్పష్టంగా ఉండేవి. ఆరో ఏట నుంచి స్పష్టంగా అనేక బాణీలు కంపోజ్ చేసింది. 2013లో తన 8వ ఏట ఆ బాణీలన్నీ కలిపి ఆల్బమ్‌గా విడుదల చేశారు ఆమె తల్లిదండ్రులు. పదేళ్ల వయసుకు అల్మా వయోలిన్ వాయించడంలో మరింత నేర్పు సాధించింది. పూర్తి స్థాయి కచేరీకి అవసరమైన కంపోజిషన్‌ను రూపొందించింది. ఆమె ప్రతిభ చూసి అందరూ తనను మెచ్చుకున్నారు. మరి అల్మా స్కూల్ సంగతులేంటి? ఐదేళ్ల వయసులో తల్లిదండ్రులు ఆమెను స్కూల్‌కి పంపారు. కానీ అక్కడి పాఠాలు ఆమెకు నచ్చలేదు. దీంతో మొదటిరోజే ఆమె స్కూల్ మానేసింది. అప్పట్నుంచి ఇంట్లోనే అమ్మానాన్న ఆమెకు చదువు చెప్పడం మొదలుపెట్టారు. కళాకారులకు స్వేచ్ఛ కావాలని, ఎవరూ అడ్డుకోని స్వతంత్రం కావాలని అంటున్నారు. బాల సంగీతకారురాలిగా పేరు పొందిన అల్మా ‘ది స్వీపర్ ఆఫ్ డ్రీమ్స్(2012), ‘సిండ్రెల్లా’(2015), ‘ది ఎంపరర్స్ న్యూ వాల్డ్జ్(2023) వంటి సంగీత రూపకాలను స్వరపరిచి, ప్రదర్శించింది. 2021లో లియోనార్డో డావిన్సీ అంతర్జాతీయ పురస్కారం అందుకుని, ఆ పురస్కారం అందుకున్న చిన్నవయస్కురాలిగా రికార్డు సాధించింది. అనేక అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలు ఇస్తోంది. (చదవండి: రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా వాచ్‌మ్యాన్ -
సంగీతంలో అపశ్రుతి
సంగీతంలో సప్తస్వరాలు ఉన్నాయి. పశుపక్ష్యాదుల ధ్వనుల నుంచి ఇవి పుట్టినట్లు ప్రతీతి. శ్రుతి లయలు స్వరాల గమనానికి దిశానిర్దేశం చేసి, సంగీతాన్ని మనోరంజకం చేస్తాయి. సంగీతానికి ఆధారభూతమైన సప్తస్వరాలైనా, శ్రుతిలయాదులైనా– అన్నీ ప్రకృతి నుంచి పుట్టినవే! ప్రకృతికి కులమతాలు లేవు. ప్రకృతి నుంచి పుట్టిన సంగీతానికి కూడా కులమతాలు లేవు, సరిహద్దులు లేవు. చక్కని సంగీతానికి శ్రావ్యతే గీటురాయి. సంగీత కళను శాస్త్రబద్ధం చేసిన తొలి రోజుల్లో సంగీతానికి సంబంధించిన శాస్త్రీయ సంప్రదాయాలు కొన్ని ఏర్పడ్డాయి. తర్వాతి తరా లలో కొందరు సంగీత విద్వాంసులు పూర్వసంప్రదాయాలను, చాదస్తాలను తోసిపుచ్చి, తమదైన సృజనతో కొత్త ఒరవడికి నాంది పలికారు. తొలినాళ్లలో ఏకరీతిలో ఉన్న భారతీయ సంగీతంలో పద్నాలుగో శతాబ్దం నాటికి విభజన ఏర్పడింది. భారతీయ సంగీతంలో హిందుస్తానీ సంగీతం, కర్ణాటక సంగీతం ప్రధాన శాఖలుగా ఏర్పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా సంగీతంలో ఎన్ని శాఖలు ఉన్నా, అవన్నీ శైలీభేదాల వల్ల ఏర్పడి నవి మాత్రమే! కర్ణాటక సంగీతానికి పురందరదాసు పితామహుడిగా పేరుగాంచారు. ఆయన తర్వాతి కాలంలో త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి ‘కర్ణాటక సంగీత త్రిమూ ర్తులు’గా పేరుపొందారు. వీరందరూ ఎవరి స్థాయిలో వారు ప్రయోగాలు చేసిన వారే గాని, పూర్వ శాస్త్రగ్రంథాల్లోని పాఠాలకు కట్టుబడి, వాటినే తు.చ. తప్పకుండా వల్లెవేసిన వారు కాదు. వారంతా మడిగట్టుకుని పూర్వగ్రంథాల్లోని పద్ధతులకే పరిమితమై ఉన్నట్లయితే, ఈనాడు కర్ణాటక సంగీతం ఇంతటి ఉత్కృష్ట స్థాయికి చేరుకునేదే కాదు. ముత్తుస్వామి దీక్షితార్ సాహసోపేతమైన ప్రయోగాలే చేశారు. ఈస్టిండియా కంపెనీ అధికారి కర్నల్ జేమ్స్ బ్రౌన్ ప్రోత్సాహంతో ఇంగ్లిష్ సంగీత బాణీలకు సంస్కృత రచనలు చేశారు. ఈస్టిండియా కంపెనీ బ్యాండ్ ఆర్కెస్ట్రాలో ఉపయోగించే వయొలిన్‌ను చూసి ముచ్చటపడి కర్ణాటక సంగీత కచేరీల్లోకి తీసుకువచ్చారు. ముత్తుస్వామి సోదరుడు బాలుస్వామి తొలిసారిగా కర్ణాటక సంగీత కచేరీలో వయొలిన్ వాయించారు. పాశ్చాత్య శైలిలో ‘నోటు స్వరాలు’ కూర్చి సంప్రదాయ కచేరీల్లో వినిపించడం ప్రారంభించారు. ముత్తుస్వామి దీక్షితార్ చేసిన ప్రయోగాలు ఆనాటిసంప్రదాయవాదులకు మింగుడుపడనివే! చాదస్తపు విమర్శలకు భయపడి ముత్తుస్వామి తన ప్రయోగాలను విరమించుకున్నట్లయితే, ఆయన అనామకంగానే కాలగర్భంలో కలిసిపోయేవారు. ముత్తుస్వామి దీక్షితార్ తర్వాతికాలంలో కూడా కొందరు విద్వాంసులు క్లారినెట్, శాక్సాఫోన్, మాండొలిన్, గిటార్, వయోలా, పియానో వంటి పాశ్చాత్య వాద్యపరికరాలను కర్ణాటక సంగీత కచేరీలకు పరిచయం చేశారు. త్యాగరాజు కాలం నాటికి అప్పటి తంజావూరు సంస్థానంలో పాశ్చాత్య సంగీతానికి కూడా సమాదరణ ఉండేది. త్యాగరాజు రాజాశ్రయానికి దూరంగా తనసంగీత సాధన కొనసాగించినా, ఆయనపైనా పాశ్చాత్య సంగీత ప్రభావం లేకపోలేదు. త్యాగరాజు ఏటా వేసవిలో ఎక్కువగా తిరువయ్యారులో గడిపేవారు. అక్కడ ఉన్నప్పుడే ఆయన పాశ్చాత్యసంగీతాన్ని ఆస్వాదించారు. త్యాగరాజు ఆ తర్వాతి కాలంలో శంకరాభరణ రాగంలో కూర్చిన ‘వరలీలా గానలోలా’, ‘సారస నేత్ర’, సుపోషిణి రాగంలో కూర్చిన ‘రమించు వారెవరురా’ వంటి కొద్ది కీర్తనల్లో పాశ్చాత్య సంగీత ధోరణులు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ప్రయోగాలు లేకుండా ఏ కళా, ఏ శాస్త్రమూ అభివృద్ధి చెందదు. మన కాలానికి చెందిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ కూడా కర్ణాటక సంగీతంలో ఎన్నో ప్రయోగాలు చేసి శ్రోతలను మెప్పించారు. సంగీత సంప్రదాయం ప్రకారం ఆరోహణ అవరోహణలలో ఒక రాగానికి కనీసం ఐదేసి స్వరాలు ఉండాలి. ఆరోహణ అవరోహణలలో ఐదు కంటే తక్కువ స్వరాలను ఉపయో గించి ఆయన కొత్త రాగాలను సృష్టించారు. నేటితరంలో టి.ఎం.కృష్ణ తనదైన శైలిలో సంగీతంలో ప్రయోగాలను కొనసాగిస్తున్నారు. సంప్రదాయ కచేరీ నమూనాలోనే మార్పులను తీసుకొచ్చారు. వర్ణాలు, కృతులు, తిల్లానాలు వంటి వాటితోనే సాగే కర్ణాటక సంగీత కచేరీల్లో టి.ఎం.కృష్ణ క్రైస్తవ గీతాలను, ఇస్లాం గీతాలను, తమిళ కవుల గేయాలను కూడా పాడటం ద్వారా కొత్త ఒరవడికి నాంది పలికారు. కచేరీల్లో టి.ఎం. కృష్ణ ఈ మార్పులను తెచ్చినప్పటి నుంచి మతతత్త్వవాదులు ఆయనపై విమర్శలు గుప్పిస్తూ వస్తు న్నారు. టి.ఎం.కృష్ణ సంగీత రంగానికి మాత్రమే పరిమితం కాకుండా; దేశంలోని సామాజిక పరిణామాలపై ఎప్పటికప్పుడు స్పందించే తీరు, దళితవాడలకు వెళ్లి కచేరీలు చేస్తూ సంగీతాన్ని సామాన్యుల చెంతకు చేరుస్తున్న పద్ధతి కూడా వారికి కంటగింపుగా మారింది. ఇదివరకు టి.ఎం. కృష్ణకు రామన్ మెగసెసె అవార్డు వచ్చినప్పుడు రుసరుసలు వినిపించాయి. ఇటీవల ఆయనకు మ్యూజిక్ అకాడమీ ‘సంగీత కళానిధి’ అవార్డును ప్రకటించింది. దీనికి నిరసనగా గాయనీమణులు రంజని, గాయత్రి మ్యూజిక్ అకాడమీలో ఈసారి కచేరీ చేయబోమంటూ, అకాడమీ అధ్యక్షుడికి లేఖ రాశారు. మ్యూజిక్ అకాడమీ అధ్యక్షుడు ఎన్. మురళి ఆ లేఖకు ఇచ్చిన సమాధానంలో వారి తీరును తప్పుపట్టారు. టి.ఎం.కృష్ణపై అక్కసు వెళ్లగక్కుతున్న వారంతా ఆయన సంగీత సామ ర్థ్యాన్ని గురించి మాట్లాడకుండా, ఆయన సంప్రదాయాన్ని మంటగలిపేస్తున్నాడంటూ గగ్గోలు పెడుతుండటం గమనార్హం. రంజని, గాయత్రి వంటి వారి తీరు సంగీత ప్రపంచంలో ఒక అపశ్రుతి. అయితే, సంగీతం ఒక స్వరవాహిని. ఇలాంటి అపశ్రుతులను సవరించుకుంటూ తన ప్రవాహాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. -
120 కోట్లు ‘పలికింది’
ప్రఖ్యాత రష్యన్–అమెరికన్ కళాకారుడు ఆంటోనియో స్ట్రాడివరీ 1714లో తయారు చేసిన అత్యంత అరుదైన రకం వయొలిన్ ఇది. విఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఈయన దగ్గరే కొన్నాళ్లు సంగీతం నేర్చుకున్నారు. న్యూయార్క్‌లో జరిగిన టరిసియో వేలంలో ఏకంగా రూ.120 కోట్ల ధర పలికింది. -
‘ఆ పసి హృదయం ఎంతగా గాయపడిందో ఆ కళ్లే చెబుతున్నాయి'
ఈ జిందగీలో ఎన్నో హృదయవిదారక సంఘటనలు, మనసును మెలితిప్పే ఉదంతాలు రోజూ ఎన్నెన్నో చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా పేదరికం, హింస ప్రస్తుత సమాజంలో తారాస్థాయికి చేరుతుంది. పేదరికమే హింసకు కారణమౌతుందనేది అనేకమంది వాదన. ఇది పూర్తిగా నిజం కాదు. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు చేసే లోపాల కారణంగా కొన్ని సందర్భాల్లో వారే నేరస్తులౌతున్నారు. ఐతే ప్రస్తుతం కొన్ని రకాల సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పిల్లలకు సహాయం చేయడం కోసం తీవ్రంగా కృషిచేస్తున్నాయి. అటువంటి ఓ బాలుడికి సంబంధించిన ఓ పిక్చర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ బాలుడి కథ వింటే మీ కళ్లు కచ్చితంగా చెమ్మగిల్లుతాయి. వయొలిన్ వాయిస్తున్న ఇద్దరుముగ్గరు పిల్లలు కనిపించే ఈ ఫొటో వెనుక కథ ఏంటంటే... వీరిలో ఏడుస్తూ కనిపిస్తున్న పిల్లవాడు బ్రెజిల్‌కు చెందిన వాడు. మృతిచెందిన తమ టీచర్ అంత్యక్రియల్లో వయొలిన్ వాయిస్తున్నాడు. అవ్నీష్ షరన్ అనే ఐఏఎస్ ఆఫీసర్ ట్విటర్లో హృదయాన్ని మెలిపెట్టేలా ఏడుస్తూ వయొలిన్ వాయిస్తున్న బాలుడి ఫొటోను షేర్ చేశాడు. అంతేకాదు అతని కన్నీళ్లకు కారణం కూడా తెలుపుతూ.. నేర జీవితం నుంచి బయటకు తెచ్చిన గురువు అంత్యక్రియల్లో వయొలిన్ వాయిస్తూ ఏడుస్తున్న బ్రెజిలియన్ బాలుడు (డీగో ఫ్రాజో టర్కటో) అనే క్యప్షన్‌తో షేర్ చేశాడు. ఈ ఫొటోలో మానవత్వం ప్రపంచంలోనే గట్టిగొంతుకతో మాట్లాడుతోందని కూడా రాశాడు. ఐతే అనతికాలంలో ఈ బాలుడి చిత్రం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాల్లో వైరలయ్యింది. అనేక మంది తమ ఉన్నతమైన అభిప్రాయాలను తెలుపుతూ ఈ ఫొటోకు కామెంట్ల రూపంలో పంపుతున్నారు కూడా. వాళ్లలో ఒకరు ‘మరణించిన తన ఉపాధ్యాయుడి అంత్యక్రియల్లో బ్రెజిల్ చైల్డ్‌కు చెందిన ఈ చిత్రం మన జీవితాల్లో అత్యంత భావోద్వేగ చిత్రాల్లో ఒకట'ని అభివర్ణించారు. మరొకరేమో ‘నిజానికి ఈ భూప్రపంచంలో కేవలం టీచర్లు మాత్రమే మానవత్వాన్ని కాపాడే సామర్ధ్యం కలిగినవారని, తన హృదయం పూర్తిగా బద్ధలైనట్లు అతని కళ్లు చెబుతున్నాయ'ని ఇంకొకరు కామెంట్ చేశారు. చదవండి: ఆధార్‌ను ఓటరు కార్డుతో అనుసంధానించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం! This photo was taken of a Brazilian boy (Diego Frazzo Turkato),playing the violin at the funeral of his teacher who rescued him from the environment of poverty and crime in which he lived. In this image,humanity speaks with the strongest voice in the world. Pic: Marcos Tristao pic.twitter.com/MkWUd5DcBE — Awanish Sharan (@AwanishSharan) December 19, 2021 -
జీవితం చాలా చిన్నది నన్బా : కీర్తి
కోలివుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పలువురు దక్షిణాది సినీ ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. సోషల్ మీడియాలో సందేశాలు పోస్ట్ చేశారు. రాధిక శరత్‌కుమార్, హన్సిక, రకుల్‌ప్రీత్ సింగ్, కాజల్, ఏఆర్ మురుగదాస్, విశాల్, వెంకట్ ప్రభు, సందీప్ కిషన్, ఐశ్వర్య రాజేష్, పాండిరాజ్, ఆది పినిశెట్టి.. ఇలా పలువురు విజయ్ శుభాకాంక్షలు చెప్పారు. మరోవైపు విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన తాజా చిత్రం ‘మాస్టర్’ టీమ్ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది.(చదవండి : పెంగ్విన్ మూవీ రివ్యూ) అయితే హీరోయిన్ కీర్తి సురేష్ చాలా స్పెషల్‌గా విజయ్‌కు బర్త్ డే విషెస్ తెలియజేశారు. మాస్టర్ చిత్రం నుంచి విడుదలైన కుట్టి స్టోరి సాంగ్‌కు ఆమె వయోలిన్ ప్లే చేస్తూ విజయ్‌కు బర్త్‌డే విషెస్ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘జీవితం చాలా చిన్నది నన్బా..ఎప్పుడూ ఆనందంగా ఉండండి. హ్యాపీ బర్త్ డే విజయ్ సార్. మీ బర్త్‌డే రోజున ఓ చిన్న వీడియో’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. కీర్తి అద్భుతంగా వయోలిన్ ప్లే చేసిందంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, విజయ్, కీర్తి సురేష్ జంటగా భైరవ, సర్కార్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. కీర్తి విషయానికి వస్తే.. ఇటీవల ఆమె నటించిన పెంగ్విన్ చిత్రం అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైంది. ఈ చిత్రానికి అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. -
వయోలిన్‌తో ..శంకర్ మహదేవన్ పాట
-
వయోలిన్‌తో ..శంకర్ మహదేవన్ పాట
శంకర్ మహదేవన్..ఈపేరు సంగీత ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో అతిశయోక్తి కాదు. ఆయన పాడిన బ్రీత్లెస్ ట్రాక్ అప్పడు, ఇప్పడూ సూపర్‌హిట్టే. తాజాగా ఈ పాటకు ముంబైకి చెందిన కళాకారిణి శ్వేత ఆనందశివన్ వయోలిన్‌తో చేసిన ప్రదర్శన నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ఈ వీడియోను శంకర్మహదేవన్కు ట్యాగ్ చేయగా, ఇప్పటికే 4 లక్షల వ్యూస్ వచ్చాయి. 13 వేల మంది ఈ వీడియోను షేర్ చేశారు. 1998లో శంకర్ మహదేవన్ పాడిన ఈ బ్రీత్లెస్ ట్రాక్ ఎంతో పాపులర్ అయ్యింది. దీనికి శ్వేత ఆనందశివన్ కూడా నిర్విరామంగా వయోలిన్ వాయించి నెటిజన్లను ఆకట్టుకుంది. -
ఈ వీడియో హృదయాన్ని హత్తుకునేలా ఉంది
-
ఈ వీడియో హృదయాన్ని హత్తుకునేలా ఉంది
లండన్ : డాక్టర్లు బ్రెయిన్ సర్జరీ చేస్తుండగానే సదరు మహిళ వయొలిన్ పరికరాన్ని వాయించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ ఘటన బ్రిటన్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. వివరాలు.. లండన్‌కు చెందిన 53 ఏళ్ల డాగ్మార్ టర్నర్ గత కొంత కాలంగా అరుదైన బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో బ్రిటన్‌లోని కింగ్స్ కాలేజీ ఆసుపత్రి న్యూరో సర్జన్ కీమౌర్స్ అష్కాన్ దగ్గర ట్యూమర్‌కు సంబంధించి చికిత్స తీసుకుంటున్నారు. కాగా ట్యూమర్ పరిధి బ్రెయిన్ కుడి భాగం మొత్తం విస్తరించడంతో వెంటనే ఆపరేషన్ చేసి ట్యూమర్ తొలగించుకోవాలని,లేకపోతే వెంటనే ప్రాణం పోతుందని కీమౌర్స్ అష్కాన్ సూచించారు.(జస్ట్ మిస్.. కొద్దిలో ప్రాణం పోయేదే) ఇదిలా ఉండగా టర్నర్‌కు సంగీతమంటే మహా ప్రాణం.. ఎంతలా అంటే ఆమె గత 40 ఏళ్లుగా వయొలిన్ పరికరాన్ని ఎంతో ఇష్టంగా వాయిస్తున్నారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సమయంలో తనకు వయొలిన్ వాయించడానికి అనుమతి ఇవ్వాలని టర్నర్ అష్కాన్‌ను కోరారు. మొదట ఆమె అడిగినదానికి ఒప్పుకోని అష్కాన్ టర్నర్‌కు సంగీతంపై ఉన్న ఇష్టంతో కాదనలేకపోయాడు. ఆపరేషన్ సమయంలో ఆమెకు మత్తు ఇవ్వకుండానే బ్రెయిన్లోని ట్యూమర్‌ను తొలగించారు. అయితే కణితిని తొలగించినంత సేపూ ఆమె ఎడమ చేయిలో వయొలిన్ పట్టుకొని కుడిచేత్తో వాయించిన తీరు హృదయాన్ని హతుత్కునేలా ఉంది. అయితే ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో ఫేర్ చేయడంతో వైరల్‌గా మారింది. (బల్లి నోట్లో నోరు పెట్టాడు..) 'ఒక ఆపరేషన్ సయయంలో పేషంట్ ఇలా సంగీత పరికరం వాయించడం నా కెరీర్లో ఇదే మొదటిసారి అనుకుంటా.ఆమె సంగీతానికి ఎటుంటి ఆటంకం కలగించకుండానే శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశాం' అని అష్కాన్ పేర్కొన్నారు. ' నాకు అవకాశం కల్పించిన డాక్టర్లకు ధన్యవాదాలు తెలుపుతున్నా. ఆపరేషన్ సమయంలో వయొలిన్ ప్లే చేయలేనేమో అని బాధపడ్డా. వయొలిన్ వాయించడమనేది నా అభిరుచిగా ఉండేది. నేను 10 సంవత్సారాల వయసు నుంచే వయొలిన్ వాయించడం నేర్చుకున్నా' అంటూ టర్నర్ భావోద్వేగానికి గురయ్యారు. -
వయోలిన్ సంగీత విభావరి
అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా), చికాగో ఆంధ్ర అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన శాస్త్రీయ వయోలిన్ కచేరి చికాగో నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఆరభి కేంద్ర విద్వాంసుడు కళారత్న అషోక్ గుర్జాలే మరియు ఆయన శిష్యబృందం 15 వయోలిన్లతో తమ ప్రజ్ఞాపాటవాలతో శ్రోతలను అలరించారు. చికాగో గ్రేటర్ హిందూ టెంపుల్లో నిర్వహించబడిన ప్రదర్శనలో 400 వందల మందికి పైగా భారతీయులు పాల్గొన్నారు. వయోలిన్ తదితర శాస్త్రీయ సంగీత మెళకువలను నేర్పించే లాభాపేక్షలేని సంస్థైన ఆరభి కేంద్రం ఇప్పటివరకూ 750కి పైగా ప్రదర్శనలిచ్చి ఆంధ్ర, తెలంగాణా ప్రభుత్వాల ప్రశంసలనూ, పురస్కారాలనూ అందుకుంది. చికాగోలోని ప్రముఖ వ్యాపారవేత్త రమణ అబ్బరాజు గుర్జాలే కంపోజర్‌గా 8 నుంచి 19 ఏళ్ళ వయస్సు గల బాలలు నిర్వచించే ఈ అద్భుతమైన వయోలిన్ కచేరి నిర్వహించడంలో ముఖ్య పాత్ర పోషించారు. ఆద్యంతం శ్రోతలను ఉర్రూతలూగిస్తూ సాగిన ఈ విభావరిలో శ్రోతలు కళాకారులకు ‘స్టాండింగ్ ఓవియేషన్’ ఇచ్చి గౌరవంగా సత్కరించారు. భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలను చాటిచెప్పే ఇటువంటి కార్యక్రమాలను భవిష్యత్తులో ఇంకా నిర్వహిస్తామని నిర్వాహకులు పద్మారావు అప్పలనేని అన్నారు. ఈ సందర్భంగా అషోక్ గుర్జాలే ఈ కార్యక్రమనిర్వాహకులైన సీఏఏ, ఆటాలకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర వహించిన వాలంటీర్స్ వేణు అబ్బరాజు, మోహన్ మన్నే, శర్మ కొచ్చెర్లకోట, సుందర్ దిట్టకవి, మణి తాళ్ళప్రగడ, ఉష పరిటి, లక్ష్మి అబ్బరాజు, అహల్య అబ్బరరాజు, మనిషా పొన్నల తదితరులకి నిర్వాహకులు అభినందనలు తెలిపారు. -
శాస్త్రవేత్త కాకపోయి ఉంటే...
మీకు అల్బర్ట్ ఐన్‌స్టీన్ తెలుసా? సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన విశ్వవిఖ్యాత భౌతిక శాస్త్రవేత్త అని సైన్సు పుస్తకంలో చదువుతుంటారు కదా! ఆయన గురించి మీకు తెలియని మరో సంగతేమిటంటే... ఆయనకు సంగీతంలో మంచి ప్రవేశం ఉంది. ఐన్‌స్టీన్ పదమూడో ఏట మోజార్ట్ అనే సంగీతకారుడి కచేరీ విన్నాడు. అంతే సంగీతంపై మక్కువ ఏర్పడింది. అప్పటి నుంచి వయోలిన్, పియానో సాధన ప్రారంభించాడు. శాస్త్ర పరిశోధనలు, ప్రయోగాల్లో తలమునకలుగా ఉంటూ, తీరిక వేళల్లో సంగీత సాధనతో సేదదీరేవాడు. శాస్త్రవేత్త కాకపోయి ఉంటే సంగీతకారుడిగా ఎదిగేవాడినని చెప్పేవాడు. -
మణులొద్దు.. మాన్యాలొద్దు..
యావత్ భారతదేశంలోనే వయోలిన్‌కు పర్యాయపదంగా నిలిచిన మహామహోపాధ్యాయుడు ద్వారం వెంకటస్వామి నాయుడు. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని, వయోలిన్‌పై స్వర విన్యాసాలను సాధన చేసిన మంగతాయారు ఎనిమిది పదుల వయసులోనూ అదే ఒరవడి కొనసాగిస్తున్నారు. వంశీ సంగీత అకాడమీ నుంచి జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న సందర్భంగా మంగళవారం చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలో తన వయోలిన్ కచేరీతో శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. ఈ సందర్భంగా ఆ వాద్య శిఖామణిని ‘సిటీప్లస్’ పలకరించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. ..:: త్రిగుళ్ల నాగరాజు వయోలిన్ వాద్య విన్యాసంలో మేరునగధీరుడు మా నాన్నగారు. బ్రహ్మ సృష్టికారుడైతే.. నాదాన్ని సృష్టించింది సరస్వతీదేవి. ఆ అమ్మవారు సృజించిన నాద విలాసాన్ని భువిపై నలుచెరగులా వ్యాప్తి చేసిన కారణజన్ములలో మా నాన్నగారు ఒకరని నేను విశ్వసిస్తాను. విదేశీ వాద్య పరికరమైన వయోలిన్‌ను వాగ్దేవి ఒడిలో అలంకరించిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన పుంభావ సరస్వతి. ఎందరో శిష్యులను ఆదరించి, విద్వాంసులుగా తీర్చిదిద్ది, వయోలిన్‌ను భారత వాద్య సంపదలో ఓ భాగంగా మార్చేశారాయన. అలాంటి మహానుభావుడి వారసురాలుగా పుట్టడంనా పూర్వ జన్మ సుకృతం. మహామహుల సరసన.. నా బాల్యమంతా విజయనగరంలోనే సాగింది. నాన్నగారి శిష్యురాలిగా చిన్నతనంలోనే వయోలిన్ నేర్చుకోగలిగాను. విజయనగరంలోని సంగీత కళాశాలలో డిప్లొమా చేశాను. అంతేకాదు కొన్నాళ్లు నేను సంగీతం నేర్చుకున్న కళాశాలలోనే అధ్యాపకురాలిగా కూడా పనిచేశాను. మా కుటుంబం మద్రాస్‌కు వెళ్లిన తర్వాత ప్రభుత్వ స్కాలర్‌షిప్‌తో సంగీతంలో డిగ్రీ చేశాను. ఆ తర్వాత ఆల్ ఇండియా రేడియోలో గ్రేడ్-ఏ కళాకారిణిగా సెలెక్టయ్యాను. 16 ఏళ్ల పాటు ఆకాశవాణిలో నా వాద్య స్రవంతి కొనసాగింది. అదే సమయంలో ఎన్నో కచేరీల్లో పాల్గొన్నాను. ఎమ్మెస్ సుబ్బలక్ష్మి, డి.కె.పట్టమ్మాళ్, వేదవల్లి, ఎమ్మెల్ వసంతకుమారి వంటి గానశారదల కచేరీల్లో వాద్య సహకారం అందించడం మరచిపోలేని అనుభూతి. నా జీవితాన్ని కళకే అంకితం చేశాను. వయోలిన్‌లో లీనమై వివాహం సంగతే మరచిపోయాను. ఒక గురువుగా ఎందరో శిష్యులను తీర్చిదిద్దాను. నేడు ఇండియాతో పాటు అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లోనూ నా శిష్యులు పాఠశాలలు స్థాపించి మరీ కళాసేవ చేస్తున్నారు. ఒక గురువుగా అంతకంటే ఏం కావాలి. ప్రభుత్వం బాధ్యత.. పూర్వం రోజుల్లో కళాకారులను ఆదుకోవడానికి మహారాజులు ఉండేవారు. నేడు రాజ్యాలు పోయాయి, రాజులు పోయారు.. ప్రభుత్వాలు, ప్రజాపాలకులు వచ్చారు. కళాకారులకు మాత్రం సరైన పోషణ కరువైందనే చెప్పాలి. అప్పుడు ఇచ్చినట్టు మణులు, మాన్యాలు అవసరం లేదు.. కళనే సర్వసంగా భావించి జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తులకు పోషించడం ప్రభుత్వం కనీస బాధ్యత. నాదసాధకులకు ప్రోత్సాహం మాట అటుంచండి, పోషణ అందిస్తే అదే పదివేలు. కళాకారులు తృప్తిగా ఉంటేనే దేశం, కాలం సుభిక్షంగా ఉంటాయి. ఆయా కళాకారుల ప్రదర్శనలను సీడీలుగా రూపొందించి మార్కెట్లోకి విడుదల చేసి, వాటిపై వచ్చిన మొత్తాన్ని వారికి అందజేస్తే ఎంతో మేలు చేసిన వారు అవుతారు. గురువులదే బాధ్యత.. జీవిత సాఫల్య పురస్కారం అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందరో మహానుభావులకు ఆలవాలంగా ఉన్న హైదరాబాద్ మహానగరంలో నాకీ సత్కారం చేయడం మరింత ఆనందాన్నిచ్చింది. నేటి తరంలో సంగీతం, నాట్యం నేర్చుకోవాలనే జిజ్ఞాస కనిపిస్తోంది. దాన్ని మరింత అర్థవంతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురువులదే. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప వేదం, నాట్యం, సంగీతం, చిత్రలేఖనం.. వంటి కళల్లో ప్రవేశం పొందలేరు. మీకు లభించిన వరం నిష్ఫలం కాకూడదంటే కళను ఆరాధించాలి. భక్తి, శ్రద్ధలతో సాధన చేయాలి. ఈ రెండూ లేనివాళ్లు.. సంగీతంలోనే కాదు ఏ రంగంలో ఉన్నా రాణించలేరు. గురువుల కృపను పొందడం అంటే .. వారికి సుశ్రూష చేసి విజ్ఞానాన్ని సముపార్జించడం ఒకటే కాదు, వారు చూపిన బాటలోనడవగలగాలి. వారు నేర్పిన విద్యల్లోని అర్థాన్ని, అంతరార్థాన్ని గ్రహించగలగాలి. అప్పుడే గురువును మించిన శిష్యులని అనిపించుకోగలరు. -
మరోసారి మెరిసిన ‘పద్మం'!
విజయనగరం టౌన్ : విద్యలనగరానికి మరోసారి పద్మ అవార్డు దక్కింది. సంగీత, సాహిత్య కళలకు నిలయమైన జిల్లాలో ఇప్పటివరకు ఇద్దరు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. తాజాగా వయోలి న్లో జిల్లాకు చెందిన అవసరాల కన్యాకుమారిని కేంద్ర ప్రభుత్వం తమిళనాడు రాష్ట్ర విభాగంలో పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసింది. 1958లో విజయానంద గజపతిరాజు (సర్ విజ్జీ) పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ఆయన క్రికెట్ ప్లేయర్‌గా సుపరిచితులు. భారత్ క్రికెట్ జట్టుకు ఆయన 1936లో కెప్టెన్‌గా వ్యవహరించారు. 1960, 62లో విశాఖ నుంచి లోక్‌సభకు ఎంపీగా పోటీ చేసి గెలిచా రు. అలాగే జిల్లాకు చెందిన వెంకటస్వామినాయుడు కూడా 1957లో పద్మశ్రీ అవార్డు పొందారు. ఆయనకు ఏయూ కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. అలాగే రాజా, లక్ష్మి అవార్డు కూడా దక్కించుకున్నా రు. ఈయన ఘంటశాలకు కర్ణాటక సంగీతం నేర్పారు. తాజాగా అవసరాల కన్యాకుమారికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించడంతో జిల్లా లో మూడో పద్మం మెరిసింది. జిల్లావ్యాప్తం గా సంగీత ప్రియులు ఆమెకు అవార్డు రావ డం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంతోషం కేంద్ర ప్రభుత్వం తనకు పద్మశ్రీ అవార్డు ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉందని అవసరాల కన్యాకుమారి తెలిపారు. చెన్నైలో ఉంటున్న ఆమె సోమవారం ఫోన్లో సాక్షితో మాట్లాడారు. జాతీయ స్థాయిలో అద్భుతమై న అవార్డును కేంద్ర ప్రభుత్వం తనకు ప్రకటించడం చాలా ఆనందంగా ఉందన్నారు. తన గురువులు ప్రోత్సాహం వల్లే ఇంతస్థాయి కి చేరుకున్నానని తెలిపారు. ఈమె విజయనగరంలోని కొత్త అగ్రహారంలో తన తొలి గురువు ఇవటూరి విశ్వేశ్వరరావు వద్ద విద్యాభ్యాసం చేశారు. ఆయన గురువైన ద్వారం నరసింగరావు పేరున ఏర్పాటు చేసిన పాఠశాలలో తానే తొలి విద్యార్థిని అని తెలిపారు. సంగీతంలో మరింతగా రాణించాలన్న ఉద్దేశంతో చెన్నైలో వయోలిన్‌లో పట్టా పొందేందుకు వెళ్లి స్థిరపడినట్టు చెప్పారు. -
వయొలిన్ విద్వాంసులు ఇవటూరి కన్నుమూత
విశాఖ : ప్రముఖ వయొలిన్ విద్వాంసులు ఇవటూరి విజయేశ్వరరావు (76) కన్నుమూశారు. విశాఖలోని ఆయన స్వగృహంలో శనివారం ఉదయం ఇవటూరి స్వర్గస్తులైనారు. ఇవటూరి విజయేశ్వరరావు 1938, మే 29న విశాఖలో జన్మించారు. చూపు లేకపోయినా, ఎందరికో సంగీత పాఠాలు నేర్పి ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నంలో సంగీత విద్వాంసులను తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఇవటూరి సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం 2011లో ప్రతిభా రాజీవ్ పురస్కారంతో సన్మానించింది. ప్రముఖ వయొలిన్ విద్వాంసులు స్వర్గీయ ద్వారం వెంకటస్వామి నాయుడు ప్రియశిష్యుల్లో ఇవటూరి విజయేశ్వరరావు ఒకరు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. -
ఎందాకా ఈ పరుగు?!
అమెరికాలోని వాషింగ్టన్ డీసీ మెట్రో స్టేషన్లో ఒకతను దీక్షగా వయొలిన్ వాయిస్తున్నాడు. రైల్వేస్టేషన్ ఎలా ఉంటుందో తెలుసుగా! హడా వుడి, గందరగోళం, వెళ్లేవాళ్లు, వచ్చేవాళ్లు, ఎవరికీ క్షణం కూడా నిలబడే తీరిక లేదు. అందరూ పరుగెడుతున్నారు. అలా పరుగెడు తున్న వాళ్లలో ఒకతను మాత్రం ఎక్కడి నుంచో సంగీతం వినిపి స్తోందని కాసేపు అక్కడే ఆగి అటూఇటూ చూసి, మళ్లీ తన షెడ్యూల్ గుర్తుకొచ్చి పరుగెత్తాడు. అందరిదీ అదే స్థితి. పరుగులూ... ఉరకలూ! ఇంతలో మూడేళ్ల పిల్లాడొకడు వచ్చి అక్కడ నిలబడ్డాడు. వాళ్ల అమ్మ వాణ్ణి నిలబడనివ్వలేదు. రెక్కపుచ్చుకొని ముందుకు లాక్కుపోయింది. ఇతర తల్లులూ తమ పిల్లల్ని అలాగే తీసుకుపో తున్నారు. అప్పటికి నలభై అయిదు నిమిషాలైంది. నిర్విరామంగా అతను వయొలిన్ వాయిస్తూనే ఉన్నాడు. కానీ, నిదానంగా విన్న వాళ్లని వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. వారిలో డబ్బులిచ్చినవారూ తక్కు వే. అంతా లెక్కపెడితే యాభైడాలర్లు దాటవు! మరో పదిహేను నిమిషాల తర్వాత వయొలిన్ వాయించడం ఆపు చేశాడు. సంగీ తం నిలిచిపోయి నిశ్శబ్దం ఆవహించింది. ఎవరూ అతన్ని పట్టించుకోలేదు. ఎవరికీ తెలియని విషయమేమిటో చెప్పానా, అప్పటివరకూ మెట్రో రైల్వేస్టేషన్లో వయొలిన్ వాద్యం వినిపించింది జోషుయా బెన్ - ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంగీత విద్వాంసుడు. అత్యంత అధునాతనమైన వయొలిన్మీద చాలా క్లిష్టమైన సంగీత స్వరాల నూ, రాగాలనూ, గమకాలనూ అద్భుతంగా మనోజ్ఞంగా వినిపిం చాడు. రెండురోజుల తరువాత బోస్టన్ లో అతని సంగీతకచేరీ ఏర్పాటు చేస్తే అదే సంగీతాన్ని వినడానికి జనం వెర్రిగా ఎగబడ్డా రు. టికెట్టు కోసం తన్నుకున్నారు. ‘థియేటర్ ఫుల్ అయ్యింది, సీట్లు లేవు మహాప్రభో’ అంటే ఫరవాలేదు... నిలబడి వింటామన్నారు. ఇదేదో కల్పించి చెబుతున్న కథకాదు. నిజంగా జరిగింది. జోషుయా పేరు ప్రకటించకుండా సాదాసీదాగా ఒక సాధారణ కళాకారుడిగా ఆయన వయొలిన్ వాయిస్తే ప్రజలు ఏ మేరకు ఆస్వాదిస్తారో చూడాలన్న కుతూహలం ‘వాషింగ్టన్ పోస్ట్’కు కలి గింది. ఈ క్రమంలో ప్రజల ప్రాధాన్యాలు, అభిరుచులు, అవగా హన, స్పందన తెలుసుకోవచ్చని కూడా ఈ ప్రయోగం చేసింది. దీనితో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. బహిరంగ ప్రదేశంలో, అనువు గాని సమయంలో మనం అందాన్ని, తీయదనాన్ని ఆస్వాదించ గలమా? అభినందించగలమా? అతని ప్రతిభను, ప్రావీణ్యాన్ని గుర్తించగలుగుతామా? ఏమో! అవన్నీ ఎలావున్నా నాకు మాత్రం ఒకటనిపిస్తోంది. ఒక అద్భుతమైన కళాకారుడు నిర్మలమైన, మధురమైన, మనోహర మైన తన దివ్య సంగీతంలో పరిసరాలను ముంచెత్తుతుంటే క్షణం కూడా నిలబడి వినేందుకు మనకు తీరిక లేదంటే ఈ ప్రవహించే జీవన వాహినిలో పరుగులిడే చక్రాలమధ్య ఏది వింటున్నామో, ఏది తింటున్నామో, ఏది చూస్తున్నామో, ఏది ఆస్వాదిస్తున్నామో తెలియకుండా ఎన్ని అందాలను, ఎన్ని సౌందర్యాలను, ఎన్ని మధురిమలను, ఎన్ని సౌకర్యాలను ఎన్ని రంగుల్ని, ఎన్ని కాంతుల్ని మనం మిస్ అవుతున్నామో కదా అని దిగులేస్తోంది! ఒకే జీవితం అనేక అందాలు, తనివి తీరా ఇప్పుడే ఆస్వాదించండి. జీవితానికి ఎక్స్‌పెయిరీ డేట్ ఉంది. -ప్రయాగ రామకృష్ణ -
సుస్వరాల సంగీతద్వారం...
‘‘ఈ వాయులీన సాహిత్య మాధుర్యముల్ దేవతా స్త్రీ కంఠ దీప్తరావమ్ములో, పారిజాతామోద భావమ్ములో సురనదీ జీవమ్ములో...’’ అని స్వయంగా కవిసమ్రాట్విశ్వనాథ సత్యనారాయణ ద్వారం వెంకటస్వామినాయుడు గారి మీద కవిత రాశారు. ‘‘భగవంతుడు తన సొత్తు అయిన సంగీతాన్ని ద్వారం వెంకటస్వామినాయుడు ద్వారా వెదజల్లి ఆయన ఇంటిపేరైన ‘ద్వారం’ అన్న పదానికి సార్థకత కలిగించారు’’ అని తిరుపతి వెంకటకవులలో ఒకరైన చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి అన్నారు. ‘చెవులు బట్టి పిండి శిక్షించి జడమైన కట్టెకెట్టి చదువు గఱపినావొ, అంగుళీయకంబులంటి యంటకముందె నీ ఫిడేలు మధుర నిధులు గురియు’ అని జాషువా కీర్తించారు. ఆయన వేళ్లలో ఏం మహత్యం ఉందో కాని అవి అలవోకగా నాట్యం చేస్తుంటే అందులోంచి సుస్వరమైన సంగతులు తేనెలా జాలువారుతుండేవి. ఆయన కీర్తనలు వాయిస్తుంటే సంగీత త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యేవారు. వయొలిన్ ఆయన చేతి పాపాయి అయిపోయింది. అది లేని నాయుడుగారిని ఊహించుకోవడం కష్టం. ఆ చేతివేళ్లు వయొలిన్ మీద నడయాడుతుంటే చల్లని గాలికి వరి చేలు కదిలినంత అందంగా ఉండేది. ఆ కాలంలో ఎంతోమంది సంగీత విద్వాంసులు ఆయన వేళ్లను కళ్లకు అద్దుకునేవారు. కనీసం స్పర్శమాత్రం చేతనైనా పునీతులు కావడానికి తహతహలాడేవారు. మన సంగీత విద్వాంసులు వయొలిన్‌ను అపస్వర వాద్యమని, నిరాధార వాద్యమని అప్పట్లో విమర్శించారు. అటువంటి సంగీతపరికరాన్ని సాధన చేసి, స్వాధీన పరచుకొని, శ్రోతలను తన్మయులను చేశారు నాయుడుగారు. అదే అయన తపోదీక్ష. ఎటువంటి సంగతి వాయించినా అందులో మృదుత్వం ఉండేది. ఎంత ఘనం గా కమాను తీసినా, ఆ నాదంలో స్నిగ్ధత, గాంభీర్యం నిండి ఉండేవి. ఆయన సంగీతపు పోకడలో దృఢ సంకల్పం, నిశ్చలమైన నమ్మిక, ఏకాగ్రదృష్టి ఉండేవి. అనవసరమైన చేష్టలు ఉండేవి కాదు. తానే వాయులీనమై నాదామృతపు సోనలు కురిపించి, జనహృదయాలలో సుస్థిరంగా నిలబడిపోయారు ద్వారం. అందుకే ఆయన ఫిడేల్ నాయుడుగా స్థిరపడిపోయారు. నాయుడుగారికి పూర్వం... గాత్రధారులు మాత్రమే సోలో కచేరీలు ఇచ్చేవారు. దానితో పాటు వీణ, వేణువు వంటి భారతీయ వాద్యాలు మాత్రమే సోలో కచేరీకి అనువుగా ఉండేవి. పాశ్చాత్య వాద్యం అయిన ఫిడేలు భారతదేశంలోకి ప్రవేశించి పక్కవాద్యంగా ప్రఖ్యాతి గాంచింది. ఆ పక్కవాద్యాన్నే ప్రధాన వాద్యంగా శృతి చేశారు ద్వారంవారు. వయొలిన్ మీద కర్ణాటక సంగీతం వినిపించవచ్చునని నిరూపించిన మొదటి వ్యక్తి కూడా బహుశా ఈయనేనేమో! ఆయన వయొలిన్ వాయిస్తుంటే వేళ్లు కనపడేవి కావు. కమాను పట్టారంటే దాని జన్మధన్యమైనట్లే. భారతదేశ ఖ్యాతిని తన వయొలిన్ వాద్యం ద్వారా ఖండాంతరాలకు తీసుకువెళ్లారు నాయుడుగారు. సంగీతం గురించి ఎన్నో వ్యాసాలు వ్రాశారు. ‘తంబురా విశిష్ట లక్షణాలు’ అలాంటి వ్యాసాలలో ఒకటి. ఈయన వైఖరి చాలా సున్నితమైనది. ఏ రక మైన జిమ్మిక్కులు చేయకుండా అందరి మనసులను దోచుకున్న సంగీతజ్ఞుడు. 1938 లో నెల్లూరులో మొట్టమొదటి కచేరీ జరిగినప్పుడు శ్రోతలు మైమరచిపోయి, సమయాన్ని కూడా గమనించలేదట. 1952లో అంధుల సంక్షేమనిధి కోసం ఢిల్లీలోని జాతీయ భౌతికశాస్త్ర పరిశోధనశాల ఆడిటోరియంలో ఈయన కచేరీ జరిగింది. ప్రపంచ ప్రఖ్యాత వయొలిన్ కళాకారుడు యెహుదీ మెనుహిన్ ఈయన వయొలిన్ సంగీతాన్ని జస్టిస్ పి.వి.రాజమన్నారు ఇంట్లో విని, ఆయనను ప్రశంసించకుండా ఉండలేకపోయారు. ‘‘ఒకరోజు సాధన మానితే మీ సంగీతంలోని అపశ్రుతులు మీకు తెలుస్తాయి. రెండురోజులు మానితే అందులోని అపస్వరాలు శ్రోతలకు తెలుస్తాయి’’ అని శిష్యులకు బోధించేవారు. వయొలిన్ వాద్యంలో నెలకొల్పిన ఒక విశిష్టమైన సంప్రదాయం వారి శిష్య ప్రశిష్యుల ద్వారా నేటికీ బహుళ ప్రాచుర్యంలో ఉంది. ద్వారం వారు తన కంటివెలుగును కోల్పోయినప్పటికీ మనోనే త్రాలతోనే చూసేవారు. 1964 నవంబరు 25 న ద్వారం వారి చేతివేళ్లు శాశ్వతంగా నిద్రపోయాయి. ఎందరెందరో మహాసంగీత విద్వాంసులు ఒక్కసారయినా ఏ చేతి వేళ్లు ముద్దాడితే చాలనుకున్నారో అవి సాహితీ సరస్వతి పాదాలను స్పృశించడానికి వెళ్లిపోయాయి. - డా. పురాణపండ వైజయంతి విజయనగరం మహారాజా సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్న సమయంలో, ద్వారం వారి వద్ద... శ్రీపాద పినాకపాణి, నూకల చినసత్యనారాయణ, నేదునూరి కృష్ణమూర్తి, మారెళ్ల కేశవరావు వంటి వారంతా శిష్యరికం చేశారు. =చెన్నైలో ‘శ్రీద్వారం వెంకటస్వామినాయుడు స్మారకట్రస్టు’, విశాఖపట్నంలో ‘ద్వారం వెంకటస్వామి నాయుడు కళాక్షేత్రం’ ఆయన జ్ఞాపకార్థం స్థాపించారు. ఈ రెండు నగరాలలోనూ ఈ కళాతపస్వి విగ్రహాలను ప్రతిష్ఠించారు. మద్రాసు మ్యూజిక్ అకాడమీ వారిచే 1941లో సంగీత కళానిధి అవార్డు. 1953 లో సంగీత నాటక అకాడమీ అవార్డు 1957లో పద్మశ్రీ అవార్డు నాయుడుగారి శతజయంతి సందర్భంగా 1993లో భారతీయ తపాలా శాఖవారు తపాలాబిళ్ల విడుదల చేశారు.